ఉత్తరాయణం

పేట్రేగిపోతున్న ఉన్మాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల్లో హింసా ప్రవృత్తి నానాటికీ పెరిగిపోతోంది. పరువు, ప్రతీకారం అంటూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని హత్యలకు పాల్పడటం సర్వ సాధారణమైంది. మన దేశం సామాజికంగా ఇంకా వెనుకబడే వుంది. చదువు, సంపాదన కోసం ఆడపిల్లలను కుటుంబాలకు దూరంగా పంపటం, తమకు నచ్చని ప్రేమ వివాహాలు చేసుకున్న వారిపై హత్యాయత్నాలు చేయటం దారుణం. ప్రభుత్వాలు కులాంతర వివాహాలు ప్రోత్సహిస్తుంటే పరువు హత్యలు గర్హనీయం. కాలానుగుణంగా మార్పులు సహజం, వీటికి తల్లిదండ్రులు సర్దుకుపోవాలి. తమకిష్టం లేని వారిని వివాహం చేసుకుంటే నచ్చచెప్పటం, వినకపోతే తెగతెంపులు చేసుకొని వదలివేయాలి. పరువు హత్యలతో కుటుంబాల్లో విషాదం తప్ప సాధించేది ఏమీ లేదు. సమాజంలో ఉన్మాదం పెరిగిపోవటానికి ప్రభుత్వాల బాధ్యత కూడ వుంది. సంక్షేమ పథకాల భారాన్ని మద్యం అమ్మకాల ద్వారా పూడ్చుకోవాలని చూస్తుంటే విచ్చలవిడితనం, నేరప్రవృత్తి పెరుగుతుంది. మానవత్వం మరిచి క్రూరంగా ప్రవర్తించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలి. ప్రసార మాధ్యమాలు బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్ అంటూ హింసాత్మక ఘటనలు పదే పదే చూపుతుంటే యువతపై దాని ప్రభావం పడుతుంది. టీవీ చానళ్లు స్వీయ నియంత్రణ పాటిస్తే సమాజానికి మేలు చేసినట్టే.
-తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట

టూరిజంపై దృష్టి సారించండి
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తున్న కీలక రంగాలలో పర్యాటకం ప్రధానమైంది. 1970 సంవత్సరం నాటికే పర్యాటకాన్ని లాభదాయకమైన రంగంగా ప్రపంచ దేశాలు గుర్తించాయి. ప్రయాణ సౌకర్యాలను పెంచడం, దర్శనీయ స్థలాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం, వసతి సౌకర్యాలు, భోజన సౌకర్యాలు మెరుగుపరచడం వంటివన్నీ పర్యాటక రంగాన్ని వృద్ధి చేస్తాయి. పర్యాటక రంగంలో ఒక డాలర్ పెట్టుబడికి సుమారు 67 డాలర్ల ఆదాయం వస్తున్నదంటే టూరిజం ప్రజలను ఎంతగా ప్రభావితం చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. టూరిజం ప్రాముఖ్యాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించడంతో పర్యాటకాభివృద్ధికి ఒక ప్రత్యేక సంస్థ ఆవిర్భవించింది. 1979లో ప్రపంచ పర్యాటక అభివృద్ధి సంస్థ మూడవ సదస్సులో ఏటా ‘టూరిజం డే’ను నిర్వహించాలని తీర్మానించారు. 1980 నుండి అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఏటా సెప్టెంబర్ 27న నిర్వహిస్తున్నారు. పర్యాటకానికి సంబంధించి ఉన్నత ప్రమాణాలు పాటించే నగరాలకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డు 2004లో ఇంగ్లాండ్‌లోని ఇడెన్‌బర్గ్ నగరానికి లభించింది. టూరిజంలో ఆస్కార్ అవార్డుతో సమానంగా పరిగణింపబడే ఈ అవార్డును ఈ నగరం ఐదుసార్లు అందుకోవడం విశేషం. పర్యాటక రంగంలో భారతదేశానికి ఐదో స్థానం. మన దేశంలో అనేక పర్యాటక ప్రదేశాలు వున్నాయి. వివిధ దేశాల నుండి నిత్యం పర్యాటకులు మన దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తుంటారు. పర్యాటకుల స్వర్గ్ధామంగా మన దేశానికి పేరుంది. టూరిజంను ప్రోత్సహిద్దాం, పర్యాటక ప్రదేశాలను కాపాడుకుందాం. మన వారసత్వ సంపదను గౌరవిద్దాం. మన దేశాన్ని పర్యాటక రంగంలో ముందంజలో నిలుపుదాం.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట

అమెరికా పెత్తనాన్ని అడ్డుకోండి
తన స్నేహితుడు తనకి నచ్చని మరొకడితో మాట్లాడితే ఉక్రోషం చూపించడం బాల్య చాపల్యం. మాట్లాడడం మానెయ్యడమే కాకుండా స్నేహితుడికి రెండు తగిలిస్తాననడం దుడుకుతనం. అయితే అలాంటి పనే ఒక దేశం చేస్తే దానిని ‘అహంభావి అమెరికా’ అనొచ్చు. ఈమధ్యనే ఆ దేశం ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. దాని పేరు ‘కౌంటెరింగ్ అమెరికాస్ అడ్వేర్సరీస్ త్రూ సాంక్షన్స్ యాక్ట్’. అంటే అమెరికా వ్యతిరేకుల్ని ఆంక్షల ద్వారా నిరోధించే చట్టం. దాని ప్రకారం రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్ దేశాలపై ఆంక్షలు విధించడంతోపాటు ఆ దేశాలతో వాణిజ్య, రక్షణ ఒప్పందాలు చేసుకొనే దేశాలపైనా ఆంక్షలు విధించి శిక్షిస్తారట. అందులో భాగంగా మన దేశాన్ని సైతం హెచ్చరించారు- రష్యాతో ఎస్-400 ఒప్పందాన్ని కుదుర్చుకోవద్దంటూ. లేదంటే ఆర్థిక ఆంక్షలు విధిస్తామన్నారు. సదరు ఒప్పందం ఎంతో ప్రాముఖ్యత కలది. క్షిపణి దాడుల్ని నిలువరించే ఆధునిక యాంటీ మిస్సైల్ వ్యవస్థ అది. ఇప్పటికే చైనా ఆ వ్యవస్థని రష్యా నుండి సేకరించింది. ఈ వివరాలన్నీ పక్కనపెట్టినా భారత్ వ్యవహారాలపై అమెరికా బోడి పెత్తనమేమిటి? తన ఇచ్ఛానుసారం దౌత్య, వాణిజ్య సంబంధాలు నెరిపే సార్వభౌమత్వం ఉన్న దేశాన్ని ఇలా హెచ్చరించడం హద్దులు దాటడమే. ఆ హెచ్చరికల్ని పెడచెవినపెట్టి ఒప్పందాన్ని కుదుర్చుకొని భారత ప్రభుత్వం మంచి పనే చేసింది. ఇదే దృఢ వైఖరి అన్నివేళలా ప్రదర్శించాలి. భారత్‌తో తమకున్న ఆర్థిక, వాణిజ్య అవసరాల రీత్యా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించే సాహసం ప్రదర్శించకపోవచ్చు. అలా చేసినా దీటుగా వ్యవహరించగలం అన్న సంకేతాలు భారత్ పంపడం ఆవశ్యకం.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం