తెలంగాణ

స్పీకర్ చాంబర్‌లో కాంగ్రెస్, బిజెపి, టిడిపి ఎమ్మెల్యేల బైఠాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసెంబ్లీని అర్ధాంతరంగా వాయిదా వేయడంపై నిరసన

హైదరాబాద్, మార్చి 13: తెలంగాణ అసెంబ్లీని అర్ధాంతరంగా వాయిదా వేశారని కాంగ్రెస్, బిజెపి, టిడిపి ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. ఆ పార్టీల ఎమ్మెల్యేలు స్పీకర్ చాంబర్‌లో కొంత సేపు బైఠాయించారు. అసెంబ్లీలో రెండు రోజులుగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ఆదివారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. అనంతరం మజ్లిస్ పార్టీ అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి కెసిఆర్ సమాధానమిచ్చిన తర్వాత స్పీకర్ మధుసూదనాచారి సభను సోమవారానికి వాయిదా వేశారు. అయితే వివరణ అడిగేందుకు మజ్లిస్ పార్టీకి అవకాశం ఇచ్చిన స్పీకర్ తమకు ఇవ్వలేదని కాంగ్రెస్, బిజెపి, టిడిపి ఎమ్మెల్యేలు విమర్శించారు. సభను వాయిదా వేసిన వెంటనే స్పీకర్ ఇంటికి బయలుదేరి వెళ్ళగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జె. గీతారెడ్డి, డి.కె అరుణ, వంశీచంద్ రెడ్డి, జి. చిన్నారెడ్డి, సంపత్ కుమార్, టి. జీవన్ రెడ్డి తదితరులు, బిజెపి శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్, టిడిపి ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి తదితరులు స్పీకర్ చాంబర్‌కు చేరుకున్నారు. స్పీకర్ వెళ్లిపోవడంతో వారు చేసేది ఏమీ లేక కొంత సేపు స్పీకర్ చాంబర్‌లో బైఠాయించి, ఆ తర్వాత వెనుదిరిగారు.
అభ్యంతరకరంగా ఉంది: ఉత్తమ్
అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ వ్యవహరించిన తీరు చాలా అభ్యంతరకంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి సమాధానం చెప్పిన తర్వాత వివరణలు అడిగేందుకు తమకు అవకాశం ఇవ్వలేదని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అహంకార ధోరణితో సీనియర్ ఎమ్మెల్యేలను అవమానించే విధంగా మాట్లాడడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ప్రాణహితపై మాట్లాడేందుకు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్‌ను మార్చింది నీళ్ళు ఇచ్చేందుకు కాదు, సంపాదన కోసమని విమర్శించారు. ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి మాట్లాడుతూ తుమ్మిడిహట్టి వద్ద అ ప్రాజెక్టు ఎత్తును 152 నుంచి 148 మీటర్లకు తగ్గించి సంబరాలు చేసుకోవడం విస్మయం కలిగిస్తున్నదని అన్నారు.
సిఎం ఏకపాత్రాభినయం: రేవంత్
టిడిపి ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి మట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో ఏకపాత్రాభినయం చేశారని విమర్శించారు. సభ్యుల హక్కులను కాపాడాల్సిన స్పీకరే సభను అర్ధాంతరంగా వాయిదా వేశారని ఆయన విమర్శించారు.
మ్యాచ్ ఫిక్సింగ్: లక్ష్మణ్
బిజెపి శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ అసెంబ్లీలో టిఆర్‌ఎస్-మజ్లిస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న విపక్షాల ఎమ్మెల్యేలకు స్వేచ్ఛలేదని ఆయన అన్నారు.
కెసిఆర్ నియంత: చిన్నారెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్యే జి. చిన్నారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతలా, ప్రతిపక్షాల పట్ల కనీస మర్యాదలు పాటించకుండా విమర్శిస్తున్నారని తెలిపారు. తనకంటే గొప్పవాడు లేరన్నట్లు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. అయితే వీటన్నింటినీ గమనిస్తున్న ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. ఇలాఉండగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు ముందు తాను ఆంధ్ర ఉద్యోగులంతా వెళ్ళిపోవాలని అన్నట్లు ప్రచారం జరిగిందని, దీనిని ముఖ్యమంత్రి కూడా ప్రస్తావించారని జి. చిన్నారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజానికి తాను ఆ విధంగా అనలేదని, రాష్టప్రతి ఉత్తర్వులను ప్రస్తావించానని ఆయన వివరించారు.
(చిత్రం) మీడియాతో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి, చిత్రంలో డి.కె అరుణ, భట్టి విక్రమార్క, టి. జీవన్‌రెడ్డి తదితరులున్నారు.