తెలంగాణ

మరో వివాదంలో ఎమ్మెల్యే వీరేశం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 16: ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్త ల్లో నిలిచే నకిరేకల్ టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈసారి వైద్యుడిపై చేయి చేసుకుని మరోసారి వార్తల్లోకెక్కారు. మూడు రోజుల క్రితం ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌తో కలిసి నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు వెళ్లిన క్రమంలో తన పట్ల జూనియర్ డాక్టర్ అమర్యాదగా ప్రవర్తించాడన్న ఆగ్రహంతో వీరేశం అతడి చెంప చెళ్లుమనిపించారు. ఈ సంఘటనపై బాధిత వైద్యుడు చెగురుపల్లి సందీప్‌గాని, ఆసుపత్రి నిర్వాహకులుగాని ఎవరు బహిరంగంగా స్పందించలేదు. దీంతో ఈ వ్యవహారం లోలోపలే సద్దుమణిగినట్లేనని అంతా భావించారు. ఇదే సమయంలో నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల వీరేశంకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ఈ వివాదంపై బహిరంగంగా స్పందించి ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చెరుకు డిమాండ్‌తో ఎమ్మెల్యే వీరేశం కామినేని వైద్యుడిపై చేయిచేసుకున్న వ్యవహారం కాస్తా రచ్చకెక్కినట్లయ్యింది. స్వయాన వైద్యుడు కూడా అయన సుధాకర్ బాధిత వైద్యుడికి మద్దతుగా నిలిచి ఎమ్మెల్యే వీరేశంపై సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలంటూ మంగళవారం జిల్లా అదనపు ఎస్పీ పద్మనాభరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అనుచిత ప్రవర్తనపై హోంమంత్రి నాయిని ఎందుకు స్పందించలేదంటూ ప్రశ్నిస్తూ.. ఎమ్మెల్యే వీరేశంపై చట్టపరమైన చర్యలకు వెనుకాడితే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడుతామంటూ ప్రకటించారు. ఎమ్మెల్యేతో ఘర్షణాత్మక వైఖరికి జడిసి బాధిత వైద్యుడు బహిరంగంగా ఫిర్యాదుకు జంకుతున్నందున దీనిపై సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా చర్యలు తీసుకోవాలని చెరుకు డిమాండ్ చేశారు. అటు కామినేని యాజమాన్యం కూడా ఈ ఘటనపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. చెరుకు డిమాండ్‌తో మరోసారి ఎమ్మెల్యే వేముల దుందుడుకు చర్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల సస్పెన్షన్‌కు గురైన డీసీసీబీ డీజీఎంను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ బ్యాంకు సీఈవో మదన్‌మోహన్‌ను ఫోన్‌లో వీరేశం బెదిరిస్తూ దుర్భాషలాడిన ఘటన మరువకముందే మరో వివాదంలో ఆయన చిక్కుకోవడం అధికార పార్టీకి ఇరకాటంగా మారింది.

చిత్రం..ఎమ్మెల్యే వీరేశంపై చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు ఎస్పీపద్మనాభరెడ్డిని కలిసి
ఫిర్యాదు చేస్తున్న డాక్టర్ చెరుకు సుధాకర్