ఉత్తరాయణం

న్యాయం కనబడాలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాయం జరగడమే కాదు, అది జరిగినట్టు నిస్సందేహంగా కనబడాలి. అప్పుడే సామాన్యుడికి సైతం న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం కలుగుతుంది. ఆ విశ్వాసం సడలిపోతే న్యాయవ్యవస్థ మనుగడ ప్రమాదంలో పడుతుంది. మన దేశపు ప్రజాస్వామ్య వ్యవస్థకు శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు మూలస్తంభాలుగా నిలిచాయి. వాటిలో న్యాయవ్యవస్థకి మరింత ప్రాముఖ్యత కలిగిన బాధ్యత. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని మిగతా వ్యవస్థలు మీరకుండా చూడడంతో పాటు పౌరులకు దఖలుపడ్డ హక్కులు దక్కుతున్నాయా? లేదా? అన్నది నిర్ణయించే అత్యున్నత వ్యవస్థ అది. రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామిక విలువల్ని కాపాడడంలో, సవాళ్లు ఎదురైన ప్రతిసారీ మన న్యాయవ్యవస్థ ఆదర్శప్రాయంగా నిలిచింది. సామాన్యుడి విశ్వాసాన్ని నిలుపుకొంటూ వస్తోంది. అయితే, ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై మాత్రం సర్వోన్నత న్యాయస్థానం ఆదర్శనీయంగా స్పందించలేదు. ఆయనపై ఒక మహిళ లైంగిక ఆరోపణలు చేసినందున దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం స్పందించాల్సి ఉంది. ఒకవేళ అత్యంత అరుదైన కేసు అని అనుకుంటే అందుకు తగ్గ నియమాల్ని, విధానాల్ని, చట్టాల్ని సిఫారసు చేయాల్సి ఉంది. కానీ ఆరోపణ వచ్చిందే తడవుగా ఆ మహిళ ప్రవర్తనపై ముందస్తు తీర్పు ఇస్తూ, ఆమె ద్వారా న్యాయవ్యవస్థపై దాడి జరిగినట్టు అభివర్ణిస్తూ ‘నిందితుడి’ స్థానంలో ఉన్న న్యాయమూర్తి ప్రకటించారు. ఒక బాధిత మహిళ నోరువిప్పిన ప్రతిసారీ శక్తివంతమైన స్థానంలో ఉన్న ప్రతి నిందితుడు అదే చెబుతాడు. ఇక్కడ కూడా అలాగే జరిగితే తేడా ఏముంది? ఆదర్శం ఏముంది? ఒకవేళ తప్పుడు ఆరోపణలు, కుట్రలు అయితే వాటిని నిరూపిస్తేనే ఘనత దక్కుతుంది. చీఫ్ జస్టిస్‌పై ఆరోపణలు వచ్చాక ముగ్గురు న్యాయమూర్తులతో ఒక అంతర్గత కమిటీ వేశారు. రెండు రోజుల తర్వాత- ఆ కమిటీ పక్షపాతంతో వ్యవహరిస్తోందన్న భావనతో బాధిత మహిళ వారి ముందుకు వెళ్లనన్నారు. వెంటనే కమిటీ ఆమె ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తేల్చివేసింది. ఈ ఉదంతంలో సహజ న్యాయానికి వ్యతిరేక అంశాలు ఏవంటే- ఆమెతో న్యాయ సహాయకులను కమిటీ ముందుకు అనుమతించక పోవడం. ఉగ్రవాదుల తరఫునైనా న్యాయ సహాయాన్ని అనుమతించే మంచి సంప్రదాయమున్న న్యాయవ్యవస్థ మనది. ఆ మహిళకు ఒక అవకాశం ఇస్తే ఏమిటి నష్టం? పైగా ప్రొసీడింగ్స్‌ను రికార్డు చేయకపోవడం, తుది నివేదిక ఫిర్యాదుదారుకు అందజేయక పోవడం, వివరాలను బహిర్గతం చేయడానికి నిరాకరించడం, న్యాయ సమీక్షకు అవకాశం లేదని చెప్పడం... ఇవన్నీ న్యాయ వ్యతిరేక విధానాలే. బలవంతుడి ముందు వ్యవస్థ మోకరిల్లిందా? అనే అనుమానం బలపడేలా ఉన్న ఉదంతం ఇది. వ్యవస్థ గౌరవం ఇనుమడింపజేసేలా లేదు. అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తి అయినా, అత్యంత వెనుకబడి ఉన్న సాధారణ పౌరుడైనా న్యాయస్థానం ముందు సమానమే అన్న సందేశం ఇవ్వడానికి వచ్చిన అవకాశాన్ని న్యాయస్థానం చేజార్చుకుందని భావించడంలో తప్పు లేదు.

-డా. డీవీజీ శంకరరావు, పార్వతీపురం