తెలంగాణ

తెరాసలో వైకాపా విలీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాసనసభాపక్షం తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనమైంది. వైకాపా ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మదన్‌లాల్, పాయం వెంకటేశ్వర్లు ఇటీవల తెరాసలో చేరిన సంగతి తెలిసిందే. తమను తెరాస శాసనాసభపక్షం సభ్యులుగా గుర్తించాలంటూ ముగ్గురు ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్పీకర్ శుక్రవారం వైకాపా శాసనసభాపక్షాన్ని తెరాస శాసనసభాపక్షంలో విలీనం చేసినట్లు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ ఎస్. రాజా సదారామ్ ‘బులెటిన్’ విడుదల చేశారు.
దీంతో తెలంగాణలో వైకాపా ఉన్నా, అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేనట్లే. తెలంగాణలో ఉన్న వైకాపా ఏకైక ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (ఖమ్మం) కూడా టిఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే.
మదర్ పార్టీతో ముడిపడి..
ఇలాఉండగా ఎమ్మెల్యేల చేరికను దృష్టిలో పెట్టుకుని ‘బులిటెన్’ విడుదల చేసే కొత్త సంప్రదాయానికి తెలంగాణ అసెంబ్లీ ‘తెర’ లేపింది. లోగడ టి.టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో చేరినప్పుడూ విలీనమైనట్లు ‘బులిటెన్’ విడుదల చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి 15 స్థానాల్లో గెలుపొందగా, వేర్వేరుగా 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. చివరకు ఆ పార్టీలో ముగ్గురు ఎమ్మెల్యేలు మిగిలారు. డజను మంది చేరడంతో వారు టిఆర్‌ఎస్‌లో విలీనమయ్యారని స్పీకర్ ఆదేశం మేరకు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ సదారామ్ బులిటెన్ విడుదల చేశారు. ఇదేమి విచిత్రం, ఎలా విలీనం చేస్తారని టి.టిడిపి నేతలు ప్రశ్నిస్తే, రెండింట మూడో వంతు మందికి పైగా ఎమ్మెల్యేలు చేరిపోయారు కాబట్టి విలీనంగా గుర్తించడమైందని టిఆర్‌ఎస్ వాదిస్తోంది. నిజానికి రాజ్యాంగంలోని 10వ షెడ్యూలులో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎమ్మెల్యేల విలీనాన్ని ఆమోదించాలంటే, తొలుత ‘మదర్ పార్టీ’ ఆమోదించాల్సి ఉంటుంది. 10వ షెడ్యూలు ప్రకారం తొలుత ఏదైనా ఒక పార్టీ మరో పార్టీలో విలీనం కావాలనుకుంటే ఆ పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి, విలీనానికి అనుకూలంగా తీర్మానాన్ని ఆమోదించి, ఆ తర్వాతే కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విలీనానికి సిఇసి ఆమోదించినట్లయితే, సదరు పార్టీకి ఎంపీ, ఎమ్మెల్యేలు అంటే చట్ట సభలో ప్రజాప్రతినిధులు ఉన్నట్లయితే, వారి సంగతేమిటీ? అని ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అప్పుడు చట్ట సభల్లోని ప్రజాప్రతినిధులు పార్టీ అనుసరించిన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరమేమీ లేదు. అప్పుడు ఏమి చేయాలి అన్న దానికీ 10వ షెడ్యూలులో మార్గాలు చూపింది. మదర్ (సొంత) పార్టీ మరో పార్టీలో విలీనమైనా, ఆ ప్రజాప్రతినిధులు తాము ఎన్నికైన పార్టీ తరఫునే ఆ టర్మ్ (కాల పరిమితి) పూర్తయ్యేంత వరకూ కొనసాగవచ్చు. లేదంటే ఆ చట్ట సభలోని ప్రజాప్రతినిధుల్లో రెండింట మూడో వంతు మంది, లేదంటే అంతకు మించిన సభ్యులు విడిపోయి, తమకు నచ్చిన పార్టీలో చేరడానికి అవకాశం కల్పించడమైంది. రెండింట మూడో వంతు మంది లేదా అంతకు మించిన సభ్యులు మరో పార్టీలో చేరితే! మిగిలిపోయిన వారి సంగతేమిటీ? అనే ప్రశ్నకూ సమాధానం ఉంది. ఆ మిగిలిపోయిన వారిలోనూ మళ్లీ రెండింట మూడో వంతు మంది తమకు ఇష్టమైన పార్టీలో చేరవచ్చు. మిగిలి పోయిన వారు తమకు నచ్చిన పార్టీలో విలీనం కావచ్చు. ఏదైనా మదర్ పార్టీతోనే ముడిపడి ఉంది. మదర్ పార్టీ అంగీకారం లేకుండా విలీనానికి ఆస్కారం లేదు. తెలంగాణలో వైకాపా శాసనసభాపక్షం టిఆర్‌ఎస్‌లో విలీనమైందంటే తప్పని సరిగా మదర్ పార్టీ ఆమోదం ఉండాలి. కాగా ఆ పార్టీ శుక్రవారం స్పీకర్ నిర్ణయాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూలులో ఏ ఆర్టికల్ ప్రకారం విలీనం చేశారో చెప్పాలని డిమాండ్ చేసింది.