ఉన్నమాట

ఆచారమా? రాజ్యాంగమా? మతానికి ఏది ప్రమాణం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

we, the people of India... ... hereby adopt, enact and give to ourselves this Constitution.
భారత ప్రజలమైన మేము... ... ఇందుమూలముగా ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి, చట్ట ప్రతిపత్తినిచ్చి, మాకు మేము ఇచ్చుకొనుచున్నాము.
-అని ప్రకటిస్తుంది మన రాజ్యాంగం పీఠిక.
తమ సౌకర్యం కోసం ప్రజలు రూపొందించుకున్న రాజ్యాంగం ప్రజలకంటే గొప్పదికాదు. ప్రజల కోసమే రాజ్యాంగం తప్ప రాజ్యాంగం కోసం ప్రజలు కారు. రాజ్యాంగమనేది అపౌరుషేయం కాదు. అక్షరం కూడా మార్చరాని శిలాశాసనం కాదు. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు దేశ అవసరాన్ని బట్టి దాన్ని ఎప్పుడైనా, ఎలాగయినా మార్చవచ్చు. రాజ్యాంగం అమల్లోకి వచ్చాక ఇప్పటికి వంద సవరణలు అయ్యాయి. భవిష్యత్తులో ఇంకా కొన్ని వందల సవరణలు కావచ్చు. ఇప్పుడున్న రాజ్యాంగం పనికిరాదు అని ప్రజలు మునుముందు తలచే పక్షంలో దాన్ని మొత్తంగా ఎత్తిపారేసి, ఇంకో రాజ్యాంగ నిర్మాణ సభ ద్వారా కొత్త రాజ్యాంగాన్ని రాసుకోనూ గలరు.
మనలో కొంతమంది కలిసి తమకు సంబంధించిన కొన్ని విషయాలకు, కొన్ని రంగాలకు, కొన్ని వ్యాపకాలకు, అవసరాలకు ఒక పద్ధతిని, కట్టుబాటును ఏర్పరచుకొంటూ అగ్రిమెంటు రాసుకున్న పక్షంలో - ఆ ఒడంబడిక ఆయా విషయాలకు, అందులో ఉల్లేఖించిన అంశాలకు మాత్రమే కదా వర్తించేది? ఆ మనుషులకు సంబంధించిన మిగతా జీవన వ్యవహారాల్లో, అగ్రిమెంటులో పేర్కొనని సమస్త విషయాలపై ఎలా నడుచుకోవాలి అన్నదానికి సదరు అగ్రిమెంటు ప్రాతిపదిక కానేరదు కదా?
ప్రజల జీవితాలకు సంబంధించి రాజ్యాంగంలో పొందుపరచని అంశాలు, రాజ్యాంగ పరిధిలోకి రాని విషయాలు సవాలక్ష ఉన్నాయి. వాటిపై ఎలా నడవాలి, ఎలా ఉండాలి అన్నది ప్రజలే కదా తేల్చుకోవలసింది? వాటిపై కూడా రాజ్యాంగానిదే పెత్తనం... రాజ్యాంగ సూత్రాలకు లోబడే వాటిపైనా నిర్ణయం జరగాలి - అనడం సమంజసమేనా?
శబరిమల గుడిలో మహిళల ప్రవేశం వివాదానే్న చూడండి.
హిందువులకు సంబంధించిన అన్ని దేవాలయాలలోలాగే అయ్యప్ప గుళ్లు అన్నిటిలోనూ పురుషులతో బాటు స్ర్తిలనూ అనుమతిస్తారు. ఒక్క శబరిమలలోని ప్రధాన ఆలయంలో మాత్రమే 10 నుంచి 50 ఏళ్ల లోపు వయసుగల మహిళలను రానివ్వరు. అది అనాదిగా వస్తున్న ఆచారం. ఆ వయోవర్గం వారికి రుతుస్రావం అయ్యే అవకాశం ఉన్నది కనుక, నైష్ఠిక బ్రహ్మచారి అయిన అయ్యప్పస్వామి సన్నిధిలోకి ఆ ఈడు ఆడవారు రాకూడదని నియమం. దాన్ని అయ్యప్ప భక్తురాళ్లలో ఏ ఒక్కరూ వ్యతిరేకించలేదు. హిందూ మతం మీద, ధర్మం మీద, హైందవ దేవీ దేవతల మీద విశ్వాసం ఉన్న ఏ ఒక్కరికీ ఆ విషయంలో అభ్యంతరం లేదు.
