ఉత్తరాయణం

మహిళలకు రక్షణ ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మృగాలుగా మారిన నలుగురు కిరాతకుల చేతిలో ఓ పశువైద్యురాలు హైదరాబాద్ శివార్లలో దారుణంగా అత్యాచారానికి గురై హత్యగావింపబడటం మానవత్వం వున్న ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలిచివేసే విషయం. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో జరిగిన ఈ దారుణ, పెను విషాదకర సంఘటన తెలుగు రాష్ట్రాల ప్రజానీకం యావత్తును తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలా ఓ ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యంత పైశాచికంగా, కర్కశంగా అత్యాచారం జరిపి హత్య చేయడాన్నిబట్టి చూస్తే మహిళలకు రక్షణ గగన కుసమమేనా? భద్రత ప్రశ్నార్థకమేనా? అన్నది అందరి మదిలో మెదిలే సందేహం. సాంకేతికంగా రోజురోజుకూ దేశం ఎంతో పురోభివృద్ధిని సాధిస్తూ, అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తున్నప్పటికీ- అత్యాచారాలకు, హత్యలకు, లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేయడంలో మాత్రం ఘోర వైఫల్యం చెందుతుండటం అత్యంత ఆందోళన కలిగించే విషయం. మహిళలపై ఇటువంటి దురాగతాలు తరచూ జరుగుతుండటానికి ప్రధాన కారణాలు- రైల్వే స్టేషన్, బస్టాండ్, విమానాశ్రయం వంటి ప్రాంతాలలో గస్తీ బృందాలు, నిఘా వర్గాల పర్యవేక్షణ సరిగా లేకపోవడం, వ్యవస్థాగత వైఫల్యాలు వెరసి ఎందరో మహిళలు నరరూప రాక్షసుల చేతిలో బలి అవుతూనే వున్నారు. భద్రత ప్రశ్నార్థకమైన సమయంలో మహిళలు ఒంటరిగా వెళ్లాల్సివచ్చినపుడు కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకోకతప్పదు. ఆపద సమయంలో మహిళల రక్షణ కోసం పోలీసు శాఖ నిర్దేశించిన సూచనలను తప్పకుండా పాటిస్తూ, 100, 112, 191 నంబర్లను ఫోన్లలో తప్పక అందుబాటులో ఉంచుకోవాలి. మహిళలు ముక్కూ మొహం తెలియని వారిని అమాయకంగా నమ్మటం, నమ్మించి గొంతు కోసే వారి పట్ల అప్రమత్తంగా లేకపోవడం వంటి బలమైన కారణాలు కూడ వారి రక్షణ పాలిట పెనుశాపంగా మారి, వారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయేలా చేస్తున్నాయి అనే మాట అక్షర సత్యం. పశు వైద్యురాలిపై అమానుషంగా ప్రవర్తించిన మానవ మృగాలను న్యాయస్థానం అత్యంత కఠినంగా శిక్షించాలి. వారికి ఉరిశిక్షను వీలయినంత త్వరగా అమలుపరచి ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరేలా చేయాలి. మన సమాజానికి, దేశానికీ మాయని మచ్చలా నిలుస్తున్న ఇలాంటి అత్యాచారాలు, హత్యలు మహిళలపై మరోసారి పునరావృతం కాకుండా మన పాలకులు, పోలీసు, న్యాయవ్యవస్థ కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు వీలైతే ఇలాంటి క్రూర నేరాలపై మన చట్టాలను సైతం సవరించి మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది.
-బుగ్గన మధుసూదనరెడ్డి, బేతంచెర్ల
ఆర్థిక మాంద్యం ఆందోళనకరం
గత కొనే్నళ్లుగా భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. ఆర్థికవేత్తలు ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై తమ ఆందోళన తెలియబరుస్తూనే ఉన్నారు. ఇది ఎప్పటిలా కొనే్నళ్ళకు మళ్లీమళ్లీ వచ్చే సైక్లికల్ మాత్రమే కాదు స్ట్రక్చరల్ అంటూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం ఆ విమర్శల్ని రాజకీయ విమర్శలుగా కొట్టేయడమో లేదా తేలిగ్గా తీసిపారేయడమో చేస్తూ వస్తోంది. ప్రజలకు భయం లేదన్న భరోసా ఇస్తూనే ఉంది. అయితే రోగం తీవ్రమైనదైతే అందుకు తగ్గ మందు ఇవ్వాల్సిందే గానీ వైద్యుడు హితవచనాలు చెబితే మాత్రం సరిపోతుందా? ముందు రోగం ఏ రకమైనదో, దాని తీవ్రత ఏమిటో అంచనా వేసి తగు చికిత్స మొదలెట్టాలి కదా! అందుకు సంబంధించిన నిపుణులతో బయటపడవేసే మార్గం ఆలోచించాలి కదా! అలాకాకుండా లేని ప్రతిష్టకు పోతే ఒరిగేదేమిటి? ఈ సంవత్సరం వరసగా రెండో త్రైమాసికంలో జీడీపీ దిగజారి 4.5కి చేరింది. ఇది ఆరున్నరేళ్లలో కనిష్టం. కనీసం 7గా ఉండాలని, ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇంకో ఐదేళ్ళలో ఐదు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా దేశం తయారవ్వాలంటే జీడీపీ ఏటేటా 9 శాతంగా పరుగులు పెట్టాలి. వాస్తవం ఇలా ఉండగా ఈ స్థితికి ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణమనీ, అయినప్పటికీ ఆర్థిక గమ్యం చేరగలమనీ ప్రభుత్వం చెప్తోంది. మరి ప్రజలకెలా నమ్మకం కలుగుతుంది? ఇంకా బాధాకరం ఏమిటంటే ఈ పరిస్థితి కేవలం మందగమనం మాత్రమే కానీ మాంద్యం కాదని ప్రభుత్వం వాదిస్తోంది. కొన్ని నిర్వచనాల ప్రకారం వరుసగా రెండో త్రైమాసికంలో వృద్ధి తగ్గుముఖం పడితే మాంద్యం ఉన్నట్టే లెక్క. అయినా నిర్వచనాలదేముంది అనుకోడానికి లేదు. ఎందుకంటే తీవ్రత గుర్తించేది వాటివల్లనే కదా! సరే వారిలెక్కలు వారివి అనుకున్నా వారు చేస్తున్న వైద్యం పనిచేస్తున్నట్టు దాఖలాలు లేవు. సంపన్నులకు కార్పొరేట్ పన్ను తగ్గించారు. కొన్ని రాయితీలు ప్రకటించారు. పెట్టుబడులు వస్తాయని చెప్పారు. అయితే రాయితీలకు తగినంత ఫలితం అటునుండి కనబడలేదు. కొంతమంది ఆర్థిక నిపుణులు చెప్తున్నదేమిటంటే ఈ దుస్థితికి కారణం ప్రజల చేతిలో డబ్బు లేకపోవడం. తద్వారా వస్తువులకు గిరాకీ తగ్గిపోవడం. ప్రభుత్వం గిరాకీ పెంచే యోచన చెయ్యాలి కానీ సప్లయ్ వైపు రాయితీలు పెంచడం కాదని. నమ్మదగిందిగా ఉంది ఈ మాట. రాజకీయ ప్రేరేపిత సలహా అనిపించడం లేదు. నలభై ఏళ్లలో అధిక స్థాయికి నిరుద్యోగిత ప్రబలింది. కొత్త ఉద్యోగాలు లేవు. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే వ్యవసాయం, నిర్మాణం తదితర రంగాలు నీరసంగా ఉన్నాయి. భేషజాలకు పోకుండా సమస్య తీవ్రతను పాలకులు గుర్తించాలి. ఆలస్యం చేస్తూ మరింతగా దిగజారే పరిస్థితిని ఎగదొయ్యకూడదు.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం