ఉత్తరాయణం

వాజపేయి ఉవాచ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిలకధారణ
రామభజన
జెండా వందనం
యోగాభ్యాసం
వీటికే కాదు పరిమితం
మన సంస్కృతి, సంప్రదాయం

పితృవాక్య పరిపాలన కోసమని
పట్ట్భాషేకాన్ని కాదని
నార వస్త్రాలు ధరించి కానలకేగడం
అరణ్యవాసాన్నీ ఆస్వాదించడం
ఇదీ మన సంస్కృతి, సంప్రదాయం

ఆడి తప్పరాదని
రాజ్యాన్ని ధారపోసి
ఋణశేషం ఉండరాదని
ఆలినీ బిడ్డనీ అమ్మేసి
తాను కాటికాపరిగా కొలువుతీరడం
ఇదీ మన సంస్కృతి, సంప్రదాయం

తాను సాగించిన మారణ హోమమే
తన కనులు తెరిపించగా
చక్రవర్తే భిక్షువుగా పరివర్తనమవడం
అహింసా దండం ధరించడం
ఇదీ మన సంస్కృతి, సంప్రదాయం

మానవ మనుగడకైనా
దేశపాలనకైనా
నీతీ న్యాయం రెండూ ఆవశ్యకం

సరిపోదు రాజ్యాంగానికీ చట్టాలకూ లోబడడం
నీతి లక్ష్మణరేఖను దాటకపోవడమే రాజధర్మం
-మల్లాప్రగడ రామారావు
99898 63398
*
అక్రమార్కులకు చెంపపెట్టు
మహారాష్టలో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో రాజ్యాంగ విలువలకు, నైతిక సూత్రాలకు కట్టుబడి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది, ప్రజాస్వామ్యానికి మేలుకొలుపువంటిది. అధికారం తమ చేతుల్లో వుంది కదా, తామేమి చేసినా చెల్లుతుందనే దురహంకారంతో అనైతిక పద్ధతులతో పాలనాపగ్గాలు చేపట్టాలనుకునే వారికి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు వంటిది. గత ఏడాది కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుచేసే విషయంలో కూడ అనారోగ్య పద్ధతులను అవలంబించి కేంద్రంలోని బీజేపీ పెద్దలు అభాసుపాలైన విషయం ప్రతి ఒక్కరికీ విదితమే. ఆ ఘోర తప్పిదం నుంచి ఏమాత్రం గుణపాఠం నేర్చుకోని బీజేపీ పెద్దలు మరోమారు మహారాష్టల్రో ప్రభుత్వం ఏర్పాటుచేసే విషయంలో అలాంటి నీతిమాలిన పద్ధతులే పాటించారు. తాజాగా భాజపా నేతలు చావుదెబ్బ తినడం దేశ రాజకీయాల్లో మరో సంచలన ఘటన. అపర చాణక్యుడిగా పేరుగాంచిన ప్రధాని మోదీ సహా కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు వేసిన పాచికలు మహారాష్టలో పారకపోవడం గొప్ప విశేషమే మరి. అందుకు ప్రధాన కారణం నీతికి, న్యాయానికి పెద్దపీట వేస్తూ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అని అందరూ అంగీకరించాలి. సుప్రీం కోర్టు ఇచ్చిన సమున్నత తీర్పు ఫలితంగా- అనైతిక పద్ధతుల్లో మహారాష్ట్ర సీఎంగా గద్దెనెక్కిన దేవేంద్ర ఫడ్నవీస్ కథ 72 గంటల్లో కంచికి చేరడం కొసమెరుపు. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు మహారాష్ట్ర సీఎంగా అవకాశం బంగారుపళ్లెంలో వచ్చి మరీ వరించడం శరవేగంగా జరిగిన రాజకీయ పరిణామం. ఏది ఏమైనా జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన ఈ అమూల్యమైన తీర్పు న్యాయవ్యవస్థ పట్ల దేశ ప్రజలలో మరింత గౌరవ మర్యాదలు, కీర్తిప్రతిష్టలు ఇనుమడించేలా ఉందనడంలో సందేహం లేదు. చట్టం అంటే మన చుట్టం కాదు, దానితో చెలగాటం ప్రాణసంకటమే అనే యదార్థం మరోసారి నిరూపితం అయ్యింది.
-బుగ్గన మధుసూదనరెడ్డి, బేతంచర్ల
*
పిల్లిమొగ్గలేస్తున్న ‘పులి’!
దశాబ్దాలుగా బీజేపీకి మిత్రపక్షంగా వున్న శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తన కుమారుడిని ముఖ్యమంత్రిగా చూడాలనే దురాశతో శత్రుపక్షాలతో జతకట్టడం పచ్చి అవకాశవాదం. మహారాష్ట శాసనసభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ-శివసేన కూటమికి స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టారు. కర్ణాటకలో 30 సీట్లతో కుమారస్వామి ముఖ్యమంత్రి అయినట్లు, ఇక్కడా శివసేన సీఎం పీఠాన్ని కోరుకోవడం అర్థరహితం. కర్నాటకలోనూ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి బీజేపీని అతిపెద్ద పార్టీగా గెలిపించారు. ఎన్నికల వేళ పరస్పరం దూషించుకున్న కాంగ్రెస్, జనతాదళ్ పార్టీలు ఎన్నికల పిమ్మట లౌకికవాదం పేరుతో లౌక్యంగా జట్టుకట్టినా ఆ ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. మహారాష్టల్రో ప్రధాన పార్టీలు ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్నాయి. బీజేపీ 105 సీట్లు, దాని మిత్రపక్షం శివసేన 56 సీట్లు సాధించాయి. ఫడ్నవీస్‌పై ప్రజల్లో వ్యతిరేకత వుంటే బీజేపీ సీట్లు ఇంకా తగ్గి శివసేనకో, కాంగ్రెస్‌కో మెజారిటీ సీట్లు రావాలి. ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ప్రజలు కులమతాలకతీతంగా గెలిపించారు. కూటమికి మెజారిటీ సీట్లు వచ్చినందున బీజేపీ ప్రభుత్వంలో శివసేన చేరితే బాగుండేది. అన్నప్రాసన నాడే ఆవకాయ కావాలన్న సామెతలా ముఖ్యమంత్రి పదవి కోసం శివసేన కుప్పిగంతులు వేయడం జుగుప్స కలిగించింది. ప్రజలు స్పష్టంగా బీజేపీ కూటమిని గెలిపిస్తే ముఖ్యమంత్రి పదవి కోసం ‘పులి’ గుర్తు పార్టీ (శివసేన) కాంగ్రెస్, ఎన్‌సీపీలతో రాజకీయం చేయడం దారుణం. ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా పదవులు పంచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే ఇక ఎన్నికలు జరపడం ఎందుకు? ఈ ఉదంతంలో శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రేదే తొలి తప్పు. దొడ్డిదారిన గద్దెనెక్కటం అప్రజాస్వామ్యం. గవర్నర్ చర్య అప్రజాస్వామికం అని ఆక్రోశించే నేతలు ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా చీకటి ఒప్పందాలు చేసుకోవడం కూడ అప్రజాస్వామికం అని గ్రహించాలి. మనం తప్ప అందరూ చట్టబద్ధంగా వ్యవహరించాలంటే కుదరదు. మన దేశం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందినా సామాజికంగా, నైతికంగా దిగజారుతోంది.
-తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట