తెలంగాణ

ప్రతి ఎకరాకు సాగునీరు..ప్రతి ఇంటికీ తాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జనవరి 12: రాష్ట్రంలో ప్రతి ఎకరానికి సాగు నీరు.. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభు త్వం పనిచేస్తోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో రూ. 60 కోట్లతో చేపట్టనున్న ఎస్సారెస్పీ కాల్వల మరమ్మతు పనులకు మంత్రి హరీష్‌రావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్యానాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ సీనియర్ రాజకీయవేత్త అని, నియోజకవర్గ అభివృద్ధి కోసం అనుక్షణం ఆలోచించే నాయకుడని అభినందించారు. కొన్ని నెలల క్రితం మరిపెడ వచ్చినప్పుడు డోర్నకల్ నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకు నీరు అం దించాలంటే ఎస్సారెస్పీ కాల్వల మరమ్మతు పనులను చేపట్టాలని కోరారని, ఆనాడు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు కురవిలో రూ. 60 కోట్లతో పనులకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారుర. పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్నిరంగాలలో అభివృద్ధి చేయడంతో పాటు, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా పాలన సాగుతుందన్నారు. భారతదేశంలోనే కేంద్ర జలవనరుల ఇంజనీరు బృందం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను చూసి భారతదేశంలో ఇలాంటి బహుళార్థ సాధక ప్రాజెక్టు మరోటి లేదని అభినందించారన్నారు. ఏడాదిలోనే అన్ని అనుమతులు తెచ్చి శరవేగంగా పనులు నిర్వహిస్తున్న కాళేశ్వరం, తెలంగాణ రాష్ట్రానికి జీవనాడి అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయితే ముం దుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకే లాభం చేకూరుతుందన్నారు. లక్ష పదివేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. రైతన్నకు 24గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించిన ఘతన భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేదని, కాంగ్రెస్సో... తెలుగుదేశమో అధికారంలో ఉండి ఉంటే.. ఈ కార్యక్రమం అమలు పరచగలిగేవారా? అని ప్రశ్నించారు. గతంలో రైతులు నీటికోసం ఆకాశం వైపు, ఎరువుల కోసం పోలీస్‌స్టేషన్ల దగ్గర, విత్తనాల కోసం వ్యవసాయ కార్యాలయాల వద్ద, పెట్టుబడుల కోసం బ్యాంకుల ముందర, వడ్డీ వ్యాపారుల ఇళ్ల ముందు పడిగాపులు కాయవలసి వచ్చేదని.. కానీ.. మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిశా నిర్దేశకత్వంలో అలాంటి పడిగాపులు రైతన్నకు ఉండవన్నారు. సాగుకు నీరిస్తాం.. నాణ్యమైన విద్యుత్ ఉచితంగా అందిస్తాం... విత్తనాలు, ఎరువులు సకాలంలో కల్తీ లేకుండా అందేలా చూస్తాం... పెట్టుబడికి కూడా ప్రతి పంటకు నాలుగువేల చొప్పున చెక్కులను అందచేస్తామని రైతుల హర్షధ్వానాల మధ్య మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. గత ప్రభుత్వాలు తండాలను ప్రత్యేక పంచాయతీలు చేస్తామని మాటలు చెప్పారే తప్ప, ఆచరణలో చూపలేదన్నారు. కాని, తమ ప్రభుత్వం నెలరోజుల్లోనే తండాలను పంచాయతీలుగా ప్రకటించి, ఎన్నికలను నిర్వహించి, మీ తండాలను మీరే పాలించుకునే మంచి రోజులు తేనుందన్నారు. ఈ మేరకు కేబినేట్ సమావేశంలో మంత్రి వర్గం నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఇక ప్రకటనే తరువాయి అన్నారు. ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంటే తమ రాజకీయ ఉనికి ఉండదని బెంబేలెత్తిపోతున్న చవట దద్ధమ్మ ప్రతిపక్షాలు చవకబారు ప్రకటనలు చేస్తున్నాయని విమర్శించారు. మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటామని, ప్రజలకు సేవచేసేందుకు ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా నెరవేర్చేందుకు నిరంతరం కృషిచేస్తామని హరీష్‌రావు అన్నారు.
ఈ కార్యక్రమాలలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సత్యవతిరాథోడ్, మాలోత్ కవిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్, ఓడీసీఎంఎస్ చైర్మన్ నూకల వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మహబూబాబాద్ జిల్లా కురవిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న మంత్రి తన్నీరు హరీష్‌రావు