తెలంగాణ

నేర రహిత రాష్ట్రంగా తెలంగాణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/గచ్చిబౌలి, జనవరి 18: తెలంగాణ రాష్ట్రాన్ని నేర రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని డిజిపి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ లక్ష్యంతోనే సర్వే పేరుతో నేరస్తుల గణన చేపట్టామని చెప్పారు. గత 10 ఏళ్లగా వివిధ నేరాలతో సంబంధం ఉండి శిక్షలు అనుభవించిన, ఇంకా నేరాలు చేస్తున్న వారి జాబితాను సమగ్రంగా తయారు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తమ శాఖ అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో సమగ్ర నేరస్థుల సర్వే చేపట్టారని తెలిపారు. ఈ జాబితాను టీఎస్‌కాప్‌కు అనుసంధానం చేస్తామని తెలిపారు. గురువారం ప్రారంభమైన ఈ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా చివరి నేరస్థుడి వివరాలు సేకరించే వరకు కొనసాగుతుందని చెప్పారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్వత్ నగర్‌లో నిర్వహిస్తున్న సర్వేలో పాల్గొని నేరస్థుల వివరాలను స్వయంగా సేకరించారు. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ సిటీ, సైబరాబాద్, రాచకొండ కలుపుకొని మిగిలిన కమిషనరేట్లు, జిల్లాల పరిధిలో 2.18 లక్షల మంది నేరస్థులు ఉన్నట్లు డీజీపీ వెల్లడించారు. వీరందరి వివరాలు సమగ్రంగా సేకరించిన తర్వాతే ఎవరెవరు ఏఏ నేరాలు చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారనే అంశాలు పూర్తిగా వెల్లడవుతాయని అన్నారు. ప్రజల నుంచి కూడా నేరస్థుల సర్వేకు మంచి సహకారం అందుతోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కరడుగట్టిన నేరస్థులు తరచూ నేరాలు ఒకచోట చేసి మరోచోట ఉండడం వల్ల పోలీసులకు ఇబ్బందిగా మారిందని అన్నారు. ఇలాంటి వారిపై నిఘా ఉంచేందుకు జియో ట్యాగింగ్ ఉపయోగపడుతుందని వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇక్కడ నేరాలు చేయకుండా వారి వివరాలను సైతం జియో ట్యాగింగ్ చేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో నేరాలకు పాల్పడుతున్న వారికి కౌనె్సలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య, జాయింట్ సీపీ షానవాజ్ ఖాసీం, మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి హుమయూన్ నగర్ బస్తీలో, సరూర్‌నగర్‌లో జరిగిన సర్వేలో కూడా పాల్గొని నేరస్థులను విచారించారు. హైదరాబాద్ నగరంలో సీపీ వివి శ్రీనివాసరావు పర్యవేక్షణలో అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో నేరస్థుల సమగ్ర వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. అదనపు డీజీపీ అంజన్‌కుమార్, తదితరులు నేరుగా నేరస్తుల సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సర్వే జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించేందుకు డీజీపీ మహేందర్ రెడ్డి నగరంలోని హబీబ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో నేరస్థుల కుటుంబాలతో మాట్లాడారు. నేరస్తుల్లో మార్పు తెచ్చేందుకే ఈ సర్వే చేపట్టినట్లు వివరించారు. గతంలో నేరాలు చేసి ఇప్పుడు వేరే పనులు చేసుకుంటూ బతుకుతున్న వారి వివరాలే కాకుండా ఇంకా నేరాలు చేస్తున్నారా, మళ్ళీ మళ్ళీ నేరాలు చేసే పనిలో ఉన్నారా, ఉంటే ఎక్కడ ఉన్నారు, వారి కుటుంబాల పరిస్థితి ఏమిటనే కోణంలో సమగ్రంగా వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు పౌరులు, నేరస్తుల కుటుంబాలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అందుబాటులో ఉన్న ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరస్తుల కుటుంబాలు ఉన్న ప్రాంతాన్ని జియో ట్యాగింగ్ చేయడం ద్వారా నేరస్థుల ఆట కట్టిస్తామని డీజీపీ వెల్లడించారు. సుమారు వారం రోజుల పాటు ఈ సర్వే కొనసాగుతుందని వెల్లడించారు.

చిత్రం..హైదరాబాద్‌లో నిందితులకు కౌనె్సలింగ్ చేస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి,
పక్కన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, ఇతర అధికారులు