మెయన్ ఫీచర్

ఐరాసలో సంస్కరణలు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో కొన్ని దేశాలకు ‘విశ్వం వొక విపణి, జీవితం వొక వ్యాపారం’. మరికొన్ని దేశాలకు విశ్వం వొక యుద్ధ్భూమి, జీవితం వొక పోరాటం. కాని భారత్‌కు మాత్రం ‘విశ్వం వొక కుటుంబం, జీవితం అనుబంధాలతో ఆత్మను ఆవిష్కరించుకునే పవిత్ర ప్రయత్నం’. ఇంతటి ఉదాత్తమైన సిద్ధాంతం ఆచరణ సాధ్యమై, పోరు, పొక్కులేని జీవనం సాగిస్తున్న మన దేశానికి దశాబ్దాలు గడిచినా ఐరాసలో శాశ్వత సభ్యత్వం లభించలేదు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థల లాగానే ఐరాస కూడా అమెరికా వంటి అగ్ర దేశాల చెప్పుచేతల్లో వుండడమే దీనికి కారణం. ఐరాస నేడు 70వ ఏట అడుగుపెట్టింది. ఐరాసలో సంస్కరణలకై మోదీ ప్రభుత్వం పట్టుబిగించింది. చైనా తరువాత అధిక జనాభాగల దేశంగా, అతి పెద్ద ప్రజాస్వామ్యంగా, బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌కు శాశ్వత సభ్యత్వం యింతవరకూ లభించలేదు. గత సెప్టెంబరులో భారత ప్రధాని అమెరికా పర్యటన సందర్భంగా ఈ విషయం ఐరాస వేదిక మీద మరోసారి ప్రతిధ్వనించింది. భారత ఆర్థిక వ్యవస్థను 8 ట్రిలియన్ డాలర్లనుండి 20 ట్రిలియన్ల డాలర్లకు పెంచాలన్న మోడీ సంకల్పం నేపథ్యంలో, ఉపనిషత్తుల కాలంనుంచి ఉపగ్రహాలను భూకక్ష్యలోకి ప్రవేశపెడ్తున్న దేశంగా భారత్ మాటకు, ఓటుకు ఐరాసలో సరియైనచోటు కల్పించాల్సిన అవసరం గురించి దౌత్యవేత్తలంతా ఆలోచిస్తున్నారు.
రెండవ ప్రపంచ యుద్ధంలో విజేతలు ఐరాసను తమ చెప్పుచేతల్లో వుండేట్టు చేసుకోగల్గారు. 1945లో ఏర్పడిన ఐరాస గత డెబ్భై ఏళ్ళలో పెద్దగా మారింది లేదు. ప్రపంచం మాత్రం చాలామార్పులు చవిచూసింది. ఐరాస నియమావళిలో ఆర్టికల్ 108 ననుసరించి ఏ రకమైన సంస్కరణ తేవాలన్నా మూడింట రెండువంతుల సభ్యదేశాలు మద్దతు పలకాలి. సామ్రాజ్యవాదం అంతరించి, రష్యా ముక్కలైన ఏకధృవ ప్రపంచంలో, వైశ్వీకరణ మంత్రంతో ప్రపంచం కుగ్రామంగా మారిన నవీన ఆర్థికయుగంలో ఐరాసలో జరిగిన వొకే వొక సంస్కరణ 1965లో శాశ్వత సభ్యత్వం లేని దేశాల సంఖ్యను 6నుంచి 10కి పెంచడం.
భారత్, స్వాతంత్య్రానికి రెండేళ్ళకు ముందు 1945లో ఐరాసలో చేరింది. ఐరాస శాంతి పరిరక్షణ దళాల్లో గత ఏభై ఏళ్ళలో సుమారు లక్ష మంది సైనికులు సేవలందించారు. నేడు సుమారు 10000 మంది సేవలందిస్తున్నారు. ఐదు అగ్రరాజ్యాల దళాల మొత్తం సంఖ్యకు ఇది రెండింతలకు పైమాటే. భారత్‌కు ఈ విషయంలో ఓ సుదీర్ఘ చరిత్ర వుందని అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా వొప్పుకున్నాడు. ఐరాస భద్రతా మండలికి 7సార్లు భారత్ ఎన్నుకోబడింది. ప్రపంచంలో నేడు భారత్ రెండవ అధిక జనాభాగల దేశం. ప్రపంచంలో 7వ అతిపెద్ద ఆర్థిక శక్తి. కొనుగోలు సగటు సామర్థ్యం కలిగిన దేశాల్లో 3వ అతిపెద్ద దేశం. సైనికశక్తిలో 3వ స్థానంలో వుంది. అమెరికా, చైనాల తరువాత అణ్వాయుధాలున్న దేశం. అంతరిక్ష రంగంలో అమెరికాకు దీటుగా ‘మార్స్’ విజయవంతమైంది. నిజానికి ఐదు శాశ్వత సభ్య దేశాలను ఓటింగు పద్ధతిలో ఎన్నుకోవాలని ఓసారి న్యూయార్క్‌టైమ్స్ సూచించింది. అలాగే అయితే, రష్యా, చైనా, ఇండియా, బ్రిటన్, అమెరికాలు శాశ్వత సభ్యత్వం పొందుతాయని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రపంచంలో అతిపెద్ద హిందూ జన సంఖ్యతోబాటు రెండవ అతి పెద్ద ముస్లింలున్న దేశం. శాశ్వత సభ్యత్వంకోసం భారతదేశం చేస్తున్న వాదనను శాశ్వత సభ్యదేశాలైన ప్రాన్సు, రష్యా, యుకె, అమెరికాలు బలపరుస్తున్నాయి.
