ఉత్తరాయణం

‘రద్దు’ల రాజకీయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ కశ్మీర్ గవర్నర్ ఆ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయడం ఫక్తు రాజకీయ నిర్ణయం. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధం. కేంద్రంలో పాలకపక్షం తన రాజకీయ అవసరాల దృష్ట్యా ‘రాజ్‌భవన్’ ద్వారా నెరవేర్చుకొన్న రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపం ఇది. గతంలో విభిన్న భావజాలం ఉన్నప్పటికీ పీడీపీ, బీజేపీ కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. దారులు మారాక బీజేపీ మద్దతు ఉపసంహరించగా ప్రభుత్వం పడిపోయి గత ఆరుమాసాలుగా అక్కడ రాష్టప్రతి పాలన సాగుతోంది. అసెంబ్లీని ‘సుప్త చేతనావస్థ’లో ఉంచారు. అంటే ఎప్పుడు ఏ పార్టీ తగు బలంతో ముందుకు వచ్చినా బలపరీక్ష చేసి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సి వుంటుంది. ఆ నేపథ్యంలో పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పాయి. వారి బలం కనీస మెజారిటీ 44కన్నా పది స్థానాలు ఎక్కువ. వారికి రాజ్యాంగ నియమాలను అనుసరించి బలపరీక్షకు అనుమతించల్సిన గవర్నర్ ఆ పని చేయడానికి బదులు ‘విభిన్నభావాలు కలిగిన వారం’టూ ముందస్తు తీర్పులు చెప్పి అసెంబ్లీని రద్దు చేశారు. గతంలో ప్రభుత్వం ఏర్పరచిన పీడీపీ, బీజేపీ ఒకే భావజాలం ఉన్న పార్టీలా? విభిన్న భావజాలం ఉన్న పార్టీలు రాష్టప్రయోజనాల దృష్ట్యా కలిసి పనిచెయ్యరాదని ఏమైనా నిబంధన ఉందా? ఏ పార్టీకీ మెజారిటీ రాని స్థితిలో ప్రభుత్వాలెలా ఏర్పడతాయి? అయినా ఆ పార్టీలు ప్రజల మద్దతుతో ఎన్నుకోబడినవి. నిషేధిత సంస్థలు కావు. ఎవరి బలాలు ఏమిటో తేలాల్సింది అసెంబ్లీలో బలపరీక్ష ద్వారా, కానీ గవర్నర్ ఇష్టానికొచ్చిన తీర్పుల ద్వారా కాదన్నది కోర్టులు స్పష్టపరిచాయి. అయినా ఈ పార్టీలన్నీ కలిసి ముందుకొచ్చింది, పీడీపీని చీల్చడానికి జరుగుతున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగానే. ఓ ఇద్దరు సభ్యులు ముందుకొచ్చి బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నిస్తామంటున్నారు. వారికన్నా ఎక్కువ బలంతో తస్మదీయులు ముందుకొచ్చేటప్పటికి గవర్నర్‌కి ఉపద్రవాలు కనబడసాగాయి. ఇలాంటి సందర్భాల్లో గవర్నర్ ప్రజాస్వామ్య నిబంధనలకు కట్టుబడి బలపరీక్షకు వారిని అనుమతిస్తే కేంద్రానికి ప్రశంసలు దక్కేవి. ఎన్నుకున్న ప్రజలకు గౌరవం ఇచ్చినట్లుండేది.
--డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

యథేచ్ఛగా వన్యప్రాణుల వేట
అడవుల్లో స్వేచ్ఛగా సంచరించాల్సిన వన్యప్రాణులు వేటగాళ్ల ఉచ్చులో పడి, మాంసాహార ప్రియులకు విందు భోజనంగా మారుతున్నాయి. తెలంగాణలోని వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో వేటగాళ్లు వన్యప్రాణులను వేటాడుతున్నారు. వాటి మాంసాన్ని పట్టణాలకు, నగరాలకు పలు మార్గాల్లో తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. వన్యప్రాణులకు ఉచ్చులు పెట్టడం, కరెంటు తీగలు అమర్చడం, మందుగుండు పేల్చి వాటిని హతమార్చడం వంటి ఘోరాలు జరుగుతున్నాయి. కొన్ని గ్రామాలలో ముఠాలుగా ఏర్పడిన కొందరు వన్యప్రాణులను వేటాడుతూ, వాటి మాంసాన్ని హోటళ్లు, రెస్టారెంట్లకు తరలిస్తున్నారు. కుందేళ్లు, దుప్పులు, అడవి పందులు, కొండగొర్రెలు, నెమళ్లు, జింకలు వేటగాళ్ల వలలోపడి ప్రాణాలు కోల్పోతున్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం కాగితాలకే పరిమితమవుతోంది. వీటిని రక్షించాల్సిన అటవీ అధికారుల్లో కొందరు అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఓ వైపు పోడు వ్యవసాయం వల్ల అడవులు అంతరించి పోతుండడం, మరోవైపు వేటగాళ్ల దాష్టీకానికి వన్యప్రాణుల సంఖ్య తగ్గుతుండడం కలవరపెట్టే పరిణామం. వరంగల్ రూరల్ జాల్లాలోని కొత్తగూడ, పాకాల అడవులు, జయశంకర్ జిల్లాలోని మహదేవపూర్, పలిమెల, వాజేడు, మహాముత్తారం, కాటారం, గూడూరు, మంగపేట, కన్నాయిగూడెం, వెంకటాపురం, ఏటూరు నాగారం మండలాల పరిధిలో ఈ వేట నిరాటంకంగా సాగుతున్నది. వేటగాళ్లను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలి. కనుమరుగవుతున్న వన్యప్రాణి సంపదను కాపాడాలి.
--కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట