ఉత్తరాయణం

పేదల ఆకలి కేకలు పట్టవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతి తక్కువ ఖర్చుతో రెండు పూటలా భోజనాన్ని- అన్ని సామాజిక వర్గాల్లోని నిరుపేదలకు అందించేందుకు ఏపీలో గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఏర్పాటుచేసింది. ధనిక వర్గాల కోసమో, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమో వీటిని ఏర్పాటు చేయలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం పనిచేస్తున్నట్లు పదే పదే చెప్పుకొంటున్న ప్రస్తుత వైకాపా ప్రభుత్వం- అదే సామాజిక వర్గాల్లోని పేదలు ఈ క్యాంటీన్ల వల్ల ఆకలి తీర్చుకుంటున్నారనే సత్యాన్ని గుర్తించాలి. ఎక్కడ పడితే అక్కడ క్యాంటీన్లు నిర్మించి గత ప్రభుత్వం అవినీతికి పాల్పడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని పాలక వర్గం ఆరోపణలు చేస్తోంది. ఈ ఆరోపణలే వాస్తవం అనుకుంటే కొన్ని క్యాంటీన్లయినా ప్రజాదరణకు నోచుకోక ఎప్పుడో మూతపడేవి. పేదల ఆందోళనలు చేసేవారు కాదా? రాజకీయ కోణంలో చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. ‘అన్నమో రామచంద్రా..’ అని నిరుపేదలు ఎదురుచూస్తూ క్యాంటీన్ల వైపు చూస్తుంటే, కొన్ని రోజుల తరువాత మంచి భోజనంతో మొబైల్ క్యాంటీన్లు నడుపుతామని, అంతవరకూ ఆగాలంటూ ప్రభుత్వం చెబుతోంది. వెనకటికి ఎవరో ఒక పేదవాడు- ‘ఆకలి అవుతోంది.. అన్నం పెట్టయ్యా మహాప్రభో..’ అని ఒక పెద్దమనిషితో మొరపెట్టుకుంటే- ‘ఇవాళ ఆగు.. రేపు నీకు పంచభక్ష్య పరమాన్నం పెడతాను.’ అన్నాడట. ఆ చందంగానే వుంది వైకాపా ప్రభుత్వ పనితీరు. ఇకనైనా ప్రభుత్వం ప్రతిపక్షంపై పంతాలకు పోకుండా, తమ అభీష్టం మేరకు క్యాంటీన్లకు పేరు మార్చి వేసైనా- పేదల ఆకలి తీర్చటానికి అవసరమైన చర్యలు సత్వరమే చేపట్టాల్సి ఉంది.
-పి.సిహెచ్.కోటయ్య, అద్దంకి
అనుభవ శూన్యుడు ఇమ్రాన్
భారత్‌తో యుద్ధం వస్తే అంతు తేలుస్తానన్నాడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఇవి అతడి అసందర్భ ప్రేలాపనలు. గతంలో ఏ పాక్ ప్రధాని కూడా ఇలా అనలేదు. ఇమ్రాన్‌ను మించినవాడైన పర్వేజ్ ముషారఫ్ సైతం తోక ముడిచాడు. గతంలో భారత్‌పై పాక్ రెండుసార్లు సమరానికి దిగింది. రెండుసార్లూ భారత్ చేతిలో పాక్ చావుదెబ్బతింది. క్రికెట్ ఆట తప్పించి ఏ మాత్రం రాజకీయం తెలియనివాడు ఇమ్రాన్. అనుభవ శూన్యుడైన అతడు భారత్, పాక్‌ల మధ్య యుద్ధం వస్తే అందుకు భారత్‌దే బాధ్యత అని అంటున్నాడు. కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దయిన తర్వాత- భారత్ అంతుతేలుస్తానని ఇమ్రాన్ వాగడం అహంకారానికి నిదర్శనం. అంతు తేలుస్తామనే దానికింత సమయమెందుకు? కశ్మీర్‌పై అనుకున్నది అమలు చేశారు మన ప్రధాని మోదీ. మరి ఇమ్రాన్ నుండి ప్రతి చర్యయేది? ఇమ్రాన్‌వి ఉత్తరకుమార ప్రజ్ఞలు తప్పించి మరేం కావు. పాక్ మోహరింపుపై ఆందోళన ఏలంటున్నాడు మన సర్వసైన్యాధిపతి బిపిన్ రావత్. భారత సైన్యం సర్వసిద్ధంగా వుందన్నది ఆయన ప్రకటన. అవసరమైతే ఆప్ఘాన్‌నుండి బలగాలు తరలిస్తామని ఇమ్రాన్ అంటున్నాడు. ఇది ఇమ్రాన్ నైజం.
