ఉత్తర తెలంగాణ

బొమ్మను కాను.. అమ్మను రా..! ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడు పదుల వయసుదాటిన కమలమ్మ వృద్ధాప్యంలో..తన సొంతింట్లో ఓ మారుమూల గ్రామంలో జీవనం గడుపుతోంది. ఆ గ్రామంలోని మనుషులందరూ ఆమెను ఆప్యాయంగా నానమ్మ, అమ్మమ్మ అని పిలుస్తుంటారు. బాగా చదువుకోక పోయినా రాయడం, చదవడం తెలుసు..దశాబ్దాలుగా ఆ ఊళ్లో ఉంటున్న ఆమెకు సొంత ఇల్లే లోకం.. తనకున్న నలుగురు కొడుకులు పట్టణాల్లో స్థిరపడ్డారు. భర్త చనిపోయి..నలభై ఏళ్లు కావస్తోంది. కొడుకులు..కోడళ్లు, మనుమలు, మనుమరాళ్లు ఆమెను చూడటానికి పల్లెకే వస్తూ వెళ్తుంటారు. ఆమె మాత్రం వాళ్ల వద్దకు వెళ్లదు. ఎందుకంటే ఆ పల్లె అన్నా.. ఆ పల్లె ప్రజలన్నా ఆమెకు ఎంతో ఇష్టం..
ఓ రోజు ఉదయం పనులు ముగించుకుని కునుకు తీస్తుంటే.. ‘పోస్ట్’ అంటూ తలుపుతట్టిన శబ్దం విన్నది. నిద్ర నుండి మేల్కొన్న ఆమె తలుపు తీసింది. ‘ఎవరు బాబు’ అంది. ‘నానమ్మ నీకు పోస్ట్ వచ్చింది’ అన్నాడు పోస్ట్‌మ్యాన్ రవి. ‘ఓరి రవి నువ్వా రా? ఏం సంగతి రా? లెటర్ ఎక్కడి నుండి వచ్చిందిరా?’ అంటూనే లెటర్‌ను తీసుకుంది..
టేబుల్‌పై వున్న కళ్లద్దాలను పెట్టుకుని పోస్ట్‌కార్డును చదువసాగింది. ‘మనుమలు, మనుమరాళ్లు గుర్తు చేస్తున్నారమ్మా నీవు ఒకసారి వచ్చి వెళ్లరాదా?’ అన్న చిన్న కొడుకు లెటర్ సారాంశాన్ని గ్రహించింది..
తను రాలేనన్న సంగతిని తన వద్ద దాచి వున్న కార్డుపై ఇలా రాసింది.
చి. మనోహర్‌కు
‘మీ అమ్మ ఆశీర్వదించి రాయునది. నేను క్షేమంగా ఉన్నానురా..
నా కన్నతల్లిగా భావించే ఈ పల్లెను వీడి రాలేనురా.. దీనర్థం మీ మీద ప్రేమ తగ్గిందని కాదు.. కోడళ్లు సరిగా చూసుకోరని కాదు.. ముద్దా ముద్దా పిసికి.. ముద్దుగా మీ నాన్న నేను కట్టుకున్న ఈ ఇల్లు వదలి రావడం నాకు మనసొప్పడం లేదు. అంతేగాక..మిమ్మల్ని కని, పెంచిన జ్ఞాపకాలున్నాయి. ఇక్కడ! నా అత్తమామలు, నా తల్లిదండ్రులు పుట్టి పెరిగిన ఊరిది! ఎన్నో ఏళ్లుగా పెనవేసుకుని ఉన్న ఈ ఊరు, ఈ ఇల్లుతో ఉన్న అనుబంధాన్ని విడిచి రాలేను.. నా వయసును వెక్కిరించే నా ఇంటి దూలాల క్రింద వుండటమే నాకిష్టం! కొత్త పోకడల మధ్య.. మమీ డాడీల సంస్కృతిలో.. మీతో కలిసి అక్కడ వుండటం నాకు కష్టం! మీ కప్ బోర్డ్‌లో బొమ్మలా ఉండటం నాకిష్టం లేదు. మీ అమ్మనురా! నన్ను ఇక్కడే వుండనివ్వురా!
- మీ అమ్మ కమలమ్మ
అని రాసి.. ప్రక్కింటి రమణతో పోస్ట్ చేయించింది.

