ఉత్తర తెలంగాణ

అపకారికి.. (కథ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవంబర్ పదిహేనవ తేదీ... సాయంత్రం ఆరు కావస్తోంది. చిరుచీకటి దుప్పటి కప్పుకుని చలి తన పంజా విసిరేందుకు సిద్ధపడుతున్న సంధ్యా సమయమది. సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్ మాత్రం కాలంతో పనిలేకుండా ఎప్పటిలాగే గోలాహలంగా ఉంది. ప్రాణాలు కాపాడుకునేందుకు వచ్చేవాళ్లు... ఆయుష్షు తీరిపోయేవాళ్లు.. ఈ వచ్చిపోయేవాళ్ల వెంట ఉన్న మనుషుల్లో సందర్భాన్ని బట్టి హర్షాతిరేకాలు లేదా అంతులేని శోకాలు.. అన్ని ఒక్కచోటే. ఫీలింగులతో సంబంధం లేకుండా డ్యూటీయే ధర్మంగా మరబొమ్మల్లా చకచకా తిరుగాడుతున్న నర్సులు.. డాక్టర్ల సందడి వాతావరణానికి గాంభీర్యతను తీసుకొస్తోంది.
సరిగ్గా అప్పుడే ‘కుయ్య్’మని సైరన్ మోగిస్తూ రయ్య్‌న దూసుకొచ్చి ఆగింది అంబులెన్స్. అప్రమత్తమైన ఎమర్జెన్సీ సిబ్బంది స్ట్రెచర్, వీల్‌చైర్‌లలో దానిచుట్టూ చేరారు. అందులోంచి సుమారు 50 సంవత్సరాల వయసుండే యాదగిరిని తీవ్ర గాయాలతో రక్తంతో తడిసిన బట్టలతో అతి జాగ్రత్తగా దించి హుటాహుటిన ఐసియు విభాగానికి తరలించారు. అతను ఏ చలనమూ లేని స్థితిలో ఉన్నాడు. చేసేవాళ్లకు ఆందోళన కలిగించేలా.
ఆ వెనక ఐదు పది నిమిషాల వ్యవధిలో వచ్చిన ఆటో నుండి ఆయన భార్య రాజమ్మ, ఆమె తమ్ముడు విజయ్ దంపతులు దిగగానే హాస్పిటల్ ముందరంతా శోకాలతో పెడబొబ్బలతో నిండిపోయింది. రాజమ్మ ఏడుపును ఆపటం ఎవ్వరి తరమూ కావటంలేదు. ‘ఓ దేవుడా.. నేనేం పాపంజేసిన్నని.. నా దేవునికి ఇంత గోస తెచ్చిపెట్టినవు. శీమెకు కూడా అపకారం చెయ్యనోన్ని గా మాయదారి పోరగాండ్లు బండిమీద వచ్చి గుద్ది ఎల్లిపోయ్యిరి. ఇగ నేనేమిజేతూ..నేనెక్కడనిబోతూ..నా దేవుడా..ఆ’ అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే అక్కడున్నవారంతా చలించిపోయారు. పరిచయం లేకపోయినా ఆమె బాధచూసి పల్లెటూరి వాళ్లంతా పక్కన చేరారు. పెద్దవయసున్న ఒకావిడ దగ్గరకు తీసుకుని ఓదార్చసాగింది. కాసేపటికి కుదుటపడ్డ రాజమ్మ పెద్దావిడ మాటమీద గటగటా నీళ్లుతాగింది. తడిసిన చీరతో కళ్లు తుడుచుకుని జరిగిందంతా చెప్పింది.
వాళ్లది గజ్వేల్. వాళ్లాయన వ్యవసాయం చేస్తూనే చిన్న కిరాణం నడుపుతాడు. ఊళ్లో అందరికీ వీలైనంత సాయం చేస్తూ మంచిమాటలు చెబుతూ ఆప్తుడిగా ఉంటాడు. సాయి వాళ్ల ఒక్కగానొక్క అబ్బాయి. హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. నిన్న తన తమ్ముడు మరదలు వచ్చి.. సాయిగాన్ని చూడక చాన రోజులయిందే. అందరం రేపోపాలి పట్నంబొయ్యి సూసొద్దాం’ అనటంతో రాత్రికి రాత్రి రాజమ్మ కారబ్బిళ్లలు చేసి డబ్బాలో గుద్దింది.
ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తరువాత అందరూ కలిసి గజ్వేల్‌లో బయలుదేరి జెబిఎస్ చేరుకున్నారు. ఇబ్రహీంపట్నం వెళ్లటానికని సిటీ బస్సుకోసం స్టేజి దగ్గర రోడ్డుమీద నిలబడ్డారు. అంతలోనే ముగ్గురు యువకులున్న పల్సర్ బైకొకటి వేగంగా రాంగ్ రూట్లో రావటం యాదగిరిని గుద్ది వెళ్లిపోవటం క్షణాల్లో జరిగిపోయింది. కిందపడి తలకు బలంగా గాయమైన అతను కోమాలోకి వెళ్లిపోయాడు. అక్కడున్న వాళ్లు తేరుకునేలోపే గుద్దేసిన బండి అడ్డదిడ్డంగా అతివేగంగా వెళ్లి మెట్రో రైలుకోసం జరుగుతున్న కందకాల పనుల దగ్గర మాయమయింది. ఒకతను మాత్రం బండి నెంబరు నోట్ చేసిన చిట్టిని విజయ్‌కిచ్చాడు. చూడకుండానే దానిని జేబులో పెట్టుకున్నాడు. విపరీతమైన రక్తస్రావం అవుతుండటంతో 108కి ఫోన్ చేసారెవరో. అంబులెన్స్ రాగానే యాదగిరిని అందులోకి ఎక్కించి మరో ఆటోలో వీళ్లు బయలుదేరి వచ్చారు.
***
జరిగిందంతా చెప్పిన రాజమ్మ మళ్లీ ఏడుపందుకుంది. వాళ్లబ్బాయికి ఫోన్ చేస్తే తన ఫ్రెండ్స్‌కెవరికో ఆరోగ్యం బాగాలేకపోతే అదే హాస్పిటల్‌లో ఉన్నట్లు తెలిసింది. ఒక్క ఉదుటున అమ్మను మామయ్యను చేరుకున్న సాయి నాన్న పరిస్థితి తెలుసుకుని బావురుమన్నాడు. డాక్టర్‌ను విచారించగా తేలిందేమిటంటే యాదగిరి తలకు లోతైన గాయమవ్వటం, తీవ్రమైన రక్తస్రావం అంతర్గతంగా కూడా జరగటంతో ‘బ్రెయిన్ డెడ్’ స్థితిలో ఉన్నాడని బతికినన్నాళ్లు జీవచ్ఛవంలా మంచంపై ఆక్సీజన్‌మీదే బతకాలని వివరించారు. కుప్పకూలిన సాయి కాసేపటికే తేరుకున్నాడు. వాళ్ల మామయ్యను పక్కకు పిలిచి మాట్లాడాడు. మామయ్యా నాన్న ఎలాగూ మళ్లీ మామూలు మనిషి కాలేడు. నాన్నలా ఆ స్థితిలో చూస్తూ అమ్మ, నేను మామూలుగా బతకలేం. కాలం గడుస్తున్నకొద్దీ శరీరంలోని భాగాలు ఇంకా పాడయి తనకే కాదు ఎవరికీ పనికిరాకుండా పోతాయి. మనం పోయినా నలుగురికి ఉపయోగపడాలి అనేవాడు నాన్న’ అని మామయ్య మొహంలోకి చూస్తూ ఆగాడు సాయి.
‘ఇంతకీ నువ్వు చెప్పదల్చుకున్నది ఏంటిరా’ కాస్త అర్థమయ్యి కాస్తకాక ప్రశ్నించాడు విజయ్. ‘అదే మామయ్యా.. నాన్న ఆశయాలకు అనుగుణంగా మనం ఆయన శరీరాన్ని ‘అవయవదానం’ చేద్దాం’
‘దీనికి మీ అమ్మ ఒప్పుకుంటుందంటావా? ఇది జరిగే పనేనా’ ఆందోళనగా అన్నాడు విజయ్. ‘అమ్మకు నువ్వంటే చాలా ఇష్టం. నీ మాటంటే గౌరవం. నువ్వే ఒప్పించాలి.. ఒప్పించగలవు మామయ్య’ విజయ్ రెండు చేతులను బలంగా నొక్టిపట్టుకుని అర్థిస్తున్నట్లుగా అడిగాడు సాయి.
అనుకున్నట్లుగానే విజయ్ చెప్పిన మాటలకు, యాదగిరి భావజాలం తెలిసిన రాజమ్మ మెల్లిగా ఒప్పుకుని అవసరమైన పత్రాలపై సంతకాలు చేసేసింది. వెంటనే అదే హాస్పిటల్‌లో అవయవాలు చెడిపోయి దాతలకోసం చూస్తున్న నలుగురు పేషెంట్లను సెలెక్ట్ చేసి రాత్రి 12 కల్లా గుండె, కళ్లు, మూత్రపిండాలు మరియు కాలేయం మార్పిడి విజయవంతంగా ముగించారు. అవయవదానం పొందిన వారి బంధువులు రాజమ్మ, విజయ్, సాయిల కాళ్లు మొక్కారు.
***
నవంబర్ పదహారు ఉదయం తొమ్మిది గంటలకు ఆదమరచి శాశ్వత నిద్రోతున్న యాదగిరిని అంబులెన్స్‌లో వేసుకుని బరువెక్కిన హృదయాలతో గజ్వేల్‌కు బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. ఇంతలో సాయి బైకు తీసుకుని వచ్చాడు. బైకు మీదున్న కలర్ స్టిక్కరింగ్‌ను చూసి ఎక్కడో చూసినట్లుందే అని అనుమానం వచ్చి నిన్న జేబులో పెట్టుకున్న చీటి తీసి చూసాడు విజయ్. అదే నెంబర్. ఉలిక్కిపడ్డాడు. ‘ఏయ్ సాయి.. ఈ బండెవరిది? నిన్న మీ నాన్నని గుద్దిన బండి ఇదే’ అంటూ చీటి చూపించాడు. అప్పుడు సాయికి తన ఫ్రెండు నిన్న చెప్పిందంతా అర్థమైంది. తన మరో మిత్రుడు షకీల్ నిన్న తన బండినపుడుతూ పొరపాటున నాన్నని గుద్దాక డిస్టర్బ్ అయిపోయి ఆ తొందరలో ఆందోళనలో వెళ్లి మెట్రో రైలు కందకంలో పడిపోయిన ఘటనలో లివర్‌కు తీవ్రగాయమై యశోదలో చేరటం.. తను రావటం అంతా కళ్లముందు సినిమాలా కదిలింది. నాన్న దేహంలోని లివర్ అమర్చింది ఎవరికో కాదు షకీల్‌కే. చివరకు నాన్న తన చావుకు కారణమైన వాడికే ప్రాణం పోశాడని.. అర్థమైంది. వెంటనే నాన్న కాళ్లకు దండం పెట్టాడు సాయి. కళ్లల్లోంచి ఉబికిన నీళ్లు ఆ మహానీయుని పాదాలకు అభిషేకం చేసాయి.

- పెనుగొండ బసవేశ్వర్
కరీంనగర్, సెల్.నం.9059568432

పుస్తక సమీక్ష

‘గులాబీల’ కవిత్వపు సౌరభాలు!

పేజీలు : 95
వెల : 100/-
ప్రతులకు: పరిమళా పటేల్
ఇం.నం.13-72
సిరికళ్యాణి అపార్ట్‌మెంట్
ప్రగతి నగర్, హైదరాబాద్
సెల్.నం.9912229594

ఆయన అక్షరాల్లో అందమైన భావచిత్రాలను చిత్రించగలరు. అవే అక్షరాలను భాస్వర గుళికలుగా తీర్చిదిద్దగలరు. వృత్తిరీత్యా న్యాయవాదైనా.. రచనా వ్యాసాంగాన్ని ప్రవృత్తిగా మలుచుకుని దశాబ్దాలుగా సాహితీ సేద్యం చేస్తున్న గులాబీల మల్లారెడ్డిగారు ‘జనమేవ జయతే’ పేరుతో ఒక కవితా సంపుటిని వెలువరించారు. మనస్సుకి ఉత్సాహం, ఉల్లాసం, ఉద్వేగంతో పాటు ఓ అనిర్వచనీయ అనుభూతిని కలిగించేదే కవిత్వమని భావించే ఆయన ఈ కవితా సంపుటి నిండా తన హృదయ స్పందనలను కవితల్లో బంధించారు. అర్ధరాత్రి హాస్టల్ గదిలో... మగత నిద్రలో.. చైతన్యం శరీరానికి జడత్వం కప్పుకొన్నప్పుడు.. కలల సౌధంలో..అరవిచ్చిన గులాబీలను తన కవిత్వంలో పొందుపరిచారు..రేపటి సౌభాగ్యం కోసం.. సూర్యుని కిరణాలపై పయనిస్తాననీ.. అమృత లోకాల కోసం బాణం సంధిస్తానని విద్యార్థిగా హాస్టల్ గదిలో పొందిన అనుభూతులను..అంతరంగంలోని ఆలోచనలను అభ్యుదయ భావాల రూపంలో నాలుగు దశాబ్ధాల క్రితమే ఆవిష్కరించారు. 1974లోనే..నవీన జనం తీరు తెన్నులపై ఆయన తన కలాన్ని సంధించారు..ఆయన గుండెల్లోని పోరును ప్రదర్శించ ప్రయత్నించారు.
తాను డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న రోజుల్లో ‘సెక్స్’ను జెండర్ గుర్తింపుగా అభివర్ణిస్తూ..అది అపోజిట్ జెండర్‌కు జనండర్ అని వ్యాఖ్యానించారు. ఇందులోని ‘మార్లిన్-మన్రో’ కవిత రమణీయంగా ఉంది. కవి గులాబీల మల్లారెడ్డి యొక్క రసికతకు అద్దం పట్టేనా మలచబడింది! ఈ కవితలోని ప్రతి పంక్తీ.. పఠితులను పరశింపజేస్తుంది.. చెక్కిలి గింతలు పెడుతుంది. ఊహాలోకాల్లో విహరింపజేస్తుంది! ‘లా నెరజాణ’ పేరుతో రాసిన కవితలో తాను న్యాయ విద్యనభ్యసిస్తున్న కాలం నాటి అనుభవాలను, అనుభూతులను ఏకరువు పెట్టారు. ఉస్మానియా క్యాంపస్.. ఒక ఉత్తుంగ తరంగాల జలనిధి అనీ.. జననిధి అనీ.. యువ ప్రపంచం.. నవ ప్రపంచం.. కొంగ్రొత్త ఆలోచనల తరంగం.. అంటూ ఆనాటి యువలోకపు పోకడలను, కెరటాలు కెరటాలై కాలేజీ తీరాలను.. చెలియని కట్టల్ని చెంపకు చారడేసి కన్నులతో..వనె్న వనె్నల డ్రస్సులతో కనువిందు చేసిన దృశ్యాలను అక్షర బద్ధం చేశారు. గులాబీ పౌడరు ‘కోటింగ్’తో.. జిలేబీ పెదవుల ‘లిప్‌స్టిక్’తో ఘుమఘుమలాడే ‘నగరంలోని కనె్నల’ వనె్నలను ఓ కవితలో బంధించారు. మొక్కజొన్న తోటలో కాపలా కాస్తూ..తన చెలికాడు కోసం నిరీక్షిస్తూ.. చెలికత్తె పాడే పాటను అందంగా ఆవిష్కరించారు. బడికెళ్తున్న చిన్న చిన్న పిల్లల్ని.. ఎటు చూసినా పిల్లలతో నిండిన దృశ్యాన్ని పూలవనంతో పోల్చారు. చిగురాకు.. చిగురాకు అనుకోకు నన్ను..అరటాకు..అరటాకు అంటూ జమకట్టబోకు.. ఆట పాటలందు సమ ఉజ్జిగా ఆదరిస్తే చాలు.. చదువు సంధ్యల్లో సరిజోడుగా విలువనిస్తే చాలు..సరసన నిలువనిస్తే చాలు.. సరసన నిలువనిస్తే చాలంటూ ‘మహిళా విలాపం’ కవితను తీర్చిదిద్దారు. ఇలా.. గులాబీల మల్లారెడ్డి గారు ఆయా సందర్భాల్లో తాను వివిధ అంశాలపై రాసిన కవితల్ని ఈ గ్రంథంలో పొందుపరిచారు. గ్రంథంలో కవితలే కాదు.. గేయాలు.. పాటలు.. నాటికలు.. నానీలు ఉయ్యాలపాటలు మనకు కానవస్తాయి.. చివరలో.. ఛాయా చిత్రాలతో కూడిన కవితలున్నాయి..నీవే నా శ్వాస.. కొమ్మ..నెచ్చెలి..అంటూ అడుగులో అడుగేసే కవితలు దర్శనమిస్తాయి.. నయన తూణీరాలతో గుండె గాయమైన సంగతిని తెలుపుతాయి. భావ కవిత్వానికి పెద్ద పీట వేస్తూ రాసిన మరికొన్ని ఆయన స్పందనలు మనసు పులకరింపజేస్తాయి. మయూరాలు తలపించే లంగా ఓణీల కనె్నల వయ్యారాల నడకలూ కానవస్తాయి.. సినీ తారల అందాలను కవితాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశారు. దర్శకేంద్రుని అభినవ మయుడుగా అభివర్ణించారు.
జనం కష్టాలకి కన్నీళ్లకి తెరదించడమే నా గతం గమ్యం పరమార్థమని భావించే గులాబీల మల్లారెడ్డి గారి ఉత్తమ వ్యక్తిత్వానికి అభినందన చందనం సమర్పిద్దాం.. ఆయన సీరియస్ కవిత్వం రాయగలరు.. సమకాలీన కవిత్వాన్ని అనుసరిస్తే అద్భుతమైన సృజన చేయగలరు. ఈరోజు హాలీవుడ్ బాలీవుడ్, టాలీవుడ్ నటీమణులపై కవిత్వం రాయడం కన్నా.. పేదవాని శ్రమైక సౌందర్యంపై రాస్తేనే బాగుంటుందన్న అంశమూ ఆయనకు తెలియంది కాదు.. సరదా కోసం రాసినా కవిత్వంలో సృజనాత్మక పాలు ఎక్కువుంటేనే పాఠకులు ఆదరిస్తారన్న విషయమూ ఆయనకు తెలుసు! ఆయన ఇకనైనా.. సరదా కవిత్వపు పరదా మాటు నుండి బయటకొచ్చి సమకాలీన కవిత్వం రాయాలని కోరుకుందాం.

- సాన్వి, సెల్.నం. 9440525544, కరీంనగర్

మినీకథ

రాధా మాధవీయం

కొడుక్కు తానే పెళ్లి సంబంధాలు వెతకాల్సి వస్తుందని కొండలరావు కలలో కూడా ఊహించలేదు. ఐదారేళ్ల క్రితం కూతురు పెళ్లికి సంబంధాలు చూసి చివరికి అబ్బాయి అమ్మానాన్నల్ని బతిమాలి పెళ్లి చేశాడు. కాలం మారుతోంది. కొడుక్కు పిల్లనిస్తామని అమ్మాయిల తండ్రులు క్యూలో వస్తారనుకున్నాడు. బ్రోకర్‌కు అడ్వాన్సు కమీషన్ అప్పజెప్పినా అమ్మాయి దొరకలేదు. భార్య విశాలాక్షికి అనారోగ్యం. కోడలొస్తే విశ్రాంతి దొరికి తీరుతుందనుకున్నాడు. పేరున్న తనకు సంపదలున్నాయి, కొడుక్కు చదువుంది. అయినా సమస్య ఎక్కడేసిన గొంగళి అక్కడే లాగుంది. తన సమస్య గురించి బాల్య స్నేహితుడు రఘుపతి సలహా అడిగాడు. అతడు ఇప్పుడు అమ్మాయిల సంఖ్య తగ్గిపోయిందిరా కొండంతా! మగపిల్లగానికి మంచి అమ్మాయి దొరకాలంటే కాలికి బలపం కట్టుకుని తిరగాలి. హితోపదేశం చేశాడు.
ఆ తరువాత అతడే తనకు దూరబ్బంధువులైన సూర్యాపేట అమ్మాయి జాడ చెప్పాడు. ‘ఆ అమ్మాయి హైదరాబాద్‌లో చదివింది. అడిగి చూస్తానన్నాడు. ‘నా కొడుగ్గూడా హైదరాబాద్‌లో ఎం.కాం చదివిండుగదా. ఈ సంబంధం అతికేట్టు చూడుమని బతిమాలాడు. రఘుపతి వెంటనే సెల్‌ఫోన్‌లో సంప్రదించాడు. వాళ్లు అబ్బాయి ఇంటికి వెళ్లి చూపులకొస్తామన్నారు. ‘అదెట్లా మేమేవచ్చి అమ్మాయిని చూసుకోవాలంటే’ పెళ్లయ్యాక మా అమ్మాయి వాళ్లింట్లో ఉండాలి గదా! అన్నాడు అమ్మాయి తండ్రి. అమ్మాయి పేరు మాధవి.. బాగానే వుందని ఒప్పుకున్నాడు.
పెళ్లికూతురు తల్లిదండ్రులతో పెళ్లి చూపులకొచ్చి మర్యాదలందుకుంది. అబ్బాయి రాధాకృష్ణ- అమ్మాయి మాధవి గదిలోకెళ్లి మాట్లాడుకున్నారు. అబ్బాయి- అమ్మాయి ఒకరికొకరు నచ్చారని చెప్పారు. ఆ తరువాత ఆడపిల్ల వారు ఇల్లంతా, ఇంటి చుట్టుపక్కల పరిశీలించి చూశారు. కొండల్రావుకు కొండెక్కినంత సంతోషమైంది. ‘సూర్యాపేట కెళ్లాక ఫోన్ చేస్తామని’ రఘుపతి ముందే చెప్పి వెళ్లిపోయారు. పది రోజులు గడిచినా సూర్యాపేట నుండి ఫోన్ రాలేదు. చంద్రుని కోసం చకోర పక్షిలా ఎదిరి చూసినా లాభం లేదు.
రాధాకృష్ణ తండ్రి కొండల్రావుతో సహా రఘుపతి వద్దకెళ్లి సంప్రదించారు. కొండల్రావు జ్వరంతో బాధపడుతున్నా సూర్యాపేటకు ఫోన్ చెయ్’మని అడిగాడు. ‘సరే గానీ నీ ఇంటి చుట్టూ మురికినీరుంది. చెట్లు లేవు. దోమలు జొయ్యిమంటున్నా వాటివల్లనే ఈ జ్వరాలు’ అన్నాడు రఘుపతి. ‘నేను కూడా అదే అన్నాను మావయ్యా. ఇంటి చుట్టూ గుంతలు మూయించి చెట్లు పెంచుదామా, ఇంటి మురికి నీరును పైపుల ద్వారా బజారు డ్రైనేజికి విడుద్దామంటే నాన్న అంత ఖర్చు అంటున్నాడు బాధపడ్డాడు రాధాకృష్ణ.
లోపలి నుండి రఘుపతి కుమారుడు శశికాంత్ వచ్చి ‘బాగున్నావా మావయ్యా’ అని కూచున్నాడు. అతడు డాక్టరు. డ్యూటికెళ్లాలని తయారైనాడు. రఘుపతి అందుకుని, ముందు మావయ్య జ్వరం సంగతి చూడు శశీ’ అన్నాడు. శశికాంత్ పరీక్ష చేసి మందులు రాసిచ్చి ‘మీ ఇంటికి వద్దామంటే భయం రాధాకృష్ణ’ ఇంటి చుట్టూ గలీజు దోమలు. దోమలతోనే మలేరియా, డెంగ్యూ జ్వరాలొస్తే’ అని వెళ్లిపోయాడు. కొండల్రావు ఆలోచనలో పడిపోయాడు.
రఘుపతి సెల్‌ఫోనందుకుని స్పీకర్ ఆన్ చేసి మాటాడ్తా సూర్యాపేటతో. మీరు గూడా వినండి’ అన్నాడు. ఫోన్‌లో పెళ్లికూతురు తండ్రి ‘సంబంధం మాకందరికీ ఓకే కానీ అబ్బాయి వాళ్లింటి వాతావరణం చాలా గలీజుగా వుంది. మురికి నీరు, గుంతల నిండా దోమలు.. వాటికి తోడు పందులు. వారం రోజుల్లో ఇంటి వాతావరణాన్ని శుభ్రపరిస్తే ఓకే’ అన్నాడు. కొండల్రావు ఫోన్ లాక్కొని ‘హల్లో బావగారూ! మీరన్నట్టుగా వారం రోజుల్లో మా ఇంటి చుట్టూ వున్న మురికి గుంతలు మూసేసి మొక్కలు నాటుతాం. మురికి నీటిని పైపుల ద్వారా బజారు మోరీకి పంపిస్తాం’ చకచకా చెప్పేశాడు. రఘుపతి, రాధాకృష్ణలు సంతోషించారు.
వారం రోజుల్లో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయించాడు కొండల్రావు. మళ్లీ రఘుపతి ద్వారానే ఫోన్‌లో చెప్పించారు. కొత్త రక్తమెక్కించినట్టు కొండల్రావు హుషారైనాడు. ఫోన్‌లో తానే మాట్లాడ్తున్నాడు. మాధవి తండ్రి మహదానందం వ్యక్తం చేస్తూ ‘వెరీగుడ్ బావగారూ! రేపే మీరు సకుటుంబ సమేతముగా మా ఇంటికొచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి. ఇక్కడే పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం. రఘుపతిని వెంట తీసుకురావాలి సుమా’ హర్షం వెలిబుచ్చాడు.
రాధాకృష్ణ పక్కకు వెళ్లి మాధవికి ఫోన్ చేసి శుభవార్త అందజేసి ‘ఇదంతా నీ ప్లానే మాధవీ! నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నాను.’ ముద్దుగా చెప్పేశాడు.
మాధవి ఒళ్లు పులకించింది’ నేను గూడా డిటో!’ అని గలా గలా నవ్వింది. ఆ నవ్వులో మంజీరా తరంగాల ధ్వని వుంది. తిరిగి వచ్చి రాధాకృష్ణ తండ్రి పక్కన కూచుని రఘుపతికి సైగచేశాడు.
అప్పటిదాకా కక్కలేక, మింగలేక నిజాన్ని అంతరాళాల్లో అదిమిపెట్టిన రఘుపతి మొహం వికసించింది. ‘ఒరేయ్! కొండల్రావు! నీకు తెలీదు గానీ మన రాధాకృష్ణ, ఆ మాధవి హైదరాబాద్‌లో చదువుకునేప్పుడే ప్రేమించుకున్నారట్రా! నువు కాదన్నా ఈ పెండ్లి జరిగేది. కానీ నీ బుర్ర బూజు దులిపేందుకు, ఇంటి వాతావరణాన్ని నీతోనే బాగు చేయించేందుకు ఇదంతా చెయ్యాల్సి వచ్చిందిరా!’ ఆనందంగా చెప్పాడు.
కొండల్రావు కొడుకునూ, రఘుపతిలను తేరిపార జూచి ‘ఏదైతేనేం.. మా ఇల్లు బాగైంది. నా కొడుక్కు పెళ్లవుతోంది’ అంటూ మురిసిపోయాడు.

- ఐతా చంద్రయ్య, సిద్ధిపేట
సెల్.నం. 9391205299

సామల సదాశివ రాష్టస్థ్రాయి సాహితీ పురస్కారానికి
ఎంట్రీలు ఆహ్వానం
రాష్టస్థ్రాయి సామల సదాశివ స్మారక సాహితీ పురస్కారానికి తెలంగాణ కవుల నుండి ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ కళావేదిక అధ్యక్షులు, పురస్కార కమిటీ కన్వీనర్ అనుముల దయాకర్, కో-కన్వీనర్ దాస్యం సేనాధిపతి ఒక ప్రకటనలో తెలిపారు. 2012-2015 మధ్య ప్రచురితమైన తమ కవితా సంపుటాలను నాలుగు ప్రతుల చొప్పున అనుముల దయాకర్, 10-1-181, రాంనగర్, కరీంనగర్ - 505 001 చిరునామాకు ఫిబ్రవరి 10వ తేదీలోగా పంపాలని కోరారు. పురస్కారం కింద ఐదువేల రూపాయల నగదు, ప్రశంసాపత్రం, శాలువతో ఆదిలాబాద్‌లో జరిగే సభలో విజేతను సత్కరించడం జరుగుతుందని వివరించారు. వివరాలకు 8886623533 ఫోన్ నెంబర్‌లో సంప్రదించగలరు.

మనోగీతికలు

గవాక్షం
సూర్యుని వెలుగునీ, వేడినీ అందిస్తూ
చల్లని సమీరాల హాయిని ప్రసాదిస్తూ
వెనె్నల కాంతులను వెదజల్లుతూ
మంచు బిందువులను ప్రసరింపజేస్తూ
వాన తుంపర్లతో తడుపుతూ..
సంధ్యారుణాలతో నిండిన
ఆకాశాన్ని చూపిస్తూ
కనులకు విందుజేస్తావు!
పక్షుల కిలకిలారావాలను
కోకిల గీతాలను
వీనుల విందుగా వినిపిస్తావు!
చల్లని శశిని చూసి
మైమరిపిస్తావు!
మాయా తెరవై నిలిచి..
మానవాళి అలరిస్తావు!
నీ రెక్కలు తెరిస్తే..
ఎంతటి ప్రపంచాన్ని చూపగలవో
నీ రెక్కలు మూస్తే..
ఇంటినీ, మనసునీ
చీకటి చేయగలవు!
మనిషికి అక్షువెంత ముఖ్యమో..
ప్రతి గృహానికి
గవాక్షమూ అంతే ముఖ్యం!!

- పోపూరి మాధవీలత,
కరీంనగర్
సెల్.నం.8125115667

ఎన్‌ఎస్‌ఎస్
శిబిర గీతం!
కాదిది కాదిది
మామూలు శిబిరం
అవునిది అవునిది
విద్యార్థులకు వరం!
వారం రోజుల సంబరం
ఏనాటిదో ఈ బంధం
ఈ ఊరు శిబిరంతో కుదిరింది
ఈ ఊరు శిబిరంలో పెరిగింది!
సమాజ సేవతో వ్యక్తిత్వ వికాసం
అదే అదే ఎన్‌ఎస్‌ఎస్ ధ్యేయం
పలుగూ పారా పడదాం
శ్రమదానం చేయ కదులుదాం!
పెద్దల మాటలు విందాం
మేధోమథనం చేద్దాం..
ఇంటింటికీ వెళదాం
సమస్యలకు పరిష్కారం చూపుదాం!
సేవ చేసేది కొందరేరా
అడిగేది మాత్రం అందరురా
ఇది జగమెరిగిన సత్యం రా
నీవంతు శ్రమిస్తూ ముందుకు సాగరా!
జాతీయ సేవా పథకం
దేశ ప్రగతికి తలమానికం
రుషుల్లా కృషిచేద్దాం అందరం
పల్లెలకు మెరుగులు అద్దుదాం!

- డా. టి.సంపత్ కుమార్
నిర్మల్
సెల్.నం.09810402895

జై జవాన్
అతడు
శాంతి చుక్కలను భుజానెత్తుకుని..
కాంతి రేఖల కుసుమమై
దేశ రక్షణకు దేశం అర్పణంటూ
సరిహద్దుల్లో..
పహారా కాస్తాడు!
నిస్వార్థానికి..
తాను నిలువెత్తు నిదర్శనమై..
అలికిడి లేని రెక్కల గొడుగౌతాడు!
స్వప్నించిన కలల సౌధాలపై..
అనుక్షణం సంఘర్షణ పడుతూ
రాత్రి, పగలు సేవలందించే
అవిశ్రాంత శ్రామికుడు!
అతడే మన సైనికుడు!
పుడమి తల్లిని..
కాపాడ తన ప్రాణాలను
ఘనంగా పెట్టే..
సైనికుడికి..
మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం?
‘జై జవాన్’ అని
వందనం సమర్పించడం తప్ప!

- వజ్జీరు ప్రదీప్
వరంగల్ జిల్లా
సెల్.నం.9989562991

జీవన సౌరభం
మనుషులు
మరబొమ్మలవుతుంటే..
మమతానుబంధాలకు తావెక్కడ?
స్వార్థమే పరమార్థమవుతుంటే..
సంబంధ బాంధవ్యాలకు చోటెక్కడ?
అవినీతి, బంధుప్రీతి రాజ్యమేలుతుంటే..
అమాయకులకు స్థానమెక్కడ?
జాలి, దయ, కరుణ
కనుమరుగవుతుంటే..
క్షామాలకు కాక..కలిమికి తావెక్కడ?
మానవ సంబంధాలన్నీ..
‘మనీ’ సంబంధాలవుతుంటే..
మనిషి మనుగడకు చోటెక్కడ?
ఇకనైనా..
మమతానుబంధాలు
మానవత్వ పరిమళాలతో గుబాళించాలి!
జీవన సౌరభ నిర్మాణానికి
పునాదులేస్తూ పునీతులు కావాలి

- శిష్టా మాధవి, భాగ్యనగర్
సెల్.నం.7382183258

జీవితం!
జీవితమంటే..
ఓ ఆశావలయం
ఓ రంగుల కల
ఓ మధుర గీతం
ఓ విషాద గీతం
ఓ మలయ మారుతం
ఓ పెనుతుఫాను
శుక్ల కృష్ణ పక్షాలు
ఊహించని మలుపులు
ఊపిరి సల్పని ఆలోచనలు
ఎనె్నన్నో మజిలీలు
కష్టనష్టాల సమ్మిళితం!
సుఖ దుఃఖాల సంభరితం
ఆరాటాలు.. వ్యర్థ పోరాటాలు
తుదిశ్వాస ఆగిన వేళ
ఓ మూడు దినాల శోకముద్ర..!?

- కొడుకుల సూర్య సుబ్రమణ్యం, జగిత్యాల
సెల్.నం.9492457262
email : merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

- పెనుగొండ బసవేశ్వర్