ఉత్తరాయణం

‘అశ్లీలం’ ఉండాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోనే అతిపెద్ద ‘రియాల్టీ షో’ అంటూ ‘బిగ్‌బాస్’ను ఎలక్ట్రానిక్ మీడియాలో ఊదరగొడుతున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ‘బిగ్‌బాస్’ మూడో ఎడిషన్‌ను చూస్తుంటే ఇంతటి వేలం వెర్రి ఎందుకోసం? అనిపిస్తుంది. ఏది శృంగారమో, ఏది బూతో తెలియదు గాని- ఎవరి మనసును వారు జడ్జిమెంట్‌ను అడగాలి. బిగ్‌బాస్‌లో కంటపడిన దృశ్యాలు అశ్లీలంగానూ ఉంటున్నాయి. ‘అరటి బోదెల వంటి తొడలు..’ అనే వర్ణనలను ఒకప్పుడు శృంగార కావ్యాలలో చూశాము. ఇలాంటి అసభ్యకర దృశ్యాలకు ఇపుడు రియాల్టీ షోలు వేదికలవుతున్నాయి. తలలు కనపడకుండా ఒకరిపై ఒకరు పొర్లుతున్న దృశ్యాలు, వారిద్దరూ పురుషుడూ, స్ర్తినా? ఒకే జండర్ వారా? అనేది తెలియదు. ఇలాంటి సన్నివేశాలు ‘బిగ్‌బాస్’లో వీక్షకుల కంటపడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఇదే ‘షో’లో అతి పొట్టి నిక్కరుతో ఓ యువతి తెరపై కనపడింది. ఇలాంటి దృశ్యాలను ఇంటిల్లిపాదీ కలిసి చూడగలరా? రామా రామా అంటూ డ్రామాలు పోతున్నాడు అని పరిహసించడానికి వీలుగా రెండులో నామాలతో ఓ పాత్ర వుంటే, విబూది రేఖలతో మూడు నామాలతో మరో పాత్ర వుంది. ఇలాంటి వింత పోకడలు, విపరీత చేష్టలతో ‘బిగ్‌బాస్’ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు?
-వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్

‘అన్న క్యాంటీన్లు’ తెరవండి
ఆంధ్రప్రదేశ్‌లోని చాలా పట్టణాల్లో గత ప్రభుత్వం ప్రారంభించిన ‘అన్న క్యాంటీన్ల’లో ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నందున మధ్య తరగతి, పేదవర్గాల వారికి ఎంతో వెసులుబాటుగా ఉండేది. పొరుగూర్ల నుంచి వచ్చే ఉద్యోగులు, ఆసుపత్రులకు వచ్చే రోగుల బంధువులకు, దినసరి కూలీలకు, నిరుద్యోగ యువతకు ఈ క్యాంటీన్లలో తక్కువ ధరకే టిఫిన్, భోజనం లభించేది. తమ ఆకలిని తీరుస్తున్నందుకు ఎంతోమంది అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని వేనోళ్ళ కొనియాడారు. ఎవరూ ఆకలితో అలమటించకుండా ఉండేలా పటిష్ట ప్రణాళికతో ఈ క్యాంటీన్లను రూపొందించారు. ఈ పథకం అమలు గురించి పలు రాష్ట్రాలు ఆసక్తి చూపడం, అధ్యయనం చేస్తుండడం గమనార్హం. ఈ క్యాంటీన్లను మూసివేయాలని కొత్తగా అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం యోచించడం తగదు. గత ప్రభుత్వం ప్రారంభించిన పలు పథకాలకు పేర్చు మార్చడమో లేదా వాటిని రద్దు చేయడమో పనిగా ప్రస్తుత ప్రభుత్వ పాలన సాగుతోంది. రాజకీయ కోణంలో సంక్షేమ పథకాలను రద్దు చేయడం సరికాదు. కావాలంటే అన్న క్యాంటీన్ల పేరు మార్చుకోవచ్చు. గత ప్రభుత్వం కంటే మరో ఆహార పదార్థం అదనంగా వడ్డించడమో, ఓ రూపాయి తగ్గించి తమ ప్రభుత్వ గొప్పతనాన్ని చెప్పుకునే విధంగా భోజనం అందించాలే తప్ప లక్షలాది మందికి పొట్టనింపే పథకాన్ని రద్దుచేయడం పాలకుల హ్రస్వ దృష్టికి నిదర్శనం. అధికారం చేపట్టిన రెండు నెలల్లోపే వైకాపా సర్కారు తీసుకున్న పలు నిర్ణయాలు ప్రజలకు మేలుచేయకపోగా వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ విషయంలో ప్రజల అసంతృప్తి మరింతగా రాజుకోక ముందే మంచి నిర్ణయాలు తీసుకోవాలి.
