ఉన్నమాట

మనవాడి ప్రాణం నిలిచింది చాలదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరైః పరిభవేత్ ప్రాప్తే వయం పంచోత్తరం శతం
పరస్పర విరోధే తు వయం పంచశతంతు తే
మనలో మనం కలహించుకుంటే మనం ఐదుగురం; కౌరవులు నూరుగురు. పైవారితో కలహం వస్తే భరత వంశీయులం నూట ఐదు మందిమి - అంటాడు భారత ‘వనపర్వం’లో ధర్మరాజు. మనలో మనకు భేదాలు, స్పర్థలు ఎన్ని ఉన్నా బయటివారితో విరోధం వచ్చినప్పుడు భారతీయులందరం ఏకం కావాలి. ఒక్కమాట మీద ఉండాలి.
పల్లెటూళ్లో పామర జనానికి కూడా తెలిసిన ఈ చిన్న కామన్‌సెన్సు పాయింటే మన మతిమాలిన మేధావుల బుర్రలకు ఎక్కడం లేదు. నరేంద్ర మోది మీద, అతడి పార్టీ మీద, దాని వెనుక ‘పరివారం’ మీద వల్లమాలిన ద్వేషం ఎంత ఉన్నా, విదేశీ సవాళ్లను, బయటి విరోధుల ఆగడాలను ఎదుర్కొనే విషయంలో భారత జాతి యావత్తూ భారత ప్రభుత్వాన్ని బలపరచాలి - అన్న ఇంగితజ్ఞానం బుద్ధి తక్కువ బుద్ధి జీవుల్లో కొరవడింది.
కులభూషణ్ కథ దీనికి తాజా ఉదాహరణ.
కులభూషణ్ జాధవ్ భారత నౌకాదళంలో పనిచేసి పదహారేళ్ల కిందట రిటైరయ్యాడు. బతుకు తెరువుకు ఇరాన్ వెళ్లి సముద్రంలో సరకు రవాణా వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆ దేశంలో అల్‌ఖైదాకు అనుబంధంగా పనిచేస్తున్న పాకిస్తానీ టెర్రరిస్టు ముఠా నిరుడు అతడిని ఇరాన్‌లో కిడ్నాప్ చేసి, రహస్యంగా సరిహద్దు దాటించి ఐ.ఎస్.ఐ.కి అప్పగించింది. అతడు భారత గూఢచారి అనీ, ‘రా’ ఏజంటనీ, బెలూచిస్తాన్‌లో గూఢచర్యం నెరపుతూ, పాకిస్తానీ పౌరుల ప్రాణాలు తీసేందుకు టెర్రరిస్టు కార్యకలాపాలను సాగిస్తూండగా మాటువేసి పట్టుకున్నట్టూ ఐ.ఎస్.ఐ. నిరుడు మార్చిలో తప్పుడు కేసు బనాయించింది. ఇండియాలో తెగబడి టెర్రరిజానికి పాల్పడుతూ అనేక సందర్భాల్లో రెడ్‌హాండెడ్‌గా దొరికిపోయిన తన సిగ్గుమాలిన దుర్ణయాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇండియా మీదా అదే బాపతు బురద చల్లడం కోసం పన్నిన పన్నాగమది.
ఒక దేశం పౌరుడిని ఇంకో దేశంలో నిర్బంధించినప్పుడు తన దేశ ప్రభుత్వం నుంచి న్యాయపరమైన, ఇతర విధాల సహాయాన్ని దౌత్య కార్యాలయాల ద్వారా పొందేందుకు అవకాశం ఇవ్వాలని 1963 నాటి వియన్నా ఒడంబడిక. దశాబ్దం కింద పాకిస్తాన్ కుట్రపన్ని ముంబయిని ముట్టడించి భయానక నరమేథానికి పాల్పడ్డప్పుడు, మనకు పట్టుబడ్డ కసబ్‌గాడికి కూడా అంతర్జాతీయ ఒడంబడిక ప్రకారం ఇవ్వాల్సిన దౌత్య సదుపాయాలన్నీ మనం ఇప్పించాం. అతగాడి కొమ్ము కాసేందుకు పాకిస్తాన్‌కి సకల అవకాశాలూ కల్పించాం. అదే - తాను కిడ్నాప్ చేయించి తప్పుడు కేసులో ఇరికించిన కులభూషణ్ జాధవ్‌కి నిర్దోషిత్వం నిరూపించుకునేందుకు భారత్ నుంచి కాన్సులర్ సహాయం పొందడానికి ఇస్లామాబాద్ ససేమిరా అనుమతించలేదు. విషయమేమిటో కనుక్కోవడానికి, అవసరమైన సాయం చేయడానికి తమ దౌత్యాధికారులను అతడిని కలవనివ్వాలని భారత ప్రభుత్వం ఏకంగా పదహారు పర్యాయాలు అడిగినా పాకీలు మొండిగా, బండగా కుదరదు పొమ్మన్నారు. పైగా సీనియర్ భారత అధికారుల మీద అడ్డగోలు అభాండాలు మోపి, వాటిని బలపరిచేందుకు కావలసిన తప్పుడు సాక్ష్యాలను సేకరించడానికి ఇండియాయే తమకు తోడ్పడాలనీ, దానికి ఒప్పుకుంటేనే జాధవ్‌కి కాన్సులర్ యాక్సెస్‌ని అనుమతిస్తామనీ తెంపరి లంకె పెట్టారు. బహిరంగ విచారణ ఏదీ లేకుండానే, నిర్దోషిత్వం చాటుకునేందుకు నిందితుడికి ఇసుమంత అవకాశం ఇవ్వకుండానే అతడిని కోల్డ్‌మార్షల్ చేసి మరణశిక్ష విధించామనీ, తమ సైన్యాధిపతి దానిని ధ్రువీకరించాడు కూడా అని, పాక్ గూఢచారి గుడారం ఐ.ఎస్.ఐ. చల్లగా చెప్పింది.
ఈ దురాగతానికి భారతజాతి మొత్తం దిగ్భ్రాంతి చెందింది. విరోధి దేశం మన మీద పగబట్టి, తలపెట్టిన మరణశిక్ష నుంచి మనవాడిని ఎలాగైనా కాపాడాలని యావద్దేశం తహతహలాడింది. అన్యాయంగా శిక్ష పడ్డ తన పౌరుడి ప్రాణాన్ని రక్షించేందుకు భారత ప్రభుత్వం దౌత్యపరంగా చేయగలిగిందంతా చేసింది. పాక్ హై కమిషనర్‌ని పిలిపించి, పర్యవసానం తీవ్రంగా ఉంటుందని ఘాటైన హెచ్చరిక చేసింది. ఏ రాయినీ వదలకుండా, పెనుసవాలును ఎదుర్కొనేందుకు బహుముఖ వ్యూహంలో భాగంగా అంతర్జాతీయ న్యాయస్థానం గడపా తొక్కింది. మామూలుగా ఒకసారి కోర్టుకు హాజరవడానికే గంటకు ఎన్నో లక్షల రూపాయలు ఫీజు తీసుకునే హరీష్ సాల్వే అంతటి టాప్‌క్లాస్ అడ్వొకేటు లాంఛనంగా ఒక రూపాయి ఇవ్వండి చాలునని ముందుకొచ్చి ప్రపంచ న్యాయస్థానంలో ఇండియా తరఫున అద్భుతంగా వాదించాడు. కేసు మనం గెలవాలని, మనవాడికి ఎలాగైనా ప్రాణగండం తప్పాలని అందరూ కోరుకున్నారు.
అమాంబాపతు రాజకీయ, మేధావి వర్గాల విచిత్ర జీవులు తప్ప!
రాజకీయ మేధావుల్లోకెల్లా పెద్ద మేధావి సీతారాం ఏచూరి. ‘జాధవ్ కేసును అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకుపోవడం పెద్ద తప్పు. అది మోదీ ప్రభుత్వపు ఘోరాతిఘోర దౌత్య వైఫల్యం. అసలు ద్వైపాక్షిక అంశాన్ని అంతర్జాతీయం చేయడమేమిటి నానె్సన్స్!’ అని ఆయన బోలెడు కోప్పడ్డాడు. నిరంతరం మోదీ కీడుకోరే అమిత్ర పత్రికల సంపాదకీయ రచయితలూ, కాంగ్రెసు మిత్ర మీడియా వ్యాఖ్యాతలూ, దేహం ఇండియాలో ఉన్నా మనసు పాకిస్తాన్‌కి పారేసుకున్న ఒపీనియన్ మేకర్లూ అదే రాగాన్ని కోరస్‌గా అందుకున్నారు. పాక్‌తో పేచీని పాక్‌తో తేల్చుకోకుండా ప్రపంచ న్యాయస్థానానికి ఎక్కడం 2008 నాటి ఇండో-పాక్ ఒప్పందానికి ఏ రకంగా విరుద్ధమో, ద్వైపాక్షిక ఒప్పందాన్ని తుంగలో తొక్కడంవల్ల ఇండియాకు కలిగే చేటు ఏమిటో, దాన్ని ఆసరా చేసుకుని కాశ్మీర్ లాంటి సమస్యల మీద నిరాఘాటంగా అంతర్జాతీయ పంచాయతీ పెట్టి పాకిస్తాన్ మన దుంప ఎలా తెంచగలదో పైత్యపు పండితులు కళ్లకు కట్టినట్టు వర్ణించారు. ఇంతగా విధం చెడ్డా ఈ కేసులో ఇండియాకు ఫలం దక్కదని ముందే జోస్యం చెప్పారు. హేగ్ కోర్టులో మన కేసు ఎందుకు వీగిపోతుంది, మనం చేసిన ఏఏ తప్పులవల్ల తీర్పు మనకు వ్యతిరేకంగా వస్తుంది అనడానికి ముప్ఫైమూడు కారణాలు కష్టపడి కనుగొన్నారు. ప్రపంచ కోర్టులో పరాభవమయ్యాక మొగం చెల్లని మోదీని చూసి కడుపారా ఆనందించడానికి మహాజనులు ఎంచక్కా కాచుకుని ఉండగా...
