ఉన్నమాట

మనవాళ్లు ఉత్త వెధవాయలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుమానం అక్కర్లేదు.
పఠాన్‌కోట్‌లో జరిగింది దేశం మీద దాడి.
దాడి చేసింది టెర్రరిస్టులు కారు. చేయించింది పాకిస్తానీ ‘జైషీ’లో, మసూద్‌లో మరొకరో కాదు.
అది పాకిస్తాన్ ప్రభుత్వమే చేయించిన సైనికదాడి. పాక్ సైన్యం ఇండియా మీద జరిపిన ప్రచ్ఛన్న యుద్ధం.
రోజులు మారాయి. యుద్ధ తంత్రంలోనూ తరం మారింది. వెనకటి కాలంలోలాగా దండెత్తేముందు యుద్ధ ప్రకటనలు, సరిహద్దుల్లో సైనిక సమీకరణలు, టాంకులతో, కాల్బలాలతో హోరాహోరీ కాల్పులు ఉండవు. యుద్ధ నియమాలతో, అంతర్జాతీయ సంప్రదాయాలతో, మానవత్వ జంజాటాలతో నిమిత్తం లేదు. చెప్పా పెట్టకుండా, అవతలివారు ఆదమరిచి ఉండగా కుట్రపన్ని, దొంగచాటుగా చొరబడి రాక్షసంగా చావు దెబ్బ తీయడానే్న పాకిస్తానీలు యుద్ధనీతి అనుకుంటూంటారు.
గద్దె మీద కూచునేది ఎవరైనా, పాకిస్తాన్‌ను పాలించేది మిలిటరీ. దాని శత్రువు భారతదేశం. ఆ శత్రువును దెబ్బతీసేందుకు అది ఉపయోగించే సాధనం ఐ.ఎస్.ఐ. గూఢచారి దళం. ఆ దళం వేసుకునే ముసుగులకు జైషే, జమాయతే, లష్కర్... వగైరా రకరకాల పేర్లు. పఠాన్‌కోట్ కొల్లగొట్టేందుకు వాడిన మాస్కు పేరు జైషె మొహహ్మద్.
ఆ టెర్రర్ అడ్డా నడిపేదెవడు, వాడికి తోడబుట్టిన తోడు దొంగలెవరు, వాళ్లలో ఎవరు ఎన్నిసార్లు విద్రోహుల ముఠాకు ఎన్ని నిమిషాలు ఫోను చేసి ఏ ఆదేశాలిచ్చారు అన్నవి ఇక్కడ అప్రస్తుతం. పఠాన్‌కోట్‌లో జరిగింది సుశిక్షితమైన, భారీ హంగులు, అపార వనరులుగల మిలిటరీ మాత్రమే నడిపించగలిగిన ఆపరేషను అన్నది పాయింటు.
టెర్రరిస్టుదాడులు దేశానికి కొత్తకావు. నగరాల్లో జనావాస ప్రాంతాల్లో, జనసమ్మర్దంగల హోటళ్లలో, రైల్వేస్టేషన్లలో, ఆడిటోరియాల్లో బాంబులు, తుపాకులు పేల్చి పెద్ద సంఖ్యలో ప్రాణాలు బలిగొన్న ఉదంతాలు లెక్కలేనన్ని. మొన్నటి దాడిని గురిపెట్టింది సాధారణ ప్రజాజీవితం మీద, నిరాయుధ జనం మీద కాదు. భారత సైన్యానికి, వైమానిక దళానికి సంబంధించిన బృహత్ వ్యవస్థలకు నెలవైన భారీ ఆయుధాగారం మీద.
పఠాన్‌కోట్‌లో 30 కిలోమీటర్ల వ్యాసార్థం ఉన్న విశాల స్థావరంలో అన్ని రకాల అధునాతన ఆయుధాలు, యుద్ధ విమానాలు, మందుగుండు సామగ్రి రాశిపోసి ఉంటాయి. పాకిస్తాన్ మీద సైనికదాడులు జరపవలసివస్తే ఆపరేషన్లకు బేస్ పఠాన్‌కోటే. అందుకే ప్రతి యుద్ధంలోనూ అది పాకిస్తాన్‌కి ఫస్ట్ టార్గెట్. 1965, 1971 యుద్ధాల్లో పాక్ యుద్ధ విమానాలు దానిని దెబ్బతియాలని విశ్వప్రయత్నాలు చేశాయి.
దాదాపు ఒక మోస్తరు పట్ణణమంతటి పెద్ద ప్రాంతంలో అత్యాధునిక నిఘా వ్యవస్థ పహారాలో, భారీ భద్రతా ఏర్పాట్లతో, అడుగడుగునా సాయుధ సైనికుల కాపలాలో దుర్భేద్యంగా కనపడే అలాంటి బృహత్ స్థావరం మీదికి దండెత్తాలన్న ఆలోచన మామూలు టెర్రరిస్టు మూకలకు కలలో తప్ప కలగదు.
ప్రాణాలకు తెగిస్తే ఎలాగో చొరబడి, ఆత్మాహుతి దాడికి పాల్పడి చేతనైన విధ్వంసం జరిపి చచ్చిపోగలరేమో. కాని పఠాన్‌కోటపై దండెత్తిన వారి ఆశయం భయవిహ్వలతను రేకెత్తించి, తడాఖా చాటుకుని చచ్చిపోవటం కాదు. సైనిక స్థావరంలో సమీకరించిన అధునాతన యుద్ధ విమానాలను, భయానక క్షిపణులను, ఇతర ఆయుధ సంపత్తిని నాశనం చేసి, భారత సైనిక పాటవాన్ని దారుణంగా దెబ్బతీయటం. ఏకంగా సైనిక గుహలోకే చొరబడి ఆయుధాగారానే్న బద్దలు కొట్టటం ద్వారా భారత ప్రభుత్వాన్ని, భారత భద్రతా బలగాలను పరువుతీసి పలుచన చేయటం. తనను తానే రక్షించుకోలేని సైన్యం, వైమానిక దళం ఇక దేశాన్ని ఏమి రక్షించగలవన్న భీతావహ స్థితిని భారతీయులకు కలిగించటం.
ఇటువంటి దుస్సాహసానికి ఒడిగట్టాలంటే విశాల సైనిక స్థావరపు ఆనుపానులు, అక్కడి భద్రతా ఏర్పాట్లు, కాపలా వ్యవస్థ కదలికలు, ఆయుధాల ఆచూకి, విమానాల ఉనికి వంటివి క్షుణ్ణంగా తెలియాలి. ఆ సమాచారాన్ని సేకరించటం టెర్రరిస్టు మూకల తరం కాదు. పఠాన్‌కోట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని శాటిలైట్ ఇమేజరీలు, రాడార్లు, అంతరిక్ష గవాక్షాల వంటి హంగులు కలిగిన పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్సు మాత్రమే సమకూర్చగలదు. ఇటువంటి ముసుగు దాడిని పాక్ సైన్యం మాత్రమే నడిపించగలదు.
యుద్ధ సమయంలో ఉండేంత సన్నద్ధత, జాగరూకత మామూలు సమయాల్లో ఎంత గొప్ప సైన్యానికీ ఉండదు. అందునా పాక్ ప్రధాని, భారత ప్రధాని అపూర్వ సహోదరుల్లా తలచిందే తడవుగా కలుసుకుని, కరచాలనాలు చేసుకుని ఆప్యాయతలు ఒలకబోసుకున్న సమయంలోనే పాకిస్తాన్ భారత్ మీద దొంగ దెబ్బకు పాల్పడుతుందన్న ఆలోచన ఈ భూప్రపంచంలో ఎవరికీ రాదు. రాలేదు. పఠాన్‌కోట సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. పొలిమేరకు ఇటువైపు తూర్పు పంజాబ్ అయితే అటువైపు పశ్చిమ పంజాబ్. వేష భాషలు ఒకేలాంటివి కాబట్టి వచ్చేపోయే జనంలో ఎవరు ఎటువైపు వారో పోల్చుకోవటం కష్టం. కాపలాలకు కొదవలేక పోయినా సరిహద్దు పొడవునా డొంకదారులూ, వాగులూ వంకల గుండా మాదకద్రవ్యాల రవాణా జరుగుతూనే ఉంటుంది.
ఈ పరిస్థితుల్లో అందరూ ఒక విధంగా ఆదమరచి ఉన్న సమయాన భయానక కుట్రకు తెరలేస్తే... పాక్ సైన్యం నెలల తరబడి తర్ఫీదు చేసి, పకడ్బందీగా పథకం వేసి ప్రయోగించిన సాయుధ ముష్కరులు మెరపులేని పిడుగులా విరుచుకు పడితే, ఎంత వినాశానికైనా ఆస్కారం ఉంది. నేల మీద వాలి ఉన్న వందలకోట్ల విలువైన యుద్ధ విమానాలు, మందుగుండు పాతరలు ధ్వంసమైతే, మానవ బాంబులు పేలకూడని చోట పేలి ఉంటే ప్రాణనష్టం, ఆస్తినష్టం, ఆయుధనష్టం, అన్నిటికి మించి దేశానికి పరువు నష్టం ఎంత జరిగి ఉండేదో ఊహిస్తేనే ఒళ్లు జలదరిస్తుంది.
మన అదృష్టం కొద్దీ అటువంటి ఘోరం ఏదీ జరగలేదు. ఎయిర్‌బేస్ లోపలికి చొరబడి, నాలుగు రోజులు పొంచి ఉన్నా పాకిస్తానీ మేస్ర్తిలతో ఎప్పటికప్పుడు సంభాషిస్తూ ఆదేశాలందుకున్నా విద్రోహులు వైమానిక స్థావరానికి ఇసుమంత నష్టం చేయలేకపోయారు. వైమానిక, ఆయుధ సంపత్తికి, రక్షణ వ్యవస్థలకు కించిత్తు హాని కలిగించలేకపోయారు. వచ్చిన ఆరుగురూ భద్రతా బలగాల చేతిలో చచ్చారు.
ఇది గొప్ప విషయం కాదా?
ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా పొరుగు దేశం పగబట్టి సైనిక స్థావరంపై చేయించిన దాడిని ఎదుర్కొనే క్రమంలోఏడుగురు సైనికులు నేలకొరిగితే వారి శౌర్యానికి, త్యాగానికి కన్నీటి బొట్టు విడవాలి. ఇంతటితోనే సరిపోయింది; ఇంకా పెద్ద ప్రాణనష్టం కాలేదని సంతోషించాలి. కాని ఏడుగురి మరణానికి ఎవరిది జవాబుదారీ అని వాదులాడటం సబబేనా? భద్రతాబలగాల వైఫల్యం వల్లే వారి ప్రాణాలు పోయాయని రచ్చ చేయటం సమంజసమేనా?
ముందస్తు సమాచారం అందినా ఎయిర్ బేస్‌లో ముష్కరులు చొరబడకుండా చెలరేగకుండా అడ్డుకోలేకపోయారు; ఆకస్మిక సవాలును ఎదుర్కోవటంలో భద్రతా సంస్థలు చతికిలపడ్డాయి; ఒక సంస్థకూ, ఇంకో భద్రతా వ్యవస్థకూ మధ్య సమన్వయం బొత్తిగా లేకపోయింది; యాభైవేల సైనికులు అందుబాటులో ఉంటే వారిని చప్పున రంగంలోకి దించి ముప్పు నుంచి బయటపడవలసింది పోయి వంద, రెండు వందల మందిని మాత్రమే మోహరించారు; ఆనుపానులు బాగా ఎరిగిన స్థానిక సైనిక బలగాలను కాదని ఆ పరిసరాలతో పరిచయం లేని ఎన్.ఎస్.జి. దళాన్ని విమానాల మీద ఎక్కడి నుంచో తెప్పించారు; అనుభవజ్ఞులైన సైన్యాధికారులను పురమాయించకుండా జాతీయ భద్రతా సలహాదారు అన్నీ తానే అయి కంగాళీ చేశాడు; మొత్తంగా మన భద్రతా వ్యవస్థ అలసత్వం, వ్యూహాత్మక వైఫల్యం, సమన్వయ లోపం, పెద్ద పదవుల్లో ఉన్నవారి అసమర్థ నిర్వాకం, బాధ్యతా రాహిత్యం దారుణంగా బయటపడ్డాయి...
-అంటూ కూచుంటే లేవలేని పరిశీలకులూ, వ్యాఖ్యాతలూ, తెలియనిది లేదనుకునే బుద్ధిమాంద్య మేధావులూ, రాజకీయ కింకరులూ, మిడిమేలపు యాంకరులూ, మీడియా సర్వజ్ఞులూ, పనిలేని మాజీ సైన్యాధికారులూ పోటీలుపడి సాగిస్తున్న పరాభవ పంచాయతీల్లో ఇంతకీ పస ఎంత?
