ఉత్తరాయణం

మోదీ దిశానిర్దేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదిహేడో లోక్‌సభ కొత్తగా కొలువుతీరిన తరుణంలో అఖిల పక్షాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు స్ఫూర్తిమంతంగా ఉన్నాయి. ‘సమావేశాలను ఆటంకపరచడం ద్వారా ప్రజల మనసుల్ని గెలవలేం, రాజకీయ విభేదాల్ని విస్మరించి పార్టీలన్నీ దేశ ప్రగతి కోసం అవిశ్రాంతంగా పనిచేయాల’న్న మోదీ దిశానిర్దేశం భేషుగ్గా వుంది. గత కొన్ని సంవత్సరాలుగా పార్లమెంటు వేదిక రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు, ప్రతివిమర్శలు, ధర్నాలు, ఆందోళనలు, వాకౌట్లతో దద్దరిల్లుతూ విలువైన సమయం వృథా కావడం పట్ల ప్రజాస్వామ్యవాదులు తీవ్ర ఆందోళనలు వెలిబుచ్చుతున్నా మన ప్రజాప్రతినిధులలో కాస్తంత మార్పైనా రావడం లేదు. గత రెండు లోక్‌సభలు వాటికి కేటాయించిన సమయంలో 70 శాతం సమయం వృథా అయ్యిందని ఇటీవల పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తన నివేదికలో తేల్చింది. అతి ముఖ్యమైన బిల్లులు అర్థవంతమైన చర్చలు లేకుండానే ఆమోదం పొందడం, మరికొన్ని ఆర్డినెన్సుల రూపంలో దొడ్డిదారిన అమలు కావడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం. స్వపక్షమా? విపక్షమా? అన్నది పక్కనపెట్టి నిష్పక్షపాత స్ఫూర్తితో దేశ విస్తృత ప్రయోజనాల కోసం అందరం కృషిచేయాలన్న ప్రధాని ఆదర్శం ఆచరణలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి మరింతగా పరిఢవిల్లుతుంది. ప్రజాప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా శాసనాలు చెయ్యడం, జవాబుదారీతనాన్ని నెలకొల్పడం ప్రజాప్రతినిధుల బాధ్యత. అన్ని నిర్ణయాలలో విపక్షాలను కలుపుకోవాలన్న వివేచన పాలకపక్షంలో, సమావేశాల్ని స్తంభింపజేయడం ద్వారా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని జవాబుదారీ చేసే అవకాశాన్ని చేజార్చుకొంటున్నామన్న ఆలోచన విపక్షాల్లోనూ కలగనంత కాలం చట్టసభలు సజావుగా సాగడం చాలా కష్టం.
- సి.కనకదుర్గ, హైదరాబాద్
ప్రైవేటు స్కూళ్లకు నజరానాలా?
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లుల పేరిట ఏటా పదిహేను వేల రూపాయలు జమచేస్తామని ఎన్నికల ముందు వైకాపా అధినేత జగన్ హామీ ఇచ్చారు. ఆయన అధికారం చేపట్టాక ప్రైవేటు బడుల్లో చదువుకునే వారికి కూడా సహాయం వర్తింపచేస్తారని ప్రకటించారు. ఇది అమలు జరిగితే అంతంతమాత్రంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితి ఉంది. వేలాది రూపాయలు జీతం పొందే ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారు. తమ బిడ్డలకే చదువు చెప్పలేని పంతుళ్లు మా పిల్లలకేమి ఒరగపెడతారని నిరుపేదలు, అల్పాదాయ వర్గాల వారు తమ బిడ్డల భవిష్యత్తుకై కానె్వంట్ల బాటపడుతున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో వసతులు కల్పిస్తానని ముఖ్యమంత్రి సెలవిస్తున్నారు. అంతకంటే ముందు ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు తమ పిల్లలను విధిగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని, అలా చేయని వారికి రాయితీలు, ఇంక్రిమెంట్లు, పదోన్నతులు నిలుపుదల చేస్తామని ఆదేశాలు ఇవ్వాలి. ప్రజాప్రతినిధులు కూడా తమ వారసులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీచేసేందుకు అవకాశం ఇవ్వరాదని చట్టం చేస్తే కొంతైనా మార్పు రాగలదు. ఇప్పటివరకూ ఏ పార్టీ అధికారంలో ఉన్నా సర్కారు బడులపై సవతితల్లి ప్రేమ ఒలకబోసిందనే చెప్పాలి. ప్రభుత్వోద్యోగుల పిల్లలు కానె్వంట్లో చదివితే ఎలాంటి ఆర్థిక సహాయం చేయరాదు. ప్రభుత్వ విద్యాలయాలు దేవాలయాలుగా రూపాంతరం చెందాలంటే రాజకీయ కోణంలో లాభనష్టాలను బేరీజు వేయకుండా పటిష్ట ప్రణాళికతో ముందుకు నడిస్తే విద్యారంగానికి మేలు జరుగుతుంది.
-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం
‘స్థానిక’ ఎన్నికలు ప్రామాణికం కావు
గ్రామసీమల్లో స్థానిక రాజకీయాలకు అనుకూలంగా భిన్నమైన పొత్తులు కలిగి ఇటీవలి ఎన్నికల్లో తెరాస అధికారాన్ని చేజిక్కించుకుంది. దీన్ని గొప్పలు చెప్పుకుంటూ పోయింది. ఆయా గ్రామాల్లో బలంగా ఉన్న పార్టీకి వ్యతిరేకంగా జట్టుకట్టి తెరాస వారు పంచాయితీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకుంది. భావసారూప్యం లేని పార్టీలతో పొత్తుపెట్టుకుంది. నిజానికి ఇది గెలుపుకాదు. కొన్ని చోట్ల వామపక్షాలతో, మరికొన్ని చోట్ల ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకుంటే ఇతర పార్టీలలో గెలిచిన వారిని తమవైపు తిప్పుకుంది. గతంతో పోల్చిచూస్తే భాజపాకు సంఖ్యాబలం పెరిగింది. అది తక్కువైనప్పటికీ కొంతమేరకు అధికార పార్టీపై ప్రభావం చూపింది. కొన్నిచోట్ల తెదేపా వంటి పార్టీలు కూడా గెలుపొందాయి. ఇది రహస్య పొత్తుల విజయం. దీన్ని తమ బలానికి ప్రాతిపదికగా భావించరాదు. ఎన్ని చెప్పుకున్నా గతంలోకంటే కొంత వ్యితిరేకత అధికార పార్టీపై జనాల్లో ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. హుజూర్‌నగర్ అసెంబ్లీ సీటుకు జరిగే ఉప ఎన్నిక తెరాసకు సవాల్‌గా మారవచ్చు. అధికారపార్టీ రానున్న నగర పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపు కోసం అప్పుడే కొన్ని తాయిలాలను ప్రకటిస్తోంది. ముందు జాగ్రత్త చర్యలతో సంసిద్ధమవుతోంది.
-అయినం రఘురామారావు, ఖమ్మం