ఉత్తరాయణం

గమ్యం తప్పిన ‘ఎయిర్ ఇండియా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో ఎయిర్ ఇండియా సంస్థ దశాబ్దాల తరబడి సేవలందించడం ఆనందదాయకమైన విషయం. కానీ, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ అనుచిత నిర్ణయాలతో పెను రుణభారాన్ని ఈ సంస్థ మోయలేక మోస్తోంది. అయిదారేళ్ళుగా మన దేశంలో విమానయానం మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోనికి వచ్చింది. ప్రైవేటు విమానయాన సంస్థలతో పోటీ పడలేక- ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎయిర్ ఇండియా కూలబడిపోవడం బాధాకరం. రద్దీ మార్గాలలో కీలకమైన సమయాలను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కేటాయించడం, తక్కువ రద్దీ మార్గాలలో ఎయిర్ ఇండియా విమానాలను నడపడంతో సంస్థ ఆదాయ మార్గాలు మూసుకుపోయి ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. విదేశాలకు వెళ్ళే విమానాలలో ఎయిర్ ఇండియా విమానాల సంఖ్య ఎక్కువే అయినా ప్రైవేటు రంగ సంస్థలు చౌక ధరలకు ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. ప్రయాణికులలో ఎయిర్ ఇండియా వాటా 14.6 శాతం నుండి 12 శాతానికి పడిపోయింది. దానితో రుణభారం కొండలా 52వేల కోట్ల రూపాయలకు పెరిగింది. దేశీయ, అంతర్జాతీయ గమ్యాలకు చేరే 140 విమానాలు, 27వేల మంది సిబ్బందితో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ సంస్థ ఇప్పుడు ఉద్యోగులకు వేతన బకాయిలతో ఈసురోమంటూ నడవడం గర్హనీయం. వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి నెలకొల్పిన ప్రభుత్వరంగ సంస్థ రాజకీయ స్వార్థప్రయోజనాలకు, నేతల అతి జోక్యానికి తోడు అధికారుల వైఫల్యం, సిబ్బంది పనితీరు అధమ స్థాయిలో వుండడంతో ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది. ఇప్పటికైనా ఈ సంస్థలో నష్టాలను పూడ్చడానికి మార్గాలను అనే్వషించడానికి బదులు- దీన్ని ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నిస్తుండడం ‘రోగం ఒకటైతే చికిత్స వేరొకటి’ అన్నట్టు ఉంది. ఈ సంస్థను ప్రైవేటీకరిద్దామన్నా 510 కోట్ల డాలర్ల రుణ భారాన్ని తలకెత్తుకోవడానికి ఏ భారీ పెట్టుబడి సంస్థ కూడా సిద్ధంగా లేదు. ఎయిర్ ఇండియాను వేధిస్తున్న మరొక సమస్య సిబిఐ నిర్వహిస్తున్న విచారణలో వెలుగుచూస్తున్న ఆసక్తికర అంశాలైన ఎయిర్ ఇండియా- ఇండియన్ ఎయిర్‌లైన్స్ సంస్థల విలీనంలో చోటుచేసుకున్న అవకతవకలు, 11 విమానాలు, లీజులోని లొసుగులు, లాభదాయక మార్గాలను ప్రైవేటు సంస్థలకు కేటాయించడం వంటివి. గతంలో ఎందరో ప్రభుత్వాధికారులు, ఎయిర్ ఇండియా సిబ్బంది ప్రైవేట్ విమానయానసంస్థలకు అనుకూలంగా పనిచేసి ఈ సంస్థకు నష్టం వాటిల్లేలా నిర్ణయాలు తీసుకోవడం, సంస్థపై రాజకీయ నాయకుల పెత్తనం, సిబ్బందిలో జవాబుదారీదనం కొరవడడం, ఎయిర్ ఇండియాకు దేశవ్యాప్తంగా వున్న భూములు, భవనాలు, ఇతర స్థిరాస్థులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా లేకపోవడం తెలిసిందే. ఒకప్పుడు ఎంతో ప్రతిష్టాత్మక సంస్థగా ఉన్న ఈ సంస్థ ఇపుడు కోలుకోలేని పరిస్థితికి దిగజారింది. సంస్థకు సంబంధించి దేశ విదేశాలలో వున్న ఆస్తులను బేరీజు వేయడానికి ప్రభుత్వం బిడ్‌లను ఆహ్వానించినా అధికారుల నిర్లిప్త వైఖరితో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు కనిపిస్తున్నాయి. పైలెట్లు, సిబ్బంది వేతన బకాయిలు 1200 కోట్ల మేరకు పోగుపడడం సంస్థ దుస్థితిని తెలుపకనే తెలుపుతోంది. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణ ఉదంతంతో బ్యాంకులకు తల బొప్పికట్టి కొత్తగా రుణాలు ఇవ్వడానికి వెనుకాడడంతో ఈ సంస్థకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫలితంగా సేవలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడడం అత్యంత బాధాకరం. వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేయడం ప్రభుత్వాల అసమర్ధతకు, అస్తవ్యస్త విధానాలకు ప్రత్యక్ష తార్కాణం. ఇప్పటికైనా ప్రభుత్వాలు పైపూతలు మాని గాయానికి అసలు చికిత్స చేసేందుకు నడుం బిగించాలి.

- సి.కనకదుర్గ, హైదరాబాద్

డ్రైవింగ్ లైసెన్సులు అందక ఇక్కట్లు

ప్రతి వాహన చోదకుడు తగిన ధ్రువీకరణ పత్రంతోపాటు డ్రైవింగ్ లైసెన్సును విధిగా ఉంచుకోవాలని మోటారు వాహనాల తనిఖీ అధికారులు చెబుతున్నారు. ఇది రోడ్డు భద్రతా నియమాలలో అతి ముఖ్యమైనదని మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత 7 నెలలుగా వాహనాల రిజిస్ట్రేషన్ కార్డులు అందటం లేదు. 5 నెలలుగా డ్రైవింగ్ లైసెన్సుల కోసం ఆర్‌టీఓ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా వాహనదారులు తిరుగుతున్నారు. తెలంగాణలోని 31 జిల్లాల్లో డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్ కార్డులు అన్ని పనిదినాల్లో జారీ చేయడం ఆపివేశారు. ఆగస్టునుండి కొత్త డ్రైవింగ్ లైసెన్సుల జారీ నిలిపివేశారు. ఆన్‌లైన్‌లో కార్డులను వాహనదారులు పొందినప్పటికీ వాహనాల తనిఖీ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులకు చూపెట్టడానికి ఒరిజినల్ కార్డులు లేకపోవడంతో చాలామంది అసహనానికి గురి అవుతున్నారు. కొందరు మోటార్ వాహనాల ఇన్‌స్పెక్టర్లు, ట్రాఫిక్ పోలీసులు ఆన్‌లైన్ కార్డులు చూపిస్తే వదిలివేస్తున్నారు. మరికొందరు ఒరిజినల్స్ చూపాలని అడుగుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్న సమయంలో మొబైల్‌లో వెబ్‌సైట్ కనెక్టు కాకపోతే తమ జేబులు ఖాళీ కావటం తప్పటం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ కార్డు ఓపెన్ కాకపోతే జరిమానాలు చెల్లించవలసి వస్తోంది. కరీంనగర్ జిల్లాలో 7 ఆర్టీఏ కార్యాలయాల్లో దాదాపు 46వేల కార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. కార్డుల కాంట్రాక్టు పొందిన వారు డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్ లైసెన్సులను ప్రింట్ చేయడంలో జాప్యం చేయడంతో వాహనదారులు ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రతి పనిని కంప్యూటర్ ద్వారానే చేస్తారు. రోజూ ఎన్ని వేల కార్డులనైనా ప్రింట్ చేసే అవకాశం ఉంది. కానీ, వాహనదారులు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు. నేటి ఇంటర్నెట్ యుగంలో డ్రైవింగ్ లైసెన్సుల జారీ పట్ల ఇంత జాప్యం విచారకరం.

- రావుల లావణ్య రాజేశం, కరీంనగర్

గందరగోళంలో బ్రెగ్జిట్

యూరోపియన్ సమాఖ్య నుండి వైదొలగాలని నిర్ణయించుకున్న బ్రిటన్‌కు ఆ ముహూర్తం దగ్గర పడుతున్నా గందరగోళ పరిస్థితులు తప్పడం లేదు. బ్రిటన్ ప్రధాని థెరెసా మే ప్రతిపాదించిన విధి విధానాల ఒప్పందం పార్లమెంటులో ఆ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ పరాజయాన్ని పొందింది. చట్టసభలో సభ్యులు ఆ ఒప్పందాన్ని తిరస్కరించి ప్రధానికి గుణపాఠం చెప్పారు. అయితే, ఆమెపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఓడించి మద్దతు ప్రకటించారు. ముందురోజు ఆమె విధానాలను చెత్తబుట్టలోకి పంపి, రెండోరోజు ఆమె గౌరవాన్ని కాపాడారు. లేదంటే ఆమె రాజీనామా చెయ్యాల్సి వచ్చేది. ఇప్పుడు తిరస్కరించిన ఒప్పందం స్థానే ప్రత్యామ్నాయ ఒప్పందం పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అన్ని కార్యక్రమాలు మార్చి 29లోగా జరిగితే ఆ రోజునుండి సమాఖ్య నుండి బ్రిటన్ విడిపోతుంది. అందరికీ ఆమోదయోగ్యమైన ఒప్పం దం సిద్ధం కాకపోతే, ఏ ఒప్పందం లేని బ్రెక్జిట్ వచ్చే ప్రమాదముంది. అప్పుడు బ్రిటన్ ఉన్న పళంగా విడిపోవడంవల్ల నష్టపోయే ప్రమాదముంది. ఆ స్థితి రాకూడదంటే విడాకుల ముహూర్తాన్ని వాయిదా వెయ్యమని అడగడం కానీ లేదా సమాఖ్యలో కొనసాగుతామంటూ, అందుకు తగ్గట్టు ఆర్టికల్ 50 అమలుని వెనక్కి తీసుకోవడం కానీ ఆ దేశం చెయ్యాలి. సమాఖ్య వద్దంటూ ఇంతదూరం వచ్చాక అలా చెయ్యడం సబబేనా? అన్నది ఒక అనుమానం, ఒక అవమానం. లేదా ఎటూ తెగని ఐర్లాండ్ సరిహద్దు వివాదాన్ని అధిగమిస్తూ కస్టమ్స్ విషయంలో సమాఖ్యతో కలిసే ఉండడం లాంటి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ప్రస్తుతానికైతే బ్రిటన్‌కు, ముఖ్యంగా ప్రధానికి ఇరకాటం, గందరగోళం తప్పదు. యూరప్‌లో రాజకీయ, ఆర్థిక, సామాజిక మార్పుల ప్రభావం అన్ని దేశాలపై ఉంటుంది కనుక అక్కడి పరిస్థితులు చక్కబడాలని ఆశిద్దాం.
- డా. డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం