నిజామాబాద్

ఊరూరా గులాబీ దండు సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, ఫిబ్రవరి 5: ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా భావించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలతో ఘన విజయాన్ని నమోదు చేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. ఫలితాలు వెలువడిన వెంటనే టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ రోడ్లపైకి చేరుకుని బాణాసంచా పేలుస్తూ, పరస్పరం మిఠాయిలు పంచుకుంటూ సంబరాల్లో మునిగి తేలారు. జిల్లా వ్యాప్తంగా ఎటుచూసినా ‘గులాబీ’ దండు సంబరాలే కనిపించాయి. మరోవైపు కాంగ్రెస్, టిడిపి-బిజెపి శిబిరాల్లో తీవ్ర నైరాశ్యం అలుముకుని, ఆ పార్టీల కార్యాలయాలు బోసిపోయాయి. ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ప్రతిష్టాత్మకంగా భావించి సర్వశక్తులొడ్డిన గ్రేటర్ పోరులో తెరాస నేతలు సైతం ఊహించని రీతిలో ఆ పార్టీ దాదాపు వంద డివిజన్ల వరకు గెల్చుకోవడం గులాబీ శ్రేణుల్లో అణువణువునా ఉత్సాహం ఉరకలెత్తేలా చేసింది. సాయంత్రం ఐదు గంటల నుండే టి.విల ముందు అతుక్కుపోయి ఫలితాలు తెలుసుకునేందుకు ప్రతిఒక్కరూ ఎంతో ఆసక్తిని కనబర్చారు. అంతకుముందే ఓట్ల లెక్కింపు ప్రారంభించిన నేపథ్యంలో ఐదు గంటల సమయానికే తెరాసకు స్పష్టమైన ఆధిక్యత లభించినట్టు స్పష్టమైంది. క్రమంగా గ్రేటర్‌లో సీట్ల సంఖ్య అధికార పక్షానికి పెరుగుతూ రావడం, దాదాపు వంద స్థానాల్లో విజయం సాధించినట్టు ప్రసార మాధ్యమాల ద్వారా వెల్లడైన వెంటనే గులాబీ నేతలు తీవ్ర హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ సంబరాల్లో మునిగి తేలారు. ఆశించిన దానికంటే ఎక్కువ స్థానాల్లో గ్రేటర్ ఓటర్లు ఆధిక్యతను కట్టబెట్టడంతో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలంతా ఆనందోత్సాహాలు వెలిబుచ్చుతూ ఊరూరా సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలు, ఆయా గ్రామాల్లో గులాబీ దండు సంబరాలు పండగ వాతావరణాన్ని తలపించాయి. నగరంలోని తెరాస అర్బన్ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకుడు బిగాల రాకేష్ నేతృత్వంలో కార్యకర్తలు బాణాసంచా పేల్చి పరస్పరం మిఠాయిలు తినిపించుకుని గ్రేటర్ ఫలితాల మజాను ఆస్వాదించారు. నెహ్రూపార్క్ వద్ద తెరాస మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో సంబరాలు మిన్నంటాయి. గ్రేటర్ ఎన్నికల్లో తెరాస గెలుపు చారిత్రక అవసరమంటూ ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేసిన దరిమిలా, జిల్లాకు చెందిన మంత్రి పోచారంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలంతా హైదరాబాద్‌లోనే మకాం వేసి తెరాస అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎంపి కవిత అయితే దాదాపు రెండున్నర మాసాల పాటు సొంత నియోజకవర్గానికి దూరంగా ఉండిపోయి మరీ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో చెమటోడ్చారు. తెరాస మైనార్టీ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు కూడా గ్రేటర్ ప్రచార బరిలో గులాబీ అభ్యర్థులకు మద్దతుగా అహరహం శ్రమించారు. ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవడం సదరు నేతలను ఎంతో సంతృప్తికి గురి చేసింది. తెరాస నేతల తరహాలోనే కాంగ్రెస్, టిడిపి, బిజెపి పార్టీలకు చెందిన నేతలు సైతం ప్రచారం నిర్వహించినప్పటికీ, నామమాత్రపు స్థానాలకే పరిమితం కావాల్సి రావడంతో వారందరిలో నైరాశ్యం అలుముకుంది. తెరాస ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో ఆదరణ ఉందనడానికి గ్రేటర్ ఎన్నిక ఫలితాలు నిదర్శనంగా నిలిచాయని తెరాస నాయకులు పేర్కొన్నారు.

ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతోనే పల్లెల ప్రగతి
కలెక్టర్ యోగితారాణా
డిచ్‌పల్లి రూరల్, ఫిబ్రవరి 5: ప్రభుత్వ పథకాలలో స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వాములైనప్పుడే అవి విజయవంతం అవుతాయని, నూరు శాతం మరుగుదొడ్లు నిర్మించుకున్న 78 గ్రామ పంచాయతీలను ఆదర్శ సచివాలయాలుగా తీర్చిదిద్దనున్నట్టు కలెక్టర్ యోగితారాణా తెలిపారు. శుక్రవారం డిచ్‌పల్లిలోని టిటిడిసిలో మండల అభివృద్ధి అధికారులు, ఎంపిపిలు, ఎంపిటిసిలు, జడ్పీటిసిలు, సర్పంచ్‌లతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓడిఎప్‌గా నమోదైన 78 గ్రామ పంచాయతీలలో మ్యాజిక్ పిట్లు, సోక్‌పిట్లు, స్వశాన వాటికలు, డంపింగ్ యార్డులు, చెత్తను తరలించే రిక్షాల ఏర్పాటు, పశువులకు నీటి తొట్టెల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. వీటిని త్వరితగతిన ఏర్పాటు చేసుకుని ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుద్దామని పిలుపునిచ్చారు. సంసద్ ఆదర్శ యోజన కింద పార్లమెంటు సభ్యులు దత్తత తీసుకున్న కందకుర్తి, కౌలాస్ గ్రామాల్లో అన్ని రకాల వౌలిక సదుపాయాలు కల్పించేందుకు 20కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. మ్యాజిక్ పిట్లను ఏర్పాటు చేసి వృధా నీటిని భూమిలోకి వెళ్లేలా చర్యలు తీసుకుని భూగర్భ జలాలను పెంపొందించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. వీటి వల్ల సుమారు ఆరు నెలల తర్వాత వట్టిపోయిన బావులలో, బోరుబావుల్లో నీరు సమృద్ధిగా లభించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ప్రతి గ్రామంలోని ఇళ్లలో మరుగుదొడ్లు, మ్యాజిక్ పిట్లు ఏర్పాటు చేయడంతో పాటు 13 సోప్ పిట్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. అంగన్‌వాడి, సబ్ సెంటర్‌లోని పిహెచ్‌సిలో నూటికి నూరు శాతం గర్భిణీ స్ర్తిలను నమోదు చేయడంతో పాటు ఆరోగ్య లక్ష్మి కింద ఆహారం తీసుకోవడం, పూర్తి స్థాయిలో టీకాలు వేయించడం, ఆసుపత్రులలో ప్రసవాలు చేయించడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 10న జిల్లాలో డీవార్మింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రెండేళ్ల నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు మధ్యాహ్నం వేళలో డీవార్మింగ్ మందును ఇచ్చేందుకు అన్ని ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేశామన్నారు..అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలు, పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు వారి పేర్లను నమోదు చేసుకోవడంతో పాటు అంగన్‌వాడికి వచ్చి ఆరోగ్య లక్ష్మి కింద ఆహారాన్ని తీసుకోవాలని, తద్వారా పౌష్టికంగా ఎదిగేందుకు ఇది దోహదపడుతుందని కలెక్టర్ హితవు పలికారు. 78 గ్రామ పంచాయతీలలో విద్యాపరంగా డిజిటల్ తరగతుల ఏర్పాట్లు, గ్రంథాలయాల్లో పుస్తకాల ఏర్పాటు, ఉన్నత పాఠశాల బాలబాలికలకు క్రీడా సామాగ్రి ఇవ్వడంతో పాటు మద్యాహ్న భోజన ఏర్పాట్లు చేసి ఆదర్శంగా ఉండేలా చర్యలు తీసుకునేందుకు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. తొలిరోజున జిల్లాలోని 18మండలాలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని, మిగతా 18 మండలాల వారికి శనివారం నిర్వహిస్తామని వివరించారు. ఈ సదస్సులో ఐకెపి పి.డి వెంకటేశం, ఐసిడిఎస్ పి.డి రాములు, డిఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటి, డిపిఓ కృష్ణమూర్తి, బిసి కార్పొరేషన్ ఇ.డి సాయిలు, ఉద్యానవన శాఖ అధికారిణి సునంద, డిఎప్‌ఓ రమేష్, పశు సంవర్ధక శాఖ జె.డి ఎల్లన్నతో పాటు ఆయా మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

తెరాస శ్రేణుల్లో ఉప్పొంగిన ఉత్సాహం
బోధన్, ఫిబ్రవరి 5: హైదరాబాద్ మహానగర ఎన్నికలలో తెరాస ఘణ విజయాన్ని సాధించడంతో శుక్రవారం సాయంత్రం బోధన్ పట్టణంలో తెరాస నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకుడు ఎం.ఏ. రజాక్ నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు గొడుగులు చేతబట్టుకుని శక్కర్‌నగర్ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో బాణా సంచాలు కాల్చి మిఠాయిలు పంచి పెట్టారు. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలు మారుమ్రోగాయి. ఈ సందర్భంగా రజాక్ మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు తెరాస అభ్యర్థులను భారీ సంఖ్యలో గెలిపించి మరోమారు తెలంగాణ వాదాన్ని చాటి చెప్పారని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని రకాల విమర్శలు చేసినా ప్రజలు మాత్రం అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అభివృద్ధి కేవలం తెరాసతోనే సాధ్యమని గుర్తించి తమ పార్టీ అభ్యర్థులకు భారీ మెజార్టీతో గెలిపించారని అన్నారు. బంగారు తెలంగాణ సాధన కోసం పార్టీ అధినేత కేసీఆర్ కృషిని ప్రజలు గుర్తించారని మునుముందు జరిగే వరంగల్ ఎన్నికలలో కూడా తెరాస విజయ ఢంకా మోగించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్ర పార్టీలకు స్థానం లేదని హైదరాబాద్ ప్రజలు నిరూపించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు భవానిపేట్ శ్రీనివాస్, రాజాగౌడ్, ఖాదర్, ఐలయ్య, క్రిష్ణ, రెంజల్ రవి యువజన నాయకులు పాల్గొన్నారు.
మిఠాయిలు పంచుకుని సంబరాలు
ఎల్లారెడ్డి: జిహెచ్‌ఎంసి ఎన్నికలలోటిఆర్‌ఎస్ పార్టీ గెలుపు సాధించడం పట్ల ఎల్లారెడ్డి మండల టిఆర్‌ఎస్ నాయకులు శుక్రవారం స్థానిక తెలంగాణ తల్లి ప్రాంగణం వద్ద ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని, టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా స్థానిక ఎంపిపి నక్కగంగాధర్, జడ్పీటిసి సభ్యులు చినబాలి సామెల్, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ, జిహెచ్‌ఎంసి ఎన్నికలలో 150 సీట్లకు గాను 103కి పైగా అనగా 1/3 మెజార్టీ సాధించి టిఆర్‌ఎస్ పార్టీ మేయర్ స్థానాన్ని దక్కించుకోవడం పట్ల, రాష్టర్రాజధానిలోని విద్యావంతులు, సామాన్యప్రజానీకం రాష్ట్ర సిఎం కెసిఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై, సిఎంపై ఉన్న నమ్మకంతో టిఆర్‌ఎస్ పార్టీకి మేయర్ పట్టం కట్టబెట్టారని అన్నారు. అలాగే ఇదే నెలలోమెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ అసేంబ్లీ ఉపఎన్నికలలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థ్భిరీ మెజార్టీతోవిజయం సాధించడం ఖాయం అని అన్నారు. ఈకార్యక్రమం వైస్‌ఎంపిపి నునుగొండ శ్రీనివాస్, సింగల్‌విండోచైర్మైన్ బోండ్ల సాయులు, మండల కో-ఆఫ్షన్ సభ్యులు రఫీక్, ఎంపిటిసి సభ్యులు షెకావత్ అలీ, టిఆర్‌ఎస్ నాయకులు మంచిర్యాల విద్యాసాగర్, సయ్యద్ ఘని, హబీబ్, హన్మంత్‌రెడ్డి, బోనగిరి వెంకటేశం తదితరులు ఉన్నారు.

వికలాంగులకు మోటారు వాహనాలు
కంఠేశ్వర్, ఫిబ్రవరి 5: డిగ్రీ, ఆ పై చదువులు చదువుతున్న శారీరక వికలాంగులకు మూడు చక్రాల మోటారు వాహనాలను మంజూరు చేయనున్నట్టు కలెక్టర్ యోగితారాణా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో డిగ్రీ, పి.జి కోర్సులతో పాటు తత్సమానమైన వృత్తి విద్యా కోర్సులు చేస్తూ పూర్తిగా నడవలేని, చేతులు బలంగా ఉన్న శారీరక వికలాంగ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వాహనాలను మంజూరు చేస్తామని చెప్పారు. 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల్లోపు వయస్సు ఉన్న వారు అర్హులని అన్నారు. అదేవిధంగా సదరం క్యాంపుల ద్వారా వైకల్య ధ్రువపత్రం పొందిన వారై ఉండాలని, ప్రస్తుతం చదువుతున్న కోర్సుకు సంబంధించి బోనాఫైడ్ జిరాక్స్ ప్రతులను దరఖాస్తుతో పాటు జత చేయాలన్నారు. కోర్సు అడ్మిషన్ పొందిన నెంబరు, ప్రారంభమైన తేదీ, ముగింపు తేదీ దరఖాస్తులో తెలుపాలని, సంవత్సరానికి లక్ష రూపాయల్లోపు ఆదాయం కలిగి ఉన్నట్టు సంబంధిత తహశీల్దార్‌తో ధ్రువపత్రం పొందిన వారు అంగవైకల్యాన్ని చూపే మూడు ఫొటోలు, ఆధార్ జిరాక్స్, కుల ధ్రువీకరణ పత్రం దరఖాస్తుతో జత చేయాలని సూచించారు. దరఖాస్త్ఫురాలను వికలాంగుల, వయోఃవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు నిజామాబాద్ కార్యాలయంలో పొంది, ఈ నెల 15వ తేదీలోగా సమర్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఇతర వివరాలకు సంబంధిత కార్యాలయం ఫోన్‌నెంబరు: 08462-251690కు సంప్రదించాలని సూచించారు.
మధ్యాహ్న భోజనం నాణ్యతపై దృష్టిసారించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం నాణ్యత పట్ల దృష్టిసారించాలని కలెక్టర్ యోగితారాణా జిల్లా విద్యాశాఖ అధికారులు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఇటీవల మధ్యాహ్న భోజనం వికటించి పలు చోట్ల విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ తన చాంబర్‌లో అధికారులు, ప్రధానోపాధ్యాయులతో సమావేశం అయ్యారు. మధ్యాహ్న భోజన పథకంలో వినియోగిస్తున్న బియ్యం, నూనె, వంట పాత్రలు, పప్పు, ఇతర సామాగ్రి నాణ్యతను స్వయం సహాయక సంఘాల సమాఖ్యలతో తనిఖీ చేయించాలని డిఆర్‌డిఎ పి.డికి సూచించారు. ఈ అంశాన్ని జిల్లా సమాఖ్య సమావేశం ఎజెండాలో చేర్చాలని, సమాఖ్య ప్రతినిధులకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తెలుపాలన్నారు. వంట మనుషులకు పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించాలన్నారు. అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కోసం వాడుతున్న నీటి నాణ్యతను పరీక్షించేందుకు నీటి శాంపిల్స్ సేకరించాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో అన్ని పాఠశాలలకు నాణ్యత కలిగిన నీటిని సరఫరా చేయాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలతో క్లస్టర్ల వారీగా ప్రధానోపాధ్యాయులచే సమావేశాలు జరిపించాలని డిఇఓ లింగయ్యను ఆదేశించారు.

పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలి
నందిపేట, ఫిబ్రవరి 5: రానున్న వార్షిక పరీక్షల్లో తెలుగు సబ్జెక్టులో విద్యార్థులను అన్ని విధాలుగా సన్నద్ధం చేయాలని తెలుగు భాష రాష్ట్ర రిసోర్స్ పర్సన్‌లు రంగరాజు, భానుప్రకాశ్‌లు ఉపాధ్యాయులకు సూచించారు. నందిపేట మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవన్‌లో శుక్రవారం తెలుగు భాష సమగ్ర మూల్యాంకనంపై తెలుగు ఉపాధ్యాయులకు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలుగు సమగ్ర మూల్యాంకన విధానంలో భాగంగా నెలవారీ పరీక్షలు, వార్షిక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల తయారీ ఎలా చేయాలి, మోడల్ పేపర్‌లపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ప్రధానంగా 6 నుండి 10వ తరగతి వరకు తెలుగు భాషలో విద్యార్థులకు అవగాహన కలిగేలా మూల్యాంకన తదితర అంశాలపై రాష్ట్ర రిసోర్స్ పర్సన్లు వివరించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో ఎంఇఓ లింగన్న, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ఇంటి ఎదుట ధర్నా
ఆర్మూర్, ఫిబ్రవరి 5: పెండింగ్ బిల్లులు, వేతనాలు ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మధ్యాహ్న భోజన ఏజెన్సీల కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంటి ఎదుట ధర్నా నర్విహించారు. నిత్యావసర సరకుల ధరలకు అనుగుణంగా ఒక విద్యార్థికి 12 రూపాయల స్లాబ్ రేటు ఇవ్వాలని, పౌష్టికాహారం కింద గుడ్లకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలని లేదా కోడిగుడ్లను సరఫరా చేయాలని, ప్రతి నెల 10వ తేదిలోపు బిల్లులను అందజేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే ఇవ్వాలని, సామాజిక, ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని, వంట పాత్రలు సమకూర్చాలని, కార్మికులకు అపాయిమెంట్ ఆర్డర్లు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గత సంవత్సరం పెంచిన స్లాబు రేటును పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటి గేటుకు వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి పి.వెంకటేష్, మధ్యాహ్న భోజన ఏజన్సీల కార్మిక సంఘం నాయకులు కొండ గంగాధర్, సాయిలు, కె.ఎల్లయ్య, సాయన్న, భారతి తదితరులు పాల్గొన్నారు.

పుర్రె గుర్తు తొలగించే వరకు ఉద్యమం
ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షుడు ముత్తెన్న
భీమ్‌గల్, ఫిబ్రవరి 5: బీడీ కట్టలపై పుర్రె గుర్తును తొలగించే వరకు కార్మికులంతా ఐక్యంగా ఉండి ఉద్యమించాలని ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షుడు ముత్తెన్న పిలుపునిచ్చారు. శుక్రవారం భీమ్‌గల్ మండలంలోని గోన్‌గొప్పుల గ్రామంలో ఐఎఫ్‌టియు భీమ్‌గల్ ఏరియా ప్రధాన కార్యదర్శి ఆర్.రమేష్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ముత్తెన్న మాట్లాడుతూ, బీడీ కార్మికుల పొట్ట కొట్టేందుకే కేంద్ర ప్రభుత్వం బీడీ కట్టలపై పుర్రె గుర్తులు ముద్రించాలనే ఆంక్షలను ప్రవేశపెట్టిందని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని దుయ్యబట్టారు. బహుళజాతి కంపెనీలకు కార్మిక వర్గాలను తాకట్టు పెట్టే కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. స్వదేశీ నినాదం జపిస్తూనే, విదేశీ మోజులో పడి దేశంలోని కార్మిక వర్గాన్ని ప్రపంచ దేశాల ముందు మోకరిల్లేలా చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. బీడీ కట్టలపై పుర్రె గుర్తు ముద్రించడం వల్ల బీడీ పరిశ్రమలు పూర్తిగా మూతబడే ప్రమాదం ఉందని, ఫలితంగా ఆ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది బీడీ కార్మికుల బతుకులు బజారునపడే ప్రమాదం ఉందన్నారు. సిగరెట్ కంపెనీల యాజమాన్యాలకు దాసోహమైన కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని విమర్శించారు. కుటీర పరిశ్రమగా విస్తరించిన బీడీ పరిశ్రమను కాపాడుతూ, కార్మికులకు బాసటగా నిలువాల్సిందిపోయి, ఈ పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేయాలని చూడడం శోచనీయమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ తరహా ఆంక్షలను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కె.రాజేశ్వర్, రిక్క దామోదర్, నాయకులు స్వామి, రమేష్, డాక్టర్ ప్రశాంత్‌తో పాటు బీడీ కార్మికులు పాల్గొన్నారు.