తెలంగాణ

నిఘా నీడలో నాగోబా ‘దర్బార్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,జనవరి 19: నిషేదాజ్ఞలు.. పోలీసు నిఘా నీడన శుక్రవారం కెస్లాపూర్ నాగోబా జాతరలో నిర్వహించిన గిరి దర్బార్‌లో లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలన్న ఏకైక డిమాండ్‌తో ఆదివాసీల నుండి వినతులు వెల్లువెత్తాయి. గిరిజన సమస్యల పరిష్కార వేదికగా 1941 నుండి నాగోబా జాతరలో ఆనవాయితీలో భాగంగా ప్రభుత్వం ప్రతి ఏటా అధికారులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో దర్బార్ నిర్వహిస్తోంది. అయితే గత మూడు నెలలుగా ఆదివాసీలు, లంబాడాల మద్య కొనసాగుతున్న వర్గపోరు నేపథ్యంలో ఈసారి ఆసాధారణ రీతిలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం, ఆదివాసీలపై ఆంక్షలు విధించడం పట్ల గిరిజన సంఘాల ప్రతినిధులు అసంతృప్తి అగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రతి ఏటా దర్బార్‌కు వివిధ ప్రాంతాల నుండి కెస్లాపూర్‌కు మధ్యాహ్నం వేళ ఆదివాసీలు తరలివస్తూ సమస్యలు విన్నవిస్తుండగా ఈసారి అనూహ్యంగా అధికారులు ఉదయం 10 గంటలకు దర్బార్ ప్రారంభించి రెండుగంటల్లోపే ప్రసంగాలతో మమ అనిపించడం గిరి దర్బార్ ప్రాముఖ్యతను దెబ్బతీసినట్లయింది. ఈసారి జాతరకు భారీ ఎత్తున ఆదివాసీలు తరలివచ్చినప్పటికీ దర్బార్‌లో అధికారులు, మంత్రి, ఎంపి ప్రసంగాన్ని వినడానికి ఆసక్తి చూపలేదు. సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ దివ్య ఈసారి భారీ ఎత్తున ఆర్జీల కౌంటర్లు ఏర్పాటు చేసి 18 మండలాల అధికారులను, సిబ్బందికి బాధ్యతలు అప్పగించగా 6వేల మంది గిరిజనులు తమ సమస్యలను పక్కన పెట్టి లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాల్సిందేనని ఏకైక డిమాండ్‌తో వినుతులు సమర్పించడం విశేషం. ఆదివాసీ సంక్షేమ పరిషత్, తుడుం దెబ్బ, ఆదివాసీ విద్యార్థి సంఘాల పిలుపుమేరకు మెస్రం వంశీయులతో పాటు ఆదివాసీ గిరిజన తెగల ప్రజలు తమ హక్కుల పరిరక్షణ కోసం లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాల్సిందేనని పట్టుబడుతూ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వినుతులు సమర్పించారు. దర్బార్ వేదికపై మంత్రి జోగురామన్న, జడ్పీ చైర్‌పర్సన్ శోభారాణి, కలెక్టర్ దివ్యకు సైతం ఆదివాసీ సంఘాల నేతలు తమ డిమాండ్‌ను త్వరితగతిన పరిష్కరించాలని ఒత్తిడి తీసుకరావడం కనిపించింది. ఎక్కడా చూసిన ఒకే నినాదంతో వినతి పత్రాలు వెల్లువెత్తాయి. అయితే దర్బార్ అనంతరం ఆదివాసీ సంఘాల నాయకులు వెడ్మ బొజ్జు, సోయం బాపురావు, ఉయిక సంజీవ్, దుర్వ నగేష్‌లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల డిమాండ్లపై జాప్యం వహించడం తగదని, వెంటనే ప్రభుత్వం రాజ్యాంగ చట్టాలను తిరిగేసి ఆదివాసీ హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలన్న డిమాండ్‌తో నాగోబా ఆలయంలో పూజలు చేసిన అనంతరం వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వానికి కనువిప్పు కావాలని తాము నాగోబాకు పూజలు చేసినట్లు వారు తెలిపారు. ఇదిలా ఉంటే తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా జాతరలో పోలీసు ఆంక్షలతో ప్రజలు లేకుండానే దర్బార్ నిర్వహించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివాసీ జనాభా అధికంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ మంజూరైతే ప్రభుత్వం రాజకీయ ఉద్దేశంతో వరంగల్ జిల్లాకు తరలించడం ఆదివాసీల పట్ల చిన్నచూపు చూడడమేనని విద్యార్థి సంఘాల నేతలు దర్బార్‌లో ఆరోపించారు. యూనివర్సిటీ ఉట్నూరు కేంద్రంగా ఏర్పాటు చేసి, విద్య పరంగా ఆదివాసీలను అభివృద్దిపర్చాలని వారు డిమాండ్ చేశారు. కాగా మంత్రి జోగురామన్న, ఎంపి గెడం నగేష్ మాట్లాడుతూ ఆదివాసీల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకవెళ్తామని, ఆలయం అభివృద్దికి కోటి రూపాయల నిధులు మంజూరు చేస్తామని ప్రకటించడం గమనార్హం.

చిత్రాలు..కెస్లాపూర్ నాగోబా జాతరలో వెలసిన గుడారాలు, గిరిజన దర్బార్‌లో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని
మంత్రి రామన్నకు వినతి పత్రం సమర్పిస్తున్న ఆదివాసీ నేతలు