ఉత్తరాయణం

‘గాంధీ’ రహిత కాంగ్రెస్ సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చెయ్యడం మంచి నిర్ణయం. ఆ నిర్ణయంలో చిత్తశుద్ధి, నిజాయితీ ఏమేరకన్నది తెలియాలంటే మరికొంత సమయం పడుతుంది. మరికొన్ని పరిణామాలు చూశాకే ఆ విషయం చెప్పగలం. తనలాగే ఇంకా చాలామంది బాధ్యత వహించాల్సి ఉంటుందన్న ఆయన మాటలు సత్యదూరం కావు. కాంగ్రెస్ పార్టీ, ఆమాటకొస్తే ఏ జాతీయ పార్టీ అయినా బలహీనం కావడం దేశానికి మంచిది కాదు. అధికార పక్షానికి దీటుగా బలమైన ప్రతిపక్షం ఉన్నపుడే ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ మాట ప్రతిపక్షాలనుద్దేశించి సాక్షాత్తూ ప్రధాని మోదీయే చెప్పారు. మీ సంఖ్య తక్కువని చింతించవద్దు, మీ గొంతు ప్రజలకు అవసరమని ఆయన విపక్షాలనుద్దేశించి ఇటీవల అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే దాని సుదీర్ఘ చరిత్రలో గాంధీ కుటుంబం తప్ప ఇతరుల నాయకత్వానికి కట్టుబడిన సందర్భాలు అత్యంత అరుదు. కొద్దికాలం పాటు సీతారాం కేసరి, మరికొంచెం ఎక్కువకాలం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అధ్యక్షులుగా వ్యవహరించారు. వారు అధ్యక్షులుగా ఉన్న కాలంలో కూడా గాంధీ కుటుంబానికి వీరభక్తులుగా చెలామణి అయిన నేతలలో ఇబ్బందులు, తలనొప్పులు పడ్డారు. కాంగ్రెస్ పార్టీకి గాంధీలను మించి, గాంధీ భక్తులతోనే అసలు పేచీ. ఒకవేళ నిజంగానే రాహుల్ గాంధీ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దూరంగా ఉంటూ వేరే నేత నాయకత్వంలో పార్టీని నడవనిస్తే అది మనసావాచా కర్మణా జరగాలి. పైకి ఎవరినో ఉండనిచ్చి తెరవెనుక స్వంత భక్తుల భజనల్ని అనుమతిస్తే ఫలితం ఉండబోదు. అయినా నేత మారినంత మాత్రాన పార్టీ రాత మారదు. పార్టీ సంస్కృతి, పనితీరు మారాలి. క్షేత్ర స్థాయిలో కార్యకర్తల్ని, రాష్ట్ర స్థాయిలో నాయకత్వాన్ని ప్రజల దృష్టిలో ఎదగనివ్వాలి. పార్టీ పదవుల ఎంపికల్లో పారదర్శకత, అంతర్గత ప్రజాస్వామ్య ధోరణులు ప్రతిబింబించాలి. రాహుల్ గాంధీ తప్పుకుంటే ఆ స్థానానికి ఇప్పటికే ఓ పది మంది పేర్లు చెప్పగలిగిన స్థాయిలో ఆ పార్టీ ఉండాల్సింది. వైఫల్యం చెందినప్పుడే దేశవ్యాప్తంగా ముప్ఫై శాతం ఓట్లు సాధించిన పార్టీ అది. ఇప్పటికిప్పుడు ఆ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టి దిశ మార్చగల జాతీయస్థాయి నేత ఒక్కరూ కనబడడం లేదంటే ఆ పార్టీ తీరులోనే లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. సమూల ప్రక్షాళనకు, పునరుజ్జీవనానికి ఆ పార్టీకి ఇదే మంచి సందర్భం. చిత్తశుద్ధితో పార్టీ ఎదగడానికి కృషిచేస్తే, ఆ పార్టీకే కాక దేశ రాజకీయాలకు కూడా మంచి జరుగుతుంది.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
కామాంధులకు శిక్షలు పడాలి
వరంగల్‌లో తొమ్మిదేళ్ల బాలికపై ఓ మృగాడు అతి పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఉదంతం ప్రజలందరినీ దిగ్భ్రాంతిలో ముంచి వేసింది. ప్రకాశం జిల్లాలో 16 ఏళ్ళ అమ్మాయిని గ్యాంగ్‌రేప్ చేసి చంపేసిన ఉదంతం కలిచివేసింది. ‘నిర్భయ’ వంటి కఠిన చట్టాలు తీసుకువచ్చినా మహిళలపై దారుణంగా కామాంధులు తెగబడడం చూస్తుంటే క్షేత్ర స్థాయిలో సదరు చట్టాల పనితీరు అధ్వానంగా వుందని అర్థవౌతోంది. న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ పట్ల భయం లేకపోవడం వలనే వీరు చెలరేగిపోతున్నారు. కేసులు నమోదుచేసి, విచారణ పూర్తిచేసి అనంతరం శిక్ష పడే సరికి కనీసం పుష్కరకాలం పడుతోంది. ఈలోగా నిందితులు దర్జాగా కాలం వెళ్ళబుచ్చుతున్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా కేసులు పరిష్కరించాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు. ఈ కేసుల్లో నిందితులు అధిక భాగం సైకోలో లేక తల్లిదండ్రుల పెంపకం లోపం కారణంగా చిన్ననాటి నుండే బరితెగించిన యువకులే కావడం విశేషం. సమాజానికి భారంగా పరిణమిస్తోన్న ఇటువంటి వారిపై ప్రభుత్వం, తల్లిదండ్రులు ఒక కంట కనిపెడుతూ వుండాలి. తమ పిల్లలను క్రమశిక్షణతో, నైతిక విలువలతో పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
- సి.సాయిప్రతాప్, హైదరాబాద్
డ్రైవర్ల నిర్లక్ష్యంతో ప్రమాదాలు
ఇటీవల ఆర్టీసీ బస్సులకు కొందరు డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్ టేకింగ్‌ల పేరుతో ఇతర వాహనాలను ఢీకొనటం పరిపాటిగా మారింది. వెనుక నుండి ద్విచక్ర వాహనాలను ఢీకొట్టడం, అధిక స్పీడ్‌తో అదుపుతప్పి రోడ్డుపక్కకు పోవటం, చెట్లను ఢీకొనటం జరుగుతోంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అనే నినాదం కొందరు డ్రైవర్లు మూలంగా తప్పుతోంది. దీనికితోడు భారీ వాహనాలైన లారీలు సైతం అతివేగంతో ద్విచక్ర వాహనాలను ఢీకొనటంతో ఎక్కువగా మరణాలు సంభవించటం జరుగుతోంది. ప్రతినిత్యం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోవలసి వస్తోంది. ఈ ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత రవాణాశాఖ అధికారులపై ఉంది. కొందరు సేఫ్‌గా డ్రైవింగ్ నిర్వహించినా రాంగ్‌రూట్‌లో వచ్చి ఢీకొనటం జరుగుతోంది. ప్రయాణికుల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. కాలం చెల్లిన బస్సులు కూడా ప్రమాదాలకు కారణం. వాటిని తొలగించాల్సిన అవసరం ఉంది.
- ఎ.ఆర్.ఆర్.ఆర్, ఖమ్మం

పీఠాల గౌరవాన్ని కాపాడండి
ప్రపంచ శాంతికి, వేదాల పరిరక్షణకు పాటుపడడంతో పాటు ఆధ్యాత్మిక ప్రవచనాలతో ప్రజలకు మానవత్వ విలువలను తెలియజేసేందుకు, సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటి చెప్పడానికి హిందూమతంలో పీఠాలు ఏర్పడ్డాయి. రాగద్వేషాలకు అతీతంగా తామరాకు మీద నీటిబొట్టులా ఎంతటి వారికైనా దూరంగా, అందరిని దగ్గరకు చేర్చేటట్టు వ్యవహరించి జీవించే వారే పీఠాధిపతులు. ఇటీవల విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తన ఆశీస్సులు అందచేయడం వరకు బాగానే ఉంది. కానీ, ఇద్దరు ముఖ్యమంత్రుల్లో ఒకరు నా ప్రాణం, మరొకరు నా ప్రాణ సమానమని, ఒకరు అగ్నిసాక్షిగా తన ఆత్మ అనడం పరమ విడ్డూరంగా ఉన్నది. శత్రువులు, మిత్రులనే వ్యత్యాసం లేకుండా ఒకేలా ప్రవర్తించవలసిన పీఠాధిపతికి ఇది తగునా? తన తపస్సు వల్లనే వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పడం స్వామీజీ అతిశయ ప్రవృత్తిని తెలియజేస్తున్నది. స్వామీజీ ఆధ్యాత్మికవాదులు, తపస్సంపన్నులే కావచ్చు. కాని దైవం మాత్రం కాదు. గతంలో కాకినాడ శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ తరఫున ప్రచారం చేసి భంగపడ్డారు. పీఠాధిపతులు ఎల్లప్పుడూ ఆశ్రమ ధర్మాన్ని పాటించాలి. పీఠాలకున్న గౌరవాన్ని నిలబెట్టాలి. అప్పుడే అన్ని రకాల ప్రజలలో వారు పూజింపబడతారు.
-డా. ఎన్.ఎస్.ఆర్.మూర్తి,
సికిందరాబాద్