ఆంధ్రప్రదేశ్‌

కోడి పందేలకు రెడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం/్భమవరం, జనవరి 12: సంక్రాంతి సంప్రదాయం పేరిట నిర్వహించే కోడి పందేలకు ఉభయ గోదావరి జిల్లాలు సిద్ధమయ్యాయి. శుక్రవారం నాటి సుప్రీం తీర్పు వెలువరించడానికి ముందే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోడి పందేల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసేశారు. ఒకపక్క పందేలు జరగనివ్వబోమని అధికార్లు చేస్తున్న హెచ్చరికలను బేఖాతరుచేస్తూ ప్రధానంగా పోటీలు జరిగే అన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగిపోతున్నాయి. పందేల నిర్వహణకు వీలుగా బరులు రూపొందించడంతోపాటు, భారీ షామియానాలు, ఇతరత్రా ఏర్పాట్లు చకచకా చేసేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే పోలీసులు అడ్డుకోకుండా ఉండటానికి క్రీడా పోటీల పేరిట గత కొన్ని రోజులుగా ఏర్పాట్లు భారీ ఎత్తున చేస్తున్నారు. ఏటా జనవరి 13, 14, 15 తేదీల్లో నిర్వహించే కోడి పందేలు ఈ ఏడాది మాత్రం పండగ తేదీలకు అనుగుణంగా 14, 15, 16 తేదీల్లో నిర్వహించే అవకాశముంది. భారీ బరులు నిర్వహించే ప్రాంతాల్లో రాత్రీ పగలు నిర్వహణకు వీలుగా ఫ్లడ్ లైట్లు ఏర్పాటుచేస్తున్నారు.పేరుకు సంప్రదాయ కోడి పందేలు అని పేర్కొంటున్నప్పటికీ, పెద్ద ఎత్తున జూదాలు జరుగుతాయనడంలో ఎటువంటి సందేహంలేదు. కోడి పందేలకు తోడు పేకాట, గుండాట తదితర జూదాలు నిర్వహించడానికి వీలుగా పందేల బరులకు సమీపంలో ప్రత్యేక ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ జూదాల నిర్వహణ హక్కులను కొందరు నిర్వాహకులు లక్షల రూపాయలు చెల్లించి సొంతం చేసుకుంటున్నారు. ఇక పందేలు జరిగే ప్రాంతాల చుట్టుపక్కల ఉన్న లాడ్జీలు, హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లన్నీ ఇప్పటికే హౌస్‌ఫుల్ అయిపోయాయి. రాష్ట్రం నలు మూలల నుండే కాక, విదేశాల నుండి సైతం అతిథులు గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలను తిలకించడానికి తరలివస్తున్నారు. ఇలా తరలివచ్చే వీవీఐపీల కోసం పందేల బరుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
వెంపలో సంబరాలు
కాగా కోడి పందేల నిర్వహణపై శుక్రవారం సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం వెంప గ్రామంలో సంబరాలు నిర్వహించారు. రంగులు చల్లుకుని, బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు. ఈ గ్రామం నుంచే కోడి పందాల నిర్వహణపై ఒక వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి విదితమే. ఇక ఐ.పోలవరం మండలం మురమళ్లలో కోడి పందేల నిర్వహణకు తాత్కాలిక స్టేడియం తరహాలో ఏర్పాట్లుచేశారు. షామియానాలు, తాత్కాలిక ప్రహరీ సైతం ఏర్పాటుచేయడం విశేషం. అలాగే కోడి పుంజుల బొమ్మలతో స్వాగత ద్వారాలు సైతం ఏర్పాటుచేశారు.
న్యాయస్థానం తీర్పునకు లోబడే:హోం మంత్రి
సంక్రాంతి కోడి పందేలు న్యాయ స్థానం తీర్పునకు లోబడే నిర్వహించుకోవాల్సివుందని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి చిన రాజప్ప అన్నారు. కోర్టు ఉత్తర్వులకు లోబడే ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. సంక్రాంతి పండగను సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవడానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
తరలివస్తున్న హైదరాబాద్...
కాగా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో నివాసముంటున్న ఆంధ్రావారంతా తరలివస్తుండటంతో శుక్రవారం నుండి గోదావరి జిల్లాల్లో రోడ్లన్నీ రద్దీగా మారిపోయాయి. సంక్రాంతి పర్వదినానికి సొంత ఊర్లకు రావడం ఒక సంప్రదాయంగా మారిపోయిన నేపథ్యంలో ఈ ఏడాది పండగ రద్దీ మొదలయ్యింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో నివసించే వారంతా తరలివస్తున్న ఖరీదైన కార్లతో ఎక్కడికక్కడ రోడ్లపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది.

చిత్రాలు..తూ.గో. జిల్లా మురమళ్ళలో కోడిపందాలకు సిద్ధంగా ఉన్న బరులు*ఎదుర్లంకలో స్వాగత ద్వారం