-కె.వి.రమణమూర్తి, కాకినాడ
థర్మల్ విద్యుత్‌తో ప్రకృతికి చేటు
పర్యావరణ ప్రియులు ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నా ఎలాంటి ఫలితం కనిపించటం లేదు. బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తిచేసే థర్మల్ కేంద్రాలు వెదజల్లే కాలుష్యం వల్ల మానవాళి, జంతుకోటి విలవిలలాడుతున్నాయి. జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి వర్షాభావం వల్ల తగ్గిపోయింది. దీంతో థర్మల్ (బొగ్గు) విద్యుత్ కేంద్రాల హవా కొనసాగుతోంది. నిరంతర విద్యుత్ సరఫరాలో భాగంగా అనేక దేశాలు బొగ్గు విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు వాతావరణ పరిరక్షణ నిమిత్తం చేస్తున్న వ్యయంతో పోలిస్తే ఐదు రెట్లకు పైగా బొగ్గు ఆధారిత విద్యుత్ పరిశ్రమలకు రాయితీలు ఇస్తున్నట్లు ఆయిల్ చేంజ్ ఇంటర్నేషనల్ సంస్థ ఐక్యరాజ్యసమితికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. బొగ్గు విద్యుత్ కేంద్రాల్ని నిలిపేస్తామని ప్రకటించింది. 2018 నాటికి అంచెలంచెలుగా బొగ్గు తవ్వకాల్ని ఆపేస్తామని జర్మనీ ప్రకటించింది. 2009 తర్వాత బ్రిటన్‌లో విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి అనుమతుల్ని నిలిపేసాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దుకోవాలన్న ఆకాంక్షతో ముందుకెళ్తున్న చైనా మాత్రం బొగ్గు వినియోగాన్ని విపరీతంగా ప్రోత్సహిస్తోంది. ఈ విషయంలో చైనా తర్వాతి స్థానం భారత్‌దే. 2014 వరకు ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 1215 థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అనుమతులిస్తే ఇందులో 452 చైనాలో ఉన్నాయి. 351 భారత్‌లో ఉన్నాయి. మిగిలినవి ఇతర దేశాల్లో ఉన్నాయి. చైనా గత దశాబ్దంలో బొగ్గు వినియోగాన్ని ఏటా 2,263 మిలియన్ మెట్రిక్ టన్నుల చొప్పున పెంచింది. ఇదే సమయంలో భారత్ ఏటా 367 మిలియన్ టన్నుల చొప్పున బొగ్గు వినియోగాన్ని పెంచగా, దక్షిణ కొరియా 59 మిలియన్ టన్నుల చొప్పున పెంచుకొచ్చింది. చైనాలో ఉత్పాదక వ్యయాన్ని తగ్గించడం ద్వారా ప్రపంచ మార్కెట్‌ను హస్తగతం చేసుకునే ఆలోచనతోనే బొగ్గు వినియోగాన్ని పెంచుతున్నారు. కాగా ఇప్పటికే ఆ దేశంపై కూడా ఆంక్షలు మొదలయ్యాయి. దీంతో గత ఏడాది చివరిలో బీజింగ్, యాంగైజ్ నదీ పరివాహక ప్రాంతాల్లో 16 శాతం బూడిద, 1వ శాతం గంధకాల కంటే అధికంగా ఉన్న బొగ్గు వినియోగాన్ని నిషేధించారు. ఆస్ట్రేలియాకు చైనా బొగ్గు ఎగుమతుల్లో 25 శాతం ఒక్కసారిగా పడిపోయింది. ఈ విషయంలో భారత్ మాత్రం ఇంకా మేలుకోలేదు. ఓవైపు అణు ఇంధన ఉత్పత్తికి ఉరకలేస్తూనే మరోవైపు బొగ్గు అధారిత విద్యుత్ ఉత్పత్తిపై స్పష్టమైన దృక్పథాన్ని భారత్ ప్రదర్శించలేక పోతోంది. వాస్తవానికి 2020 నాటికి 14,600 మెగావాట్ల అణువిద్యుత్ ఉత్పత్తిని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పటికే తారాపూర్, రావట్‌భట, కాక్రాపాల్, నరోరాలలో అణువిద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఏర్పాటయ్యాయి. ఆంధ్ర రాష్ట్రంలోని కడప జిల్లాలో యురేనియం నిల్వలు వెలుగుచూశాయి. వీటిని వినియోగించుకుని అణు విద్యుత్ ఉత్పత్తిపై దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. వీటితోపాటు సౌర, పవన విద్యుత్‌ను ప్రోత్సహించాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. భారత్ సైతం పర్యావరణ పరిరక్షణలో పాలుపంచుకోవాలని కోరుతున్నారు. బొగ్గు వినియోగాన్ని తగ్గించి భావితరాలకు భూమండలాన్ని స్వర్గంగా అందించాలని శాస్తవ్రేత్తలు సూచిస్తున్నారు.
- పుట్టా సోమన్నచౌదరి, కాకినాడ

రిజర్వేషన్లు రద్దు కావాలి
దేశంలోని అన్ని రాజకీయ పార్టీలూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను విభజించి పాలిస్తున్నాయి. ఇతర దేశాల్లో పాలకులకు ప్రజలందరూ సమానమే. మన దేశంలోనే ప్రజలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలుగా విభజన చేశారు. ఈ విభజన ప్రజల మధ్య ఐకమత్యాన్ని దెబ్బతీయటానికేనన్నది వాస్తవం. డా.బి.ఆర్.అంబేద్కర్ మన దేశంలో భారత రాజ్యాంగాన్ని రాసిన వారిలో ప్రముఖుడు. ఆయన మన రాజ్యాంగంలో బడుగువర్గాలకు రిజర్వేషన్లు కల్పించి, వాటిని పది సంవత్సరాలు వుంచి, ఆ తర్వాత తీసివేయమన్నారు. మన నాయకులు ఆ మహానుభావుణ్ణి గౌరవించలేదు. అలనాటి ప్రధాని వి.పి.సింగ్ పరిపాలనలో బి.సి.రిజర్వేషన్లు తీసుకొని వచ్చారు. బి.సి. ఓట్లు తమవైపు తిప్పుకోటానికే! ఈ రిజర్వేషన్లు కేవలం కొంతమందికే అందుతున్నాయి. భారీగా ఆస్తులున్నవారికి సైతం రిజర్వేషన్లు అందుతున్నాయి. ఇప్పుడు వైకాపా అధినేత, ఏపీ సీఎం జగన్ 50 శాతం రిజ్వేషన్లను నామినేటెడ్ పదవుల్లో కేటాయిస్తామన్నారు. ఇవన్నీ కేవలం ఓట్లుపొందాలనే గదా! ఈ విధంగా దేశంలో ఐకమత్యం లేకుండా సమాజాన్ని నాశనం చేస్తున్నారీ రాజకీయ ప్రబుద్ధులు! దేశంలో ప్రజలందరూ సమానమే! దీన్ని ప్రతి పౌరుడు నిస్వార్థంతో ఆలోచించి గుర్తించాలి. కులాలు, మతాల పేరిట ఇస్తున్న రిజర్వేషన్లు పూర్తిగా రద్దుకావాలి.
-జి.శ్రీనివాసులు, అనంతపురము