ఉత్తరాయణం

అన్నదాతకు భరోసా ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశీయంగా ఒకప్పుడు 82 శాతం ఉన్న వ్యవసాయ కుటుంబాలు- నేడు 62 శాతానికి కుదించుకు పోవడం పాలనాపరంగా ప్రభుత్వాలు చేయూత నివ్వకపోవడం, అన్నదాతలను ప్రోత్సహించే నైజం పాలకులకు లేకపోయాయన్నది కఠోర వాస్తవం. భూమిని నమ్ముకొని రైతులు, వారి కుటుంబ సభ్యులు నిరంతర కష్టంతో పంటలు సాగుచేస్తారు. పంట ఉత్పత్తుల అంచనాలతో కుటుంబ వ్యవస్థ ప్రగతిని రైతు ఆశిస్తాడు. ఆశించిన ఫలితాలు రాక పంట ఉత్పత్తులు తగ్గితే అతని కుటుంబం అవస్థల పాలుకాక తప్పదు. బడా భూస్వాములు సైతం ఖర్చులను భరించలేక, తమ భూములను కౌలుకు అప్పగించి, నగరాలకు వలసపోయి అక్కడ నిక్షేపంగా తమ వ్యవహారాలు చూసుకొంటూ అక్కడే షాపింగ్ కాంప్లెక్సులనో, లేదా చిన్నపాటి పరిశ్రమలనో నెలకొల్పి ఆదాయ వనరులను అందిపుచ్చుకుంటున్నారు. భూస్వాములు కౌలు రైతులపై నమ్మకంతో భూమిని అప్పగించి వెళ్ళడం మానవీయం. మరికొందరు భూస్వాములు భూమి కౌలుకుకావాలంటే నిర్ణీత రొక్కం చెల్లిస్తేగాని భూమిలోకి అడుగుపెట్టనివ్వరు. కాళ్ళావేళ్ళాపడి అడుక్కొంటే అంతోఇంతో ముందస్తుగా చెల్లిస్తే భూమిని కౌలు రైతులు సాగుచేసుకొనే వీలుంటుంది. తన భూమిని ఫలానా రైతుకు కౌలుకిచ్చాననో, ఇన్ని సంవత్సరాలు ఆ రైతు కౌలుకు చేసుకుంటాడనో తెలిపే ధ్రువపత్రం కౌలురైతులకు రాసి ఇవ్వడానికి భూస్వాములు సమ్మతించరు. అలాంటి పత్రాలిస్తే ముందుముందు కౌలు రైతులకే ఆ భూములను కట్టబెట్టేందుకు ప్రభుత్వాలు వెనుకాడబోవని వారి నిశ్చయాభిప్రాయం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కౌలురైతుల వ్యవసాయ సాగుకు బ్యాంకులు రుణాలు ఇచ్చే పరిస్థితులు ఏమాత్రం ఉండబోవు. భూమిని సాగుచేసుకోమని అందుకు గాను కౌలును డిమాండ్ చేస్తున్న భూస్వాముల కర్కశవైఖరిని కౌలురైతులే కాదు, మిగతా రైతాంగం, రైతాంగ నాయకులు తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నూట ముప్పై కోట్ల జనాభాకు మూపూటల ఆకలితో అలమటించకుండా జాతీయ వ్యవసాయ ఉత్పత్తులను పెంచిపోషించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి జాతికి పట్టెడన్నం ప్రసాదించే రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచే ప్రణాళికలను రూపొందించాలి. కార్యాచరణలో స్పష్టమైన ఫలితాలను రాబట్టే క్రియాశీలకతను ప్రభుత్వాలు అందించాలి. కరవు కాటకాలతో కటకటలాడే రాష్ట్రాలను, ప్రాంతాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలి. ఎప్పుడో చేద్దాం, చూద్దాం అనే ప్రాతిపదికకు అతీతమైనది కరువు. నోరు తడుపుకోవడానికి సైతం నీళ్లు కరవైన వైనం, అందరికీ అందని ఆహారం, రైతాంగం సాగుచేసుకోవడానికి ఆర్థిక సహాయం, విత్తనాలు, క్రిమిసంహారక మందుల కొనుగోలు వంటివి రైతులకు భారం అవుతున్నాయి. బోలెడంత ఖర్చుతో దుక్కిదున్ని, విత్తనాలు, శుద్ధిమందులతో కూలీలు దొరకని అవస్థలో ఎలాగోలాగ అదనూ, పదనూ మీరిపోతుందనే ఆతృతతో విత్తనాలు వేసినా భవిష్యత్‌పై వారికి ఆందోళనే. చినుకులు పడగానే మొలకెత్తిన విత్తనాలు నాలుగాకులు వేయకముందే కరువురక్కసి కాటువేస్తే ప్రకృతి వైపరీత్యంగా ప్రభుత్వాలు గుర్తించి రైతాంగాన్ని ఆదుకొనేందుకు యుద్ధప్రాతిపదికన సహాయ సహకారాలు అందించి రైతాంగానికి భరోసా కల్పించాలి.
వ్యవసాయ సీజను మొదలైందని, అదనూపదనులో విత్తనాలు విత్తితే అనుకొన్న విధంగా ఉత్పత్తిని సాధించవచ్చని రైతాంగం భావిస్తుంది. పట్టెడన్నం ప్రసాదించే కర్షకులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నివిధాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు సేంద్రియ వ్యవసాయం పట్ల అవగాహన పెంపొందించడమే కాకుండా ఆర్థికపరంగా వారిని ఆదుకొనే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలి.
-దాసరి కృష్ణారెడ్డి, పుంగనూరు
రుణమాఫీ మాట మరచారా?
గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఐదు విడతల ఋణమాఫీలో ఇప్పటికి మూడు విడతలు సహాయం రైతులకు అందజేశారు. 4, 5 విడతల ఋణమాఫీ ప్రకటించిన తర్వాత ఎన్నికలొచ్చాయి. నేడు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఏదైనప్పటికీ పాలనా యంత్రాంగం ఒక్కటే! ప్రజలందరూ ఒక్కటే! ఋణమాఫీని అమలు చేసేది రాజకీయ పార్టీలు కాదు, రాష్ట్రాన్ని పాలించే ప్రభుత్వాలే! కోర్టులు జోక్యం చేసుకొని ప్రభుత్వం ఇవ్వవలసిన ఋణమాఫీని ఇచ్చేట్లు చేయాలి. ఇది రైతులు కోరే న్యాయమైన కోరిక! ఇది ప్రభుత్వం ఇవ్వవలసిన బాకీయే! ఇది ప్రభుత్వ బాధ్యత. రైతు సంఘాలు కూడ దీనిపై గట్టిగా పోరాడాలి.
-జి.శ్రీనివాసులు, అనంతపురము
రైలు, జలరవాణా మేలు
కొత్త హైవేల నిర్మాణాలకు 15 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గడ్కరీ ప్రకటించడం హర్షణీయం. అలాగే రైలు. జల మార్గాలకు సైతం అధిక ప్రాధాన్యత నివ్వాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడచినా (డబ్లింగ్, గేజ్ మార్పిడి మినహాయిస్తే) బ్రిటీష్ వారు వేసిన రైలు మార్గానికి మరో 20% మాత్రమే కొత్త మార్గాలు వేశారు. ఆ కొత్త మార్గాలు, కొత్త రైళ్లను కొందరు రైల్వే మంత్రులు తమ ప్రాంతాలకే తగిన డిమాండు లేకపోయినా వేయించుకున్నారు. రద్దీ ఎక్కువున్న దక్షిణ మధ్యరైల్వేలో తగినన్ని రైళ్లు లేక రోడ్డు రవాణా పెరిగింది. రోడ్డు ప్రమాదాలతో ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కేంద్రం సురక్షిత మార్గాలైన రైలు, జల మార్గాలకు తగిన ప్రాధాన్యత నివ్వటం లేదు. హైవే పనులు హైస్పీడులో పరుగెడుతుంటే, జల, రైలు మార్గాలకు మహర్దశ అంటూ దశాబ్దాలుగా వూరిస్తూ, బకింగ్‌హాం వంటి జల మార్గాలకు సంబంధించిన ప్రతిపాదనలు నెమ్మదిగా సాగుతున్నాయి. పెరిగిపోతున్న వాహన వినియోగంతో కాలుష్యం పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కేంద్రం ఇకనైనా రైలు, జలమార్గాలను త్వరితగతిన పూర్తిచేసి వాహన వినియోగం తగ్గిస్తే, ఇంధన ఖర్చులు, దిగుమతులు గణనీయంగా తగ్గటమే గాక ప్రజలకు, పర్యావరణానికి మేలు జరుగుతుంది. సరుకు రవాణా ఖర్చులు బాగా తగ్గుతాయి. గుంటూరు- తిరుపతి, గుంటూరు- మార్కాపూర్, దొనకొండ వంటి రద్దీ ప్రాంతాలకు పగటి పూట రైళ్ల సంఖ్యను పెంచితే అన్ని వర్గాలకూ మేలు చేకూరుతుంది. కొత్త బడ్జెట్‌లోనైనా జల, రైలు మార్గాల, సర్వీసుల విస్తరణకు పార్లమెంటు సభ్యులు కేంద్రంపై వత్తిడి తేవాలి.
-తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట