తెలంగాణ

చివరి ఆయకట్టుకూ సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జనవరి 22: రబీ సీజన్‌లో చివరి ఆయకట్టు రైతులకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో ఎస్సారెస్పీ నుంచి విడతల వారీగా నీటిని విడుదల చేస్తున్నామని, అయితే, కాలువలలో మోటార్లు బిగించడం వల్ల చివరి ఆయకట్టు భూములకు నీళ్లు అందే పరిస్థితి లేకుండా పోయిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కాలువలపై మోటార్లు బిగించిన రైతులు తక్కువ నీటిని వాడుకుంటూ చివరి ఆయకట్టు రైతులకు నీరందేలా సహకరించాలని కోరారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ ఇంజనీర్లు, ట్రాన్స్‌కో అధికారులతో ఎస్సారెస్పీ నీటి వినియోగంపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో పంటకు అగ్గితెగులు సోకీ రైతులు నష్టపోయారని, కనీసం రబీ సీజన్‌లోనైనా రైతులకు నష్టం కలగకుండా ఉండేందుకు ఎస్సారెస్పీలో నీరు లేకుంటే సింగూర్, మంజీర ప్రాజెక్టుల నుండి ఎస్సారెస్పీ (పోచంపాడు)లో నీటిని నింపుతూ, ఇక్కడి నుంచి నీటిని విడతల వారీగా విడుదల చేస్తున్నామని తెలిపారు. ఎల్‌ఎండి పైభాగంలో 4లక్షల ఎకరాలు, కింది భాగంలో లక్షా 50వేల ఎకరాలకు నీరు విడుదల చేసేందుకు ప్రణాళికలు చేసామని తెలిపారు. ప్రతి విడతలో 5వేల క్యూసెక్కులు విడుదల చేస్తే ఎస్సారెస్పీ కాలువలపై రైతులు బిగించిన 5హెచ్‌పి, 10హెచ్‌పి, మోటార్ల ద్వారా కరీంనగర్ సరిహద్దుకు వచ్చేవరకు 900 క్యూసెక్కుల నీరు కూడా రావడం లేదని తెలిపారు. కాలువలపై మొత్తం 1,174 మోటార్లు బిగించి నీటిని తోడేస్తుండటంతో సమస్యగా తయారైందని, తద్వారా చివరి ఆయకట్టు రైతులకు నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువలపై మోటార్లు బిగించిన రైతులు 5 నుంచి 6 గంటలు మాత్రమే వాడుకుంటూ చివరి రైతులకు నీరు అందేలా సహకరించాలని కోరారు. ప్రభుత్వం ఇస్తున్న 24గంటల కరెంట్ వల్ల కాలువలపై బిగించిన మోటార్ల ద్వారా అవసరానికి మించి నీటిని తోడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ కాలువలపై అక్రమ విద్యుత్ మోటార్ కనెక్షన్లను తొలగించుటకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 25న మూడవ విడత నీటిని విడుదల చేస్తామని, ఈలోగా సంబంధిత జిల్లాల కలెక్టర్లు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించి నీరు చివరి వరకు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి నీటిని దుర్వినియోగం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాగునీటి విషయంలో ఒక ప్రాంతంలో ఒక విధంగా, మరో ప్రాంతంలో మరో విధంగా కొన్ని పార్టీల నేతలు వ్యవహరిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూడటం శోచనీయమని అన్నారు. నేతలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, రైతులు ఎవరూ కూడా రెచ్చిపోవద్దని, మీ పంటలను కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
ఈ సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కరీంనగర్, పెద్దపల్లి కలెక్టర్లు సర్ఫరాజ్ అహ్మద్, దేవసేన, రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, కరీంనగర్, రామగుండం, మంథని శాసనసభ్యులు గంగుల కమలాకర్, సోమారపు సత్యనారాయణ, జగిత్యాల జేసీ రాజేశం, ఎస్సారెస్పీ సిఇ శంకర్, ఎస్‌ఇలు శ్రావణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, ఇఇలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్