జరగకూడనిది జరిగింది. అపశకునపు పక్షుల దిమ్మతిరిగేలా న్యాయస్థానంలో తొలి నిర్ణయం మనకు అనుకూలంగా వచ్చింది. పాకిస్తాన్ చెబుతున్నట్టు అతడు ఒకవేళ గూఢచారి, టెర్రరిస్టు అయినా సరే వియన్నా ఒప్పందం మేరకు కాన్సులర్ సదుపాయం కల్పించాల్సిందే... మీకూ మీకూ మధ్య వేరే అగ్రిమెంటు ఉన్నాసరే వియన్నా ఒడంబడికను విధిగా గౌరవించాల్సిందేనని పదకొండుగురు న్యాయమూర్తులు ఏకగ్రీవంగా తేల్చి చెప్పారు. ఒక చెంప రహస్యంగా మరణశిక్ష విధించి, దాన్ని ఆపుతామని ఎలాంటి హామీని ఇవ్వకుండా పైపెచ్చు తొందర ఏమీ లేదని వాదిస్తారేమిటని ఇస్లామాబాద్‌ని ముక్క చివాట్లు పెట్టారు. గూఢచర్యానికి, జాతీయ భద్రతకు సంబంధించింది కాబట్టి ఈ కేసును విచారించే అధికారం హేగ్ కోర్టుకు లేదన్న అభ్యంతరాన్ని కొనగోటితో కొట్టిపారేశారు. వియన్నా ఒడంబడిక అతిక్రమణ జరిగిందనడానికి ఆస్కారం కనిపిస్తున్నది కాబట్టి ఈ కేసు ముమ్మాటికీ తమ అధికార పరిధి కిందికి వస్తుందని తేటతెల్లం చేసి, విచారణ తెమిలేవరకూ మరణశిక్షను ఆపండి అని అంతర్జాతీయ న్యాయస్థానం ‘స్టే’ ఉత్తర్వు ఇచ్చింది. అంతటితో ఊరుకోకుండా తమ ఆర్డరును పాటించడానికి ఏ చర్యలు తీసుకున్నది కూడా తమకు చెప్పాలని ఇస్లామాబాద్‌ను ఆదేశించారు.
ఆ విధంగా భారతీయుడికి ఉరి గండం ప్రస్తుతానికి తప్పింది. 45 ఏళ్లుగా ఏ భారత ప్రభుత్వమూ చేయని సాహసం చేసి, పాకిస్తాన్‌తో ఏ గొడవ అయినా ద్వైపాక్షికంగానే తేల్చుకోవాలి అన్న ఇనే్నళ్ల ప్రకటిత విధానానికి ఆపద్ధర్మంగా మినహాయింపు ఇచ్చి, రిస్కు తీసుకుని ప్రపంచ కోర్టుకు వెళ్లినందుకు మోదీ సర్కారుకు ఫలితం దక్కింది. ఏ రకంగా చూసినా ఇది ఇండియాకు విజయం; పాకిస్తాన్‌కి శృంగభంగం. తాము వెళ్లగక్కిన అనుమానాలను, ప్రకటించిన భయాలను పటాపంచలు చేసి ప్రభుత్వం జాతీయ ప్రయోజనాన్ని సాధించిన తరవాతైనా సంశయాత్ముల అలజడి నెమ్మదించిందా? మొత్తానికి మంచి జరిగిందన్న సంతోషం వారి మొగాల్లో మొలకెత్తిందా?