- గంప ఉమాపతి
కరీంనగర్, సెల్.నం.9849467551

పుస్తక సమీక్ష

బడుగు వర్గాల వెతలతో..
రూపుదిద్దుకున్న కవితలు!

పేజీలు: 45, వెల : 30/-
ప్రతులకు:
కె.పి.లక్ష్మీనరసింహ,
2-19, గ్రామం తిమ్మాపూర్,
మం: అడ్డాకల్,
జిల్లా: మహబూబ్‌నగర్.
సెల్.నం.9010645470

రైతన్నల కన్నీళ్లను తన కలంలోకి ఒంపుకుని.. కవి కె.పి.లక్ష్మి నరసింహ ‘ఆరుతున్న మెతుకు దీపం’ కవితా సంపుటికి ఆకృతినిచ్చారు. ఈ గ్రంథంలో బడుగు, బలహీనవర్గాల ప్రజల వ్యథలకు పెద్దపీట వేశారు. అన్నదాతల ఆక్రందనలను ఆర్ద్రంగా ఆవిష్కరించారు. ప్రేమ కవితలకూ చోటు కల్పిస్తూ.. కులం, మునవాదం, వలసలు, కూలీ బతుకులు తదితర అంశాలను తన కవితా వస్తువులుగా ఎంపిక చేసుకుని కవితలను తీర్చిదిద్దారు. అయితే కవిత్వాంశ పెద్దగా లేక పోయినప్పటికీ..కవి యొక్క సామాజిక చింతనను అభినందించకుండా ఉండలేము! కన్నీటి తడి, నిప్పుల వేడి, లేమిలో వుండే ప్రేమ అట్టడుగు మనుషుల జీవితాల్లో ఉంటుందని ఇందలి కవితల్లో కవి ప్రస్తావించ ప్రయత్నించారు. ‘నువ్వు లేక..’ మొదటి కవితలోనే.. అన్నదాతల ఆత్మహత్యలపై స్పందిస్తూ.. సినుకు రాలక.. సేను పెరగక..నీల్ల జాడ జూడనీకే నింగికెగురుతున్నవా? అని ప్రశ్నించారు. నువ్వు దిగులు జెందకన్న.. మమ్మల్ని ఆగం జేసి పోకన్న మేమందరం ఉన్నామన్న భరోసా ఇచ్చారు. ‘మచ్చలేని సెంద్రుడు’ కవితలో..మట్టి మకరందాలని కవిత్వీకరించడానికి పదాలు సరిపోతలేవని పేర్కొంటూ.. అన్నదాతను ఉన్నతంగా చిత్రించారు. ‘మెతుకు లేక..!’ కవితలో.. సూరీడి మంట.. కన్నీళ్ల పంట.. ఒక్క జల్లు సినుకు కురువదు.. మల్లన్న మడికట్టల్ల.. గుసోని ఆకాసం దిక్కు జూస్తుండని వాపోయారు. కరువు రైతన్న పాలిట అమాస సీకటైంది.
‘నీ కెవ్వరు తోడు’ కవితలో..రాబందులు రైతన్న రక్తాన్ని తాగుతున్నయ్ ఇసం జిమ్ముతున్నయ్..అన్నదాత మాకెవ్వరు తోడు? అని ప్రశ్నించారు. అన్నం బెట్టెటోనికి ఆకలి కష్టాలొచ్చాయని ‘నాయకుల బ్యారాలు’ కవితలో కవి తమ ఆవేదనను వ్యక్తపరిచారు. పిట్టకు సెట్టు తోడుంది. పుట్టకు మట్టి తోడుంది. మెతు పెట్టెటోనిది అనాధ బతుకు.. ఏ నాయకుడి తోడు లేదు కానీ.. నీకు ‘మేమున్నం’ అని కాడెడ్లు అంటున్నయ్ అన్న పంక్తులు మరో కవితలో చక్కగా ఒదిగి పోయాయి. వలసల బాటలో.. పాలమూరు పక్షిది చీకటి జీవితమయిందనీ.. బతుకు భారాన్ని మోస్తూ..సాగుతున్న క్రమంలో.. కూటికోసం గూడునొదిలి.. ‘నీడలేని కాపురమయిందని వాపోయారు. పల్లెకు పచ్చని తోరణం.. బతుకమ్మ అలంకరణమని ఓ కవితలో చక్కగా ఆవిష్కరించారు. మనిషి అనే పదానికి కులం, మతం లేదని అంబేద్కర్ ఆశయాలను, భావాలను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. మనువాదం.. మతోన్మాదం నిండు ప్రాణాలను బలి తీసుకునే రాక్షసవాదమని వ్యాఖ్యానించారు. ‘ఆనందం ఆకాశంలా’ కవితలో.. చెలిని తలుచుకుంటూ ప్రకటించిన భావాలు రమణీయంగా వున్నాయి. ‘కడలి అలలా’ కవితలోను చెలిపట్ల ప్రేమను వ్యక్తపరిచారు. ‘నీ రూపం’ కవితలో..నీ రూపం నా నయనంలో నెమలివలె నాట్యం చేస్తున్న ఈవేళ.. నీ సుందర స్వప్నాలే..నా ముందు వాలుతున్నవని చెలిని గుర్తు చేసుకున్నారు. ఇందులోని కవితలు సాదాసీదాగా ముస్తాబై వచ్చాయి.. మున్ముందు కవిత్వం రాయడంలో మెళకువలు తెలుసుకుని.. అధ్యయనంపై దృష్టి సారించి కవి గాఢమైన కవిత్వం పండించాలని కోరుకుందాం.

- సాన్వి, కరీంనగర్
సెల్.నం.9440525544

అంతరంగం

సామాజిక చైతన్యానికి
కవిత్వం దోహదపడాలి

కవి, రచయిత వరిగొండ కాంతారావు

వరిగొండ కాంతారావు
ఆదిత్య, 35-5-220
జీవన మిత్రనగర్
విద్యారణ్యపురి,
హన్మకొండ-506009
సెల్.నం.9441886824

కవిత్వం సామాజిక చైతన్యానికి దోహదపడాలని అభిప్రాయపడే వరంగల్‌కు చెందిన కవి, రచయిత వరిగొండ కాంతారావు వృత్తిరీత్యా భారత జీవిత బీమా సంస్థలో వికాసాధికారిగా ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యానం, ఝరి, సంద్రం, గగనం కవితా సంపుటాలను వెలువరించారు. ఆయన సాహిత్యాన్ని మూల్యాంకనం చేస్తూ ‘రచనోద్యోగం’ గ్రంథం ప్రకటింపబడింది. రెండు కథా సంపుటాలను కూడా వెలువరించారు. ‘సాహచర్యం’ నవలను ప్రకటించారు. జాతీయ భావాలను పుణికి పుచ్చుకున్న ఆయన తన రచనల ద్వారా జన చైతన్యానికి కృషి చేయడం విశేషం! గేయ రచనలో..్ఛందోబద్ధ కావ్యాలను వెలువరించడంలోనూ అనుభవం ఉన్న ఆయన వరంగల్ సాహితీ సమితి మరియు శ్రీలేఖ సాహితిలో క్రియాశీలక బాధ్యతల్ని నిర్వర్తించారు. కాంతారావు గారు తాను తన ఎనిమిదేళ్ల వయసులోనే రచనా వ్యాసంగంపై దృష్టి సారించడం గమనార్హం. ‘మెరుపు’ జరిపిన ‘ముఖాముఖి’ వివరాలు ఆయన మాటల్లోనే....

ఆ మీ రచనా వ్యాసంగాన్ని ఎప్పుడు
ప్రారంభించారు?
నాలోని రచయిత తొలిసారిగా బయటకు తొంగిచూసింది నా ఎనిమిదేళ్ల వయసులో.. అయితే స్పష్టాస్పష్ట రచనలు మొదలు పెట్టింది పదిహేను, పదహారేళ్ల వయసులో.. ఇది కవిత్వమంటూ ప్రారంభించింది మాత్రం 1975, 76 ప్రాంతంలో.. తొలి కవితా సంపుటిని 1990లో వెలువరించాను.

ఆ వృత్తిపరంగా మీ నేపథ్యం?
1972లో ఆబ్కారి శాఖలో టైపిస్ట్‌గా నా ఉద్యోగ జీవనం ప్రారంభమైంది. ఆ తరువాత..మున్సిఫ్ కోర్టులో స్టెనోగ్రాఫర్‌గా పనిచేశాను.. 1973 నుండి 2013 వరకు భారత జీవిత బీమా సంస్థలో వివిధ హోదాల్లో విధులను నిర్వర్తించాను. మెదక్ జిల్లా రామాయంపేటలో కొంతకాలమే ఎల్‌ఐసిలో వికాసాధికారిగా చేశాను. మిగతా కాలమంతా వరంగల్‌లోనే గడిచింది.

ఆ మీ దృష్టిలో కవిత్వమంటే ఏమిటి?
నా దృష్టిలో కవిత్వమంటే పాఠకులను ఆలోచింపజేయాలి. క్లుప్తత, గాఢత, స్పష్టత ముప్పేట అల్లుకుపోయేదే కవిత్వం.. కవిత్వం సమాజహితం కోరాలి. సామాజిక చైతన్యానికి దోహదపడాలి.

ఆ మీ ముద్రిత గ్రంథాలు?
ఉద్యానం, ఝరి, సంద్రం, గగనం గ్రంథాలతో పాటు గేయ శతకాలను, గేయ ద్విశతులను వెలువరించాను. గేయ శతక రచనకు నేనే ఆద్యుడనని కొంతమంది నాకు ఉత్తరాల ద్వారా అభినందనలు తెలిపారు. అయితే ఇది పరిశోధనలో నిగ్గుతేలవలసి ఉంది. పై గ్రంథాలతో పాటు ‘రచనోద్యోగం’ నా సాహిత్య సమాలోచన గ్రంథం శ్రీ నమిలికొండ బాలకిషన్ రావు ప్రధాన సంపాదకత్వంలో ప్రకటింపబడింది. ‘దోస్తాన’, ‘కృష్ణార్పణం’ కథా సంపుటాలు వెలువరించాను. ‘అనవానిలము’, ‘సాహచర్యం’, నవలను రచించాను. ప్రణవం, పంచాంగాన్ని నమ్మడమెలా? వంటి గ్రంథాలను కూడా పాఠకులకు అందించిన తృప్తి నాకుంది.

ఆ మీ రచనల్లో జాతీయ భావాలు ప్రతిబిం
బింపజేయడానికి ప్రేరణనిచ్చింది ఎవరు?
కవిత్వము, కవి వ్యక్తిత్వం రెండూ అభిన్నమని నమ్మేవాళ్లలో నేనొకన్ని..అమ్మా నాన్నలు..చదువు చెప్పిన గురువులు..నాకు జాతీయ భావాలను చిన్ననాటి నుంచే రంగరించి పోశారు.

ఆ మీకు నచ్చిన గ్రంథాలు?
రామాయణం, మహాభారతం, శ్రీమద్భాగవతం..

ఆ కవి యొక్క కవిత్వం ద్వారా ఆయన
వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చా?
సాధారణంగా కవి తాను ఆచరించేదే కవిత్వంలో పొందుపరుస్తాడు..అయితే మనం గమనిస్తున్నది ఏమిటంటే? ఇప్పటి కవిత్వంలో కవి వ్యక్తిత్వం చాలా వరకు ప్రతిబింభించడం లేదు..కవిత్వం హిమవన్నగోన్నతంగా వున్నా..ఆ కవిత్వం యొక్క ప్రభావం సమాజంపైన లేదంటే..ఆ కవి విషయంలో కవిత్వమూ, కవి వ్యక్తిత్వమూ వేరే అంశాలుగానే చూడాలి.

ఆ ఇప్పుడొస్తున్న వచన కవిత్వంపై
మీ అభిప్రాయం?
పఠితను ఆలోచింపజేసే కవిత్వం విరివిగా రావడం లేదు..కవిత్వానికి కనీస ప్రమాణాలు పాటిస్తే బాగుంటుందనే విషయాన్ని నేటి కొత్త కవులు గమనించాల్సి వుంది..పూల మొక్కలకు ఆకులు అనవసరం అన్న చందంలా కవిత్వంలో కవిత్వాంశను వదిలివేస్తున్నారు. ఈ ధోరణి మారాల్సి వుంది.

