ఉత్తరాయణం

జగజ్జేత సింధుకు జేజేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు తేజం పీవీ సింధు ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించి కొత్త చరిత్ర సృష్టించడం భారతీయులందరికీ గర్వకారణం. ఈసారి ఆమె ‘ఫైనల్ ఫోబియా’ను జయించి, భారతీయ క్రీడాకారులెవరూ ఇప్పటివరకూ సాధించని ఘనతను తన ఖాతాలో వేసుకొంది. గతంలో రెండుసార్లు అందినట్టే అంది చేజారిన ‘ప్రపంచ చాంపియన్ షిప్’ ఇపుడు సింధు సొంతం కావడంతో భారత పతాకం అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడింది. నిన్నటి తరం బ్యాడ్మింటన్ దిగ్గజాలు ప్రకాశ్ పదుకోన్, పుల్లెల గోపీచంద్, సీనియర్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు దక్కని టైటిల్‌ను సాధించి సింధు అందరి చేత ‘ఔరా’ అన్పించింది. గతంలో ఎదురైన అపజయాల నుంచి పాఠాలు నేర్చుకొన్న సింధు ఏకాగ్రతతో, దృఢదీక్షతో సాధన చేసి తన లక్ష్యాన్ని ఎట్టకేలకు సాధించింది. ఈ ఘన విజయం క్రీడాకారులందరికీ స్ఫూర్తిదాయకం. రెండేళ్ల క్రితం ఇదే టోర్నమెంటులో తనను ఓడించిద ఒకుహరతో తలపడి, ఎలాంటి తడబాటు లేకుండా సింధు ఆధిపత్యాన్ని ప్రదర్శించిన తీరు ప్రశంసనీయం. గట్టి ప్రత్యర్థి అయిన ఒకుహరను మట్టికరిపించడం సింధుకు నిమిషాల పనే అయింది. ఏకపక్షంగా సాగిన ఆటలో సింధు ఒకుహరను మొదటి నుంచి కట్టడి చేసి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసింది. ప్రపంచ చాంపియన్ షిప్‌లో అయిదు పతకాలు కైవసం చేసుకున్న రెండో క్రీడాకారిణిగా చైనా షట్లర్ జాంగ్ నింగ్ సరసన సింధు నిలిచింది. రెండు కాంస్యాలు, రెండు రజతాలకు తోడుగా ఇప్పుడు పసిడి పతకాన్ని కొల్లగొట్టిన సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌పై చెరగని ముద్ర వేసింది. తాను సాధించిన అద్భుత విజయాన్ని తన తల్లికి పుట్టినరోజు కానుకగా అంకితం చేస్తున్నట్టు ప్రకటించి, సింధు తన వినమ్రతను చాటుకోవడం అభినందనీయం.
-పి.సాయి పవన్, విశాఖ
ఈ ఖ్యాతి.. ఆటగాళ్లకు స్ఫూర్తి
ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీలో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు బంగారు పతకాన్ని సాధించడం ప్రశంసనీయం. ఇప్పటివరకూ ఏ భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సాధించని ఘనతను తెలుగు తేజం సింధు సాధించడం చారిత్రాత్మక విజయం. ఈ విజయం ద్వారా 42 సంవత్సరాల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ చరిత్రలో అత్యధిక పతకాలు గెలిచిన క్రీడాకారిణిగా చైనాకు చెందిన జాంగ్ వింగ్ పేరిట ఉన్న రికార్డును సింధు సమం చేయడం భారతీయులందరికీ గర్వకారణం. చివరి పోటీలో ఎక్కడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా సింధు ఆధిపత్యాన్ని ప్రదర్శించడం అభినందనీయం. తెలుగు క్రీడాకారుల్లో ప్రతిభకు లోటు లేదని ఆమె నిరూపించింది. సింధు సాధించిన ఘనత దేశంలోని యువ క్రీడాకారులందరికీ స్ఫూర్తిదాయకం. టోక్యో ఒలింపిక్స్‌లో సింధు స్వర్ణ పతకం సాధించాలని భారతీయులంతా కోరుకుంటున్నారు.

-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట

నిస్సహాయ స్థితిలో ఇమ్రాన్
జమ్మూ కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకొనేందుకు ఏ దేశం కూడా సుముఖత చూపకపోవడంతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్టు కనిపిస్తోంది. ఆయన ఎంతగా గింజుకున్నా కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమేనన్నది చారిత్రక సత్యం. 72 ఏళ్ల ప్రజాస్వామ్య భారత్‌లో ఎవరూ చేయలేని సాహసాన్ని నేడు ప్రధాని మోదీ దిగ్విజయంగా పూర్తి చేసి, కశ్మీర్‌కు స్వేచ్ఛను ప్రసాదించారు. ఒక్క కలం పోటుతో 370వ అధికరణాన్ని రద్దు చేయడం ద్వారా కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని మోదీ ప్రపంచానికి చాటి చెప్పారు. రెచ్చగొట్టే మాటలతో అనునిత్యం అసహనాన్ని వ్యక్తం చేస్తున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇక- భారత్‌తో యుద్ధం తప్పనిసరి అనే నిర్ణయానికి వచ్చేశాడు. ఒకప్పుడు క్రికెట్ ఆటగాడైన ఇమ్రాన్ భారత్‌తో ఆటలాడుకోవాలని భావించి ఇపుడు ఏకాకి అయ్యాడు. కశ్మీర్ విషయంలో ఏ దేశం కూడా పాక్‌కు మద్దతు ప్రకటించడం లేదు. కశ్మీర్ అంశంపై వేలు పెట్టేందుకు ఏ దేశానికి గాని, ఐక్యరాజ్యసమితికి గాని ఎలాంటి హక్కు లేదు. భారత్‌తో వాణిజ్య, దౌత్య సంబంధాలను ఇమ్రాన్ ఖాన్ రద్దు చేసుకోవడం వల్ల పాకిస్తాన్‌కే తీరని నష్టం కలుగుతుంది. ప్రపంచ దేశాల అభిమతాన్ని ఇమ్రాన్ ఇకనైనా గ్రహించడం ఉత్తమం.

-కేవీ రమణమూర్తి, కాకినాడ