ఉత్తరాయణం

అంతరిస్తున్న భాషలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ వ్యాప్తంగా సుమారు 600 భాషలు అంతరించిపోయే దశలో ఉన్నాయని, గత 60 ఏళ్లలో 250కి పైగా భాషలు అదృశ్యమయ్యాయని నిపుణులు అంచనా వేశారు. ఒక భాష కనుమరుగైతే ఆ ప్రాంత సంస్కృతి కూడా అదృశ్యం అవుతుంది. ఏ ప్రాంతం వారైనా భాషాపరమైన వారసత్వాన్ని పరిరక్షించుకోవాల్సి ఉంది. సాంస్కృతిక వారసత్వ సంపద, మన భాషలను కాపాడడం రాజ్యాంగబద్ధమైన విధి. ప్రభుత్వం ఆ కర్తవ్యాన్ని విస్మరించినా భారతీయ పౌరులుగా మనం అలసత్వం ప్రదర్శించరాదు. ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేసి ఆధునిక తరానికి వాటిని పరిచయం చేయడం నేటి కర్తవ్యం. వేగంగా చొచ్చుకు వస్తున్న పాశ్చాత్య సంస్కృతి ప్రభావం మన భారతీయ భాషలపై ఎంతగానో వుంది. తమిళనాడు, కర్నాటక, కేరళ, మహారాష్టల్రు తమ భాష, సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వ సంపదను పదిల పరచుకునేందుకు ఎంతగానో కృషిచేస్తుంటే, అనవసరపు రాజకీయాల్లో పడి కొట్టుకుంటున్న తెలుగు రాష్ట్రాలు మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించడం బాధాకరం. భాషా పరిరక్షణ, అభివృద్ధిని బహుముఖ దృక్పథంతో కొనసాగించాలి. అది ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే ప్రారంభమై, ఉన్నత స్థాయి వరకు కొనసాగాలి. పౌరులందరూ తమ మాతృభాషపై మమకారం ఏర్పడేలా చూడాలి. పాలన మాతృభాషలోనే జరిగేలా ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళికలు చేపట్టాలి. మాతృభాషలను నేర్చుకున్న వారికి గౌరవం లభించేలా చూడాలి. భారతీయ భాషా ప్రచురణలను, పత్రికలను, పిల్లల పుస్తకాలను ప్రోత్సహించాలి. మాండలికాలు, జానపద సాహిత్యంపై దృష్టి సారించాలి. మాతృభాషను ప్రేమించడాన్ని చిన్నచూపుగా చూడరాదు.
- సిహెచ్ ప్రతాప్, శ్రీకాకుళం
సమస్యలతో సంక్షేమ హాస్టళ్లు
మన దేశంలో సంక్షేమ హాస్టళ్ళు నరక కూపాలను తలపించడం బాధాకరం. పేదపిల్లల విద్యాభ్యాసం ఆదిలోనే అడుగంటిపోకూడదని వారికి ఆశ్రయం, తిండి, బట్ట కల్పించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఏర్పరిచిన సంక్షేమ హాస్టళ్ళు ఎన్నో సమస్యలతో సతమతవౌతున్నాయి. వసతి గృహాలలో కనీస సదుపాయాలైన బాత్రూములు, మంచాలు, దుప్పట్లు లేక పిల్లలు ఎండావానలకు, చలిగాలులకు తట్టుకోలేక అనేక రోగాల బారిన పడుతున్నారు. ఉన్నత న్యాయస్థానం, మానవ హక్కుల సంఘం, లోకాయుక్త, ‘కాగ్’ వంటి సంస్థలు వీటి దుస్థితి గూర్చి ప్రభుత్వాలను నిలదీసినా పరిస్థితుల్లో కించిత్ అయినా మార్పు లేకపోవడం పేదల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి కొరవడిందని చెప్పకనే చెబుతోంది. రెక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజలు పిల్లల్ని చదివించుకుందామని ఈ హాస్టళ్ళకు పంపిస్తే అవి మురికివాడల కంటే కనాకష్టంగా వుండడం ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. పెచ్చులూడిపోయి, శిథిలావస్థలో వున్న భవనాలు, కనీస వసతులు లేని అద్దె భవనాలు, పారిశుద్ధ్యం సరిగ్గా లేని మరుగుదొడ్లు, బాలికలకైతే తగిన స్నానాల గదులు లేక అష్టకష్టాలుపడుతూ దుర్భర పరిస్థితుల్లో నెట్టుకురావడం మానవీయ విలువలను విస్మరించడం తప్ప మరొకటి కాదు. వసతి గృహాలు అపరిశుభ్ర పరిసరాలతో దోమలు, పందులకు కేంద్ర స్థానాలుగా మారడం, వాటిలోనే పేద పిల్లలు సహజీవనం చేయడం దురదృష్టం. తెలుగు రాష్ట్రాల్లోని సుమారు అయిదువేల ఎస్‌సి, ఎస్‌టి, బిసి సంక్షేమ హాస్టళ్ళలో సంక్షేమ స్ఫూర్తి ప్రశ్నార్ధకంగా వుండడం ప్రభుత్వాల నిర్లిప్త వైఖరికి నిదర్శనం. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్స్ సంక్షేమ హాస్టళ్ళపై నిర్వహించిన సర్వేలో పేద పిల్లల సంక్షేమానికి కేటాయించిన నిధులలో చాలా వంతు అక్రమార్కుల మధ్య పందేరం అవుతున్నట్లు హాస్టళ్ళలో అనారోగ్యకర, అమానవీయ పరిస్థితులు నెలకొన్నట్లు చేదు నిజాలను వెలికి తెచ్చినా, ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. పిల్లలకు పౌష్టికాహారమైన గుడ్లు, వారానికి ఒకమారు మాంసాహారం ఇవ్వాలన్న నిబంధనలకు నీళ్ళొదిలి బస్తాలకొద్దీ బియ్యం, టన్నులకొద్దీ ఆహార పదార్థాలు నల్లబజారుకు తరలింపబడడం, దీనిలో కింది స్థాయి సిబ్బంది నుండి పై అధికారుల వరకు వాటాలు వుండడం, ఇంత తెలిసినా సదరు అధికారుల పట్ల ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వీరి నిష్క్రియాపరత్వానికి ఒక మచ్చు తునక. కనీసం 20-30 సెంట్ల విస్తీర్ణం గల స్థలంలో వసతి గృహాలను నెలకొల్పాల్సి వుండగా కాసులకు కక్కూర్తి పడి పైన తలదాచుకునేందుకు ఒక కప్పు వుంటే చాలని అరకొర సౌకర్యాలతో పేద పిల్లల జీవితాలతో ఆడుకోవడం అమానుషం. ఇప్పటికైనా ప్రభుత్వాలు పేదల సంక్షేమాన్ని దస్త్రాలపై సరిపెట్టకుండా కార్యరూపం దాల్చితే ఎంతో మంది పేద పిల్లల జీవితాలలో వెలుగును నింపినవారవుతారు.
- సి.కనకదుర్గ, హైదరాబాద్