జాతీయ వార్తలు

ఉత్తమ్ రాజీనామా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇటీవల జరిగిన జిహెచ్‌ఎంసి, అసెంబ్లీ ఉపఎన్నికలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇప్పటికి రెండుసార్లు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినాయకత్వానికి పంపించారని, పార్టీ అధినాయకత్వం ఆయన రాజీనామాపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టిందని ఏఐసిసి వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన రోజే ఉత్తమ్ తన రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ అధినాయకత్వానికి పంపించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా లేఖను పంపించారని అంటున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం ఈ రాజీనామా లేఖను పెండింగ్‌లో పెట్టింది. ఇంతలో నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పరాజయం పాలైంది. నారాయణ్‌ఖేడ్ ఉపఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓటమిపాలు కావటంతో కలత చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మరోసారి తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌కు పంపించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పార్టీ ఓటమికి గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.నాగేందర్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు క్యామా మల్లేష్ చేత కాంగ్రెస్ అధినాయకత్వం రాజీనామా చేయించింది. వీరిద్దరి రాజీనామా లేఖలు కూడా దిగ్విజయ్ సింగ్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇద్దరు డిసిసి అధ్యక్షుల రాజీనామాలపై పార్టీ అధినాయకత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ అధినాయకత్వం నాగేందర్, క్యామా మల్లేష్ చేత బలవంతంగా రాజీనామా చేయిస్తే, ఉత్తమ్ మాత్రం ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధినాయకత్వం ఈ మూడు రాజీనామాలపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పార్టీ అధినాయకత్వం ఈ మూడు రాజీనామాలపై ఇప్పుడిప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చునని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పిసిసి అధ్యక్ష పదవి చేపట్టేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎవ్వరు కూడా సిద్ధంగా లేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రంతోపాటు రాష్ట్రంలో కూడా అధికారం కోల్పోయిన ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు ఖర్చుతో కూడుతున్న వ్యవహారం కాబట్టి పిసిసి అధ్యక్ష పదవి చేపట్టేందుకు సీనియర్ నాయకులెవ్వరు సిద్ధంగా లేరని చెబుతున్నారు. 2019లో శాసన సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు పిసిసి అధ్యక్షుడిని ఎలాగూ మారుస్తారు కాబట్టి ఆ పదవి ఇప్పుడు చేపడితే రాజకీయ చాకిరి తప్ప ఏమీ మిగలదని తెలంగాణకు చెందిన పలువురు నాయకులు చెబుతున్నారు.