మతమనేదే ఒక విశ్వాసం. అసలు దైవమే ఒక నమ్మకం. దేవుడికి సంబంధించిన విషయాల్లో సంప్రదాయమే ప్రమాణం. అనూచానంగా వస్తున్న ఆచారమే శిరోధార్యం. ఆ వివేకంతోటే కేరళలో వెనుక రాజ్యమేలిన కమ్యూనిస్టు నాస్తిక ప్రభుత్వాలు కూడా న్యాయవివాదం తలెత్తిన ప్రతిసారీ శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం విషయంలో ఆచారాన్ని మార్చరాదని గట్టిగా వాదించాయి. ఇందుకు సంబంధించి సంప్రదాయాన్ని గౌరవిస్తూ తిరువాన్కూరు దేవస్వోం బోర్డు చేసిన నిర్ణయాలను లెఫ్ట్-రైట్ తేడా లేకుండా కేరళ ప్రభుత్వాలన్నీ సమర్థిస్తూ వచ్చాయి. అందువల్ల మహిళల సమానత్వానికీ, వారి రాజ్యాంగ హక్కులకూ పుట్టి మునిగిపోతోందంటూ పనిలేనివాళ్లు దావా వేస్తే కేరళ హైకోర్టు న్యాయపరమైన అన్ని అంశాలనూ పరిశీలించి, అందరి వాదనలూ విని, నిషేధాన్ని బలపరిచింది. ఎప్పటినుంచో ఆచరిస్తున్న విధానాన్ని మార్చవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదని 1991లోనే ఉన్నత న్యాయస్థానం తేటతెల్లం చేసింది. నిషేధాన్ని ఒక వేళ ఎత్తేసినా శబరిమల వెళ్లి స్వామి దర్శనం చేసుకోవాలన్న ఆలోచన ఏకోశానా లేనివాళ్లు హిందూ మతంపై రాళ్లేయడమే ధ్యేయంగా శబరిమల వివాదాన్ని ఆ తరవాత కూడా అడపాదడపా కెలుకుతూనే ఉన్నారు. దావాలు ఎన్ని పడినా, మత వ్యవహారాల్లో సంప్రదాయమే అనుసరణీయమన్న వైఖరినే న్యాయస్థానాలు ప్రకటిస్తూ వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఆలయాన నిషేధం ఎత్తేయాలంటూ వీరనారులు కొందరు కొత్తగా ఇంకో వ్యాజ్యం వేయటం వింతకాదు. ఎటొచ్చీ- దాన్ని విచారణ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం చేస్తున్న వ్యాఖ్యలూ, విసురుతున్న సవాళ్లే విడ్డూరం.
ఆచారం ఏమిటన్నది కాదు... రాజ్యాంగ సూత్రాలే ముఖ్యం. సమానత్వ రాజ్యాంగ సూత్రానికి విరుద్ధంగా ఆలయ ప్రవేశంలో లింగవివక్ష చూపుతున్నారన్న ఫిర్యాదును తీవ్రంగా పరిగణిస్తున్నాం. రాజ్యాంగ నిబంధనల ప్రాతిపదికపైనే ఆ నిషేధం చెల్లుబాటుపై నిర్ణయం చేస్తాం - అని ధర్మాసనం ఉవాచ. రాజ్యాంగం అమల్లోకి రావడానికి చాలా ముందు నుంచే ఆ ఆచారం ఉంటే మాకేమిటి? అది ఉండాలా ఊడాలా అన్నది రాజ్యాంగాన్ని బట్టి మేమే నిర్ణయిస్తాం అన్నారు మాన్య న్యాయమూర్తివర్యులు.
లౌకిక వ్యవహారాలన్నిటిలోనూ రాజ్యాంగం శిరోధార్యం అన్నది నిర్వివాదం. కాని ఎవరి విశ్వాసాన్నిబట్టి ఎవరి మతాన్ని వారు అనుసరించడానికి రాజ్యాంగమే సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు, మళ్లీ ఆ మత విశ్వాసాల్లో ఏది తప్పు, ఏది ఒప్పు అన్నది న్యాయస్థానాలు ఎలా నిర్ణయించగలవు? అనేక వేల సంవత్సరాల నుంచీ అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తున్న పవిత్ర ఆచారాలను, మత సంప్రదాయాలను లౌకిక జీవనానికి సంబంధించిన రాజ్యాంగపు తూనికరాళ్లతో తూచడం సరైనదేనా? ఆలయ ప్రవేశాల పద్ధతిని రాజ్యాంగబద్ధంగా మార్చేస్తామనే వారు, ఆలయాల్లో పూజా విధానాలను, దేవుడిని సేవించాల్సిన తీరును కూడా ఇక రాజ్యాంగబద్ధంగా తామే నిర్ణయస్తారా?
ఒక మతానికి సంబంధించి అనుసరిస్తున్న ఫలానా విధానం మీద ఆ మతానికి చెందిన వారి నుంచి అభ్యంతరం వస్తే... తమకు అన్యాయం జరుగుతున్నదని నిజమైన భక్తులో, భక్తురాండ్రో ఫిర్యాదు చేస్తే న్యాయస్థానం అటువంటి మొరను ఆలకించిందంటే అర్థం ఉంది. కాని భక్త్భివం ఉన్న దాఖలాలు ఏకోశానాలేని వారు, హిందూ ధర్మం మీద కనీస గౌరవం, విశ్వాసం లేనివాళ్లు, కేవలం హిందూ మతాన్ని భ్రష్టుపట్టించటమే పనిగా పెట్టుకున్న వాళ్లు, హిందువులను ద్వేషించే అన్యమత వర్గాల చేతిలోని పనిముట్లు తీరికూర్చుని రాజ్యాంగ సూత్రాలను అడ్డం పెట్టుకుని చేసే గొడవల మీద సర్వోన్నత న్యాయస్థానం విలువైన సమయాన్ని వెచ్చించటం ఎంతవరకు భావ్యం?
రాజ్యాంగ చట్టం సజావుగా అమలయ్యేట్టు చూసేందుకే న్యాయవ్యవస్థ ఉన్నది. అది ఎవరూ కాదనరు. తగవు వచ్చినప్పుడు న్యాయస్థానం ఇచ్చే తీర్పుకు ఎవరైనా కట్టుబడాలి. అదీ నిజమే. కాని న్యాయస్థానాల నిర్ణయాలకే నిలకడ లేదు. కిందికోర్టు ఇచ్చిన తీర్పును పై కోర్టు కొట్టేస్తుంది. పై కోర్టు ధర్మ నిర్ణయాన్ని దానికంటే పైకోర్టు కొనగోటితో తోసిపారేస్తుంది. న్యాయ రంగంలో సర్వోన్నతమనుకునే సుప్రీంకోర్టే తాను లోగడ ఇచ్చిన ఒక తీర్పు చాలా తప్పు, దాన్ని వెనక్కి తీసుకుంటున్నాం అని ఈ మధ్యే నాలుక కరచుకుంది. గతంలో ఉన్నత న్యాయస్థానాలు పూర్వాపరాలన్నీ సాకల్యంగా పరిశీలించి ధ్రువీకరించిన శబరిమల ఆలయ ప్రవేశ విధానాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఇక ముందు తలకిందులు చేసినప్పటికీ అదే తిరుగులేని న్యాయంగా కలకాలం నిలుస్తుందన్న గ్యారంటీ లేదు. ఈ లెక్కన కోర్టు తీర్పుల ప్రకారం ఆలయ నియమాలు మారుతూ పోతే... ఫలానా రోజున గుడిలోకి స్ర్తీలను వెళ్లనిస్తారో లేదో ఆ సమయానికి అమల్లో ఉండే కోర్టు తీర్పును బట్టి ఆధారపడుతుంది. మొత్తం ఆలయ వ్యవస్థే నవ్వులపాలవుతుంది.
కోర్టులనిబట్టి, బెంచినిబట్టి, వాటిలోని జడ్జిల భావాలను బట్టి తీర్పులు మారుతూ పోయేటప్పుడు - అచంచల భక్తి, విశ్వాసాలకు సంబంధించిన మత వ్యవహారాలను ఆది నుంచీ అనుసరిస్తున్న ఆచారాన్ని బట్టే పోనివ్వటం మంచిది కాదా? లౌకిక వ్యవహారాల నిమిత్తం రాజ్యాంగాన్ని తమకు తాము ఇచ్చుకున్న ప్రజలకు దైవం, ధర్మం, పవిత్ర పూజా విధానాల విషయంలో అనాదిగా చెరగని, చెదరని సంప్రదాయాన్ని నిర్నిరోధంగా అనుసరించే స్వేచ్ఛ లేదా?
పోనీ - రాజ్యాంగ సూత్రాలకు లోబడే మతాచారాలు కొనసాగాలన్న వాదమే సరైనదని అంగీకరిద్దాం. మరి ఆ న్యాయం అన్ని మతాలకూ సమానంగా వర్తించాలి కదా? హిందూ మతానికి చెందిన వేలూ, లక్షల గుళ్లలో ప్రతిచోటా స్ర్తి, పురుషులకు సమాన ప్రవేశం ఉంటేనేమి... ఏదో బలమైన కారణాలవల్ల, భక్తుల మేలుకోరి శబరిమల, సింగనాపూర్ లాంటి ఒకటి రెండుచోట్ల మహిళలకు అనుమతి నిరాకరించడంవల్లే మహిళల సమానత్వ హక్కుకూ, వారికి రాజ్యాంగం ప్రసాదించిన స్వాతంత్య్రానికీ చేటు దాపురించిందని గోలగోల చేస్తున్న వారికి ఇతర మతాలలో దానిని మించిన లింగవివక్ష కంటపడుతుందా? సాధారణంగా ఏ మసీదులోనూ పురుషులతో కలిసి ప్రార్థనలు జరపడానికి మహిళలను అనుమతించరు. అది లింగవివక్ష కాదా? మహమ్మదీయ ప్రార్థనాస్థలాలన్నిటా స్ర్తిలకు సమాన హక్కు ఉండాలని శాసించే దమ్ము న్యాయస్థానాలకు ఉన్నదా?
క్రిమినల్ న్యాయం అందరికీ వర్తించేటప్పుడు సివిల్ కోడ్ మాత్రం మతాలతో నిమిత్తం లేకుండా దేశంలోని పౌరులందరికీ సమానంగా వర్తించవద్దా? భార్య ఉండగా మారుమనువు హిందువులకు నేరం. మహమ్మదీయుడు ఎంతమందినైనా నిరభ్యంతరంగా పెళ్లాడవచ్చు. హిందూ దంపతులకు విడాకులు కావాలంటే కాళ్లరిగేట్టు కోర్టుల చుట్టూ తిరగాలి. ఎన్నో కౌన్సిలింగులకు హాజరుకావాలి. నానా అవస్థలు పడాలి. అదే మహమ్మదీయుడు మూడుమార్లు తలాక్ అని ఉచ్చరిస్తే చాలు పెళ్లి పెటాకులు అయిపోయినట్టే. విడాకులు ఇచ్చేసినట్టే. ఇది వివక్ష కాదా? తలాక్ పద్ధతి మూలంగా ముస్లిం స్ర్తిలకు తీరని అన్యాయం జరుగుతోందంటూ ఈ మధ్య ఎవరో కోర్టుకెళ్లారు. తమ పర్సనల్ లా రాజ్యాంగానికి అతీతమైనదనీ, దానిలో తలదూర్చే హక్కు సుప్రీంకోర్టుకు లేదని ముస్లిం పర్సనల్ లా బోర్డు వారు సర్వోన్నత న్యాయస్థానానే్న బాహాటంగా హెచ్చరించారు. వారి విషయంలో న్యాయ ధర్మాసనం ఏమి చేస్తుంది? మతాచారాలు రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉండవలసిందేనంటూ చేవలేని హిందువులకు చెబుతున్న నీతులను మసీదుల్లో స్ర్తిల ప్రవేశాలు, తలాక్‌ల విషయాల్లో మహమ్మదీయులకూ మాన్య న్యాయమూర్తులు బోధించగలిగితే మంచిదే. కాని బోధించగలరా? అన్యమతాలకేమో వారి ఆచారమే ముఖ్యం... హిందువులకు మాత్రమే రాజ్యాంగం ప్రమాణమూనా? ఇదేనా సమానత్వమంటే?

ఎం.వి.ఆర్.శాస్ర్తీ