-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం
పక్కదారి పడుతున్న ఎంపీ నిధులు
స్థానికంగా అభివృద్ధి పనుల్లో ఎంపీలకు ప్రాధాన్యత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంపీ లాడ్స్ పథకం 1993 సంవత్సరంలో ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఒక్కొక్క ఎంపీకి ఏడాదికి అయిదు కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించి, స్థానిక సంస్థలు, జిల్లా యంత్రాంగం ద్వారా తమతమ నియోజకవర్గాలలో అభివృద్ధి పనులను నేరుగా చేపట్టే అరుదైన అవకాశం కల్పించింది. అయితే మొదటి నుండి ఈ పథకం పక్కదారి పడుతున్నట్లు అనేక ఆరోపణలు వస్తున్నాయి. 2018 సంవత్సరంలో ‘కాగ్’ తన నివేదికలో ఎంపీ లాడ్స్ పథకంలో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకుంటోందని, ఎంపీల బంధువులే గుత్తేదారులుగా అవతారం ఎత్తి, నాణ్యతకు తిలోదకాలిచ్చి భారీగా సొమ్ము వెనకేసుకుంటున్నారని, ఈ పథకంలో సమూలంగా మార్పులు తేవాల్సిన అవసరం వుందని స్పష్టంగా తెలిపింది. అయినా ప్రభుత్వపరంగా ఈనాటికీ దిద్దుబాటు చర్యలు శూన్యం. తాజాగా పార్లమెంటరీ స్థారుూ సంఘం నివేదికలో 16వ లోక్‌సభలో ఎంపీలకు కేటాయించిన నిధులలో 11,525 కోట్ల రూపాయల నిధులలో 1,850 కోట్లు ఖర్చు కాలేదని తెలపడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. నియోజకవర్గాలలో జరిగిన అభివృద్ధి పనులలో నాణ్యత లోపించడంపై కూడా సదరు నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. కొందరు ఎంపీలు తమ స్వంత స్థలాలలో ఎంపీ లాడ్స్ పథకం కింద పనులు చేపట్టారన్న వార్తలు ఈ పథకం ఎంతగా పక్కదారి పడుతోందో ఇట్టే అర్థం అవుతోంది. ఎంపీలు, స్థానిక అధికారుల మధ్య సమన్వయం లోపించడం, జిల్లా స్థాయి సమీక్షా సమావేశాలలో ఈ పథకాల అమలుపై జవాబుదారీతనం లోపించడం, టెండర్లు ఆహ్వానించకుండా కోట్లాది రూపాయల పనులను నామినేషన్ పద్ధతిపై ఇవ్వడం, అభివృద్ధి పనులపై సకాలంలో స్థానిక అధికారులు నివేదికలు ఇవ్వకపోవడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టిసారించాలి.
- సి.హెచ్.ప్రతాప్, శ్రీకాకుళం
సస్పెన్షన్ పనిష్మెంటా?
ప్రభుత్వ విభాగాల్లో విచ్చలవిడి లంచగొండి తనానికి అలవాటుపడి సస్పెన్షన్‌కు గురైనవారు తిరిగి మళ్ళీ ఉద్యోగంలో చేరి, మరింతగా అవినీతికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ పాలనలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందన్నది బహిరంగ రహస్యం. చాలామంది ప్రభుత్వ సిబ్బందిలో భయం అనేది లేకుండా పోయింది. అవినీతికి పాల్పడి, ఏసీబీ వారికి పట్టుబడిన ఉద్యోగులను వెంటనే తొలగించాలి. మొక్కుబడిగా సస్పెన్షన్ చేయకూడదు. గతంలో ఉద్యోగంలో నుంచి తొలగించేవారు. శిక్షలు లేకపోవడం, స్వల్పశిక్షల వల్ల భయం లేకుండా పోయింది. సస్పెన్షన్ అనేది పనిష్మెంట్ కాదు. అది వారిని రక్షించటానికి విధించిన కంటితుడుపు చర్య మాత్రమే. ఎంత తప్పుచేసినా సస్పెన్షన్‌తో సరిపుచ్చుతూ, అవినీతిపరులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అవినీతికి పాల్పడే వారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించే విధానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈ పద్ధతి లేకుంటే అవినీతిని మనమే పెంచి పోషించినట్లు అవుతుంది. దీనికోసం ఒక చట్టాన్ని రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, న్యాయవ్యవస్థపై ఉంది. లేదా దోషులు తప్పించుకొనే ప్రమాదం ఉంది.
- ఎ.ఆర్.ఆర్.ఆర్, ఖమ్మం