తెలంగాణ

సొంతూరు బాట..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: సంక్రాంతి పండక్కి నగర వాసి సొంతూరు బాట పట్టారు. పాఠశాలలు, కళాశాలలకు శుక్రవారం నుంచి సెలవులు ప్రారంభం కావడంతో ముందుగా ప్లాన్ చేసుకున్న మేరకు స్వస్ధలాలకు బయలుదేరారు. దీంతో శుక్రవారం నుంచి విపరీతమైన రద్దీ ప్రారంభమైంది. ఏదో ఒక రవాణా సాధనం పట్టుకుని ఇంటిచేరుకుని బంధువులతో గడుపుదామనే ఆరాటంతో ఒకేసారి రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లకు చేరుకోవడంతో కిక్కిరిసిపోయాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ఇసకేస్తే రాలనంతగా జనం రద్దీ నెలకొంది. రైలు రావడంతోనే బోగీల వెంట పరుగెడుతున్నారు. రిజర్వేషన్ చేయించుకున్నా సుఖం లేదన్నట్లు ప్రయాణీకులు నిట్టూరుస్తున్నారు. రిజర్వేషన్ బోగీల్లో సైతం నిలబడి ప్రయాణించేందుకు జనం చేరుకోవడంతో రైల్వే సిబ్బంది ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితి. ప్రత్యేక రైళ్లన్నీ ఆలస్యంగా నడవడం, రెగ్యులర్‌గా నడిచే రైళ్లు రావడంతో ప్రయాణీకుల సంఖ్య ఫ్లాట్‌ఫాంలపై గంటగంటకూ పెరిగిపోతోంది. రైల్వే స్టేషన్లు లోపల, బయట కూడా ప్రయాణీకుల రద్దీ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఇదే తాకిడి ఎంజిబిఎస్‌పైనా పడింది. ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక వైపు వెళ్లే బస్సులన్నీ కిటకిటలాడాయి. ప్రత్యేక బస్సులు ఆంధ్రావైపునకు వెళ్లేవన్నీ ఎల్‌బినగర్ దాటాక ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదేశం నుంచి బయలుదేరుతుండగా, తెలంగాణలోని మిగిలిన జిల్లాలకు వెళ్లే బస్సులన్నీ జూబ్లీ బస్ స్టేషన్ వైపు నుంచి వెళ్లేందుకు టిఎస్‌ఆర్టీసి ఏర్పాట్లు చేసింది. దీంతో నిత్యం నడిచే బస్సులు, ప్రత్యేక బస్సులతో రహదారులన్నీ నిండిపోయాయి. హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-కరీంనగర్ జాతీయ రహదారుల్లో వాహనాలు బారులు తీరి వెళుతున్నాయి. విజయవాడ హైవేపై టోల్‌గేట్ల వద్ద వాహనాలు బారులు తీరి ఉన్నాయి. జాతీయ రహదారిపై విజయవాడ వెళ్లే రోడ్డులో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా, కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సొంత కార్లు ఉన్న వాళ్ల సంగతి అటుంచితే, రైలు, బస్సు టిక్కెట్లు దొరకని వారు కిరాయి వాహనం మాట్లాడుకుని రెండేసి కుటుంబాలు కలిసి విశాఖ, శ్రీకాకుళం, బొబ్బిలి, పార్వతీ పురం వరకు కూడా వెళుతున్నారు. దీంతో రహదారులు కిటకిటలాడుతున్నాయి. రాత్రి ప్రయాణం ఇబ్బందిగా ఉంటుందని భావించి పగలే సొంత వాహనాల్లో బయలుదేరారు. ఈ రద్దీ శని, ఆదివారం కూడా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో స్ధిర నివాసం ఏర్పరచుకున్న ఆంధ్రా, కర్ణాటక వాసులు చాలా మంది స్వగ్రామాలకు వెళ్లేందుకు ఈ పండుగకే అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల నగరం నుంచి లక్షలాది మంది బయలుదేరి వెళుతున్నారు.

చిత్రం..సంక్రాంతి పండగ కోసం సొంతూరు వెళ్లడానికి బస్సు ఎక్కేందుకు జనం పాట్లు