ఉత్తరాయణం

హడలెత్తిస్తున్న చానళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రైవేట్ టీవీ చానళ్లు లేని రోజుల్లో పరిమితమైన ప్రసారాలతో ప్రభుత్వ టీవీ ‘దూరదర్శన్’ వచ్చేది. ఒకటో, రెండో ధారావాహికలు, భారతీయ భాషలలోని ఏదైనా ఒక చలనచిత్రం వారానికి ఒకరోజు. ఒక రోజు పిల్లల కోసం కార్టూన్ షో వంటివి అలరించేవి. ఇలా పరిమిత ప్రసారాలను అందించే టీవీని ‘ఇడియట్స్ బాక్స్’అని ఎగతాళి చేసేవారు. నేడు వంటలు, పంటలు, సినిమాలు, వ్యాయామం, విద్య, ఆరోగ్యం, కామెడీ పేరిట అపహాస్యపు షోలు, కార్టూన్ చిత్రాలు, పాటల పోటీలు.. ఇలా పగలూ రాత్రీ అనే తేడాలేకుండా అనేక చానళ్లలో పోటాపోటీగా కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. ఈ వీరబాదుడు చాలక ఇటీవల ‘లక్ష్మీదేవి తలుపుతట్టింది’, ‘బతుకు జట్కాబండి’, ‘రచ్చబండ’ ‘సంసారం ఒక చదరంగం’ అంటూ సరికొత్త కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు. నిజానికి మన సంప్రదాయంతో ‘సంసారం గుట్టు వ్యాధి రట్టు’ అన్న నానుడి ఉన్నది. కాపురాల్లోని లోటుపాట్లను టీవీ కార్యక్రమాల్లో భూతద్దంలో చూపిస్తున్నారు. ఏ ప్రయోజనం ఆశించి ప్రజల మీదికి వీటిని వదులుతున్నారు? అందరి కాపురాలలోనూ ఏదోఒక లొసుగు తప్పకుండా ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని నిర్వహించే వారిలో కనీసం ఒక్కరికైనా ఎలాటి లోటులేదని చెప్పగలరా? వినోదం కోసమని టీవీ ఆన్‌చేస్తే ఈ ఏడ్పులు, పెడబొబ్బలు చూడవలసి రావటం ఖర్మకాక మరేమిటి?
-ఆయి కమలమ్మ, వనస్థలిపురం

సంప్రదాయాలను గౌరవించరా?
చట్టాలు ఏర్పడకముందే మన దేశంలో ప్రజలు సంప్రదాయాలు పాటించారు. భారతీయ సంప్రదాయం ప్రపంచానికే అనుసరణీయం అని అన్ని దేశాల మేధావులు నొక్కివక్కాణించారు. ఈమధ్య సుప్రీం కోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులు భారతీయ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉంటున్నాయి. వివాహానికి ముందే సహజీవనం చేయవచ్చునని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం సబబా? దీనివల్ల యువతీ యువకుల్లో విచ్చలవిడితనానికి దారితీస్తుందని తెలియదా? వివాహమైన స్ర్తి పర పురుషునితో కలసి ఉంటే అది వ్యభిచారం కాదట, నేరం కూడా కాదట. ఇదేలా న్యాయ సమ్మతమో! శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలనడం మత విశ్వాసాలకు విఘాతం కాదా? మతాచారాలు స్ర్తి స్వేచ్ఛకు భంగకరమా? సనాతన సంప్రదాయాలను కాలరాచే హక్కు కోర్టులకెక్కడిది? ఇప్పటికే హిందూమత ఆచారాలను పక్కనపెట్టి కొంతమంది స్ర్తిలు మంగళ సూత్రాలు, కాళ్లకు మట్టెలను ధరించడం లేదు. సంప్రదాయ విరుద్ధమైన పద్ధతులతో హిందూ ధర్మమే అపవిత్రం అవుతున్నది.
-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

స్వలాభానికే పొత్తులు
ప్రజాస్వామ్య పరిరక్షణే తమ లక్ష్యం అంటూ తెదేపా అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించడం హాస్యాస్పదంగా వుంది. కాంగ్రెస్ పార్టీతో జత కట్టిన సందర్భంగా ‘సొంత ఆస్తుల పరిరక్షణే మా ధ్యేయం’ అని చంద్రబాబు చెబితే బాగుండేదేమో. మన రాజకీయ నాయకులు వారి అవినీతి బయటపడే సరికి ‘ప్రజాస్వామ్యానికి ప్రమాదం, వ్యవస్థల నిర్వీర్యానికి కుట్ర జరుగుతోంది..’ అంటూ నానాయాగీ చేయడం చూస్తూనే ఉన్నాం. రాజకీయాలలో ఆరితేరినవారు తమపై ఆరోపణలు వచ్చినప్పుడు ఇలా బేలతనంతో ప్రకటనలివ్వడం సరికాదు. తమపై వచ్చిన అవినీతి ఆరోపణలను ధైర్యంగా ఎదుర్కోవడం నిజమైన నేతల లక్షణం. మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికైన సాధారణ వ్యక్తి ఆ పదవి నుంచి దిగిపోయే నాటికి అవినీతికి పాల్పడి ఎంతగా ధనం సంపాదిస్తున్నాడనేది ప్రజలకు తెలుసు. అలాంటిది కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రాన్ని, దేశాన్ని చక్రం తిప్పిన నాయకులపై అవినీతి ఆరోపణలు రావడం సహజం. తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. కాంగ్రెస్‌తో పొత్తు ఏర్పాటు చేసుకొని ఆ ఆరోపణలను పక్కదారి పట్టించడం తగునా? కాంగ్రెస్ వారు కూడా ఆరోపణలు ఎదుర్కొనే వారిని తమ పంచలో చేర్చుకోవడం పరిపాటే. ప్రజలు ఇలాంటి వ్యవహారాల్లో దాగిన ఆంతర్యాన్ని గుర్తిస్తారని నేతలు గ్రహించాలి.
- జి.శివశంకర్, దిల్‌సుఖ్‌నగర్