ఉత్తరాయణం

అమెరికా వైఖరి గర్హనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెక్సికో సరిహద్దు గుండా అమెరికాలోకి ప్రవేశించేందుకు శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తున్న వలసకూలీలపై ట్రంప్ ప్రభుత్వం సైన్యాన్ని ప్రయోగించడం గర్హనీయం. ట్రంప్ చర్య మానవాళిపై జరిగిన నేరంగానే పరిగణించి యావత్ ప్రపంచం ఇటువంటి అమానవీయ చర్యను ఖండించాలి. అమెరికా అడుగులకు మడుగులొత్తే ఐక్యరాజ్యసమితి ఈ సంఘటనపై స్పందించి నిరసన గళం వ్యక్తం చేయాలి. మధ్య అమెరికా దేశాలు సైతం కలిసికట్టుగా నిలబడి ట్రంప్ ప్రభుత్వ దాష్టీకాన్ని ఎదిరించాలి. పేదరికం, హింస, అరాచకం రాజ్యమేలుతున్న గ్వాటెమాలా, హూండూరస్ వంటి మధ్య అమెరికా దేశాల నుంచి బతుకు తెరువుకోసం ఉత్తర అమెరికాకు వెళ్లిన బడుగుజీవులను అక్రమ చొరబాటుదారులు, కరడుగట్టిన నేరస్థులన్న ముద్రవేసి వారిపై బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లతో సైన్యం విరుచుకుపడడం అమానుషం. ఆశ్రయం కోరి వచ్చిన వారిపై సైన్యాన్ని ప్రయోగించడం అగ్రరాజ్యంగా, పెద్దన్నగా గొప్పలు చెప్పుకునే అమెరికా నిరంకుశ వైఖరికి నిదర్శనం. దుర్భరమైన పరిస్థితుల్లో, పొట్టకూటి కోసం సొంత గడ్డను వీడి ఉత్తర అమెరికాకు దండుగా కదిలిన వీరు అమెరికాకు టెర్రరిస్టులుగా కనిపించడం అగ్ర రాజ్యం హ్రస్వదృష్టికి నిదర్శనం. వీసాలు, విమాన ప్రయాణాలు చేయగలిగే ఆర్థిక స్థోమత లేని వ్యవసాయ కార్మికులు, ట్రక్కు డ్రైవర్లు, చిన్న చిన్న పరిశ్రమల్లో, గిడ్డంగుల్లో పనిచేసే కార్మికులే నెలల తరబడి వేల మైళ్లదూరం నడుచుకుని వెళ్తున్నారు. బయట ప్రదేశాల్లో సేద తీరుతూ, అతి కష్టం మీద మెక్సికో సరిహద్దుకు చేరుకుని అక్కడ అమెరికా వీసాకు దరఖాస్తుచేసుకొని ఆరు నెలలు గడిచినా వీరు ఓపికగా ఎదురుచూశారే తప్ప ఎలాంటి ఆందోళనలకు పాల్పడలేదు. అటువంటి బడుగుజీవులపై దాడులకు దిగి వారిని అతి దారుణంగా శారీరక హింసలకు గురిచేయడం అమానవీయ వైఖరికి పరాకాష్ఠ. ఇటీవలి మధ్యంతర ఎన్నికలలో చేదు అనుభవం ఎదురైనా ట్రంప్ గుణపాఠాలు నేర్చుకోకపోవడం బాధాకరం. మధ్య అమెరికాలో పేదరికం, నిరుద్యోగం, అభద్రత, అశాంతి, అరాచకం పెరగడానికి, ఆ దేశాలు పీకల్లోతు సంక్షోభంలో పెరిగిపోవడానికి అగ్రరాజ్యం పెత్తందారీ విధానాలే అసలు కారణం అన్న సంగతి గుర్తించి, పెత్తందారీ విధానాలకి ‘పెద్దన్న’ స్వస్తిపలికేలా ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా ఎదిరించాలి.
- సిహెచ్.ప్రతాప్, శ్రీకాకుళం
స్కూలు బ్యాగులపై మంచి ఆదేశం
పిల్లలకు స్కూలు బ్యాగుల బరువు తగ్గించమంటూ రాష్ట్రాల్ని కేంద్ర ప్రభుత్వం కోరడం అభినందనీయం. ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు హోమ్‌వర్క్ ఉండరాదని చెప్పడం, 10వ తరగతి వరకూ వివిధ స్థాయిలలో బ్యాగు బరువుపై నియంత్రణ విధించడం మంచి పరిణామం. ఈ సున్నితమైన స్పందనకు అనుగుణంగా ఇక రాష్ట్రాలు ప్రతి స్పందించాల్సి ఉంది. తమ బరువుకన్నా అధిక బరువుండే బ్యాగుల్ని చిట్టి భుజాలపై మోస్తూ ఆపసోపాలుపడే చిన్నారులు నేడు ప్రతిచోటా దర్శనమిస్తారు. వీధిబడి నుండి పేరుమోసిన టెక్నోస్కూల్ వరకూ ఇదే వరస. ఎంత బరువు పిల్లలపై మోపితే, అంత పెద్ద స్కూలు కింద లెక్క. ‘అట్లాస్’ భూమిని మోస్తున్న చిత్రం ఏ పిల్లవాడిని చూసినా గుర్తురాక మానదు. దానివల్ల ఎదిగే వారి వెనె్నముకపై కూడా దుష్ప్రభావాలు తప్పవు. ఇక హోమ్‌వర్క్ సంగతి చెప్పనక్కర్లేదు. బడినుండి ఇంటికి వచ్చిన వెంటనే మళ్లీ నిద్రపోయేవరకు వర్క్ చేస్తూనే కనబడతారు. ఆటలు, ఇష్టమైన పనుల ఊసే ఉండదు. చిన్నప్పుడే మానసిక వత్తిడికి గురయ్యే పరిస్థితులు చిన్నారులు అనునిత్యం ఎదుర్కొంటున్నారు. మానసిక వికాసం అవసరంపై ఆలోచన కూడా చేయలేని విద్యావ్యవస్థ ఒక అలవాటైన చట్రంలో ఇమిడిపోయింది. ఆ చట్రాన్ని ఛేదించి బాల్యాన్ని, మంచి చదువునీ పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందులో మొదటి దశకు కేంద్రం పూనుకొంది. విద్య అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం. రాష్ట్రాలు వెంటనే ఆ స్ఫూర్తిని అందుకోవాలి. వత్తిడి, బరువులేని ఆహ్లాదకరమైన చదువుని పిల్లలకు పరిచయం చెయ్యాలి.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
ఓటు బలమైన ఆయుధం
ఓటును హక్కుగానే కాకుండా మన కనీస ధర్మంగా, బాధ్యతగా భావించాలి. ఓటు వేసేటప్పుడు అభ్యర్థి మన ప్రాంతం వాడనో, మన కులం వాడనో, మన మతం వాడనో చూడకుండా అతని సామర్థ్యం చూసుకుని ఓటువేయడం మరచిపోవద్దు. ఓటు అనేది మనకు లభించిన గొప్ప ఆయుధం. అమూల్యమైన ఓటును సక్రమంగా వినియోగించుకోవడం మన బాధ్యత. బలమైన, నీతిపరమైన, నాణ్యమైన ప్రభుత్వం కోసం ఓటువేసి దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించే సమర్థవంతులైన నాయకులను ఎన్నుకోవాలి. కలిసిమెలిసి వున్న ప్రజలను రెచ్చగొట్టి, ప్రజలమధ్య చిచ్చుపెట్టేవారి పట్ల అప్రమత్తతగా ఉండాలి. పార్టీలకతీతంగా, ప్రజల బాధలు, అవసరాలు తెలిసిన వారిని చట్టసభలకు పంపాలి. పోటీ చేసేవారిలో అందరూ మంచివాళ్ళు లేకపోయినా, ఉన్నవారిలో కాస్త మంచివారిని ఎంపిక చేసుకోవడం మరవొద్దు.
- కాయల నాగేంద్ర, హైదరాబాద్