తెలంగాణ

జూరాలలో పడిపోతున్న నీటిమట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 13: పాలమూరు జిల్లా కు వరప్రదాయినిగా భావించే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో రోజురోజుకు నీటిమట్టం పడిపోతోంది. నెల రోజుల వ్యవధిలోనే దాదాపు రెండు నుండి మూడు టీఎంసీల నీటిమట్టం పడిపోవడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన మొదలైంది. యాసంగి (రబీ) పంటలు ఈ దఫా పెద్దఎత్తున సాగు చేసిన సందర్భంలో జనవరి మాసంలోనే నీటిమట్టం తగ్గుముఖం పడుతుండటం కూడా రైతుల్లో కలవరం మొదలైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకే వరదప్రాయినిగా చెప్పుకుంటున్న జూరాల ప్రాజెక్టులో శనివారం నాటికి కేవలం 6టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు కింద దాదాపు 80 వేల ఎకరాలకు పైగా ఇప్పటికే రైతులు యాసంగి పంటలను సాగు చేశారు. ప్రస్తుతం మూడురోజులకు ఒకసారి అయకట్టుకు నీటిని విడుదుల చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం జూరాల కుడికాలువ ఆయకట్టుకు శనివారం 524 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడవ కాలువ ఆయకట్టుకు 920 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇలా ప్రతి మూడు రోజులకు ఓసారి నీటిని విడుదల చేస్తున్నారు. ఇలాగే నీటిని విడుదల చేస్తే ఈ నెలాఖరు వరకు జూరాల ప్రాజెక్టులో మరింత నీటిమట్టం తగ్గవచ్చని అధికారులు చెబుతున్నారు. జూరాల ఆయకట్టు కింద మొత్తం 1.4 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది అయితే ఈ సీజన్‌లో మాత్రం దాదాపు 80వేల ఎకరాలకు పైగా రైతులు తమ పొలాల్లో పంటలను సాగు చేశారు. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ కెపాసిటి 9.651 టీఎంసీలు. అయితే ప్రస్తుతం 6టీఎంసీలు మాత్రమే ప్రాజెక్టులో నీరు ఉంది. ఇంకా జూరాల ప్రాజెక్టు చివరి ఆయకట్టు రైతులు ప్రస్తుతం పంటలను సాగు చేస్తూనే ఉన్నారు. వీరికి సాగునీరు ఎలా అందుతుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా జూరాల బ్యాక్‌వాటర్ నుండి ఆధారమైన భీమా-1, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాల లిఫ్ట్ మోటార్లను బంద్ చేశారు. జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో గత నవంబర్ చివరిలోనే మోటార్ల నుండి నీటిఎత్తిపోతను నిలిపివేశారు. దాంతో మూడు ఎత్తిపోతల పథకాలకు జూరాల ప్రాజెక్టు నుండి గత రెండు నెలల నుండి చుక్కనీరు కూడా రావడంలేదు. మరోపక్క కర్ణాటక రాష్ట్రంలోని నారాయణపూర్ ప్రాజెక్టు నుండి ఇన్‌ఫ్లో సైతం లేదు. జూరాల ప్రాజెక్టుకు కృష్ణానది నుండి ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుండి వరద పూర్తిగా లేన్నందున జూరాల ప్రాజెక్టులో రోజురోజుకు నీటిమట్టం తగ్గుముఖం పడుతుంది. దాంతో జూరాల ఆయకట్టు రైతులు, మరో పక్క కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు ఆయకట్టు రైతుల్లో ఇప్పుడే ఆందోళన మొదలైంది. జూరాల నిండుగా ఉంటేనే మూడు ఎత్తిపోతల పథకాల మోటార్లు నడిపిస్తారని కానీ అలాంటి పరిస్థితులు మాత్రం కనపడటంలేదు. మోటర్లను బంద్ చేయడంతో కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులకు సంబంధించిన రిజర్వాయర్లలో సైతం రోజురోజుకు నీటిమట్టం తగ్గుముఖం పడుతుండటంతో ఆయా ప్రాజెక్టుల రైతులు కూడా తాము సాగు చేసిన పంటలు చివరకు చేతికి అందుతాయోలేదోనని ఆందోళన చెందుతున్నారు.
మరోపక్క ఈ ప్రాజెక్టుల ద్వారా తాగునీటి ప్రాజెక్టులు కూడా ఉండడంతో రాబోయే జూలై మాసం వరకు నీటిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. అధికారులు మాత్రం ఫిబ్రవరి చివరి నాటికి జూరాల ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. రైతులు సాగు చేసిన పంటలు చేతికి రావలంటే మార్చి మూడవ వారం నుండి మొదలుకుని ఏప్రిల్ రెండవ వారం వరకు ఉంటుందని అంతవరకు నీటి విడుదల జరిగితే తప్పా రైతులకు ప్రయోజనం ఉండదని రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.