ఉత్తరాయణం

విదేశీ పెట్టుబడులతో విపరిణామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విదేశీ పెట్టుబడుల విషయమై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆలోచించాల్సినదే. సాధారణంగా తెలిసీ తెలియని వైద్యులు ఏ రోగానికైనా స్టెరాయిడ్‌లను ఎడాపెడా వాడేస్తారు. జ్వరమో, దగ్గో వచ్చిందనుకోండి, దాని కారకంబట్టే వైద్యం చెయ్యడం ద్వారా తగ్గుతుంది. అలాకాకుండా స్టెరాయిడ్స్ వాడేస్తే లక్షణాలు తగ్గినట్టు కనబడినా, లోపల రోగం ముదురుతూ పోతుంది. తాత్కాలిక ఉపశమనం కోసం, పరిధి మించి ప్రమాదకరంగా వాడబడుతున్న మందులేమైనా ఉన్నాయంటే అవి స్టెరాయిడ్లే. ఇప్పుడు విదేశీ పెట్టుబడుల వ్యవహారం కూడా ఇలాంటిదే. పరిమితిలో ఉపయోగించుకుంటే ప్రాణాలు కాపాడాల్సిన మందులు, పరిధి మించితే ముప్పు తెచ్చేవిగా తయారవుతాయి. ఎయిర్ ఇండియాలో 49 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడం తప్పనిసరి వ్యవహారం కావొచ్చు. ఎందుకంటే 50వేల కోట్ల రూపాయల అప్పుని మోస్తూ ఎగరడం కాదుకదా నడవడమే కష్టంగా మారిన ఆ సంస్థకి పైనుండి చేయూత అవసరమే. ప్రభుత్వ ఖజానాకి భారమైన ఆ సంస్థలో మదుపు పెట్టడానికి దేశీయ సంస్థలేవీ ఎటూ ముందుకు రావడం లేదు. పైగా ఇతర దేశీయ ఆకాశయాన సంస్థల్లో విదేశీ సంస్థలు 49 శాతం వాటాలు కలిగి ఉండడానికి ఎలాంటి అభ్యంతరాలూ లేనప్పుడు ఎయిర్ ఇండియాకి మాత్రం ఆ వెసులుబాటు ఎందుకు? అయితే ఆ సంస్థ ఆస్థుల్ని కాపాడడంలో మాత్రం ప్రభుత్వం అప్రమత్తత చూపాలి. రిటైల్ వర్తకంలో వందశాతం విదేశీ పెట్టుబడులకు ఎన్నడో దేశాన్ని సంసిద్ధం చేశారు. కానీ అందులో స్థానికులకు ఎంతోకొంత మేలు చేయగల ఆయా సంస్థలు తాము చేసే ‘30 శాతం కొనుగోళ్లు స్థానికంగానే జరపాలి’ అన్న నిబంధన ఎందుకు తొలగించాలి. దానిని అమలుపరచడానికి ఐదు సంవత్సరాల గడువెందుకు? తద్వారా కుదేలైన చిల్లర వర్తకానికి కల్పించే రక్షణ చర్యలేమిటి?
నిర్మాణ రంగంలో, పవర్ ఎక్స్ఛేంజీల్లో కూడా విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచారు. నోట్లరద్దు, ఏకీకృత పన్నుల వ్యవస్థ ద్వారా కుదేలైన రంగానికి ఈ రకంగా ఊతమిద్దామని ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్న నేపథ్యంలో ఈ ‘విదేశీ చికిత్స’ బాగానే కనపడొచ్చు. కొంత నిధుల ప్రవాహం జరిగి ఉపశమనం కనబడొచ్చు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మన దేశం మరింత మంచి ర్యాంకు పొందవచ్చు. అయితే దేశీయ ఆర్థికం స్వయంగా ఆరోగ్యకరం కావడం, ముందు దేశీయంగా సంస్థలు బలోపేతం కావడం, దెబ్బతిన్న, తినబోతున్న చిల్లర వ్యాపారులు రక్షణ పొందడం తదితర అంశాల్ని గమనంలోకి తీసుకోవాలి. అది మాత్రమే ముఖ్యం కావాలి.
-డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం