ఉత్తరాయణం

తిట్టడం ఓ అర్హతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య తెదేపా యువనేత, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఒక చాలెంజ్ విసిరాడు. జగన్, పవన్‌లకు ధైర్యముంటే మోదీని తిట్టాలన్నదే ఆ చాలెంజ్! అయ్యో! రాజకీయాల్ని ఏ స్థాయికి దిగజార్చారు! ప్రజాస్వామ్యంలో ఎవరూ ఎవరినీ తిట్టరాదు. కాని ఇలాంటి చాలెంజ్‌లు వింటుంటే వీరికి ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని అర్థం అవుతోంది. వీరి దృష్టిలో ప్రధానిని తిట్టడమే తెదేపా సభ్యులకు అదనపు అర్హత అనుకోవాలి. అయితే ఇటీవల టీవీల్లో నవ నిర్మాణ దీక్ష గురించి ఒక ప్రకటన వచ్చింది. దానిలో మోదీని తిట్టలేదు. ఎందుకని? తిడితే తిరుగులేని అస్త్రాన్ని భాజపాకి ఇచ్చినట్టు అవుతుంది. దాన్ని పుచ్చుకొని వారు వీరిపై పరువునష్టం దావా వేయొచ్చన్న భయం!
- హితీక్ష, రమణయ్యపేట

నిజం తెలియక నిందలా?
దేశంలో ఏ ఘోరం జరిగినా దాన్ని మోదీపై రుద్దడానికి తయారైపోతున్నాయి తేదేపాతో సహా విపక్షాలన్నీ. అసోంలో తయారైన ‘జాతీయ పౌర రిజిష్టర్’ (ఎన్‌ఆర్‌సి)లో పేర్లులేని 40 లక్షల మందిపై జాలి కురిపిస్తున్నాయి విపక్షాలు. దీని గురించి ఏమీ తెలియకుండానే, సాంకేతిక యుగంలో నిర్దిష్ట ప్రమాణాలు పాటించకపోవడం ఒక వైఫల్యం అనేశాడు తెదేపా ఎంపీ సుజనా చౌదరి. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో మూడేళ్లపాటు 52వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో పరిశ్రమించి మూడుకోట్ల 30 లక్షల మంది దరఖాస్తులు స్వీకరించి వడపోసి వంశవృక్షాలు డిజిటలీకరించి వాటికి కోడ్ నంబర్లు ఇచ్చి తయారుచేసిన ముసాయిదా ఇది. ఇంతటి బృహత్తర కార్యక్రమం ప్రపంచంలో ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. ఇది చారిత్రాత్మకం అని గ్రహించక, కోడిగుడ్డుకి ఈకలున్నాయని యాగీ చేయడం తగదు.
- శాంతిచంద్రిక, సామర్లకోట

రహదారులపై పచ్చదనం
‘రహదారి వెంట మొక్క నాటి పెంచరా.. కలవాడు లేనివాడు నిన్ను తలచురా’ అంటూ ఘంటసాల పాడిన మధురగీతం ఆనాడు విననివారు లేరు. ఆ రోజుల్లో రహదారులకు ఇరువైపులా భారీ వృక్షాలు ఉండేవి. ‘అశోకుడు రోడ్లకిరువైపులా మొక్కలు నాటించాడ’ని చెప్పుకొనేవాళ్ళం. రానురానూ రహదారులపై పచ్చదనం కరవవుతోంది. రోడ్ల విస్తరణ పేరిట వృక్షాలను నరికివేయడం ఇందుకు ఓ కారణం. రహదారుల విస్తరణ తర్వాత మొక్కలను పెంచడం మరచిపోతున్నారు. ఇటీవల తెలంగాణలో ‘హరితహారం’ పేరుతో ప్రభుత్వం రహదారుల వెంబడి మొక్కలను నాటిస్తున్నా, కొన్నిచోట్ల ముందుచూపుకొరవడి శ్రమ, ఖర్చు వృథా అవుతున్నాయి. రహదారులపై ట్రాఫిక్‌ను, భవిష్యత్ అవసరాలను బట్టి తగినంత దూరంతో మొక్కలను నాటించాలి. రహదారులను విస్తరించిన ప్రతిసారీ వృక్షాలను నరకాల్సిన పరిస్థితి రాకుండా చూడాలి. రోడ్లపై డివైడర్లను వెడల్పుగా ఏర్పాటుచేసి, మధ్యలో మొక్కలను పెంచాలి. రహదారులన్నిటినీ పచ్చదనంతో నింపితే ప్రయాణీకులకు అలసట తీరుతుంది. భూమాతను ‘హరిత హారం’తో అలంకరిస్తే సకాలంలో వర్షాలు కురుస్తాయి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం