ఉత్తర తెలంగాణ

స్మార్ట్ ఫ్రెండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటి ఆశలతో మెట్టింట అడుగుపెట్టిన స్వప్నకు, అందరి ఆప్యాయతల మధ్య అత్తారిల్లు పొదరిల్లులా తోచింది. ఇంతలో ఉద్యోగరీత్యా బెంగుళూర్‌లో కాపురం పెట్టాల్సివచ్చింది. ప్రేమించే భర్త నీడలో జీవితం సాఫీగా సాగుతుంది. స్వప్న భర్త అనీల్ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రొద్దున తొమ్మిది గంటలకు ఆఫీస్‌కి వెళ్తాడు. తిరిగి వచ్చేసరికి రాత్రి ఎనిమిదవుతుంది. పగలంతా స్వప్న ఇంట్లో ఒక్కతే ఉండాల్సిరావడంతో..స్వప్నకు తన జీవితంలో ఏదో వెలికి ప్రవేశించిందన్న ఆలోచనమొదలైంది. ఇంతలో ‘స్వప్నా’ అంటూ అనీల్ పిలిచాడు. ‘ఆ’ అంటూ హాల్‌లోకి వెళ్లింది స్వప్న.
‘స్వప్నా పగలంతా ఒంటరిగా ఉంటున్నావుగా నీకు కాలక్షేపంగా ఉంటుందని ఈ స్మార్ట్ ఫ్రెండ్‌ను నీకు పరిచయం చేయాలని తీసుకొచ్చాను’. అన్నాడు అనీల్.
స్వప్న మనసంతా సంతోషంతో నిండిపోయింది!
స్వప్న కొత్తఫ్రెండ్, ఎప్పుడూ స్వప్నతోనే ఉంటూ, ఆమె ఆశలు ఆశయాలను గౌరవించడంతో వారి బంధం చాలా బలపడింది. ఎప్పుడూ తన ఆలోచనలు, జ్ఞాపకాలే స్వప్న జీవితంగా మారాయి! ఇప్పుడు స్వప్నకు భర్తను చూసుకోవడానికి కూడా తీరికలేదేమో ఇంతలో అనీల్ వచ్చాడు.
‘స్వప్న ఏంటిది వంట కూడా సరిగా చేయట్లేదు, ఈ మధ్య నన్ను చాలా అశ్రద్ధ చేస్తున్నావ్’ అంటూ కేకలేసాడు. స్వప్న ఏమీ మాట్లాడలేదు. అలాగే చూస్తూ నిలబడిపోయింది. అనీల్ చిరాగ్గా గదిలోకి వెళ్లాడు.
స్వప్నకు తన ప్రవర్తన అనీల్‌కు నచ్చట్లేదని తెలుసు, అయినా ఆమె జీవితంలో తన భర్తతో కన్నా ఎక్కువ సమయం తన ఫ్రెండ్‌తోనే ఏకాంతంగా గడపాలనుకుంటుంది. ఈ విషయంగానే స్వప్నకి, అనీల్‌కు మధ్య గొడవవుతుంది.
ఇంతలో హల్లో..
ఫోన్ రింగవుతూ ఉంది. స్వప్న ఫోన్ ఎత్తి ‘హలో’
అనగానే ‘ఎలా ఉన్నావమ్మా’ అంటూ స్వప్నవాల్ల నాన్నగారు పలకరించారు.
‘బాగున్నాను నాన్న మీరెలా ఉన్నారు’ అంది బాగున్నానమ్మా! ఏంటమ్మా చాలా సేపట్నించి ఫోన్ చేస్తున్నాను లిఫ్ట్ చెయ్యవేంటి?
‘ఆ’ గేమ్ ఆడుతున్నా నాన్నా’
‘గేమా ఎవరితో’
‘నా ఫ్రెండ్‌తో నాన్నా’
‘ఏంటి స్వప్న ఇలా మారిపోయావు. అమ్మా, నాన్న, బంధువులందరినీ మర్చిపోయావు. చివరికి అల్లుడిని కూడా పట్టించుకోవట్లేవంట చూడు స్వప్న నీవు నీ ఫ్రెండ్‌ను మర్చిపోవాలి ఏమంటావమ్మా?
‘లేదు నాన్నా నేను నా ఫ్రెండ్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను’.
‘మా అందరిని మర్చిపోయేంత గొప్పతనం ఏముందమ్మా నీ ఫ్రెండ్‌లో?
‘నన్ను ఎవరు పలిచినా నా ఫ్రెండ్ మొహం వెలిగిపోతుంది. కేకేసి మరీ నన్ను పిలిచి, పట్టించుకోపోతే గోల గోల చేసే అలాంటి ఫ్రెండ్‌ను మరిచిపోవడం అన్న ఊహకూడా భరించలేను నాన్నా’ అంటూ ఫోన్ పెట్టేసింది స్వప్న.
స్వప్న స్నేహితులు కూడా స్వప్నను మార్చాలని చూశారు. కానీ లాభం లేకుండా పోయింది. స్వప్న ఎప్పుడూ తన ఫ్రెండ్ గురించే ఆలోచిస్తుంది. ఎందుకలా? అనడిగితే ఇలా చెబుతుంది.
‘నా ఆత్మీయులందరిని నా కళ్లముందుకు తెస్తూ, వాళ్లతో నన్ను మాట్లాడిస్తూ, కమ్మని సంగీతంతో నన్నలరిస్తూ, ఒంటరిగా ప్రయాణం చేసేప్పుడు నాకు రక్షణగా ఉంటూ నా కోసం ఎన్నో చేసే నా ఫ్రెండ్‌కు దూరం కాలేక జీవితాన్ని మానవసంబంధాలను సరిగా వాడుకోలేక ఇబ్బందిపడుతున్నాను. ఇది సరికాదు అని తెలిసినా.. నా ఫ్రెండ్‌ను దూరం చేసుకోలేక పోతున్నాను’ అని చెప్పింది. అసలు దీనంతటికి కారణం ఏమిటంటే స్వప్న ఫ్రెండ్ చాలా స్మార్ట్. వాట్సప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి ఎన్నో ఆప్స్ దానిలో ఉన్నాయి మరి..!

- ఎన్. హరిప్రియా గిరిధర్ రావు
కరీంనగర్
సెల్.నం.9133293384

బాలల కథ

విశ్వాసం

ఆరోజు ఆదివారం కావడంతో పార్కు అంతా పిల్లల కేరింతలు, ఆటపాటలతో ఎంతో సందడిగా ఉంది. తండ్రితో కలిసి పార్కుకు వచ్చిన రాజేష్ తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఆటల్లో పిల్లలకు సమయం తెలియదు కదా! సాయంత్రం ఆరు గంటలు దాటింది. ఆడి ఆడీ అలసిపోయిన రాజేష్ తండ్రి దగ్గరకు వచ్చి ‘నాన్నా..! ఆట అయిపోయింది, ఇక ఇంటికి పోదామా?’ అన్నాడు.
‘సరే! పద’ అంటూ కొడుకుతో సహా స్కూటర్ దగ్గరకు చేరుకున్నాడు శేఖర్. పార్కు ఇంటికి దగ్గరే అయినా కొడుకును స్కూటర్‌పైనే తీసుకొచ్చాడు. వాళ్లిద్దరూ స్కూటర్ దగ్గరకు చేరేసరికి చిన్న కుక్కపిల్ల ఒకటి దాని చుట్టూ తిరుగుతూ, అక్కడే తచ్చాడుతోంది. అది చూడటానికి తెల్లగా, ముద్దుగా ఉంది. దాన్ని చూసిన రాజేష్ ఆనందానికి అవధుల్లేవు. ఎందుకంటే రాజేష్‌కు కుక్కపిల్లలంటే చాలా ఇష్టం. దాన్ని చూస్తూనే ‘నాన్నా! నాన్నా..! ఈ కుక్కపిల్లని మనం ఇంటికి తీసుకుపోదాం. ఎంత ముద్దుగా ఉన్నదోకదా!’ అన్నాడు.
‘తప్పురా! అది చాలా చిన్నపిల్ల. వాళ్లమ్మ నుంచి దూరంగా తీసుకుపోతే ఉంటుందా? చెప్పు! అమ్మను వదిలిపెట్టి నువ్వుంటావా?’ వద్దంటూ సున్నితంగా చెప్పాడు శేఖర్.
‘అమ్మో! నేనుండలేను’ అన్నాడు రాజేష్.
‘మరయితే అదికూడా అంతే కదా!’ అన్నాడు శేఖర్.
‘సరే!’ అంటూ దానికి తన దగ్గరున్న రెండు బిస్కెట్లు పెట్టాడు రాజేష్. ఆ కుక్కపిల్ల వాటిని గబగబా తినేసింది. అది చూసిన రాజేష్ ఆనందంతో దానికి మరో రెండు బిస్కట్లు పెట్టి తండ్రితో కలిసి ఇంటికి చేరాడు.
తీరా ఇంటిదగ్గర స్కూటర్ దిగేసరికి వాళ్లకు కనబడేంత దూరంలో కుక్కపిల్ల పరిగెత్తుకొస్తూ కనిపించింది. దాన్ని చూసిన రాజేష్ ఆనందం పట్టలేక ‘నాన్నా.. అదిగో! అటు చూడు. ఆ కుక్కపిల్ల మనతో వచ్చేసింది’ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి, దాన్ని రెండు చేతులతో ఎత్తుకొని ఇంట్లోకి తీసుకొచ్చాడు.
వాళ్లు రావడం చూసిన రాధ రాజేష్ చేతుల్లోని కుక్కపిల్లను చూసింది. ‘దీన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు’ అడిగింది కొడుకుని.
రాజేష్ పార్క్ దగ్గరి జరిగిందంతా తల్లికి చెప్పాడు.
‘పాపం! దానికి ఎవ్వరూ లేరమ్మా. మా వెనకాలే అది మనింటికి వచ్చేసింది. దీన్ని మనం పెంచుకుందామమ్మా!’ అని గోముగా అడిగాడు.
‘సరే కానీ!.. వద్దన్నా నువ్వు వినవుగా’ అన్నది రాధ.
తల్లి ఒప్పుకోవటంతో రాజేష్‌కు ఎక్కడలేని సంతోషం అనిపించింది.
ఆరోజు నుంచి వాడికి దానితోడిదే లోకం అయింది. దానికి ‘ప్రిన్స్’ అని పేరు పెట్టాడు. స్కూలుకు వెళ్లే సమయం తప్ప ఆ కుక్కపిల్లతోనే ఆటా, పాటా.. అన్నీ. ప్రిన్స్ కూడా రాజేష్ ఇంట్లో ఉంటే క్షణం వదిలిపెట్టేది కాదు.
రాజేష్ స్కూలుకు వెళ్లేటప్పుడు అది గేటుదాకా రావాల్సిందే. మళ్లీ స్కూలు నుండి వచ్చేటప్పటికి సాయంత్రానికి గేటు దగ్గరే ఎదురుచూస్తూ ఉండేది. రాజేష్ రాగానే కాళ్లకు చుట్టుకుని ‘కుయ్యో.. కుయ్యో’మంటూ వాడి చుట్టూ తిరిగి గోలచేసేది.
రాజేష్ కూడా దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. తనతో పాటు బిస్కెట్లు, పాలు, అన్నింటిలో దానికి వాటా ఇచ్చేవాడు. దానితోనే ఆడుకునేవాడు. అదికూడా రాజేష్‌ను క్షణం కూడా వదిలేది కాదు. రాజేష్ గదిలోనే ఒక మూలన పడుకునేది. రాజేష్ చిన్ని ప్రపంచంలో ఆ కుక్కపిల్ల విడదీయరాని నేస్తమయింది.
ఇలా కాలం గడుస్తుండగా ఒకరోజు స్కూల్లో ఆడుకుంటూ రాజేష్ కిందపడ్డాడు. ఒళ్లంతా మట్టి. మోచేతులు, మోకాళ్లు కొట్టుకుపోయి నెత్తుటి చారికలతో ఇంటికి వచ్చాడు.
అలా వచ్చిన రాజేష్‌ను చూసి రాధ చాలా కంగారుపడిపోయింది. జరిగిన విషయాన్ని ఆతృతగా కొడుకు ద్వారా తెలుసుకుంది. జరిగినదానికి చాలా బాధపడింది.
రాజేష్ అలా రావటానికి కారణం తెలియని ప్రిన్స్, ఏమి జరిగిందో అర్థంకాక అతని చుట్టూ తిరుగుతూ పదేపదే అరవసాగింది. దానికళ్ల వెంట నీళ్లు కారుతున్నాయి.
ఆరోజు సాయంకాలానికి రాజేష్‌కు ఒళ్లు వెచ్చబడింది. శేఖర్, రాధ పిల్లవాడిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు.
డాక్టర్ పరీక్షించి మందులిచ్చారు. రెండు రోజుల్లో జ్వరం తగ్గుతుంది, విశ్రాంతి అవసరమని అన్నారు.
వాళ్లు ఇంటికి వచ్చేటప్పటికి ప్రిన్స్ గుమ్మంలోనే ఉంది. రాగానే వాళ్ల చుట్టూ తిరుగుతూ అరవసాగింది. రాజేష్ చేతుల్లోకి తీసుకోగానే అరుపులు మానేసి ఒద్దికగా కూచుంది.
రాజేష్‌కి ఆరోజు వచ్చిన జ్వరం రెండు రోజులదాకా తగ్గలేదు. ఆ రెండు రోజులు ప్రిన్స్ తిండి కూడా మానేసి రాజేష్ మంచం పక్కనే కదలకుండా కూర్చుంది.
మూడోరోజుకు జ్వరం తగ్గిన రాజేష్ మంచం మీద నుంచి లేచి టిఫిన్ తిని, పాలు తాగాడు. తరువాత ప్రిన్స్‌కు పాలుపోశాడు. తోకాడించుకుంటూ వచ్చి పాలు తాగిన ప్రిన్స్ ఇల్లంతా ఆనందంతో గంతులు వేసింది.
దాని పరుగులు, సంబరం చూసిన రాధ, శేఖర్ కూడా ఎంతో సంతోషించారు.
మళ్లీ రాజేష్, ప్రిన్స్ పూర్వంలాగానే ఇల్లంతా సందడి చేస్తున్నారు. వాళ్ల ఆటపాటలతో ఇల్లంతా గంతులేస్తున్నారు.
ఒకరోజు రాత్రి రాజేష్ తండ్రి దగ్గర పడుకున్నాడు. శేఖర్ అతనితో ఏవో మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ ‘రాజేష్.. చూశావా! నీకు జ్వరం వచ్చిన రెండు రోజులు ప్రిన్స్ కూడా ఏమీ తినలేదు పాపం. దిగులుగా నీ మంచం పక్కనే కూచుంది. నీకు జ్వరం తగ్గి నువు లేవంగానే దాని ఉత్సాహం రెట్టింపయ్యింది కదూ!’ అన్నాడు.
‘అవును నాన్నా!’ అన్నాడు రాజేష్.
ఆరోజు నువ్వు పార్కులో దానికి రెండు బిస్కెట్లు పెట్టి ఆకలి తీర్చావు. దానితో అది నీ వెంట మనింటికి వచ్చి మనతో కలిసిపోయింది. నీ పట్ల ఎంత స్నేహంగా ఉంటోందో చూడు!’ అన్నాడు శేఖర్.
‘అవును’ అన్నాడు రాజేష్.
నీకు బాగోలేక నువ్వు తినకపోతే అది నీతోపాటు పస్తుంది. ఎవరైనా మనకు హాని చెయ్యబోయినా మనల్ని రక్షిస్తోంది. అందుకే కుక్క విశ్వాసం కలిగిన జంతువని అంటారు. కుక్కకున్న విశ్వాసం సృష్టిలో ఏ జీవికీ లేదని పెద్దలంటారు’ చెప్పాడు శేఖర్.
‘నిజమే నాన్నా! మనం కూడా మనకు సాయపడిన వారిపట్ల స్నేహభావంతో మెలగటంతోనే మన గొప్పతనం తెలుస్తుంది కదా!’.. ఒక ఆదర్శమేదో అర్థమైనవాడిలా సమాధానమిచ్చాడు రాజేష్.

- డా.మైలవరపు లలితకుమారి,
చరవాణి: 99595 10422

పుస్తక సమీక్ష

సాదాసీదాగా రూపుదిద్దుకున్న ‘రుబారుూలు’!

పేజీలు : 63 వెల : 60/-
ప్రతులకు: శివలీల
ఇం.నం.42-110-6/జి
ఐజయ్యనగర్ కాలనీ
వనపర్తి-509103
మహబూబ్‌నగర్ జిల్లా
సెల్.నం.9640407103
కవి ‘మరికంటి’ కలం నుండి జాలువారిన రుబారుూలు ఆయన పరిశీలనా పటిమను చాటేలా రూపుదిద్దుకున్నాయి. వృత్తిరీత్యా గ్రామీణ వికాస బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్న ‘మరికంటి’ రచనా వ్యాసాంగాన్ని ప్రవృత్తిగా మలుచుకున్నారు. లోగడ ఆయన వెలువరించిన దశావతారాల ఆధారిత ‘పొడుపు కవితలు’ చిన్నారులతో పాటు అన్ని వయసుల పాఠకులను ఆకట్టుకున్నాయి. గత రెండు దశాబ్ధాలుగా సాహితీ సృజన చేస్తున్న ఆయన ‘నూట పదహారు రుబారుూలు’ పేరుతో ఇప్పుడు ఒక గ్రంథాన్ని ప్రకటించారు. జీవన సత్యాలను రుబారుూల్లో బంధించారు. కొంత వ్యంగ్యం మరి కొంత చమత్కారాన్ని జోడించి కవి ‘మరికంటి’ ఆవిష్కరించిన రుబారుూలు సామాజిక చైతన్యానికి దోహదపడేలా ఉన్నాయి. సమాజంలోని సమకాలీన అంశాలపై ఆయన కలాన్ని సంధించారు. ఈ రుబారుూలు మంచి మనసుతో ఏ కార్యమైనా మొదలుపెట్టాలని సూచిస్తాయి. అక్షరం దిద్దినట్లే బ్రతుకు దిద్దుకుంటే..పదునైన ఆయుధంలా జనంలో ఉన్నట్టేనని తేల్చి చెబుతాయి. చీకటి మురిసిన చోట కిరణం కావాలనీ..ఆకలి విసిరిన పూట అనాథల మెతుకు అవ్వాలని ఇందలి రుబారుూలు హితవు పలుకుతాయి. కష్ట, నష్టాల బాధలు తెలుసుకోవాలంటే.. నదిలో ఎన్నోసార్లు మునిగి తేలాల్సిందేనని విడమరిచి చెబుతాయి.
ఎండమావుల చూపి నీళ్లని చెప్పే పాలకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వివరిస్తాయి.
ఆగని ప్రతిక్షణం తరిమి తరిమి కొడితే..గాయపడ్డ హృదయం గేయమై తీరుతుందనీ.. ఆకలి గొన్నప్పుడే అన్నం విలువ తెలుస్తుందనీ మరియు దేహాన్ని, దేశాన్ని కాపాడుకుంటే బ్రతుకు కది చాలునని ఇందలి రుబారుూలు హితబోధ చేస్తాయి.
శిశిర మెంతగా కసిగా విసిరి కొట్టినా.. చిగురించడమే చైతన్యం చైత్రమని ఈ రుబారుూలు తెలియచెబుతాయి.
రుబారుూల్లో.. కవి ఎక్కువ భాగం రాజకీయ నాయకులపై తమ కలాన్ని ఎక్కుపెట్టారు. అలాగే అమ్మా నాన్నల ఔన్నత్యాన్ని చక్కగా ఆవిష్కరించారు.
కరుణ కలిగితే కురిసే మేఘం కురియదా? మధుర కలయికలో మురిసే స్నేహం మురియదా? తల్లి పంచిన పాలధార అమృతమయమైతే.. ఆ తీపి నీలో తళుక్కున ఓ సారి మెరియదా? అన్న పంక్తులు హాయిగా చదువుకోవడానికి యోగ్యంగా ఉన్నాయి.
ఇందలి రుబారుూల్లో ఇలా సాదా సీదా పదబంధాలతో మానవ సంబంధాలను.. ప్రజా ప్రతినిధుల సరిగమల్ని.. సమాజంలోని రుగ్మతలను ప్రతిబింబింపజేశారు.
అధికారం ఉందని వాడు దొరికిందంతా కాజేశాడని.. ప్రజల సొమ్ము తనదన్నట్లు దొంగోడు మింగేశాడనీ.. బాధ్యత ఎవరికిస్తే భద్రంగా ఉంటుందేమో గానీ.. నీతి లేనోడు పేదల రక్తాన్ని మద్యంలా తాగేశాడని ప్రజాప్రతినిధులపై కవి ‘మరికంటి’ తమ కలాన్ని ఝుళిపించారు.
రుబారుూలకు అవసరమైన ఛాయా చిత్రాలను సమకూర్చడంలో ఇంకా శ్రద్ధ చూపితే బాగుండేది! పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఆర్థిక సహాయంతో వెలువడిన ఈ గ్రంథం సీదా సాదా రచనలతో ముస్తాబై రావడం పాఠకులకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించేదే అయనా.. కవి ‘మరికంటి’ సామాజిక బాధ్యతను అభినందించకుండా ఉండలేరు. దేన్ని పడితే దాన్ని రుబారుూలుగా రూపుదిద్దకుండా.. వస్తు ఎంపికలో ఇంకా శ్రద్ధ చూపితే బాగుండునన్న భావన పాఠకుల్లో కలిగే అవకాశం వుంది. సూక్తులు, సామెతలు, నినాదాలు, కొటేషన్ల రూపంలో కాకుండా.. చక్కని కవిత్వాంశతో తమ భావాలకు అక్షర సొబగులు అద్దితే బాగుండేది! ‘రెండో’ రుబారుూలు మళ్లీ ‘పది’లో రిపీట్ అయ్యింది. అక్కడక్కడా అక్షర దోషాలున్నాయి.
కవి ‘మరికంటి’ గారు ఓ మంచి వచనా కవితా సంపుటితో మన ముందుకు రావాలని కోరుకుందాం.

- సాన్వి, కరీంనగర్
సెల్.నం.9440525544

మనోగీతికలు

రివర్స్
బంధాలు, అనుబంధాలు
శాశ్వతం కాదనే భగవద్గీత బోధ
అలావుంచుదాం!
ఏది శాశ్వతం, ఏది అశ్వాశతం
ప్రపంచీకరణ మోజుతో
వ్యాఖ్యానం అక్కర్లేదు
ఆనందాన్ని అనుభవిద్దాం
అందాన్ని జుర్రుకుందాం
ఎవరికి ఎవరు?
ఇప్పుడు పనిచేస్తుంది తత్వం కాదు
పచ్చనోటు
ప్రేమానురాగాలు వ్యాపారమయిన వేళ...
ఎవరి కన్నీరు ఎవరు తుడుస్తారు
అంతా వట్టిదే!
మమతలు కరుణలు
మసక బారుతున్న వేళ..
ఎవరి భయాన్ని ఎవరు పోగొడుతారు
అంతా వట్టిదే..!
ప్రేమ లేనిచోట
జీవితం వ్యర్థంగా మారుతుందనే
సత్యాన్ని మరిచిపోయిన వేళ..
దేవుని ప్రేమ కోసం దీపాన్ని పెడుతాం!
రెండు చేతులు జోడిస్తాం
ఇదెక్కడి చోద్యం?

- సిహెచ్.మధు, నిజామాబాద్
సెల్.నం.9949486122

శుభం భూయాత్!
ఒకదానిని మించిన మరొకటికి
ప్రకృతి పురుడు బోస్తుంది
ఆద్యంతాలు
అంతుచిక్కని అవగాహనారహితాలు
వజ్రం అన్నింటికన్నా గట్టి పదార్థం
అయినా..లేజర్ కిరణం ముందు
దాని గట్టితనమెంత?
కూలే వరకే గోడ
పగిలే వరకే పర్వతం
ఎగిరే వరకే ఆకాశం
తెలిసే వరకే రహస్యం
ఏదైనా..
ఎప్పటికీ కాదు అభేద్యం!
హద్దులు చెరుగొచ్చు
విశ్వం అనంతమైనా
సాధనతోనే ఛేదన
చిక్కేది చిటికెడంత
తెలిసేది గోరంత
మిగిలేది కొండంత
తాడిదనే్న వాడి
తలదనే్న వాడిని వెతుకు!
శుభం భూయాత్!

- ఆచార్య కడారు వీరారెడ్డి
సెల్.నం.7893366363

గుణ సంపన్నులు
వలపు మలుపుల కాలగమనానికి
మానవ గతి తార్కికం
మాధవుని లీలా వినోదం
కుంటి, గుడ్డి, చెవిటి, మూగ
అవిటిని అధిగమించిన ఆత్మవిశ్వాసం..
అంగవైకల్య భేదనకు పాశుపతాస్త్రం
చెయ్యి లేకుంటే చేష్టలుడుగవు
చైతన్యం చేయూతనందిస్తుంది
కాలు ఉనికి కరువైతే
కలియుగం శూన్యం కాదు,
ఆత్మబలం అంగలేయిస్తుంది
సుధాచంద్రన్ నాట్యమయూరిలా
నేత్రాలు కనుమరుగైతే
మనో నేత్రాలు కలహంసలు
ఒంటికన్ను శుక్రాచార్యుడు
ఉరికించలేదా సురలను?
పుట్టి గుడ్డి సూరదాసు
పొడవలేదా సాహిత్య సూర్యుడై...
గళం ముకుళించిన దేవులపల్లి కలం
కురుపించ లేదా కవితామృతాన్ని!
శరీరాంగాలు చప్పబడినా
మానసిక పరిపూర్ణతకు
శాస్తజ్ఞ్రులు సాధికారులు
వికలాంగుల వినోద ప్రదర్శనలు
సకలాంగుల అలరింపులు
అందుకే
వికలాంగులు సకలగుణ సంపన్నులు

- ఐతా చంద్రయ్య
సిద్ధిపేట, మెదక్ జిల్లా
సెల్.నం.9391205299

రైతన్న
దుఃఖాన్ని దుక్కిగా దున్ని
స్వేదాన్ని నీళ్లుగా పోసి
సేద్యము చేద్దామంటే..
కన్నీటి కష్టాలు కడగండ్ల వానలాయే!
అవి వరదలై పారె..
ఏడాది కష్టమంతా ఏటిపాలాయే!
పరిగె పంటదీసి
ప్రాణం నిలుపుకుందామంటే..
పాపిష్టి పురుగు పంటంతా మేసే!
మిగిలిన ధాన్యాలైన
నా పొట్టకోసం వాడుదామంటే
అప్పులోడొచ్చి అత్తెసరడిగే
మిత్తిపైసలకని ఆలిపుస్తెలమ్మినగానీ
దళారి మోసం దండిగా దోచుకునే
దక్షిణకు కూడ దమ్మిడి మిగులకపాయే!
కడుపునిండని బతుకు కానలకాయే
ఆకలి తీరని ఈ రైతన్న
కడుపెండుకు పాయే!

- హనుమాండ్ల రమాదేవి
బెల్లంపల్లి, ఆదిలాబాద్ జిల్లా
సెల్.నం.9959835745

నా కవితా వస్తువు!
అన్నార్తుల ఆక్రందనల్లో
అభాగ్యుల దీనాలాపనల్లో
విధివించితుల పగిలిన
హృదయ ఫలకాల ఖండాల్లో
మోసపోయిన మనుజగణాల
భావజాలపు గుడ్డి చీకట్లలో
న్యాయం జరగక ధర్మం కానక
దారీతెన్నూ దొరకక
దిక్కుతోచక గతితప్పిన
నావాళ్ల గుండె చప్పుళ్లలో
వంచనపాలై వెట్టి చాకిరీతో
వెన్ను విరిగిన ప్రజానీకపు మూల్గుల్లో
తడియారిన హృదయ పొరల్లో
గాలించకుండానే
కంటబడింది నా కవితా వస్తువు!!

- కొడుకుల వేంకట గౌతమి
జగిత్యాల
సెల్.నం.9490210851

నిండు చంద్రుడు
నా కలల కౌముదిలో నీవు
చిన్న పిల్లాడిలా గంతులేశావు
నా ఆశల తేజస్సులో నీవు
వెలిగే సూర్యుడిలా ప్రకాశించావు!
నా కనురెప్ప కంటిన కాటుకలో నీవు
అందానివై తరించేశావు
నా దరహాసమనే పుప్పొడిలో నీవు
తూనిగవై ప్రేమ తేనెలు జుర్రేశావు
నా జీవిత గమ్యంలో నీవు
నిండు చంద్రుడివై యవ్వాన
సామ్రాజ్యాన్ని ఏలుకో..
వెలిగే ఈ జన్మను తరింపజేశావు
ఇలా ఎన్ని జన్మలైనా..
నేను నిండు ఆకాశమవ్వాలి నీవు
చంద్రుడివవ్వాలి నిరంతరం..!

- చిందం సునీత, కోరుట్ల
సెల్.నం.9701075502

email : merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

- ఎన్. హరిప్రియా గిరిధర్ రావు