ఉత్తరాయణం

ఇప్పట్లో డిఎస్సీ లేనట్టేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటోంది. వారిని చిన్నచూపు చూస్తోంది. ఫలితంగా నిరుద్యోగంతో యువత నిరాశకు గురవుతోంది. ఇప్పటివరకు ఉద్యోగాల కోసం వేయి కళ్ళతో ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో యువత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అసహనంతో నిరుద్యోగులు ఉద్యమబాట పట్టాల్సిన దుస్థితి దాపురించింది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన రీతిలో కృషి చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇచ్చి ఆంధ్రప్రదేశ్‌ను నిరుద్యోగ రహిత రాష్ట్రంగా మారుస్తామన్న చంద్రబాబు, అధికారంలోకి రాగానే చేతులెత్తేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేపట్టి నాలుగేళ్లు గడిచిపోయాయి. 2015లో ఒక డిఎస్సీ, 2017లో గ్రూప్-2, గ్రూప్-3 ద్వారా మాత్రమే పరిమిత సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేశారు. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖల్లో వున్న లక్షలాది ఉద్యోగాలు మాత్రం భర్తీకి నోచుకోవడంలేదు. ఏ ఒక్క నోటిఫికేషన్ విడుదల కావడం లేదు. డిగ్రీలు, పీజీలు చేసిన నిరుద్యోగులు ఉద్యోగ అర్హతకు వయోపరిమితి మించిపోతుండటంతో తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఓ రకంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై అనధికారిక నిషేధం విధించినట్టు వ్యవహరిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి పూనుకోవాలి. నిరుద్యోగుల కష్టనష్టాలు తీర్చాల్సిన బాధ్యతను నాయకులు గుర్తుంచుకోవాలి.
గత నాలుగేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగం పెరగడానికి, ఉద్యోగ లేమికి ప్రధాన కారణం ప్రభుత్వ విధానాలే. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తోన్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు పెంచారు. ఇది సీఎం చేసిన అతి పెద్ద తప్పిదం. దీంతో ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఏర్పడటం లేదు. ఫలితంగా యువత మేధో సంపత్తిని ప్రభుత్వం ఉపయోగించుకోలేకపోతోంది. అలాగే నిరుద్యోగిత ఏటికేడు పెరిగిపోతోంది.
ప్రతి ఏడాది తప్పకుండా డిఎస్సీ ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగులను ఊరించారు. నాలుగేళ్ళలో కేవలం ఒకే ఒక్క డిఎస్సీ నిర్వహించారు. గత డిసెంబరులో ఆగమేఘాలమీద ఉపాధ్యాయ ఉద్యోగ నియామక ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం వెలువరించింది. అదే సమయంలో ఉద్యోగార్హత పరీక్ష (టెట్)లో ఉత్తీర్ణత సాధించిన వారే డిఎస్సీ పరీక్షకు అర్హులని చెప్పి వరుసగా రెండు టెట్‌లు నిర్వహించింది. జూలై 6న డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని పదే పదే వక్కాణించారు మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు. కానీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన దస్త్రానికి ఆర్థిక శాఖ ఆమోదం రాలేదనే కుంటి సాకుతో ముచ్చటగా మూడోసారి డిఎస్సీ నోటిఫికేషనన్‌ను వాయిదా వేశారు. మరో వారంలో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. రెండు వారాలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అలాగే బిఇడిలకు ఎస్‌జిటి పోస్టుల్లో అర్హత కల్పిస్తూ ‘ఎన్‌సిటిఇ’ విడుదల చేసిన గెజిట్‌పై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పష్టమైన వైఖరిని ప్రకటించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉపాధ్యాయ ఖాళీలున్నాయి? వీటిలో ఎన్ని భర్తీ చేస్తారు? అన్నదానిపై స్పష్టత కరవైంది. ఈ నేపథ్యంలో డిఎస్సీ మరోమారు వాయిదా పడనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. డిఎస్సీ నోటిఫికేషన్ జారీకే తీవ్ర జాప్యం చేస్తున్న విద్యా శాఖపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిఎస్సీపై ప్రభుత్వం అలసత్వ ధోరణి ప్రదర్శిస్తుండటంతో దాదాపు ఎనిమిది నెలలుగా వ్యయ ప్రయాసల కోర్చి వివిధ కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందిన అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న యువతీ యువకులు డిఎస్సీ జాప్యంతో ఆర్థికంగా చితికిపోయి బతుకుబండిని లాగలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధే ఉంటే ఆర్థిక శాఖ నుండి అనుమతి పొందడం పెద్ద సమస్యే కాదని అభ్యర్థులు వాపోతున్నారు. మరోవైపు డిఎస్సీ డిసెంబర్‌లో ఉంటుందన్న ఊహాగానాలు అభ్యర్థులను మరింత గందరగోళానికి గురిచేస్తున్నాయి. కాబట్టి చంద్రబాబు తక్షణమే స్పందించి వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. తద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలి.
-బట్టా రామకృష్ణ దేవాంగ, సౌత్ మోపూరు (నెల్లూరు జిల్లా)

‘తిట్ల వర్షా’(కా)ల సమావేశాలు?
బుధవారం ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అర్థవంతంగా జరగాలనుకోవడం అత్యాశే. అయినా అలా జరగాలని ఆశించడం సగటు భారతీయుడి కోర్కె, హక్కు. గత బడ్జెట్ సమావేశాలు అవిశ్వాస తీర్మానాలతో, ఏ మాత్రం చర్చన్నదే లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. ఏ పథకానికి ఎంత బడ్జెటో, దాని లాభనష్టాలేమిటో సభ చర్చించిన పాపాన పోలేదు. సాధారణ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఈ దఫా సమావేశాలు ఘనంగా జరుగుతాయన్నది భ్రమ అయినా, ఎంతో కొంత బాధ్యతతో పార్టీలు నడవాలన్నది ఆశ. అపుడే జాతీయ పార్టీలు అసలు సమస్యలు విడిచి కొసరు సమస్యలు లేవనెత్తుతున్నాయి. బిజెపి అధికారంలోకి వస్తే హిందూ పాకిస్తాన్ తయారౌతుందని ఓ కాంగ్రెస్ నేత అసందర్భ వ్యాఖ్యలు చేస్తే, అసలు కాంగ్రెస్ పార్టీ ముస్లిం పురుషుల పార్టీ అంటూ ప్రధాని మరింత అసందర్భ వ్యాఖ్యలు చేశారు. ఇంతకన్నా ముఖ్య విషయాలు చర్చించాల్సినవి ఉన్నాయని ముందు జాతీయ పార్టీలు గుర్తిస్తే, ఆపై ప్రాంతీయ పార్టీలకి సుద్దులు చెప్పొచ్చు.
ద్రవ్యోల్బణం 2013 తరువాత అధిక స్థాయిలో నమోదైంది. వర్షాలు పడితే మహానగరాలు మహా మురికి నదులుగా తయారౌతున్నాయి. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటు చట్టం, అత్యాచార నిరోధ చట్టంపై సుప్రీం తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, తలాక్ చట్టం, ఉన్నత విద్యా కమిషన్ చట్టం ఇత్యాది ముఖ్యమైన బిల్లులతో బాటు 108 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. నీటికొరత, నిరుద్యోగిత, అగ్రరాజ్యాల నడుమ వాణిజ్య యుద్ధం నేపథ్యంలో దేశంలో ఆ ప్రభావాల్ని తగ్గించే ఆలోచనలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, విభజన చట్టం హామీల అమలు ఇలా చూస్తే ప్రాధాన్యతాంశాలమీద మొక్కుబడిగా మాట్లాడినా సమయం చాలని పరిస్థితి, చట్టసభలో అధికార, ప్రతిపక్షాలు తమ బాధ్యతగా ఈ ప్రాధాన్యతాంశాల్లో కొన్నింటిపైనన్నా అర్థవంతమైన చర్చ జరిపితే దేశానికి మేలు చేసినట్టే. ఉద్వేగాలు, తిట్లకే సమయం ఖర్చు చేస్తే అంతకుమించిన దేశద్రోహం ఉండదు. రాజకీయ ప్రయోజనాల కన్నా ప్రజా సంక్షేమం ముఖ్యమని అధికార, విపక్ష పార్టీలు ఇకనైనా గుర్తించాలి.
-డా డి.వి.జి.శంకర్‌రావు, పార్వతీపురం