ఉత్తరాయణం

వ్యసనాలకు చట్టబద్ధత వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంప్రదాయాలు, ప్రజల మనోభావాల పేరిట కోడి పందేలు, పొట్టేలు పోటీలు, జల్లికట్లు వంటి అనాగరిక క్రీడలను అనుమతించడం ప్రభుత్వాలకు పరిపాటైంది. ఇప్పుడు గాంబ్లింగ్, బెట్టింగ్‌లను చట్టబద్ధం చేయాలంటూ లా కమిషన్ సిఫార్సులు చేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. క్రికెట్ సహా కొన్ని ఆటల పోటీలపై సాగుతున్న బెట్టింగ్‌లను అరికట్టడం సాధ్యంకాదు కనుక, దాన్ని చట్టబద్ధం చేసి నియంత్రించడం ఏకైక మార్గమని లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సూచించడం విడ్డూరం. అనైతికత కార్యకలాపాలను కట్టడిచెయ్యలేము కాబట్టి వాటిని చట్టబద్ధం చేసి, పన్నుల రూపంలో అందినంత దండుకోవడమే మంచిది అన్న అభిప్రాయం వెలువడడం ఆశ్చర్యకరం. ఈ ప్రతిపాదనలు చేస్తూ మన చారిత్రక, ఇతిహాసాలను ఉదాహరించడం మరీ విడ్డూరంగా ఉంది. పురాణాలు, ఇతిహాసాలు మానవాళిని సన్మార్గంలో నడిపేందుకు దిక్సూచిగా ఉపయోగపడుతుండగా వాటిని- వ్యసనాలను చట్టబద్ధం చేయమని చెప్పే సందర్భంలో ఉదహరించడం బాధాకరం. ఇది లక్షలాది ఆస్తికుల మనోభావాలను దారుణంగా దెబ్బతీసింది. విదేశాల్లో జూదగృహాలు, బెట్టింగుల వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయో లా కమిషన్ గుర్తించకపోవడం ఆశ్చర్యం. వీటిద్వారా వచ్చే ఆదాయాన్ని సామాజిక సంక్షేమ పథకాలకోసం ఉపయోగించుకోవచ్చుననే సూచన హాస్యాస్పదమైంది. ఇప్పటికే మద్యాన్ని ఆదాయవనరుగా పరిగణించి, ఆ వ్యసనాన్ని అధికారికంగా ప్రోత్సహించడం వలన ఎన్నో లక్షల కుటుంబాలు నాశనమైపోతున్నాయి. మానవ బలహీనతలతో ఆడుకునే వ్యసనాలకు చట్టపరంగా వత్తాసుపలకడమనే మన సంస్కృతి, వారసత్వాలకే ఘోర అవమానం.
- సిహెచ్.ప్రతాప్, శ్రీకాకుళం

మమత గురివింద వైఖరి
‘బీజేపీ ఓ ఉగ్రవాద పార్టీ, మతం పేరుతో ప్రజల్ని విభజిస్తున్నద’ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనడం సరికాదు. భావస్వేచ్ఛ ఎక్కువైపోయి మన నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ రాష్ట్రంలోకి చొచ్చుకొస్తున్న ముస్లింలకు అభయం ఇచ్చి వారికి రేషన్, ఓటర్ కార్డు, ఆధార్ కార్డులిచ్చి మమత వోటుబ్యాంకును ఏర్పరచుకుంటున్నారు. తమ దేశంలోని ఉగ్రవాదులకు పశ్చిమ బెంగాల్ ఆశ్రయం ఇస్తున్నదని సాక్షాత్తూ బంగ్లాదేశ్ అధ్యక్షురాలు భారత ప్రభుత్వానికి తెలియజేసింది. హిందూ, ముస్లిం పండుగలు ఒకేరోజు వస్తే హిందువులు మర్నాడు పండుగ జరుపుకోవాలని మమత ఆదేశించి, ఆ తర్వాత హైకోర్టులో భంగపడింది. బంగ్లా దేశీయులు హిందువుల మీద దౌర్జన్యాలు చేస్తున్నా ఆమె పట్టించుకోవడం లేదు. మరి ఇది దేశ ప్రజల్ని విభజించడం కాదా?
- స్నేహమాధురి, పెద్దాపురం

అంకుర పరిశ్రమలకు మేలు
అంకుర పరిశ్రమలకు ఊతం ఇచ్చేలా కేంద్రం జాతీయ స్థాయిలో ఓ పథకాన్ని ప్రారంభించడం హర్షణీయం. యువతను వినూత్న ఆవిష్కరణల వైపుప్రోత్సహించి, వారిని పరిశోధనల రంగానికి మళ్లించేందుకు అంకుర పరిశ్రమలకు శీఘ్రగతిన అనుమతుల మంజూరు, పన్నుల్లో రాయితీలు, రుణాలు అందించాలని నిర్ణయించడం శుభ పరిణామం. విశిష్ట ఉత్పత్తులకు పేటెంట్ హక్కులు, ట్రేడ్‌మార్క్ సాధించేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు వంటి చర్యలను చేపట్టడం అభినందనీయం.
- సిహెచ్. సాయిఋత్త్విక్, నల్గొండ

వారిదే బాధ్యత..!
చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకి భాజపా భయం పట్టుకున్నట్టుంది. తమకు వ్యతిరేకంగా మాట్లాడేవారి వెనక భాజపా ఉందన్న అనుమాన పిశాచం వీరిని వేధిస్తున్నట్టుంది. తితిదే మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు తితిదే పాలక మండలిని విమర్శించగానే- ఆయన వెనక భాజపా ఉందని ప్రచారం మొదలైంది. రమణ దీక్షితుల ఆరోపణలో నిజం ఉంది. ముస్లిం, క్రిస్టియన్ ప్రార్థనాలయాల పాలనలో వేలుపెట్టడానికి సంకోచించే నేతలు హిందూ ఆలయ పాలనను హస్తగతం చేసుకొని తమ జేబులు నింపుకుంటున్నారు. రమణ దీక్షితులు కోర్టుకు వెళ్తానంటే ఆయనపై భాజపా ముద్రవేయడం ఏం విజ్ఞత?
- అయోధ్యరామ్, పెద్దాపురం

ఎదుటివారికే నీతులు..
రాష్ట్రంలో సకల అనర్థాలకు ప్రధాని మోదీయే కారణం అన్నట్టు తెదేపా నేతలు కేంద్రంపై దుమ్మెత్తిపోస్తూనే ఉన్నారు. మోదీపై ఎక్కుపెట్టిన బాణాలు కొన్ని తిరిగొచ్చి తెదేపాని ఢీకొన్నాయి. దాంతో ‘ఎవరికి ఏం జరిగినా అది చంద్రబాబు కుట్రేనా?’ అంటూ పవన్‌కల్యాణ్‌పై మంత్రి సోమిరెడ్డి విరుచుకుపడ్డారు. అవాస్తవాలు చెప్తే ప్రజలు నమ్మరంటూ వైకాపా నేత లక్ష్మీపార్వతిని కొందరు తెదేపా నాయకులు విమర్శించారు. అవాస్తవాలు చెప్తే ప్రజలు నమ్మరన్న సూక్తి తెదేపాకీ వర్తించదా?
-చంద్ర, కాకినాడ