ఉత్తరాయణం

రాజకీయ పునరుజ్జీవం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు ఐదో తరగతిలోనో, ఆరో తరగతి లోనో ‘బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవం’ గూర్చి మొదటిసారి తెలుసుకున్నాం. మన గురజాడ, కందుకూరి లాగానే ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్, రాజారామ్మోహన్‌రాయ్‌ల చరిత్ర, సమాజానికి వారందించిన సేవలు తెలిశాయి. మళ్ళీ ఇన్నాళ్లకు ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్‌ను బెంగాల్‌లో రాజకీయ పార్టీలు గుర్తుకు తెచ్చాయి. అదీ మంచి దారిలో కాదు. ఆయన విగ్రహాన్ని పట్టపగలు కూల్చేయడం ద్వారా. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ ఆ నిర్వాకం మీదంటే మీదని ఆరోపించుకొంటున్నా ఈ ఘటనకు రెండు పార్టీల వారూ బాధ్యులే. బాధ్యతారహిత రాజకీయాల నుండి విలువల రాజకీయాల పునరుజ్జీవనం జరగాల్సిన అవసరాన్ని ఈ ఎన్నికలు గుర్తుచేస్తున్నాయి. విద్యాసాగర్ విగ్రహ ధ్వంసం ద్వారా తాజా రాజకీయాల దివాలాకోరుతనం మరొక్కసారి బలంగా తెలియవచ్చింది.
ఈసారి సార్వత్రిక ఎన్నికలు ప్రజల్లో సాంప్రదాయక పార్టీల పట్ల నిరాశను నింపాయనడంలో అతిశయోక్తి లేదు. నలభై రోజుల క్రితం మొదలైనప్పటి నుంచి ఆఖరి దశ పోలింగ్ వరకూ దిగజారుడు ప్రచారాలు కొత్త లోతుల్ని చూశాయి. హింసాత్మక ఘటనలకు, డబ్బు ప్రభావానికి పరాకాష్టగా ఎన్నికలు తయారయ్యాయి. ఎన్నికల నిర్వహణకు ఏడేసి విడతలు, నెలకు మించిన రోజులు తీసుకున్న ఎన్నికల సంఘం తన బాధ్యతా నిర్వహణలో విఫలమైంది. ఎన్నికల్లో అక్రమాల్ని అడ్డుకోవడం లాంటి పెద్ద బాధ్యతలు దేవుడెరుగు! పార్టీలు ఎన్నికల నియమావళికి కట్టుబడేలా కూడా ఈసీ చూడలేకపోయింది. బెంగాల్‌లో ఎన్నికల ప్రచారాన్ని కుదించడం లాంటి అసాధారణ నిర్ణయం తీసుకుంది కానీ అందుకు కారణమైన పార్టీల దుడుకుతనాన్ని నియంత్రించలేకపోయింది. ముఖ్యంగా ఆ రాష్ట్రానే్నలుతున్న మమతా, దేశానే్నలుతున్న భాజపా ఒకర్ని మించి ఒకరు తప్పులు చేసినా ఈసీ నిష్పక్షపాతంగా, నిఖార్సుగా వ్యవహరించలేకపోయింది. పాలకుల్ని వేలెత్తి చూపే సాహసం చెయ్యకపోవడం స్పష్టంగా కనబడుతోంది. సాంకేతికంగా ఎంత ముందంజ వేసినా, పోలింగ్‌ను విరివిగా విడగొట్టి ఎన్ని దశలుగా మార్చినా ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తి, రాజకీయ పార్టీలకు స్వయం నియంత్రణ అలవడకపోతే ఫలితం సున్నా. ఎన్నికల్లో నల్లడబ్బు, నేరం, హింస, తప్పుడు ధోరణులు నియంత్రించాలంటే ఎన్నికల సంఘం బలోపేతం కావాలి. రాజకీయ సమానత్వం లాంటి భావనలు, ప్రజాస్వామిక విలువలు ఎక్కడున్నాయో? అని వెతికి చూడాల్సిన దుస్థితిలోకి నెట్టబడిన ఎన్నికల ప్రక్రియ సమూలంగా సంస్కరింపబడాలి. పౌర సమాజం మేల్కోవాల్సిన సమయమిది.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం