ఉత్తరాయణం

వాణిజ్య యుద్ధ మేఘాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వీయ రక్షణాత్మక విధానాలతో కృత్రిమంగా వాణిజ్య యుద్ధమేఘాలు రూపుదాల్చాయి. ఒక్కో దేశమూ తనకు నచ్చినా, నచ్చకపోయినా వాణిజ్య యుద్ధ క్రీడలోకి దూకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు భారత్ అమెరికా నుండి దిగుమతి అవుతున్న ఉక్కు, అల్యూమినియం తదితర వస్తువులపై సుంకాన్ని పెంచడం అలా తప్పనిసరి తద్దినంలో భాగమే. చైనా, యూరోపియన్ సమాఖ్య ఇలాంటి ప్రతిస్పందనని కాస్తా ముందుగానే చూపాల్సివచ్చింది. అమెరికా అధ్యక్షుడు తన ఎన్నికల ప్రచారంలోనే స్వీయ రక్షణాత్మక విధానాన్ని భావోద్వేగ సమస్యగా మార్చడంలో కృతకృత్యులై గెలిచారు. ఆ దేశం మిగతా దేశాల లబ్ధిప్రయత్నాల్లో బలిపశువుగా మారుతుందన్న తప్పుడు అభిప్రాయాన్ని తన ప్రజల్లో కల్పించారు. ఎన్నికల్లో గెలిచాక వాస్తవ స్థితిగతుల కనుగుణంగా, అంతర్జాతీయ నిబంధనల్ని గౌరవిస్తూ తమ లాభం చూసుకొంటే ఏ గొడవా ఉండనక్కరలేదు. కానీ అలా జరగడం లేదు. తన అవసరం ఉన్నంతవరకూ గ్లోబలీకరణ జపం జరిపి, హఠాత్తుగా రూటు మార్చి మిగతా దేశాల్ని దెబ్బకొట్టడమే అమెరికా మంత్రమై కూర్చొంది. ఈ ప్రమాదకర ధోరణి ఆ దేశం సహా అందరినీ నిలువునా ముంచేది. తాత్కాలికంగా ఆ దేశ ప్రజలకు ఇందులో లాభదాయకత కనిపించినా, దీర్ఘకాలికంగా వారి ఉత్పత్తులకు గిరాకీ తగ్గి నష్టమే జరుగుతుంది. ఎదుటివాడు గెలిచే సమయానికి ఆటముగిస్తాననడం నియమాలకు విరుద్ధం. ప్రపంచ వాణిజ్య సంస్థ ఈ కృత్రిమ వాణిజ్య యుద్ధాన్ని అరికట్టే దిశగా ప్రయత్నించాలి. అందరూ గెలవాలన్న దృక్పథం కాకుండా అందరూ మునగాలి అన్న దృక్పధంతో వ్యవహరిస్తోన్న అమెరికాను కట్టడిచెయ్యాలి. వరుస బ్యాంకు దోపిడీలు, కోలుకోని వ్యవసాయం, ఆర్థిక రంగాలతో ముందుకువెళ్తున్న భారత్ మరింత జాగ్రత్తగా తన వాణిజ్య, పన్నుల, ఆర్థికాభివృద్ధి విధానాల్ని రూపుదిద్దుకోవాలి. అంతర్జాతీయంగా ఉన్న అననుకూల పరిస్థితితో ఎక్కువ నష్టపోకుండా అప్రమత్తత పాటించాలి.
-డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

స్వదేశీ అణు రియాక్టర్ల నిర్మాణానికి నాంది
అమెరికా, రష్యా, చైనా, యూకే, ఫ్రాన్స్ వంటి అగ్రదేశాలు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని సాధ్యమైనంత మేరకు నిర్వీర్యం చేస్తున్నాయి. అణుశక్తిని శాంతి ప్రయోజనాలకు వినియోగించుకొనే ఆశయానికి కట్టుబడిన మన దేశం- ఆ ఒప్పందంపై ఎప్పటికీ సంతకం పెట్టేది లేదని 2016 జూలై 21న లోక్‌సభలో విదేశాంగ మంత్రి సుషమా స్వరాజ్ స్పష్టం చేసారు. ఇండియా, ఇజ్రాయల్, పాకిస్తాన్, నార్త్ కొరియాలు ఈ అణ్వస్తవ్య్రాప్తి నిషేధ ఒప్పందంపై సంతకాలు చేయలేదు. ప్రపంచంలోని 189 దేశాలు- అగ్రరాజ్యాల ఆధిపత్య అణునిరాయుధీకరణ అహంకార పెత్తనానికి తలలు వంచాయి.
1974 మేలో ఏర్పాటైన ‘అణు సరఫరాదారుల గ్రూప్’ సభ్యత్వాన్ని భారతదేశం ఆశిస్తోంది. అమెరికా, యుకె, ఫ్రాన్స్, రష్యా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి 15దేశాలు భారత్‌కు మద్దతు ప్రకటించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన అణ్వాయుధ అగ్రరాజ్యంగా చైనా పాకిస్తాన్‌ను వెనకేసుకువస్తూ భారత్‌కు సభ్యత్వం రాకుండా అడ్డుపుల్లలు వేస్తోంది. 7500 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతాలు కలిగిన చైనా, పాకిస్తాన్‌లు అణ్వాయుధ సంపత్తి కలిగి నిత్యం కవ్వింపు చర్యలతో యుద్ధోన్మాదాన్ని చూపుతున్నాయి. ప్రపంచశాంతికి ముప్పు కలిగించే పరిణామాలు సృష్టిస్తున్నాయి.
అణు సరఫరాదారుల బృందం (ఎన్.ఎస్.జి.)లో సభ్యత్వం వాణిజ్య సంబంధంగా, శాంతియుత ప్రయోజనాల కోసం, అణు ఇంధన రంగ ప్రగతికి, రక్షణ రంగ అభ్యున్నతికి అవసరమని భారత ప్రభుత్వం అభిలషిస్తోంది. ఎంత శత్రుదేశమైనా ఎటువంటి కవ్వింపు చర్యలు ఎదురైనా అణ్వస్త్రాయుధాలను అదుపుచేసుకొనే నియంత్రణా విధానం (‘నో ఫస్ట్ యూజ్’) తన సిద్ధాంతంగా మన దేశం ప్రపంచంలో విశ్వసనీయతను సాధించింది. ఆశ్రీత పక్షపాతం, యుద్ధోన్మాద ఎన్.పి.టి. ఒప్పందాన్ని మన దేశం ఖాతరు చేయకపోగా సంతకం కూడా పెట్టలేదు.
2015 జనవరిలో ‘ఇండియా-యుస్ సివిల్ న్యూక్లియర్ డీల్’ న్యూక్లియర్ రియాక్టర్‌ల స్థాపనకు నాంది పలికింది. 2016 నవంబర్ 11న జపాన్‌తో ఒప్పందం ఖరారైంది. ఆంధ్రప్రదేశ్‌లో కొవ్వాడ ప్రాంతంలో నెలకొల్పవలసిన ఎపి 1000 ఆరు న్యూక్లియర్ రియాక్టర్‌లు జపాన్ తోషిబాకు అనుసంధానమైన వెస్టింగ్ హౌస్ అమెరికా-జపాన్ కంపెనీ వారు దివాలా తీసిన కారణంగా 2017 మార్చి నెలాఖరులో వెనక్కిపోయారు. ఈ పరిణామం భారత్‌కు తీవ్ర నిరాశ, నిరుత్సాహం కలిగిస్తోంది. అణు విద్యుదుత్పత్తి రంగంలో స్వయం సమృద్ధిగా ఉత్పత్తి సాధించే దిశలో 10 స్వదేశీ హెవీ వాటర్ రియాక్టర్‌లు, స్వదేశీ డిజైన్, నిర్మాణ సామర్థ్యంతో నెలకొల్పటానికి మే 17న కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. స్వదేశీ పరిజ్ఞాన, న్యూక్లియర్ రియాక్టర్‌ల నిర్మాణ రంగంలో దేశం సాధించదలచిన ప్రగతికి శ్రీకారం చుట్టడం మోదీ ప్రభుత్వ దక్షతకు నిదర్శనం.
-జయసూర్య