ఉత్తరాయణం

పన్ను పరిమితి పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రం బడ్జెట్ సమర్పించే సమయం వచ్చేస్తోంది. ఈసారైనా సీనియర్ సిటిజన్లకు ఆదాయపన్ను పరిమితిని పెంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నది ఆశ. కనీసం 75 సంవత్సరాలు దాటినవారికి ఆదాయ పన్ను పరిమితి కాస్తంత ఎక్కువగా ఉండాలి. ఆదాయం సముపార్జించే ఓపిక లేని వృద్ధులకు రోగాలు, వైద్యచికిత్స, ఔషధాల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. సాధారణ వస్తువుల ధరలూ బాగా పెరిగాయి. ఖర్చులు పెరిగినా ఆదాయం పెంచుకునే అవకాశం ఆ వయసులో ఉండదు. అందువల్ల ఆర్థికమంత్రి పెద్దల కష్టాలను గుర్తెరిగి బడ్జెట్‌లో రాయితీలు ప్రకటించాలి.
-ఎ.వి.సోమయాజులు, కాకినాడ
మనుస్మృతిపై నిరసన ఎందుకు?
కరీంనగర్‌లో ఇటీవల మనుస్మృతి ప్రతులను దగ్ధం చేశారు. హిందువుల మనోభావాలను గాయపరిచేందుకు, రెచ్చగొట్టేందుకు వామపక్ష భావజాలంగల విద్యార్థి సంఘాలు ఈ చర్యకు పాల్పడ్డాయి. అలా చేసే హక్కు వారికి ఎక్కడిది? మత విషయాలపై ఆగ్రహం వ్యక్తం చేసే హక్కు వారికి ఉందంటే మైనారిటీ మతస్థులకు చెందిన గ్రంథాలు బైబిల్, ఖురాన్‌ల జోలికి వెళ్లరెందుకో? వీరు చేసే దుర్మార్గపు చర్యలకు అంబేద్కర్ పేరును వాడుకోవడం ఎంతవరకు సబబు. కాలదోషంపట్టిన కమ్యూనిజాన్ని పట్టుకుని వేళ్లాడడంలో అర్థం లేదు.
-వేదుల జనార్దన్, వంకావారిగూడెం
సైన్సు దినోత్సవంపై సెమినార్ నిర్వహించాలి
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్సు దినోత్సవంగా పాటిస్తారు. ప్రఖ్యాత శాస్తవ్రేత్త సర్ సీవీరామన్ పరిశోధన సూత్రాలు, మార్గదర్శకతపై ఆ సందర్భంగా అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సెమినార్లు నిర్వహించాల్సిన అవసరం ఉది. విజ్ఞానశాస్త్రం ప్రాధ్యానతను వివరిస్తూ, దానిపట్ల వారికి మక్కువ కలిగేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది.
-కోవూరు వేంకటేశ్వర ప్రసాదు, కందుకూరు
చిన్నవయసులో డ్రైవింగ్ వద్దు
హైదరాబాద్ సహా అనేక ప్రాంతాలలో చిన్నపిల్లలు వాహనాలు నడుపుతున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు తప్పు చేస్తున్నారు. ముచ్చట కోసం, గొప్ప కోసం వారు అలా చేస్తున్నారు. అయితే ఆయా వాహనాలను నియంత్రించే శక్తి చిన్నవయసులో ఉండదు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ఉండదు. పైగా బాధ్యత తెలీని ఆ వయసులో పిల్లలు దుందుడుకుగా వ్యవహరిస్తారు. అందువల్ల ప్రమాదాలకు కారకులవుతున్నారు. అలా అర్హతలేని, చిన్న వయసులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులయ్యేవారి తల్లిదండ్రులపై చర్య తీసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి తప్పుచేసినవారిని దండించాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్