ఉత్తరాయణం

మానుషి విజయం గర్వకారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వసుందరిగా మనదేశానికి చెందిన మానుషి ఛిల్లార్ విజయం సాధించడం భారతీయులందరికీ గర్వకారణం. దాదాపు 17 సంవత్సరాల తరువాత మళ్లీ ప్రపంచ సుందరి కిరీటం మన మహిళకు దక్కడం ఆనందకరం. చిన్నప్పటినుంచి ఉన్న కోరికను అణచివేసుకోకుండా వైద్య విద్య అభ్యసించినప్పటికీ తన చిరకాల లక్ష్యాన్ని ఛేదించడానికి ఆమె అనునిత్యం కష్టపడటం స్ఫూర్తిదాయకం. ప్రపంచదేశాల నుంచి గట్టిపోటీ ఎదురైనప్పటికీ మనోనిబ్బరం, ఆత్మవిశ్వాసంతో అంతిమ విజయం సాధించిన మానుషికి అభినందనలు.
-బి.మధుసూదనరెడ్డి, బేతంచర్ల
అర్థంలేని చర్చలు ఎందుకు?
ఇటీవలి కాలంలో టెలివిజన్ చానల్స్‌లో నిర్వహిస్తున్న చర్చాగోష్ఠులకు అర్థం లేకుండాపోతోంది. ఇటీవల విశాఖలో ఓ యువతిపై కొందరు అత్యాచారానికి ప్రయత్నిస్తుంటే కొందరు వీడియో చిత్రీకరించడం సిగ్గుచేటు. దీనిపై ఓ ఛానల్‌లో చర్చ జరిగింది. అర్థంలేని వాదనలతో అది సాగింది. ఒక హిందీ ఛానల్‌లో కశ్మీర్‌లో ముస్లింలు భారత్ మాతాకీ జై కొడుతున్నారన్న వాదనపై చర్చ పెట్టింది. ఇందులో భాగంగా ముఖానికి గుడ్డలు కట్టుకున్న కొందరు ముస్లింల అభిప్రాయాలు వెల్లడించారు. అలా ముసుగులో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది.
-వై.శేషగిరిరావు, ధవళేశ్వరం
నల్లధనం గుట్టు వీడుతుందా?
పెద్దనోట్ల రద్దువలన నల్ల కుబేరుల కూసాలు కదులుతాయన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. నల్లధనం బయటకు వస్తుందని అన్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో అది జరగలేదు. విదేశీయ ఆర్థిక సంస్థలు తాజాగా జిఎస్‌టి, నోట్ల రద్దు సత్ఫలితాలను ఇస్తున్నట్లు పేర్కొన్నాయి. కానీ వాస్తవంలో నల్లధనం గుట్టు వీడటం లేదు. నోట్ల రద్దు తరువాత జరిగిన, జరుగుతున్న ఎన్నికలలో ధనవ్యయం ఎంతగా సాగుతున్నదో చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్ అన్న తీరులో వ్యవహారం నడచిందని అర్థమవుతోంది.
-కోవూలు వేంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు
సెమినార్లు నిర్వహించాలి
కొన్ని డిగ్రీ పీజీ వృత్తి విద్యా కోర్సుల్లో గతంలో పెద్దఎత్తున సెమినార్లు, చర్చాగోష్ఠి నిర్వహించేవారు. ఆ సెమినార్లకు ఉద్దండులను, ప్రముఖులను, అనువజ్ఞులను దూరప్రాంతాల నుంచి పిలిపించి ఉపన్యాసాలు ఇప్పించేవారు. ఇవి విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చేవి. ఇప్పుడు ఆ ధ్యాస అటు యజమానులకు, ఇటు విద్యార్థులకు లేదు. ఒకటీఅరా సంస్థలు నిర్వహిస్తున్నా మొక్కుబడిగా మమ అనిపిస్తున్నాయి. అసలు తరగతులే సక్రమంగా నిర్వహించడం లేదు.
-అయినం రఘురామారావు, ఖమ్మం