పాకిస్తాన్ ఒడిగట్టింది బహిరంగ యుద్ధం అయి ఉంటే... యాభైవేల సైనికులు అందుబాటులో ఉన్నా వెంటనే కదనానికి ఎందుకు కదిలించలేదని ఆక్షేపించవచ్చు. కాని జరిగింది టెర్రరిస్టు దురాగతం. అందులో పాల్గొన్నది ఆరుగురు. వారిని ఎదుర్కొనడానికి 50వేల మంది ఎందుకు? సైనికులు ఎంత సుశిక్షితులైనా... ఎటునుంచో వచ్చి, ఎక్కడో నక్కి, ఏదో చేసి, ఎక్కడి నుంచో విధ్వంసానికి పాల్పడే టెర్రరిస్టుముష్కరులను చిత్తు చేయడానికి ప్రత్యేకమైన వృత్తి నైపుణ్యం కావాలి. ముఖ్యంగా ఇటువంటి విపత్తులను ఎదుర్కోవడం కోసమే - 2008 ముంబయి ముట్టడి తరవాత నేషనల్ సెక్యూరిటీ గార్డు అనే ప్రత్యేకదళం వందలకోట్ల ఖర్చుతో ఏర్పాటైంది. ఏ పనికి కావలసిన నేర్పు ఉన్న దళాన్ని ఆ పనికి నియోగించడంలో తప్పేముంది? ముందస్తు సమాచారం అందింది కాబట్టే - గూఢచర్యంలో ఆరితేరిన జాతీయ భద్రతా సలహాదారు డోవల్ సత్వరం కదిలి, ఎంతమంది అవసరమో అంతమందిని మాత్రమే మోహరించి, వైమానిక స్థావరానికి ఘోర విపత్తును నివారించగలిగాడేమో...? ఆపాటి సంశయ లాభమైనా ఇవ్వకుండా ఈ దేశపు భద్రతా సలహాదారు శుద్ధ శుంఠ; భద్రతా బలగాలు నిద్రమత్తు సోమరులు; సైన్యాధికారులు చేతకాని దద్దమ్మలు - అయనట్టు తెలిసీ తెలియకుండా తీర్పులు చెప్పటం మతిగలవాళ్లు చేయాల్సిన పనేనా?
పఠాన్‌కోట బీభత్సంలో తప్పులు, పొరపాట్లు దొర్ల లేదని కాదు. అధికారుల నిర్వాకం వంకపెట్టలేనంత భేషుగ్గా ఉన్నదనీ కాదు. జిల్లా పోలీసు సూపర్నెంటు అంతటి బాధ్యతాయుత స్థానంలో ఉండీ వేళకానివేళ ఎవరెవరినో వెంటేసుకుని ఎక్కడెక్కడో తిరుగుతూ, అనుమానాస్పదంగా వ్యవహరించిన పిరికిపంద మొదలుకుని... టెర్రరిస్టుల వేట ఇంకా పూర్తి కాకుండానే ‘శుభం’కార్డు వేసి అభాసుపాలైన కేంద్ర హోంశాఖ మంత్రి మహాశయుడి వరకూ వేలెత్తి చూపవలిసిన ప్రబుద్ధులు కొందరు లేకపోలేదు. రెప్పవాల్చని నిఘా ఉంటుందని అందరూ అనుకునే రక్షణ స్థావరంలోకి టెర్రరిస్టులు చొరబడి నాలుగురోజులపాటు నక్కి ఉండగలగటం మన రక్షణ వ్యవస్థ ప్రతిష్ఠకు నిస్సందేహంగా సిగ్గుచేటు.
కాని అభిశంసనకు కూడా ఒక పరిమితి ఉండాలి కదా? భయానక మారణాయుధాలు, మందుగుండు పాతరలూ, అపురూపమైన రక్షణ వ్యవస్థలు నెలకొని ఉన్న రక్షణ ప్రాంగణానికి ఏ హాని వాటిల్లకుండా జాగ్రత్తపడుతూ... నాలుగువేల ఎకరాల విశాల ఆవరణలో ఎక్కడెక్కడో పొంచి ఉన్న ముష్కరులను వేటాడవలసి వచ్చినప్పుడు ఆచితూచి అడుగు వేయాలి కదా! వేట పూర్తి చేయటంలో కొంత ఆలస్యమూ జరుగుతుంది. ఆ సంగతి కానకుండా ‘‘మనవాళ్లు ఉత్త వెధవాయలోయ్’’ అని కాళ్లు బారచాచి పళ్లికిలిస్తే మసూద్ అజర్‌కీ మనకీ తేడా ఏముంటుంది?

ఎం.వి.ఆర్.శాస్ర్తి