సబ్ ఫీచర్

టీటీడీ చైర్మన్ పీఠం రాజకీయ పదవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హిందువుల ఆథ్యాత్మిక క్షేత్రం తిరుమల ఆలయంపై రాజకీయ నేతల పెత్తనం ఎందుకు? దేశంలోనే అత్యంత సంపన్న ఆలయం కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానంపై చిరకాలంగా ప్రభుత్వాలు అజమాయిషీ చేస్తున్నాయి. ఈ కారణంగానే టీటీడీ ట్రస్టు బోర్డు చైర్మన్ పదవికి, సభ్యుల పదవులకు జరిగే నియామకాల్లో రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. టీటీడీ పాలకమండలికి చైర్మన్, ఇతర సభ్యులను ఎంపిక చేయడంలో తరచూ వివాదాలు రాజుకుంటున్నాయి. తాజాగా చైర్మన్ పదవికి కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌ను ఏపీ ముఖ్యమంత్రి ఎంపిక చేశారన్న ఊహాగానాలు ఇప్పుడు వేడి పుట్టిస్తున్నాయి. టీటీడీ పాలకమండలిని నియమించే అధికారం చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, ఈ బోర్డును ఇతర కార్పొరేషన్లతో సరిపోల్చరాదు. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో నడిచే వివిధ కార్పొరేషన్లు, ఆర్థిక సంస్థల్లో నామినేటెడ్ పదవుల్లో నియమితులయ్యే వారికి కొద్దిపాటి పాలనానుభవం ఉన్నా చాలు. ఇందుకు పూర్తి భిన్నమైనది టీటీడీ పాలకమండలి. పవిత్ర ఆథ్యాత్మిక క్షేత్రంగా, కోట్లాది మంది హిందువుల విశ్వాసాలకు ఆలవాలంగా భాసిల్లుతున్న తిరుమల ఆలయంపై రాజకీయ నేతల ఆధిపత్యం సరికాదు. టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా నియమితులయ్యే వ్యక్తికి ఉండాల్సిన అర్హతలేమిటో రాష్ట్ర ప్రభుత్వానికి తగిన అవగాహన ఉండాలి. ఇటువంటి జాగ్రత్తలేవీ తీసుకోకుండా టీటీడీ ట్రస్టుబోర్డు చైర్మన్ పీఠాన్ని ‘ఒక రాజకీయ పదవి’గా భావించి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే మెజారిటీ ప్రజలు సహించరు. వివాదాస్పద నేపథ్యం ఉన్న సుధాకర్ యాదవ్‌ను టీటీడీ చైర్మన్‌గా నిర్ణయిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాష్ట్ర ప్రజలకు ఇస్తున్న సందేశం ఏమిటి?
నిజానికి పుట్టా సుధాకర్ పేరు తొలిసారిగా తెరపైకి వచ్చినపుడే పలు హిందూ సంస్థలు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశాయి. క్రైస్తవ సమావేశాలకు సుధాకర్ హాజరైన ఫొటోలు, అన్యమత సంస్థతో ఆయనకు ఉన్న సంబంధాల గురించి ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. దీంతో సుధాకర్ నియామకంపై ప్రస్తుతానికి సందిగ్ధత ఏర్పడింది. అయితే, ఆయన నియామకం విషయంలో ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ఎక్కడా ప్రకటించలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా మైదుకూరు నుంచి పోటీచేసి ఓటమి చెందిన సుధాకర్ యాదవ్ ప్రస్తుతం అదే నియోజకవర్గం తెదేపా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా కనిపిస్తోంది. ఇతర పార్టీల నేతలను తెదేపాలో ఎడాపెడా చేర్చుకుంటున్నందున అందరికీ ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది. మాజీ మంత్రి అయిన ఓ కాంగ్రెస్ నేతను ఇటీవల తెదేపాలోకి చంద్రబాబు ఆహ్వానించడంతో సుధాకర్ యాదవ్‌ను మైదుకూరు బరి నుంచి తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఈ కారణంగానే యాదవ్‌ను టీటీడీ చైర్మన్ పదవికి సీఎం ఎంపిక చేశారట! కొన్ని వర్గాల నుంచి నిరసనలు రావడంతో నియామకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు ఇంకా విడుదల కాలేదట!
నామినేటెడ్ పదవులకు ఎవరిని నియమించాలన్నది ముఖ్యమంత్రి ఇష్టం. దీన్ని ఎవరూ కాదనలేరు. అయితే, నేతలను బుజ్జగించేందుకు టీటీడీ పాలకమండలి పదవులను వాడుకోవడం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న ఏదో ఒక కార్పొరేషన్‌కు చైర్మన్‌గా సుధాకర్‌ను నియమించుకోవచ్చు. ఏ పదవీ లేనట్టు టీటీడీ చైర్మన్ పీఠానే్న ఆయనకు కట్టబెట్టాలనుకోవడం సమంజసం కాదు. సుధాకర్ నియామకంపై ఉత్తర్వులు వెలువడితే- హిందువుల మనోభావాలను ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని భావించక తప్పదు. టీటీడీపై పెత్తనానికి సుధాకర్ తగిన నాయకుడని చంద్రబాబు భావిస్తున్నారా? భక్తుల మనోభావాలకు, హిందూ సంస్థల అభ్యంతరాలకు విలువ లేదా? ముఖ్యమంత్రి మొండిపట్టుకు పోకుండా హిందువుల విశ్వాసాలను గౌరవించాలి.
తిరుమలలో అన్యమత ప్రభావాన్ని సహించబోమని పాలకులు అనునిత్యం చెబుతుంటారు. అయితే, క్రైస్తవం స్వీకరించి టీటీడీలో పనిచేస్తున్న ఓ అధికారిణి గుట్టు ఇటీవల రట్టయింది. హైందవేతరులు ఇంకా కొందరు టీటీడీలో ఉన్నారని దేవస్థానం ఈఓ అంగీకరించారు. ఎవరి ప్రమేయంతో అన్యమతస్థులు కీలక స్థానాల్లో ఉన్నారో ప్రజలు సైతం గమనిస్తున్నారు. క్రైస్తవ మత ప్రార్థనల్లో పాల్గొంటూ, ఓ తీవ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నానని అంగీకరించిన నాయకుడిని గతంలో టీటీడీ చైర్మన్‌గా నియమించడం వివాదాస్పదమైంది. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా ఓ అన్యమతస్థురాలిని నియమించడం, ఆమె తన కార్యాలయంలో వేంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తొలగించడంతో ఉద్యమం కొనసాగడం సీఎం స్థాయిలో ఉన్న నేతలకు తెలియనిది కాదు. ‘తిరుమల ఇకపై ఏడు కొండలు కాదు, టీటీడీకి మూడు కొండలు చాలున’ని వ్యాఖ్యానించిన అప్పటి సీఎం గురించి ప్రస్తుత ముఖ్యమంత్రికి తెలియనిది కాదు. తిరుమల కొండలపై అప్పటి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ, ‘తిరుమల క్షేత్ర పవిత్రతతో ఆటలు వద్దు.. ఆ దేవుడి మహిమ తెలిసిన వాడిగా చెబుతున్నా..’ అంటూ అన్న మాటలను హిందువులెవరూ మరచిపోలేరు. అలాంటి చంద్రబాబు ఇపుడు సీఎం హోదాలో- ఓ వివాదాస్పద వ్యక్తిని టీటీడీ చైర్మన్‌గా నియమించేందుకు నిర్ణయం తీసుకుంటే ప్రజలు ఏమనుకోవాలి?
టీటీడీ పాలకమండలి పదవులకు అర్హతలేమిటి? ఈ అర్హతల కొలమానం ప్రకారమే నియామకాలు జరగాలి. హిందూ ధర్మంపై అంచంచల విశ్వాసం ఉండాలి. హిందువుగా జన్మించిన వ్యక్తికే ఇది సాధ్యం. గతంలో టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన వ్యక్తి నాస్తికుడని, తీవ్రవాదంతో సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చినా అప్పటి సీఎం పట్టించుకోలేదు. పదవుల కోసం హిందువుగా నాటకం ఆడితే పవిత్రత రాదు, అలాంటివారు ఈ పదవులకు అనర్హులే. ఆథ్యాత్మిక కోణంలో ఆలోచించి టీటీడీ పాలకమండలికి నియామకాలు జరపాలి. రాజకీయ నేతలకు, పారిశ్రామికవేత్తలకు పదవులు కట్టబెట్టడం సరికాదు. తిరుమలలో కొందరు అన్యమత ప్రచారానికి పాల్పడుతున్నారన్న వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. క్రైస్తవ సంస్థలతో సంబంధాలున్న వ్యక్తికి చైర్మన్ పదవిని అప్పగించడమంటే- అన్యమత ప్రచారానికి అధికారికంగా అవకాశం ఇవ్వడమే అవుతుంది. అనుమానాలు, ఆరోపణలు ఉన్న వ్యక్తిని అందలం ఎక్కించాల్సిన పనిలేదు. హిందూ మతంపై నిబద్ధత, వేంకటేశ్వరునిపై భక్తిశ్రద్ధలు ఉన్న వారినే టీటీడీ పాలకమండలికి నియమించాలి. ఆథ్యాత్మిక రంగంలో ఇలాంటి అర్హతలున్న వారు దొరకడం కష్టమేమీ కాదు. అనవసర వివాదాల్లోకి టీటీడీ చైర్మన్ పదవిని నెడితే హిందూ సమాజం నుంచి వ్యతిరేకత వస్తుందన్న విషయాన్ని పాలకులు గ్రహించాలి. ఎన్నికల ముందు ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు అధికారంలో ఉన్నవారికి క్షేమకరం కాదు.

..................................................
గతంలో టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన వ్యక్తి నాస్తికుడని, తీవ్రవాదంతో సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చినా అప్పటి సీఎం పట్టించుకోలేదు. పదవుల కోసం హిందువుగా నాటకం ఆడితే పవిత్రత రాదు,
అలాంటివారు ఈ పదవులకు అనర్హులే. ఆథ్యాత్మిక కోణంలో ఆలోచించి టీటీడీ పాలకమండలికి
నియామకాలు జరపాలి. రాజకీయ నేతలకు, పారిశ్రామికవేత్తలకు పదవులు కట్టబెట్టడం సరికాదు.
తిరుమలలో కొందరు అన్యమత ప్రచారానికి పాల్పడుతున్నారన్న వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. క్రైస్తవ సంస్థలతో సంబంధాలున్న వ్యక్తికి చైర్మన్ పదవిని అప్పగించడమంటే- అన్యమత ప్రచారానికి
అధికారికంగా అవకాశం ఇవ్వడమే అవుతుంది.

- పీవీ శ్రీరామశాయి సెల్: 98480 76295*