ఉత్తరాయణం

ప్రభుత్వ సంస్థల నిర్వీర్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభివృద్ధి చెందిన దేశాలు ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేసేలా చర్యలు చేపడుతుండగా మన దేశంలో మాత్రం అందుకు భిన్నంగా ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుండడం దురదృష్టకరం. ఇది తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్న చందాన వుంది. ప్రయివేటు పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా ప్రవేశించడానికి వీలుకల్పిస్తూ ప్రయివేటీకరణకు మార్గాన్ని సుగమం చేసేలా ప్రభుత్వరంగ సంస్థల నుండి పెట్టుబడుల ఉపసంహరణలపై ప్రభుత్వం వచ్చే అయిదేళ్లలో నిర్ధిష్ట లక్ష్యాలను ఏర్పరచడం అనుచితం. ఇప్పటివరకు ఖాయిలాపడిన సంస్థలను విక్రయించడం జరుగుతుండగా, ఇకపై లాభాల బాటలో పయనించే సంస్థలను కూడా ప్రైవేట్‌పరం చేయనున్నారని తెలుస్తోంది. విమానాశ్రయాల నిర్వహణ, ప్రభుత్వ సంస్థల నుండి ప్రభుత్వ వాటా ఉపసంహరణ, అన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతోనే స్థాపించడం, బీమా, వైద్యం వంటి రంగాలలో ప్రైవేట్ సంస్థల ప్రవేశం వంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.1,05,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణకు మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకొంది. ప్రభుత్వ రంగ సంస్థల ‘వ్యూహాత్మక విక్రయం’ ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వం ఆలోచించడం అనుచితం. గతంలో మన పాలకులు లాభార్జన పక్కనపెట్టి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక ప్రభుత్వరంగ సంస్థలను నెలకొల్పారు. వీటి స్థాపన ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా, కేవలం ఉత్పాదకత, లాభార్జనలను దృష్టిలో ఉంచుకొని ఈ సంస్థలను ప్రైవేట్‌పరం చేయడం ఎంతమాత్రం సముచితం కాదు. రైల్వేల ప్రయివేటీకరణ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా అనుసరించనున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణకు మోదీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలను అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ప్రతిఘటించి తిప్పికొట్టాలి.
-సి.సాయిప్రతాప్, హైదరాబాద్
పథకాలపై అవగాహన ఏదీ?
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వస్తోంది. బడ్జెట్‌లో ప్రజాసంక్షేమానికి, దేశ ఆర్థిక ప్రగతికి దోహదపడే మంచి పథకాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి వ్యవసాయ రంగానికి గత బడ్జెట్‌తో పోల్చుకుంటే 75% కేటాయింపులు పెంచి దాదాపు ఒకటిన్నర లక్షల కోట్లు కేటాయించడం సంతోషించదగ్గ విషయం. ఇంకా అంకుర సంస్థలకు సంబంధించిన ఎంజెల్స్ టాక్స్‌ను సరళీకృతం చేయడం, అంకుర సంస్థలకై ప్రత్యేకంగా ఒక టీవీ చానెల్‌ను ప్రకటించడం శుభ పరిణామం. స్వయం సహాయక బృందాల్లోని మహిళలకు ఐదువేల రూపాయల వరకూ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కల్పించడం, ప్రతి బృందంలోనూ ఒక సభ్యురాలికి లక్ష రూపాయల వరకూ ఋణ సౌకర్యం కల్పించడం సంతోషకరం. పథకాలు ప్రకటించడం ఒక ఎతె్తైతే, వాటిని ఆచరణలో పెట్టి అర్హులకు పూర్తిస్థాయిలో లబ్ధి చేకూరేలా చూడడం మరో ఎత్తు. పథకాలు ఎంత మంచివైనా అవి అర్హులకు అందకుంటే ఆ పథకం విఫలమైనట్టే. 2015లో ఆడపిల్లల్ని ప్రోత్సహించడానికి, వారి తల్లిదండ్రులకు ఆసరాగా ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి పథకం గురించి ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో చాలామందికి అవగాహన లేదు. 2016లో మొదలుపెట్టిన ఫసల్ బీమా యోజన కింద ప్రీమియం కట్టిన రైతులకు పంట నష్టపోయినా, గత 2-3 సంవత్సరాలుగా పరిహారం అందకపోవడం బాధాకరం. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ప్రజలందరికీ తెలిసేలా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన, ప్రచార కార్యక్రమాలు చేపట్టి, ఆయా పథకాల ద్వారా అర్హులందరూ లబ్ధి పొందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
- మేజారి మల్లికార్జున, కురవపల్లి (చిత్తూరు జిల్లా)
స్థానికులకు రిజర్వేషన్లు భేష్
మధ్యప్రదేశ్‌లో 70 శాతం ప్రైవేటు ఉద్యోగాలను స్థానికులకు రిజర్వు చేసేలా చట్టం తీసుకురానున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ప్రకటించడం హర్షణీయం. దేశంలో తొలిసారిగా స్థానికతకు పెద్దపీట వేస్తూ ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల అప్పుడే సామాజిక వేత్తలతోపాటు సామాజిక మాధ్యమాలలో ఆనందం వ్యక్తం అవుతోంది. స్వరాష్ట్రంలోని వనరులను సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం అనేక పరిశ్రమలను ఏర్పాటుచేస్తున్నా, స్థానికతకు ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడం అధిక శాతం ఉద్యోగాలను స్థానికేతరులే దక్కించుకుంటున్నారు. భూములు కోల్పోయిన వారికి నామమాత్రపు పరిహారం దక్కుతున్నా ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ప్రైవేటు సంస్థలు కూడా బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల నుండి ఉద్యోగార్థులను తీసుకువచ్చి తక్కువ జీతాలకు నియమించడం రివాజుగా మారుతోంది. దీంతో స్థానికంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోతూ యువతీ యువకులు తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. మధ్యప్రదేశ్‌లో ప్రైవేటు ఉద్యోగాలలో 70 శాతం స్థానికేతరులే దక్కించుకుంటున్నారన్న అధ్యయనాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం నిరుద్యోగులకు తప్పక సాంత్వన కలుగుతుంది.
-సిహెచ్.ప్రతాప్, శ్రీకాకుళం