ఉత్తరాయణం

తీరు మారని భాజపా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నాటక శాసనసభ ఎన్నికల తర్వాతనైనా బీజేపీ ఆత్మవిమర్శ చేసుకోలేదు. అందుకే అక్కడ తాజా ఉపఎన్నికల్లోనూ ఆ పార్టీని ఓటమి వెంటాడింది. ప్రతిపక్షాల అనైక్యతే తమ బలంగా భాజపా భావిస్తున్నది కాని, ప్రజాబలం పెరిగేలా చర్యలు శూన్యం. ప్రధాని నరేంద్ర మోదీ తాను నిజాయితీపరుడినని, తనకు ప్రత్యామ్నాయ నేత లేడని భావించవచ్చు గాని, నిజమైన ప్రతిపక్షం- సామాన్య ప్రజలే. కార్పొరేట్, ఉద్యోగ వర్గాలే రాజకీయ పార్టీలను ఎల్లప్పుడూ గెలిపించలేవు. పేదల పక్షపాతిగా వుంటేనే మనుగడ. ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ వంటి ప్రజాకర్షక నేతలనే ప్రజలు ఓడించారు. గతంలో కూడా బీజేపీ ప్రభుత్వం- ‘స్వర్ణ చతుర్భుజ రోడ్లు, వివిధ అభివృద్ధి పథకాలతో భారత్ వెలిగిపోతోందం’టూ గొప్పలు చెప్పి ఆ తర్వాత ఆరిపోయింది. మోదీ హవాతో మళ్లీ కేంద్రంలో గద్దె ఎక్కినప్పటికీ ధోరణి మారలేదు. ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టకపోయినా ప్రజావ్యతిరేక చర్యలను నియంత్రించాలి. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. వంటగ్యాస్ ధర ఏడాదిన్నర క్రితం రూ. 600 నుండి నేడు వేయి రూపాయలకు పెరిగింది. సబ్సిడీ పొందే లబ్దిదారులు సైతం ఆ కొద్ది మొత్తం కోసం బ్యాంకుల చుట్టూ తిరగాలి (ఏడాదికి రెండు సిలిండర్లు తగ్గించినా సబ్సిడీ ధరకు ఇళ్ళవద్దనే అందిస్తే ఇరుపక్షాలకు ప్రయోజనం). పెట్రో ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరుగుతూ, ఆ ప్రభావం అన్నిరంగాలపై పడుతోంది. అయినప్పటికీ ‘రోమ్ తగలబడుతుంటే నీరోచక్రవర్తి ఫిడేలు వాయించినట్లు’ ప్రధాని మోదీ ధరల నియంత్రణ తమ పరిధిలోలేదని తప్పించుకోవటం తగదు. ఇక, కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీకి రెండంకెల వృద్ధి, సంపన్న వర్గాల శ్రేయస్సేగాని, సామాన్య ప్రజానీకం ఆర్థిక సమస్యలు తెలియవు. అల్పాదాయ వర్గాలు అల్లాడుతున్నాయి. ఇటు రాష్ట్రాల్లో ప్రాంతీయ ప్రయోజనాల పేరుతో ప్రాంతీయ పార్టీల ప్రాభవం పెరిగి ప్రజల్లో జాతీయ భావాలు తగ్గుతున్నాయి. సంస్కరణల పిమ్మట రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్రంగా విదేశాలతో ముఖ్యంగా మనకు శత్రుదేశమైన చైనాతోకూడ వివిధ ఒప్పందాలు చేసుకుంటున్నాయి. వాటి సమగ్ర వివరాలు కేంద్రానికి, భారం మోసే ప్రజలకు, చివరకు శాసనసభ్యులకు తెలియవు. ఎన్ని ప్రజాస్వామ్య సూత్రాలు వల్లించినా, ఆచరణలో రాచరికంలో వలె వారసత్వం, కుటుంబ పెత్తనాలు, ప్రాంతీయ భావాలు పెరుగుతున్నాయి. అవసరం అనుకున్నపుడు రాష్ట్రేతరులపై ప్రాంతీయ పార్టీలు రెచ్చగొడుతాయి. అక్రమంగా నివసించే బంగ్లా, పాక్, రొహింగ్యాల వంటి విదేశీ వలసదారుల విషయంలో నోరు మెదపవు. జాతీయ పార్టీలు బలహీనపడి ప్రాంతీయ పార్టీలు బలపడితే రాజకీయ అస్థిరతలుతో కేంద్ర ప్రభుత్వం బలహీనపడినా ప్రమాదమే. కనుక ప్రధాని మోదీ ఇదే చివరి అవకాశంగా ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.
-తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట

విపక్ష కూటమికి కొత్త ఊపు
కర్నాటక ఉపఎన్నికల్లో భాజపా ఓటమి- విపక్షాల ఐక్యతా గీతానికి ఊపిరినిచ్చే ముఖ్య సంఘటన. ఉపఎన్నికలు జరిగిన ఐదు స్థానాలకు గానూ నాలుగింట కాంగ్రెస్, జేడీయూ కూటమి కైవసం చేసుకోవడమే కాకుండా భారీ మెజారిటీ సాధించడం ఆ కూటమి తిరుగులేని విజయానికి తార్కాణం. గత పదిహేనేళ్లగా ‘కమలం’ పార్టీకి కంచుకోటగా భాసిల్లుతోన్న బళ్ళారిలో లక్ష ఓట్ల మెజారిటీతో విపక్ష అభ్యర్థి గెలుపొందడం మామూలు విషయం కాదు. భాజపా ముఖ్యనేత యడ్యూరప్ప ఖాళీచేసిన లోక్‌సభ స్థానంలో ఆ పార్టీ మెజారిటీ గణనీయంగా అడుగంటిపోయింది. కలసి పోటీ చేస్తే భాజపాని, మోదీని ఓడించడం గొప్ప విషయమేమీ కాదన్న విశ్వాసాన్ని చాటుతున్నాయి. ‘మహా ఘట్‌బంధన్’ పేరుతో కూటమి ఏర్పాటుకి ఇక జనం మద్దతు పెరుగుతుంది. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి మరిన్ని పార్టీలు ముందుకొస్తాయి. కర్నాటక తరహాలో ఇతర రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఐక్యత దిశగా కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకుంటే, కొంచెం ఎక్కువ త్యాగం చేస్తే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి అనుకూలంగా ఉంటాయి. పెద్దన్నలా కాకుండా సంధానకర్తలా కాంగ్రెస్ పార్టీ వుంటే కూటమికి లాభం, తద్వారా తనకూ లాభం. జాతీయ స్థాయిలో భాజపాదే ప్రస్తుతం బలమైన స్థితి అన్న వాస్తవం, రానున్న ఎన్నికల దాకా గుర్తుంచుకోవాల్సిన నిజం. విపక్ష కూటమి విశ్వాసంతోబాటు వినయం ప్రోదిచేసుకోవాలి.
- డా.డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం