ఉత్తరాయణం

తుపాను బాధితులకు భరోసా ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తితిలీ తుపాను బాధితుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క రాత్రిలో రెండు జిల్లాల్లో పంటల్ని, రోడ్లను ఊడ్చేయడమే కాకుండా లక్షలాది మందికి మంచినీరు, ఆహారం, ప్రాథమిక సౌకర్యాలకు దూరం చేసిందీ తుపాను. వేలాది కుటుంబాలు నిలువనీడ లేకుండా, గ్రామాలకి గ్రామాలే విద్యుత్ వెలుగులు లేకుండా నాలుగురోజులుగా ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో తెలుస్తోంది. సీఎం చంద్రబాబు తాను ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో సహాయక చర్యల్ని పర్యవేక్షించడమే కాకుండా, తన మంత్రివర్గాన్ని, ఉన్నతాధికారుల్ని బాధ్యుల్ని చెయ్యడం అభినందనీయమే. వారి స్పందన, సామీప్యం బాధితుల్లో భరోసా ఇస్తుంది. అయితే, ఊరట అన్నది సహాయ కార్యక్రమాలు, వాటి ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఎంతవరకూ సమర్ధవంతంగా సహాయ కార్యక్రమాలు జరిగాయన్నది మరో వారంలో అవగాహనకి వస్తుంది. ప్రస్తుతానికైతే ఎటుచూసినా నష్టాలూ, కష్టాలే. ఈ విలయంపై కేంద్రం నుండి స్పష్టమైన సహాయం, హామీ లభించకపోవడం ఆశ్చర్యం. ఈ రెండు జిల్లాలు ఆంధ్రప్రదేశ్‌లో వెనకబడినవి. న్యాయంగా ఐతే ‘బుందేల్‌ఖండ్’ తరహా ప్రత్యేక సాయం ఏటా పొందాల్సినవి. రెండేళ్లుగా విభజన చట్టం మేరకు రావాల్సిన నిధులుకూడా అందడం లేదు. వాటిపై సాకులు, కారణాలు ఎత్తిచూపడానికే కేంద్రం, రాష్ట్రాలు పోటీపడుతున్నాయి తప్పితే సమస్య పరిష్కరించడానికి మాట్లాడడం లేదు. ఇప్పుడు మూలిగే నక్కపై తాటిపండు పడిన రీతిలో ఈ తుపాను ఉపద్రవం అదనం. పేద జిల్లాలకు పెద్దకష్టం వచ్చినపుడు వెంటనే సాయమందాలి. 2014లో వచ్చిన హుదూద్ తుపాను నష్టాన్ని నేటికీ పూరించని వాస్తవాలు కళ్లెదుటే ఉండగా ఇప్పటి సాయం ఎప్పటికి అందేనో అన్నది పెద్ద ప్రశ్న. ముందుచూపుతో ప్రాణనష్టాన్ని తగ్గించగలిగిన ప్రభుత్వం, అదే స్ఫూర్తితో జరిగిన నష్టాన్ని పూడ్చాలి. రాజకీయాలకు, అలసత్వానికి తావుండరాదు. వెంటనే చేయూత, భరోసా పొందడం ప్రజల న్యాయమైన హక్కు.
-డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
రైతన్నను ఆదుకోండి
తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసింది. వేలాది మంది నిలువ నీడలేకుండా నిరాశ్రయులయ్యారు. పంట చేతికొస్తుందన్న గంపెడాశతో ఎదురుచూస్తున్న రైతన్నల ఆశలు అడియాసలే అయ్యాయి. భారీ సంఖ్యలో పశువులు ప్రాణాలు కోల్పోయాయి. తీవ్రమైన అపారిశుద్ధ్య పరిస్థితులలో డయేరియా, కలరా వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో సమస్యల కారణంగా ఇప్పటికీ వేల మందికి సరైన వైద్యం లభించక ఆక్రోశిస్తున్నారు. తొమ్మిది మండలాలలో 42 గ్రామాలలో ప్రజలు తుపాను బీభత్సం తర్వాత ఇప్పటికీ మంచినీరు, ఆహార పదార్థాలు అందక అలమటిస్తున్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేకపోవడంతో అనేక గ్రామాలు ఇప్పటికీ గాడాంధకారంలో మగ్గుతున్నాయి. అత్యవసర వైద్యం అందించేందుకు ఏర్పాటుచేసిన వైద్యబృందాల జాడే లేదు. రోడ్లన్నీ శిథిలమై రాకపోకలు సాగించేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తుపాను తర్వాత నాలుగు రోజులపాటు 18 గ్రామాలలో ప్రజలకు కనీస అవసరాలైన నీరు, ఆహారం అందక ప్రత్యక్ష నరకం అనుభవించడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. జిల్లా యంత్రాంగం బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యింది. కోస్తా ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు తుపాను తాకిడి ఎక్కువగా వుంటుందని ఇదివరకే వాతవారణశాఖ స్పష్టమైన సంకేతాలు ఇచ్చినా అందుకు అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలవౌతోంది. కేంద్ర ప్రభుత్వం పెద్దమనసుతో ఆదుకొని, తిత్లీ తుపాను తాకిడికి అతలాకుతలం అయిన శ్రీకాకుళం జిల్లాలో సామాన్యస్థితి నెలకొల్పేందుకు తగిన సహాయం యుద్ధప్రాతిపదికపై చేపట్టేందుకు చర్యలు చేపట్టాలి. తరచుగా తుపాను తాకిడికి గురయ్యే ఉత్తరాంధ్ర జిల్లాలకు శాశ్వత ప్రాతిపదికపై రక్షణ చర్యలు చేపట్టేందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేయాలి.
- సిహెచ్.ప్రతాప్, శ్రీకాకుళం
చిచ్చు పెట్టడం కొత్త కాదు..
రోజుకొక కొత్త అభియోగంతో ప్రధాని మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు- ‘ఎన్డీయేపై నేను పోరాడుతున్నందుకే బెదిరిస్తున్నారు.. తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను రెచ్చగొడుతున్నారు’ అంటున్నారు. అసలు ఇద్దరు ‘చంద్రుల’ మధ్య ఎప్పుడైనా సయోధ్య ఉందా? ఆంధ్రోళ్లు, సెటిలర్స్ అంటూ అవమానించడమేకాక విద్యుత్తు ఉద్యోగుల్ని తొలగించి ‘మీ రాష్ట్రానికి పొండి’ అన్నారు కేసీఆర్. తెలంగాణలో పచ్చళ్లు అమ్ముకుంటూ బతకడానికి అనుమతిస్తానని కూడా ఆయన అన్నాడు. కొత్తగా ఎవరో చిచ్చుపెట్టనక్కరలేదు. ఏపీ, తెలంగాణల మధ్య ఆది నుంచీ చిచ్చు రాజుకుంటూనే ఉంది. అయినా, చంద్రబాబు తక్కువ తిన్నారా? ఉత్తరాది, దక్షిణాది మధ్య చిచ్చుపెట్టడానికి ఆయన ప్రయత్నించడం లేదా?
-చైతన్య, వాకలపూడి
వీధి కూడలిలో విగ్రహమా?
లక్నో నగరం ప్రధాన వీధుల కూడలిలో వంద కోట్ల రూపాయల ఖర్చుతో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ప్రకటించడం విడ్డూరం. దేవుళ్ల విగ్రహాలను ఆగమశాస్త్రం ప్రకారం గుడిలో లేదా గుడి ఆవరణలో మాత్రమే ప్రతిష్ఠించాలి. మామూలు మానవుల విగ్రహాల్లాగ వీధిలో ప్రతిష్ఠింప పూనుకోవటం ఎంత మాత్రమూ సరికాదు. కాబట్టి ఆ ప్రయత్నాన్ని యూపీ ప్రభుత్వం విరమించుకోవటం మంచిది.
- ఎన్.మధుసూదనరావు, హైదరాబాద్
ఇదేనా ‘జ్ఞానధార’?
ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల ‘జ్ఞానధార’ పేరిట విద్యార్థుల ఓట్లకు గాలం వేస్తున్నారు. కానీ, రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. దొంగ సర్ట్ఫికెట్లతో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు, లెక్చరర్ల సంఖ్య బయటపడుతోంది. వర్సిటీల్లో అమ్మాయిల్ని వేధించే ప్రొఫెసర్లు తయారవుతున్నారు. గూగుల్ సమాచారంతో థీసిస్‌లు రాసిన వారికి వందల సంఖ్యలో పిహెచ్‌డీ పట్టాలు ప్రదానం చేసే యూనివర్సిటీల తీరుని సాక్షాత్తూ గవర్నర్ తప్పుపట్టారు. ఇలాంటి పట్టాలతో ఉద్యోగాలు దొరక్క యువత అటెండర్ స్థాయి ఉద్యోగాలకు కూడా ఎగబడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ‘జ్ఞానధార’ అంటూ గొప్పలు చెప్పడం ఎందుకు?
-సౌందర్య,కాకినాడ