శాశ్వత సభ్యత్వమున్న దేశాల్లో చైనా ఐదవది. వీటిని పి5 దేశాలంటారు. అణ్వాయుధాల విషయంలో అమెరికాకు కొన్ని పట్టింపులున్నప్పటికీ భారత్‌ను బలపరుస్తున్నది. చైనాకూడా యిటీవలి కాలంలో భారత్‌కు ఐరాసలో పెద్దపీట వేయాలని సూచించింది. భారత్‌ను సమర్ధిస్తున్న యితర దేశాలలో, ఆర్మేనియా, ఆస్ట్రేలియా, బహెరూన్, బంగ్లాదేశ్, బెలారస్, బెర్జియం, బెలైజ్, బెనివ్, బొలీవియా, బ్రూనే, బల్గేరియా, కాంబోడియా, చిలీ, క్యూబా, సెప్రనీ, జెక్ రిపబ్లిక్, డెన్మార్క్, డొమినికన్ రిపబ్లిక్, ఇథియోపియా, ఫిన్‌లాండ్, ఘనా, గయానా, హంగరీ, ఐస్‌లాండ్, ఇజ్రాయిల్, జమైకా, లావోస్, లెసోత్, లైబీరియా, లిబియా, కజకస్తాన్, కిర్గిస్తాన్, మాలవి, మలేసియా, మాల్దీవులు, మంగోలియా, మొరాకో, మయన్మార్, నైజీరియా, నార్వే, వొమన్, పాలవ్, పెరూ, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, రవాండా, కటార్, సెనిగల్, సింగపూర్, స్లోవేకియా, సూరినాం, న్యూజిలాండ్, సిరియా, తజకిస్తాన్, టాంజానియా, ట్రినిడాడ్, టాంబాగో, తవలు, ఉక్రెయిన్, యుఎయి, ఉజ్బెకిస్తాన్, వియత్నాం, జాంబియా, స్వీడన్, ఆఫ్రికన్ యూనియన్‌లున్నాయి.
జపాన్ 1956లో ఐరాసలో చేరింది. ఐరాసకు అతిపెద్ద ఆర్థిక సహాయకారిగా వుంది. జపాన్‌తో కలిసుండకపోతే భారత్‌ను సమర్ధిస్తానని చైనా మెలిక పెట్టింది. కాని జి4లో సభ్య దేశంగా భారత్ జపాన్ సాంగత్యం వదులుకోదు. జపాన్, ఐరాస భద్రతామండలికి తాత్కాలిక సభ్య దేశంగా 10సార్లు ఎన్నికైంది. 1948లో హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు ప్రయోగం జరిగి వినాశనం దాపురించినా ఆ తరువాత కాలంలో స్వయంకృషితో, సచ్ఛీలతతో వైజ్ఞానికంగా, ఆర్థికంగా ఎదిగిన జపాన్‌కు శాశ్వత సభ్యత్వం విషయంలో నాటి అమెరికా విదేశాంగశాఖ కార్యదర్శి కండోలిజారైస్ అనుకూల వ్యాఖ్యలు చేశారు. జి4లో మిగిలిన సభ్య దేశాలు జర్మనీ, బ్రజిల్‌లు కూడా భారత్‌తో గొంతు కలిపాయి. గత సంవత్సరం ఐరాస వేదిక మీద పాకిస్తాన్‌కు స్నేహ హస్తమందించిన మోదీ, ఈసారి (2015) ఐరాస వేదిక మీదనుంచి ఐరాసను సంస్కరించాలని, ‘వసుధైక కుటుంబం’ వాస్తవ రూపం దాల్చాలని ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది పేద ప్రజలను ఆదుకోవాలని, పర్యావరణ న్యాయం పాటించాలని పిలుపునిచ్చారు.
అమెరికాతో వాణిజ్యం 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని ఇరుదేశాల నేతలు చేసిన నిర్ణయం, 350 మంది సిలికాన్ వ్యాలీ సియివోలు డిజిటల్ ఇండియాకు మద్దతు పలకడం వంటి కబుర్లు ఒబామాను కూడా మెప్పించాయి. భారత్‌కు శాశ్వత సభ్యత్వం విషయమై ఆయన బహిరంగ మద్దతు పలికారు. సెప్టెంబరు 26, 2015నాడు జి4 దేశాల నేతలు న్యూయార్క్‌లో సమావేశమై ‘‘ప్రపంచంలో తాము అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలకు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ప్రధాన ఇంజిన్ వంటి దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని ఐరాసలో శాశ్వత సభ్యత్వమిచ్చే ప్రపంచ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా వున్నామని సంయుక్త ప్రకటన చేశాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదం పేర ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోంది. వలసవాదులు బలపడి ఐరోపాలో అలజడి సృష్టిస్తున్నారు. అందుకే యూరపు దేశాలు జాతీయవాదం స్వీకరించాయి. శరణార్థులు పెరుగుతున్నారు. విశ్వశాంతి ప్రస్థానం సుదూర తీరంలో కానరావడం లేదు. ఈ సమయంలో భారత్ వంటి దేశాలు సమరసతా శంఖారావం పూరించాల్సిన బృహత్తర బాధ్యతను నెత్తికోవాలంటే ఐరాసలో శాశ్వత సభ్యత్వం తప్పనిసరి. ఇందుకోసం మేథావులు, రాజనీతిజ్ఞులు, రక్షణ రంగ నిపుణులు, వైజ్ఞానికులు, పత్రికా సంపాదకులు భారతదేశం వాణి విశ్వమంతా వినిపించేలా అర్థవంతమైన సమావేశాలను, చర్చలను నిర్వహించాలి. ఐరాసలో సంస్కరణలకు ఊతమియాలి.

- తాడేపల్లి హనుమత్‌ప్రసాద్ సెల్ : 9676190888