తెలంగాణ

మోత్కుపల్లి కారెక్కుతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 19: టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు టిఆర్‌ఎస్‌లో చేరుతారా..? ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లా టిడిపి శ్రేణుల్లో ఎవరిని కదిపినా ఇదే చర్చ రచ్చరచ్చ చేస్తుంది. ఎన్‌టిఆర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ టిడిపిని టిఆర్‌ఎస్‌లో విలీనం చేయాలంటు మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్లలో మోత్కుపల్లి కూడా పార్టీ వీడిపోతారన్న సందేహాలను రగిలించాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టిడిపి పార్టీకి మోత్కుపల్లి, ఎలిమినేటి ఉమామాధవరెడ్డిలు ఇంతకాలంగా పెద్దదిక్కుగా కొనసాగుతు వచ్చారు. ఇటీవల ఉమామాధవరెడ్డి తన కుమారుడు సందీప్‌రెడ్డితో కలిసి టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. దీంతో మోత్కుపల్లి ఒక్కడే టిడిపి బాహుబలిగా పార్టీ పరిరక్షణకు పెద్ద దిక్కుగా మిగిలిపోగా ఈ దిశగా మోత్కుపల్లి సైతం నవంబర్ 20న కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేసి తెలుగు తమ్ముళ్లలో పార్టీ భవిష్యత్‌పై నమ్మకం కల్గించారు. కలెక్టరేట్ రైతుపోరు దీక్షలో మోత్కుపల్లి తనదైన శైలీలో టిడిపి నుండి ఇతర పార్టీల్లో చేరిన రేవంత్‌రెడ్డిని ఇతర టిడిపి నాయకులను, సీఎం కెసిఆర్ సారధ్యంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనను పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ సమక్షంలోనే తుర్పారబట్టారు. మోసగాళ్లు, పెత్తందారులంతా పార్టీని వీడారని, ఇక ఎన్నికల్లో పార్టీ టికెట్లన్ని బడుగులకేనంటు తెలుగు తమ్ముళ్లలో సమరోత్సహం నింపారు. తనకు వేరే పనులు లేవని పార్టీ బలోపేతమే తన ఏకైక లక్ష్యమంటు రైతుపోరు దీక్షలో మోత్కుపల్లి చేసిన ఉత్తేజభరిత ప్రసంగాన్ని తెలుగు తమ్ముళ్లు మరువకముందే ఇప్పుడు టిడిపిని టిఆర్‌ఎస్‌లో విలీనం చేయాలంటు మోత్కుపల్లి చెప్పడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. టిడిపి నాయకుడిగా టిఆర్‌ఎస్ అవిర్భావం నుండి కూడా కెసిఆర్‌ను తిట్టిపోసిన మోత్కుపల్లి చివరకు కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్‌ఎస్‌లో టిడిపిని విలీనం చేయాలన్న వైనం తెలుగు తమ్ముళ్లకు రాజకీయంగా షాక్‌నిస్తుంది. పార్టీకి ఉమ్మడి జిల్లాలో ఏకైక పెద్దదిక్కుగా ఉన్న మోత్కుపల్లి పార్టీని వీడితే భవిష్యత్ ఏమిటన్న బెంగ వారిని పీడిస్తుంది.
కారెక్కేందుకు సిద్ధమయ్యే..!
మోత్కుపల్లి నరసింహులు టిఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయించుకునే టి.టిడిపిని టిఆర్‌ఎస్‌లో విలీనం చేయాలంటు మాట్లాడారంటు తెలు గు తమ్ముళ్లు భావిస్తున్నారు. పార్టీ అధినేత, ఏపి సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణలో టిడిపికి పూర్వవైభవం తేలేడన్న అభిప్రాయంతో పాటు ఆయన ఇప్పిస్తానన్న గవర్నర్ పదవి రాకపోవడం, పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్ శూన్యమన్న నిరాశ నిస్పృహాలతో మోత్కుపల్లి పార్టీ విలీనం వ్యాఖ్యలు చేశారని జిల్లా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మోత్కుపల్లికి తన రాజకీయ గురువుగా భావించే మాజీ సీఎం ఎన్‌టిఆర్ టిడిపి పార్టీ తొలి నాళ్లలో విద్యార్ధి నాయకుడిగా ఉన్న మోత్కుపల్లి చురుకుతనం గమనించి 1983ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం టిడిపి టికెట్ ఇచ్చారు. 1983, 1985లో టిడిపి అభ్యర్ధిగా, 1989లో ఇండిపెండెంట్‌గా, 1994ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధిగా, 1999ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా మోత్కుపల్లి ఆలేరు ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో గెలిచారు. తిరిగి టిడిపిలో చేరి 2004, 2008ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్ధి కె.నగేష్ చేతిలో ఓడారు. డిలిమిటేషన్ నేపధ్యంలో 2009ఎన్నికల్లో తుంగతుర్తి రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్ధిగా గెలుపొందారు. 2014ఎన్నికల్లో ఖమ్మం మధిర నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి ఓడారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్‌టిఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసి టిడిపి చీలిక సమయంలో ఎన్‌టిఆర్ పక్షాన ఉండి 1999లో కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచి తదుపరి టిడిపిలో చేరి నేటి దాకా టిడిపిలోనే కొనసాగుతున్న మోత్కుపల్లి పార్టీ మారిన పక్షంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టిడిపికి రాజకీయంగా చావుదెబ్బే కానుంది. మాదిగ సామాజిక వర్గంలో, అణగారిన వర్గాల్లో పట్టున్న మోత్కుపల్లిని టిఆర్‌ఎస్‌లోకి చేర్చుకోవడంలో ఆ పార్టీ సఫలీకృతమైతే తెలంగాణతో పాటు ఉమ్మడి జిల్లాలో టిఆర్‌ఎస్ మరింత బలోపేతంగా నిలువనుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మోత్కుపల్లి టిఆర్‌ఎస్‌లో చేరితే రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారం సాగుతుండగా ఇటీవలే ఉమామాధవరెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరినప్పుడు కూడా ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తారన్న ప్రచారం సాగింది. ఈ నేపధ్యంలో అసలు మోత్కుపల్లి టిఆర్‌ఎస్‌లో చేరుతారా చేరితే ఎప్పుడు చేరుతారు, ఆయనకు కెసిఆర్ ఏ పదవి కట్టబెడుతారన్న చర్చలు ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి.