ఉత్తరాయణం

రెక్కలు విప్పిన నల్లధనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్విస్ జాతీయ బ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారం గత ఏడాది తమ దేశపు బ్యాంకుల్లో భారతీయ ఖాతాల్లో పోగుబడిన ధనం మునుపటికన్నా ఏభై శాతం ఎక్కువ. మొత్తం ఖాతాల నిల్వల్లో మూడు శాతం వృద్ధి కనబడగా, భారత్ వాటాయే ఏడువేల కోట్ల రూపాయలు. కొద్దికాలం స్తబ్దత తరువాత ‘స్విస్’ ఖాతాల్లో ధనప్రవాహం వెల్లువెత్తడం గమనార్హం. ఈ నివేదిక భారత్‌లో నల్లధనంపై యుద్ధం ఎంత ప్రభావ రహితంగా ఉందో చెబుతోంది. కేంద్రమంత్రి జైట్లీ- ‘ఆ ధనమంతా నల్లనిదేనని చెప్పలేమన’డం బలహీనపు వాదన. తాటిచెట్టు క్రింద తాగుతున్నది తాటికల్లో, మంచినీళ్ళో చెప్పలేమన్నట్టే ఉందీ వాదన. విదేశాల్లో దాచుకోగలిగిన వాళ్ళు సంపన్నులే తప్ప, సామాన్యులు కారు. సంపన్నులు తమ సక్రమ సంపాదనను అక్కడ అనుమానాస్పద రీతిలో దాచుకోవాలనుకోరు. రిస్క్ తీసుకోరు. కాబట్టి ఒకటో అరో కేసుల్లో సక్రమ సంపాదనే ఉన్నా, అధికభాగం నల్లధనమే. అదీ ఏభై శాతం పెరుగుదల అంటే ఇక్కడ ఏ స్థాయిలో దోపిడీ జరుగుతుందో ఆలోచించాల్సిందే. వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు, రుణాల ఎగవేతలకు పాల్పడ్డ ఆసాములు దేశం ఎల్లల్ని సులభంగానే దాటేస్తున్నారు. వారిని వెనక్కి తీసుకురావడానికే ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. మరి డబ్బుని సరిహద్దులు దాటించడం ఆ తరహా వాళ్లకి పెద్ద బ్రహ్మవిద్యా? ఆ ఖాతాల వివరాలు తెప్పించుకోవడమే గగనవౌతున్నప్పుడు, ప్రభుత్వం ఆ డబ్బుని వెనక్కి తీసుకురాగలదని నమ్మగలమా! అంతవరకూ ఘరానా ఖాతాదారులు అమాయకంగా అక్కడే ఆ సొమ్మునుంచుతారా! ఆలోచించినకొద్దీ నల్లధనంపై యుద్ధమన్నది ఫార్సులా కనబడుతోంది. ‘బినామీల ఆచూకీ తెలపండి- గిఫ్టుకొట్టండి’ అంటూ పౌరుల్ని బేలగా అడుగుతూన్న ప్రభుత్వం తన వైఫల్యాన్ని గుర్తించాలి. నల్లధనం అరికట్టడానికి బొమ్మ కత్తులతో యుద్ధం కుదరదు. చిత్తశుద్ధితో కఠిన చట్టాల సాయంతో చెయ్యాలి.
- డా. డి.వి.జి. శంకరరావు,పార్వతీపురం

నిర్లక్ష్యానికి భారీ మూల్యం
ప్రస్తుతం వర్షాకాలం ఎండాకాలాన్ని తలపింపజేస్తున్నందున రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటి ప్రజలు అల్లాడిపోతున్నారు. దీనికి ముఖ్యకారణం చెట్లను, అడవులను విచక్షణారహితంగా నరికి వేయడమే. అడ్డూఅదుపూ లేకుండా జనాభా పెరిగిపోవడం, మన అవసరాల కోసం చెట్లను నరికివేయడంతో అవస్థలు తప్పడం లేదు. అడవుల నరికివేతను నియంత్రించేవారే లేకపోవడం శోచనీయం. మొక్కలు నాటడంలోనూ, వాటిని సంరక్షించడంలోనూ ఆసక్తి చూపించక పోవడం సహించరానిది. ప్రభుత్వం నష్టనివారణకై ఏటా ‘హరితహారం’ నిర్వహిస్తూ అసంఖ్యాకంగా మొక్కలను నాటిస్తున్నది. వాటిని సంరక్షించుకునే శ్రద్ధ ప్రతి ఒక్కరిలో ఉంటేనే ఈ కార్యక్రమం సఫలం అవుతుంది. నిలువెత్తు నిర్లక్ష్యం పేరుకొనిపోయి ప్రభుత్వ ప్రయత్నానికి ప్రజలు తూట్లుపొడుస్తున్నారు. రహదారులను విస్తరిస్తున్నకొద్దీ పచ్చదనం మాయమవుతోంది. రోడ్లను విస్తరించేటప్పుడు తగినంత దూరంతో రెండువైపులా మొక్కలు పెంచాలి. రహదారుల మధ్యలో వెడల్పైన డివైడర్లను ఏర్పాటుచేసి పచ్చదనాన్ని కాపాడాలి. స్థానిక సంస్థలు, ప్రభుత్వ శాఖలు పరిసరాలను హరితమయం చేసేందుకు కృషిచేయాలి. చెట్లను విచక్షణా రహితంగా నరికివేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించాలి. ప్రతి ఇంటా మొక్కల పెంపకాన్ని చేపట్టాలి. మొక్కల పెంపకానికి ఎక్కువ స్థలాన్ని కేటాయించే ఇళ్ల యజమానులకు ఆస్తిపన్నులో రాయితీనివ్వాలి. హరితహారం వంటి కార్యక్రమాలు విజయవంతం కావాలంటే అది ప్రజల చేతిలోనే ఉంది.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

రూపాయి దీనగాధ!
మన దేశం స్వాతంత్య్రం పొందేనాటికి రూపాయితో సమానంగా డాలర్ విలువ నేటికి అరవై రెట్లకు పైగా పెరగటానికి ముఖ్యకారణం- 1960 ప్రాంతాల్లో ఆహార కొరతతో గోధుమలపై, 1962లో చైనా యుద్ధం నేపథ్యంలో ఆయుధాల కొనుగోళ్ళకు అమెరికాపై ఆధారపడటం. పాశ్చాత్య విలాసవస్తువులు, ఖరీదైన వాహన వినియోగ సంస్కృతి, విదేశీ చదువులపై మోజు పెరగటం వంటి కారణాలతో రూపాయి విలువ భారీగా క్షీణించింది. మన విదేశీ మారకంలో అత్యధిక భాగం ఇంధనం వంటి విదేశీ దిగుమతులకే పోతోంది. ద్రవ్యోల్బణం, జీవన వ్యయాలు పెరుగుతున్నాయి. మొబైల్, ఆటోమొబైల్ రంగాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి విదేశీ సంస్థలకు రాయితీలిస్తుంటే, ఆ సంస్థలు లాభాలను తమ దేశాలకు తరలిస్తుంటే డాలర్ విలువ పెరుగుతోంది. మరోవైపు చైనా ఉత్పత్తులు మన దేశీయ ఉత్పత్తులను దెబ్బతీస్తున్నాయి. అయితే, గతంలో వలె మన దేశం ఆహారం, ఆయుధాలు, వినిమయ వస్తువుల కోసం విదేశాలపై ఆధారపడవలసిన స్థితి లేదు. కనుక మన ప్రభుత్వాలు స్వదేశీ తయారీ నినాదమే కాకుండా స్వదేశీ సంస్థలను ప్రోత్సహించాలి. నిత్యావసరం కాని విదేశీ విలాస వస్తువులు, వాహనాలపై పన్నులను బాగా పెంచి వాటి వినియోగం నియంత్రించాలి. హాలెండ్, డెన్మార్క్, నార్వే వంటి సంపన్న దేశాలు సైతం పాడిపరిశ్రమతోనే అభివృద్ధి చెందాయి. మన ప్రభుత్వం కూడా పాడిపరిశ్రమ, సౌర పవన విద్యుత్, బయోగ్యాస్, బయోడీజెల్ వంటి రంగాలను ప్రోత్సహిస్తే పర్యావరణానికి మేలు జరుగుతుంది, ఈ రంగాల్లో ఉపాధి లభిస్తుంది. ఇంధన దిగుమతుల వ్యయం తగ్గి రూపాయి బలపడుతుంది. ఇక మన స్వదేశీ సంస్థలు లాభపాక్ష కొంత తగ్గించుకొని తమ ఉత్పత్తులను చైనావలే సాధ్యమైనంత పోటీ ధరలకు విక్రయించాలి. స్వదేశీ సంస్థల ఉత్పత్తులనే మనం వినియోగిస్తే రూపాయి విలువ గణనీయంగా పెరుగుతుంది.
- తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట