ఉత్తరాయణం

‘హోదా’ పోరులో విద్యార్థులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం పాఠశాలలు, కళాశాలల్లో సమావేశాలు నిర్వహిస్తామని ఉద్యమకారులు ప్రకటించటం సమంజసం కాదు. చదువుకునే విద్యార్థులను ఉద్యమాల పేరుతో చెడగొట్టడం దారుణం. రాజకీయ ప్రయోజనాలు సాధించేందుకు పిల్లలే కావలసి వచ్చారా? ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకొని, విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించే పద్ధతులను ఏ తల్లిదండ్రులూ అంగీకరించరు. నేతలు రాజకీయ బ్రతుకుదెరువు చూసుకోవాలే గానీ పిల్లలను వీధుల్లోకి తేవాలనుకోవడం మంచిది కాదు. ఉద్యమాలు చేసేవారు నిజాయితీగా పోరాడాలి. విలువైన విద్యా సంవత్సరం వృథా కాకుండా తల్లిదండ్రులు కూడా రాజకీయ నాయకుల విధానాలను బహిరంగంగా నిరసించాలి.
- జి.శ్రీనివాసులు, అనంతపురము

గ్రామాల దత్తతపై స్పందించరా?
గతంలో ఎంపీ లాడ్స్ పథకం కింద ఒక్కొక్క ఎంపీకి కోటి రూపాయల నిధుల్ని కేంద్రం ఏటా కేటాయించేది. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలతో సంబంధం లేకుండా ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు ఈ పథకం తొలుత మంచి ఫలితాలను ఇచ్చింది. ఆ తర్వాత పార్లమెంటరీ స్థారుూ సంఘం సిఫార్సుల మేరకు యుపీఏ ప్రభుత్వం ఎంపీ లాడ్స్‌కు నిధులను కోటి నుండి మూడు కోట్లకు పెంచింది. నిధులు దారి మళ్ళుతున్నాయన్న ‘కాగ్’ నివేదిక ప్రాతిపదికపై మోదీ ప్రభుత్వం ఈ పథకానికి మార్పులు చేసింది. అందులో ముఖ్యమైనది కొంతభాగం నిధులను సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద గ్రామాలను దత్తతకు తీసుకొని అభివృద్ధిచేయాలి. పది మంది మంత్రులు సహా 78 శాతం మంది ఎంపీలు ఇప్పటివరకు ఒక్క గ్రామాన్ని కూడా దత్తత తీసుకోలేదని తాజా నివేదిక పేర్కొంది. 13 రాష్ట్రాలకు చెందిన లోక్‌సభ సభ్యులు ఒక్క గ్రామన్ని కూడా దత్తత తీసుకోలేదు. 16 రాష్ట్రాలకు చెందిన రాజ్యసభ ఎంపీలు అసలు ఈ పథకంలో తమ పేరునే నమోదు చేయించలేదు. సెలబ్రిటీలు, కార్పొరేట్ సంస్థల అధిపతులు స్వచ్ఛందంగా గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తుండగా- మంత్రులు, ఎంపీలు నిర్లిప్తవైఖరి చూపడం దారుణం. దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నా, బిహార్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఎంపీలు గ్రామాల దత్తతపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరం. సంసద్ ఆదర్శగ్రామ యోజనలో పాలుపంచుకోని సభ్యుల నిధులను ఆపివేయాలని కాగ్ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ పథకంలో అక్రమాలు జరిగితే సంబంధిత ఎంపీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రతి రూపాయి కూడా సద్వినియోగం అయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంది.
-ఎం.కనకదుర్గ, తెనాలి

ఐలయ్య మాటలు హాస్యాస్పదం
ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్న కంచె ఐలయ్య వంటి మేధావులు వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడడం హాస్యాస్పదం. డా. బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం రాయకుంటే దేశంలో నియంతృత్వమే వచ్చేదని ఐలయ్య అనడం ఆశ్చర్యకరం. అంబేద్కర్ ఒక్కరే రాజ్యాంగాన్ని లిఖించలేదు. రాజ్యాంగం రూపకల్పనకు ఏర్పాటు చేసిన ప్రముఖుల కమిటీకి అధ్యక్షుడాయన. అందరూ చర్చించుకొని రాజ్యాంగానికి రూపుదిద్దారు. ఆయనకాకపోతే మరొకరు ఆ కమిటీ అధ్యక్షులయ్యేవారు. అంబేడ్కర్ అధ్యక్షత వహించిన కమిటీ కూడా చాలా సమస్యల్ని ఊహించలేక పోయింది. అందుకే రాజ్యాంగాన్ని ఇప్పటివరకు వందసార్లు సవరించవలసి వచ్చింది. అసలు లిఖిత రాజ్యాంగం లేకపోయినా నేడు చాలా ప్రజాస్వామ్య దేశాలు నియంతృత్వం లేకుండా కొనసాగుతున్నాయి.
- లక్ష్మి, కాకినాడ

ఎవరి తాట తీశారు..?
‘ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి కుంభకోణాలు జరిగే సమస్యే లేదు. అక్రమాలు జరిగితే తాట తీస్తాం..’ అని ఈమధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు గర్జించారు. అయితే ఇటీవల అవినీతి నిరోధశాఖ దాడుల్లో చిరు ఉద్యోగుల ఇళ్లలో కూడా కోట్ల కొద్దీ కరెన్సీ నోట్లు దొరికాయి. అయినా అక్రమార్కులపై కేసులు లేవు. ఎవరి తాట తీయలేదు. ఒక సంస్థ జరిపిన సర్వేలో రెవెన్యూ, పోలీసు, రిజిస్ట్రేషన్ శాఖల్లో అవినీతి ఎక్కువగా ఉందని బయటపడింది. విద్య, వైద్య రంగాలు కూడా అవినీతి మయమైనట్లు ప్రజలకు తెలుసు. ఇసుక, మద్యం మాఫియాల సంగతి అందరికీ తెలుసు. ఎందరి తాటతీశారో మాత్రం ఎవరికీ తెలియదు!
- మరుద కాశి, కరప