తెలంగాణ

కరవు కాటుకు బత్తాయి రైతు విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 7: కరవు జిల్లా అయన నల్లగొండలో బత్తాయి రైతు లను దారుణంగా దెబ్బతీస్తు భారీ నష్టాలపాలు చేస్తోంది. వర్షాలు లేక ఎండిపోతున్న బత్తాయి చెట్లను రక్షించుకునేందుకు లక్షల రూపా యల మేర అప్పులు చేసి, బోర్లు వేసినా, భగీరథ ప్రయత్నాలు చేసినా భూగర్భ జలాలు లభించక విసుగెత్తిపోతున్న బత్తాయి రైతులు తోటలను తొలగించే దిశగా సాగిపోతున్నారు.
కరవు, ఎండల తీవ్రతతో ఎండుతున్న చెట్ల రక్షణకు అద్దె బోర్ల నుండి పైప్‌లైన్లతో కొందరు, 1500 రూపాయలకు ట్యాంకర్ చొప్పున మరికొందరు నీ టిని కొనుగోలు చేసి వ్యయప్రయాస పడుతున్నారు. సీజన్‌లో టన్ను బత్తాయి 3 వేల వరకు పడిపోగా ప్రస్తుతం 27 వేల వరకు ధర వస్తుండడంతో రైతులు ఎలాగైనా బత్తాయి దిగుబడులను సంరక్షించుకోవాలన్న పట్టుదలతో భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒక్క తిప్పర్తి మండలం ఇందుగులలోనే రైతులు ఈ సీజన్‌లో 500 బోర్లకు పైగా వేసిన తీరు బత్తాయి రైతుల కష్టానష్టాలకు నిదర్శనం. కళ్ల ముందు నిలువునా ఎండుతున్న బత్తాయి తోటల పరిరక్షణ ఇక భారమని తలచిన రైతులు ఇన్నాళ్లుగా కంటిపాపలా సాకినా బత్తాయి చెట్లను నరికివేస్తూ ప్రత్యామ్నాయ పంటల దిశగా ముందుకు సాగుతున్నారు.
నిన్న దేశంలోనే అధికం..
బత్తాయి సాగు విస్తీర్ణంలో దేశంలోనే నిన్నటిదాకా నల్లగొండ జిల్లా రైతాంగం అగ్రగామి..ఏటా 1600 కోట్ల రూపాయల వ్యాపారం జిల్లా బత్తాయి తోటల రైతాంగం సాధించిన ఘనత. అదంతా ఇప్పుడు గత వైభవంగా మారిపోతుండగా జిల్లాలో గత రెండేళ్లలో బత్తాయి తోటల సాగు విస్తీర్ణం వేగంగా తగ్గిపోతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. రెండేళ్ల క్రితం వరకు కూడా 75,739 హెకార్ల మేరకు ఉన్న బత్తాయి తోటలు నేడు 44 వేల హెక్టార్లకే పరిమితమవ్వడం జిల్లాలో వేగంగా తగ్గిపోయిన బత్తాయి తోటల సాగు విస్తీర్ణానికి నిదర్శనం. యేటేటా పెరగాల్సిన సాగు విస్తీర్ణం కాస్తా తగ్గిపోతుండగా బత్తాయి రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వం దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. నాడు సంప్రదాయ వరి వంటి పంటలకు ప్రత్యామ్నాయంగా ఉద్యానవన విప్లవాన్ని తలపిస్తూ జిల్లా రైతులు పెద్ద ఎత్తున బత్తాయి తోటల సాగు చేపట్టి ఒకప్పుడు మంచి లాభాలు గడించారు. అయితే జిల్లా బత్తాయి తోటల వైభవంపై కనే్నసిన దళారులు నానాటికీ విస్తరించడం, బత్తాయి కొనుగోలు మార్కెట్, కోల్డ్ స్టోరేజీ వంటి వసతులు లేకపోవడం, రకరకాల చీడపీడలతో బత్తాయి చెట్లు నిలువునా ఎండిపోతుండడం, కరవు, ఎండల తీవ్రతతో సాగునీటి కొరత, మద్దతు ధర కరువైపోవడం వంటి సమస్యలతో బత్తాయి తోటల పట్ల రైతాంగాన్ని నిరాసక్తత పెంచుకునేలా చేశాయి. ప్రభుత్వం సైతం క్రమంగా పండ్ల తోటల ప్రోత్సాహక పథకాలను తగ్గించుకుంటూ వస్తుండడం కూడా బత్తాయి తోటల సాగుకు ప్రతిబంధకమైంది. పాత తోటల పునరుద్ధరణ పథకం, బత్తాయి తోటల ప్రోత్సాహక పథకాలను 1000 ఎకరాలకే పరిమితమైంది. చిన్న కమతాలు పెరిగిపోతుండడం, స్వల్పకాల వాణిజ్య పంటల వైపు రైతాంగం ఆసక్తి బత్తాయి తోటల విస్తరణను కుదించి వేస్తోంది. జిల్లాలో బత్తాయి మార్కెట్ లేక రైతులు తమ దిగుబడులను హైద రాబాద్, కొత్తపేట మార్కెట్‌కు నానా వ్యయప్రయాసల మధ్య తరలించలేక తోటల వద్దనే మధ్య దళారీలకు విక్రయిస్తూ నష్టపోతున్నారు. బత్తాయి మార్కెట్‌కు గతంలో కనగల్, నల్లగొండ మండలాల్లో సేకరించిన స్థలం ప్రతిపాదనలు సైతం ఏళ్ల తరబడి కాగితాల్లోనే మగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో నానాటికీ తగ్గిపోతున్న బత్తాయి తోటల పరిరక్షణకు ఎండుతున్న చెట్లకు తగిన పరిహారంతో పాటు తక్షణమే బత్తాయి మార్కెట్, కోల్డ్ స్టోరేజీ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటు రైతు సంఘాల నుండి బలమైన డిమాండ్‌గా వినిపిస్తోంది.