ఆ సాహితీ పురస్కారాలపై మీ అభిప్రాయం?
పురస్కారాలు కవిని ప్రోత్సహించడం జరుగుతుంది. పైగా గుర్తింపునూ ఇస్తాయి.. అయితే పురస్కారాల ప్రధానంలో.. పారదర్శకత అవసరం.. పురస్కారాలు కవులు, రచయితల బాధ్యతను పెంచాలి.

ఆ కొత్త కవులు, రచయితలకు
మీరిచ్చే సలహాలు?
భాషను ప్రేమించాలి. భాషపై పట్టు సాధించాలి. అధ్యయనంపై దృష్టి సారించాలి.

ఆ తెలంగాణ సాహిత్యం వెలుగులోకి
రావాలంటే ఏం చేయాలి?
వివక్ష వల్ల మరుగున పడ్డ మన సాహితీ సంపదను వెలికి తెచ్చేందుకు పరిశోధనలపై కవులు, రచయితలు దృష్టిపెట్టాల్సి ఉంది. ఇందుకోసం.. ప్రభుత్వం.. ప్రచురణకర్తలు కవులు, రచయితల్ని ప్రోత్సహించాలి.

ఇంటర్వ్యూ: దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544

పుస్తక సమీక్ష

భాగ్యవిధాత

సుజనావళి సన్నుతి
సురావాసము తలుపుతట్టింది
సురల తలపుల తలుపులు విచ్చుకోగానే
స్వర్గం నుండి దిగి వచ్చిందో దేవత,
సకల సంపత్సమేత గోమాత
మానవ సేవయే మాధవ సేవయన్న
కామధేనువు మానసపుత్రి
వసుధైక కుటుంబకం ఊపిరిగా,
శంఖ-చక్రములు కొమ్ములుగా,
చతుర్వేదములు కాళ్లుగా
మానవ సంక్షేమం కోసం అవతరించింది
తల్లిపాలు మరీచికలై తల్లడిల్లే పసికూనల
ప్రాణాలు నిలబెట్టే సంజీవని పాత్ర
పంతము సొంతముగా బైఠాయించిన
మొండి రోగాలకు దంది విరుగుడైన
పంచతాన్ని ప్రసాదించే విశారద
గడ్డి పోచలతో కడుపు నింపుకుని
క్షీరధారలు కురిపించే క్షేమప్రదాయని
కృషితో నాస్తి దుర్భిక్షమన్న
విబుధుల బోధనలో తడిసి,
కర్మక్షేత్రము ఒంటినిండా
నాగలితో గిలిగింతలు పెట్టే
బసవన్నల నిచ్చే భాగ్య విధాత
పర్యావరణ రక్ష దక్షా
కంకణధారిణి గోమాత

- ఐతా చంద్రయ్య
సిద్ధిపేట, సెల్.నం.9391205299

జ్ఞాపకాల ఫైలు..
సమస్యల కౌగిళ్ల బిగువున నలిగి నా నీ వొళ్లు
కన్నీళ్ల సుడులతో బిక్కకూడద నీ కళ్లు
కన్నీళ్లు జలపాతమై కాకూడదు ‘నైలు’
ఆవేశం ‘జీవితాన్ని’ పట్టాలు ఎక్కించే ఒక రైలు
కడగండ్ల చీకట్లు ముసిరిన బెదరనీకుమా ‘ఆ’స్మైలు
అపుడపుడు తెరవాలి గతకాలపు జ్ఞాపకాల ఫైలు
ఒక అడుగుతోనే మొదలవుతుంది కదా మైలు
కష్టమైనా శాశ్వతమా వెళ్లిపోదా ఎపుడో ఒకసారి చూసుకుని వీలు
కష్టం, సుఖం చక్రభ్రమణంలో
ఒకదాని తరువాత ఒకటి వాలు
కాలం గడిచేకొద్ది నింపాదిగా నిను చేరు అనుభవాలు
ఆనందాలు నిండాలి నీ (మనిషి) జీవితాన వందలు వేలు

- నల్లగొండ రమేష్, ఆసిఫాబాద్, కొమ్రంభీం జిల్లా
సెల్.నం.9441711832

లయగ్రాహి
లాలిత్యంలోని సొగసు
మాధుర్యంలోని తీపి
సౌందర్యంలోని మెరుపు
సాహిత్యంలోని వివేకం
సమ్మిళితమైన హృదయం
సకల కళలకు నిలయం
సంగీతానికి లయవలె
జీవితానికే లయ ఉంది
ఆ లయ అన్నింటికే ప్రాణం!
అదే సుఖ జీవన గానం!!
ఆ గానంలో తడిసి
అనునిత్యం ఉల్లసించాలి!
అనుక్షణం హృల్లసించాలి!!

- డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ
కామారెడ్డి, సెల్.నం.9440468557

అంతా బతకాలి
అద్దమై నిలుద్దాం.. నిజాన్ని వెలికి తీద్దాం
దీపమై వెలుగుదాం.. చీకటిని చీల్చుదాం
చూసిరాతే పరీక్షా! కాదు పేపరు లీకే అస్లీ పరీక్షా!
చదువులో మొద్దైనా వాడెలా సరస్వతీ ముద్దు బిడ్డా!
అంతా అయోమయం, ర్యాంకులో టాపర్
అన్నీ తెలుసా! అడిగేదే తెలుసా!
ఇష్టపడి కష్టపడే అభ్యర్థి ఈ వ్యవస్థలో అవస్తే!
కన్నవాళ్లు కాయకష్టం చేసి చదివిస్తే
వాళ్ల కల కలగానే కల్లగానే!
ఆశ నిరాశే! ఇలాగైతే చేతిలో ఎండ్రీనే!
కుండపోత వానలా కాసులు కురిపించే
బకాసురులు, నల్లకుబేరులెందరో!
వాళ్ల ప్రతాపమే!
నేడెవరు స్వతంత్రులు!
ఉద్యోగులు బందీలే!
లంచానికే అంతా బానిసలే!
ఐనా ఈ బతుకెన్నాళ్లు!
నిజం గ్రహించు నదిలా జీవించు!

- పెరుక రాజు, నీలగిరి, తమిళనాడు
సెల్.నం.09443091384

పెద్ద నోటు!

లోకం బొడ్రాయి పక్కన ఎగరేసిన జండాలా
నీ రూపం అపురూప దీపం
ప్రాణంలో ప్రాణంగా చూసుకున్నాం
కన్నోళ్లకంటే మిన్నగా పెంచి పోషించాం
ఊహించని భూకంపం దేశం నట్టింట్ల బద్ధలైంది
జీవితమంతా తోడుంటావని
జీవనాన్ని వెలుగుల సీతాకోక చిలుక చేస్తావని
దున్నాం చెమట దుక్కులు
పండించాం కలలు పంటలు
అవ్యత దర్జాగా అందరి మధ్య బతికావు
రద్దు పొటొచ్చి ఫోటోగా వేలాడుకున్నావు
నిలువెత్తు రూపానికి ఎవరో దండేసిండ్రు
అందరికి అయినదానివి, వారసులు లేనిదానివి
నువ్వు వెంటుంటే పరుగు పాదరసమయ్యేది
కోరికల గుర్రాలు ధీమాగా బతికేవి
తండ్రి, తాత, తల్లీ పిల్లలు లేదు తేడా
అందరూ నిన్ను నమ్ముకున్నోళ్లే
భద్రంగా గుండెల్లో దాచుకున్నోళ్లే
నువ్వు నేల వాలితే
వంగి పైకెత్తి కళ్లకద్దుకునే వారు
ఇప్పుడు నువ్వే బరువయ్యావు..్భరమయ్యావు
నిన్ను ‘మమీ’ని చేసే పిరమిడ్లు లేవు
నీ చావు ఇంత ఘోరం అనుకోలే
శవం వికటాట్టహాసానికి
కోట్లాది రెక్కలు తెగిన పక్షులు విలవిల
ఇక్కడ హంతకుడు భళా
ఫోటోలో నీవి ముసిముసి నవ్వులు
మావే విషణ్ణవదనాలు

- కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట, సెల్.నం.9985411090

అవును నేనొక
ఉపాధ్యాయుడనే..!
జీవన సారాన్ని మధించి అమృతాన్ని
శిష్యులకు పంచే ఉపాధ్యాయుడను నేను
ఉపనిషత్తుల సారాన్ని, ఉత్పత్తి నిష్పత్తుల
గుణాల గణాల గణాంకాల
వలువల విలువలు పలువిధాలైన
విధుల, నిధుల లోగుట్టు తెలిపే గురువునేను
వైద్యుడైన, విద్యావేత్త అయినా, సాంకేతిక నిపుణుడైనా
జిల్లాల, రాష్ట్రాల, కేంద్రాల పరిపాలనాధ్యక్షులై
రాజకీయ దురంధరులైన..నా శిష్యరికంలో పెరిగినవారే
నేను వారి ఉపాధ్యాయుడనే..
బీదలైన, ధనికులైన చదువుల్లో ప్రథముల్లైన, ఆధముల్లైనా
వారంతా నావరే, నా ప్రియ శిష్యులే..
వారు ఖరీదైనా వాహనాల్లో తిరిగి, విమానాల్లో ఎగిరినా
సముద్రతలంలో, పాతాళంలో పయనించినా
అది నేను కాలి నడకన నడచిన బాటనే
అది నేను వారికి చూపిన తోవనే..!
నేనొక ఉపాధ్యాయుడను, మామూలు బడిపంతులును.

- రమేష్ బాబు శ్రీరామోజు
మంచిర్యాల, సెల్.నం.9866193224

నాన్న
అంతులేని బాధ్యతల బరువును మోస్తూ
అనంత జీవన పయనాన్ని సాగిస్తూ
అందమైన సంతాన శ్రేయస్సుకై పరితపించే..
అనురాగమూర్తి నాన్న!
ఆలుబిడ్డల సంక్షేమమే తన జీవిత పరమావధిగా భావిస్తూ
అవిశ్రాంతంగా అలుపెరుగని పోరాటం సాగిస్తూ
వారి బాగుకై నిరంతరం శ్రమించే..
ప్రేమమూర్తి నాన్న!
సంసార సాగరంలో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నా..
కుటుంబ రథసారథిగా చేరవల్సిన గమ్యమనే తీరానికి
సురక్షితంగా చేర్చు ఆదర్శ మూర్తి నాన్న!
కన్నవారి కలలు సాకారం చేస్తూ కర్పూరంలా తాను
కరిగిపోతున్న కుటుంబానికి కాంతిని ప్రసాదించే..
తానేగ మూర్తి నాన్న!
ఎగిరే గాలి పటానికి దారం ఆధారమైనట్లు..
ఎదిగే పిల్లల ఉన్నతికి నానే్న ఆధారం!
మంచితనంతో మసలుకుందాం!
మలి దశలో వారికి ఊతమవుదాం!!

- సిరిపురం వాణిశ్రీ
కరీంనగర్, సెల్.నం.9392023988

రైతు నానీలు
పండించే పంట
నిఖార్సుగా నీదే
ఖర్సులన్నీ లెక్కగట్టి
ధరజెప్పే సాహసించు

మద్దతు ధర కొరకు
గానుగెద్దులాగ తిరిగి
ఎవుసం కాటుకు
బలవుతున్న బక్కరైతు

ఆలుబిడ్డలంత కలిసి
ఆరుగాలం శ్రమించినా
గిట్టుబాటు ధరజూసి
గిర్రున కళ్లను నీళ్లు

గతి తప్పిన పాలసీలు
దగా చేసే రైతన్నను
రైతులకే రాజీర్కం
రాకపోతే కనాకష్టం

అప్పుల మాఫీలంటూ
కమ్మనైన కబుర్లు
తిప్పలన్ని పోయేనా
రుణభారం తీరేనా

ఏ లీడరు మాట్లాడిన
రైతురాగమే తీత్తరు
బెల్లం పాన్కం లెక్క
తియ్యగనే పలుకుతరు

రైతే రాజంటరు
ఎన్నటికైతరో
నివద్దెంతనో
అబద్ధమెంతనో

దేశానికి వెనె్నముక
రైతే రైతే రైతే
నిలువెత్తు నినాదాలు
మతితప్పిన విధానాలు

శ్రీ దాస్యం లక్ష్మయ్య
హుస్నాబాద్
సిద్ధిపేట జిల్లా
సెల్.నం.9440155240

email : merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

- గంప ఉమాపతి