లేదు. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును పాకిస్తాన్ ఖాతరు చేస్తుందని గ్యారంటీ ఏది? ఇంతకు ముందు జర్మనీ, పరాగ్వే దేశాలు మోపిన ఇలాంటి కేసుల్లో ఇదే కోర్టు ఇచ్చిన ఇదే విధమైన ఉత్తర్వులను అమెరికా లక్ష్యపెట్టకుండా మరణశిక్షను అమలుపరిస్తే ఈ కోర్టు ఏమి చేయగలిగింది? దక్షిణ చైనా సముద్రంపై ఇదే కోర్టు రూలింగును చైనా తుంగలో తొక్కలేదా? అలాగే రేపు పాక్ కూడా ఎదురు తిరగదనే మిటి? ఇంకా మనవాడు పాకిస్తాన్ నిర్బంధంలోనే ఉండగా ఘనకార్యమేదో సాధించినట్టు గొప్పలెందుకు? ఇంతకీ అతగాడు అసలు బతికున్నాడో, ఇప్పటికే పాక్ చెరలో చచ్చాడో ఎవరికెరుక? మీ లెక్కేమిటి, మా చట్టం ప్రకారం నేరస్థుడిని హతమార్చాం అని ఇస్లామాబాద్ రేపోమాపో చెప్పకుంటే ఎవరు మాత్రం ఏమిచేయగలరు?... అంటూ కొత్త కొత్త అనుమానాలను మహా మేధావులు కొందరు ఉత్పత్తి చేస్తున్నారు. తెలివి తక్కువ పాకిస్తానీలకు సమయానికి స్ఫురిస్తుందో లేదోనన్న బెంగతో రకరకాల ఉపాయాలను తామే తేరగా సూచిస్తున్నారు. ప్రింటు, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో హేగ్ తీర్పుపై ధారాళంగా సాగుతున్న వ్యాఖ్యానాల తీరును గమనిస్తే సామాన్య మానవుల బుర్రలు చెడటం ఖాయం.
నిజమే. ఇప్పటికి వెలువడింది తాత్కాలిక న్యాయ నిర్ణయం మాత్రమే. దాంతోనే మనం దిగ్విజయం సాధించినట్టు కాదు. మనవాడికి ప్రాణభయం తొలిగినట్టూ కాదు. అంతర్జాతీయ న్యాయస్థానమనేది క్రిమినల్ అపీలు కోర్టు కాదు. అంతర్జాతీయ ఒడంబడికల ఉల్లంఘనలకు సంబంధించిన వివాదాలను పరిశీలించి, తప్పొప్పులను తేల్చడం వరకే దాని పని. తప్పు జరిగినప్పుడు దానిని పునఃపరిశీలించి, మీ చట్టాల ప్రకారం దానిని సరిదిద్దమని సూచించగలదే తప్ప తన నిర్ణయాన్ని నిక్కచ్చిగా అమలు జరిపించగల సత్తా ఆ కోర్టుకు లేదు. కాని దానికిగల నైతిక అధికారాన్ని తక్కువ అంచనా వేయకూడదు. అమెరికా, చైనాల వంటి మోతుబరి అగ్రరాజ్యాలు హేగ్ తీర్పును లోగడ లక్ష్యపెట్టలేదు కనుక పాకిస్తాన్ కూడా అలాగే బరితెగించగలదని ఊహించడం తప్పు. ఇప్పటికే అంతర్జాతీయ బీభత్సకాండకూ, స్టేట్ టెర్రరిజానికి పెద్ద ముద్దాయిగా ప్రపంచంలో ముద్రపడ్డ బికారి పాకిస్తాన్‌కి ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని ధిక్కరించే తాహతు లేదు.
అటువంటి చిన్నదేశాలు ప్రపంచ కోర్టు ఉత్తర్వును ధిక్కరిస్తే భద్రతామండలి చూస్తూ ఊరుకోదు. పాక్‌తో లాలూచీ ఎంత లావున ఉన్నా అలాంటి పరిస్థితి వస్తే బహుశా చైనా కూడా ఆదుకోజాలదు. కులభూషణ్‌ను ఇంతకుముందే హతమార్చి, మరణశిక్ష నాటకాన్ని పాకిస్తాన్ ఆడుతున్న పక్షంలో ఇప్పుడు హేగ్ కోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వువల్ల పాకిస్తాన్ తన గోతిలో తానే పడుతుంది. న్యాయస్థానం ఆపమన్న తరవాత కూడా అతడి ప్రాణం ఎలా తీశారని ప్రపంచం దాన్ని నిలదియ్యక మాదు. అదృష్టం బాగుండి కులభూషణ్ క్షేమంగా ఉండి ఉంటే హేగ్ ‘స్టే’ అతడి భద్రతకు గొప్ప కవచం. పాకిస్తాన్‌లో పౌర ప్రభుత్వాన్ని కుక్కను చేసి ఆడించే మిలిటరీకి పోగాలం దాపురించి, జాధవ్‌ని పంతంపట్టి ఉరి తీసే ప్రమాదం ఇప్పటికీ లేకపోలేదు. వ్యవహారం అంతదాకా వస్తే పాకీల పని ఎలా పట్టాలో మోదీకి తెలుసు.

ఎం.వి.ఆర్.శాస్ర్తీ